మా ఊరి గ్యాపకాలు...
x
ఫోటో సౌజన్యం: జస్ట్ డయల్

మా ఊరి గ్యాపకాలు...

రాయలసీమ గ్రామీణ సువాసన గుబాళించే కవిత. నేటి మేటి కవి: టీచర్ నల్లబోతుల నాగమణి


మా ఊరి గ్యాపకాలన్నీ

నా మదినీ మురిపంచే తడి దడులే
ముందుగాల మా ఊరి వంక అంటే వయ్యారాల నజరానే
కదలనీయక అడిగేయనీయని తన లోలోపల కి లాక్కునే
సన్నని సొగసైన ఇసుక
కనుసూపు మేర ఒంపుసొంపులతో సాగుతూ
పశువులకు ,ఊరిజనాలకి అవసరాలు తీర్చే
ఆపద్భాదవురాలు మా వూరి వంక
అట్లనే మా ఊరి సిగలో మిలమిల మెరిసే
కిరీటం దేవుని గుడి శిఖరం
భారత భాగవత పురాణ గాథలు వినిపించిన సీతమ్మ కట్ట ఎంతమంది కూసున్న ఇంకా కూసున్నిక చోటిచ్చే పుష్పక విమానమట్ల బసవన్న బండ
ఆటపాటలకు ,ఆలనాపాలనలకి అండ నడిబొడ్డున నిటారుగా నిల్చిన నా ఊరి తేరు
ముచ్చట్లకి ,అచ్చట్లకి ఆలవాలమైన గుడి ముందర మైదానం
కబుర్ల కార్ఖనా మా ఊరి ఎదురుమాన్యం
బీదబిక్కిజనాలకు ఇలవేల్పులు మాదిగ్గేరి ల మారెమ్మ కురవగేరి సుంకలమ్మ గుడి
పండ్లు ,ఫలహారాల వర్ణమాల వచ్చిపోయే జనాల వారధి మా ఊరి బస్టాండ్
నన్ను మమతల మాగాణిగా తీర్చిదిద్దిన
మా ఊరంటే
మా ఊరి గ్యాపాకాలంటే
సింతోక్కు ఊరిమిండి కొర్రబువ్య
తిన్నంత ఇష్టం
ఎన్నో గ్యాపకాల గని
అరుదైన
ఆనందాల హరివిల్లు మా ఊరు
(మా ఊరు దైవందిన్నె జ్ఞాపకాలు)

-నల్లబోతుల నాగమణి, టీచర్, ఎమ్మిగనూర్, కర్నూలు జిల్లా


Read More
Next Story