తెలంగాణ చారగొండలో అరుదైన చారిత్రక శిల్పాలు
x
దేవాలయంలో కనిపించిన రాజ పండితగల్లు శిల్పం

తెలంగాణ చారగొండలో అరుదైన చారిత్రక శిల్పాలు

నాగర్ కర్నూల్ జిల్లా చారగొండలో మూడు అరుదైన శిల్పాలు గుర్తింపు. రాష్ట్రకూట, కాకతీయ శైలుల ప్రత్యేకతలు వెలుగులోకి వచ్చాయి.


నాగర్ కర్నూల్ జిల్లా మండల కేంద్రమైన చారగొండ గ్రామంలో శివాలయం పరిసరాల్లోని మూడు అరుదైన శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు యాదేశ్వర్ దండేతికర్, కిరణ్ గౌడ్ గుర్తించారు.

రాజపండితగల్లు:

ఒకటవది రాజకవి శిల్పం. అర్ధపద్మాసనంలో కూర్చున్న రాజు కుడిచేతపట్టిన ఖడ్గం మొనను ఎడమపాదం మీద విశ్రాంతంగా ఆనించాడు. ఎడమచేత పుస్తకం ధరించాడు. నడినెత్తిసిగ మణిపట్టికతో అలంకరించబడ్డది. చెవులకు పెద్దకుండలాలున్నాయి. మెడలో హారాలున్నాయి. భుజంమీద జంధ్యం ఉంది. నడుమున ధట్టీ వుంది. దండరెట్టలకు పూసలదండలున్నాయి. చేతులకు కంకణాలున్నాయి. వేష,భూషణాదులన్నీ రాజహోదావే. ఈ శిల్పం రాష్ట్రకూటశైలికి చెందిన రాజపండితగల్లు శిల్పం. గతంలో ఇదే జిల్లాలో ‘పండితగల్లు’ శిల్పాలు రెండు లభించాయి. ఈ శిల్పం వాటికంటె విభిన్నమైందని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

భైరవశిల్పం

భైరవుడు:

రెండవది భైరవ శిల్పం. ఈ భైరవుడు జ్వాలాకేశాలతో కపాలమకుటం ధరించాడు. సర్ప కుండలాలు, సర్పాలే హస్తభూషణాలు, సర్పహారం, కపాలమాల, కపాలమేఖలతో, కాళ్ళకు కడియాలతో, పాంజీబులతో, త్రిభంగిమలో వైతస్తికపాదాలతో చతుర్భుజభైరవుడు పరహస్తాలలో ఢమరుకం,, త్రిశూలాలతో, నిజహస్తాలలో ఖడ్గం, రక్తపాత్రలతో పరహస్తాలలో ఢమరుకం,, త్రిశూలాలతో, నిజహస్తాలలో ఖడ్గం, రక్తపాత్రలతో స్థానక శిల్పంగా కనిపిస్తున్నాడు. అతనికి రెండువైపుల బేతాళులు ఒకరు నాట్యం చేస్తుండగా, రెండవవాడు కూర్చుని రక్తంకోసం చేతులు చాపుతున్నాడు.

ఈ భైరవుడు తాంత్రికమూర్తి. శైలిలో కాకతీయ శిల్పం.

దేవాలయ ప్రాంగణం లో ఉన్న సప్త మాతృకల రాతి దిమ్మె

సప్తమాతృకలు:

దేవాలయ ప్రాంగణంలో సప్తమాతృకలను చెక్కిన రాతిదిమ్మె ఉంది. పూర్వం నుంచి ఉన్న మాతృకల క్రమం కాకుండా ఈ శిల్పపట్టికలో యమి, బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, ఇంద్రాణి, చాముండ దేవతలున్నారు. ఏడుగురు అమ్మదేవతల వరుసలో ఉండవలసిన వారాహి లేదు. అందరు దేవతలకన్న ముందుస్థానానికి చేరింది యమి. ఇది ఆధునికం అంటే 14,15వ శతాబ్దాలకు చెందిన శిల్పం. ఈ తర్వాత సప్తమాతృకల క్రమంలో చేర్పులు, మార్పులు లేవు అని ప్రతిమ లక్షణ వివరణ ఇస్తూ ఆయన తెలిపారు.

Read More
Next Story