రానివ్వు రాత్రిని!
x

రానివ్వు రాత్రిని!

నేటి మేటి కవిత


ఈ రాత్రి ఎంత అద్భుతమైనది?

నిన్ను నా నిద్రలోకి,

నా కలలోకి తీసుకొచ్చిన రాత్రి!

ఆకాశం మెల్లిగా

పున్నమి చంద్రుడ్ని

తన రాత్రిలోకి తెచ్చుకున్నట్లు?

సంధ్యవేళప్పటి నది

వెన్నెల అలల దుప్పటిలో

అస్తమిస్తున్న దిగులు సూర్యుడ్ని

ఊయల ఊపినట్లు!

తోట రహస్యంగా

రాత్రిలో మల్లెలను వికసింప చేసుకున్నట్లు,

నిన్ను!ఓహ్ అక్షరాలా నిన్ను!

నా కలల్లోకి తెచ్చిన రాత్రి,

ఆ రాత్రి నిజంగా ఎంత మధురమైంది?

నువ్వు కలలోకి నడిచి వచ్చిన రాత్రి?

*

నా రాత్రికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోను?

నీ తలపే మధువై నిద్ర పట్టిన రాత్రి.

మత్తైన మధువు లాంటి నిద్ర పట్టిన రాత్రి!

నిన్ను కలల్లోకి తీసుకొచ్చిన రాత్రి,

నీ కలలోంచి,

నా కలలోకి నువ్వు బయలుదేరి వచ్చిన రాత్రి!

అద్భుతమైన,

సమ్మోహకమైన రాత్రి కదా అది?

*

చూడు! మెలకువ నిన్ను,

నన్ను కలవనివ్వదు.

స్వప్న కాంక్షలూ,

నిశీధులే కదా మనల్ని కలిపేది?

మన లోలోపలి నది ఒడ్డున,

హృదయ రాగాలేవో వింటూ

చేతులు పట్టుకుని మనల్ని

నడిపిన రాత్రెంత అత్యద్భుతమో కదా?

*

రానివ్వు రాత్రిని

రానివ్వు నిదురని

రానివ్వు కలని!

పద నిదురపోదాం

అలసిన దేహమనస్సుల కల్లోలాలను మరిచి,

ఒకరినొకరు తలచి తలచి,

ఒకరికోసం ఒకరం వగచి వగచి నిదురపోదాం.

రాత్రిని బ్రతిమిలాడి కలలోనైనా కలుసుకుందాం!

Read More
Next Story