రా... కదలిరా  (కవిత)
x

రా... కదలిరా (కవిత)

తనని తాను పొగట్టుకున్నట్లు గుర్తిండం జీవితంలో మైలు రాయి. అక్కడి నుంచి కొత్త జీవితం ప్రారంభం కావాలి. ఎపుడో విడిపోయిన తనని ఆహ్వానించడం మీద ఈ సారి కవిత.




రా...ఒక్కసారి !


-గీతాంజలి


చాలా కాలం అయింది నిన్ను చూసి.

నన్ను నువ్వు చూసి !
ఎక్కడ గడిపావు ఇన్నేళ్లు ?
దుఃఖపు మొఖాన్ని దాచుకుంటూ...
అచ్ఛం...నా లాగే .
ఎన్ని పగళ్లలో నీ నీడ కూడా అలిసిపోయేంతగా దిక్కు లేకుండా తిరిగావు?
ఎన్నెన్ని రాత్రుళ్లలో చీకటికి కూడా చిక్కకుండా
నిద్రపోని రహదారులను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చి ఉంటావు ?
చీకట్లను మింగుతూ తెల్లారనీయకుండా ..పగళ్ళని కూడా రాత్రుళ్ళు చేసుకుని ఉంటావు ?
అవునచ్ఛం నా లాగే !
చూడిటు.. నువ్వు లేని నా జీవితాన్ని !
నిన్ను ఎడబాసిన అపరాధాన్ని మోస్తూ శిలనై పోయాను !
అసలు నా నీకే నేను దూరంగా ఎలా ఉంటున్నాను ?
పోనీ నువ్వెలా ఉంటున్నావో చెప్పు !
రా..ఒకసారి వచ్చి జీవితాన్ని అందించి వెళ్ళు !
అప్పటిదాకా నా ఆకాశంలో చందమామ లేడు.. సూర్యుడూ లేడు.
నా కసలు ఆకాశమే లేదు.
నా లోపలి తోట ఎండిపోయింది.
రా ఒకసారి ! వచ్చి ఎండిన నా పెదవుల ఎడారికి నీ పెదవుల తడి అందించి వెళ్ళు.
ఆ తరువాత జరిగే అద్భుతాన్ని చూడు !
నా తోట పూలు ..నీ ఊపిరిలో పరిమళ శ్వాసని నింపుతాయో లేదో ?
నా ఆకాశంలో సూర్య చంద్రులు..నక్షత్రాలు ఒకేసారి మెరవక పోతే చూడు !.
శుష్కించిన నా హృదయం లో మబ్బులు నాటుకొని వర్షపు మొలకలు మొలవక పోతే చూడు !
రా..ఒక్కసారి !


Read More
Next Story