
ప్రాచీన యుద్ధ విద్య ‘కర్రసాము’ పునర్జన్మ
కర్రసాము--కత్తిసాము... నూతనంగా, నూతన పద్దతుల్లో...
గుంటూరు ట్రెక్కింగ్ టీంతో అహోబిలం వెళ్ళినప్పుడు ఒక టీనేజ్ పిల్లోడు నిశ్శబ్దంగా ఫోటోలు వీడియోలు తీస్తూ, యూట్యూబ్ చేస్తూ, గుళ్ళ గురించి చెప్తూ కనిపించాడు.టీం లీడర్ పుల్లారావుగారు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లమని ఆ పిల్లోడికి అప్పచెప్పాడు.మాటల్లో ఫోటోలు,వీడియోలు, యూట్యూబ్ లే కాదు కర్రసాము చేస్తాను అన్నాడు. ఫోటోలు వీడియోలు, గుళ్ళ గురించి టకటక చెబుతున్న దానిమీద దృష్టి పెట్టాను కానీ, కర్రసాము మీద పెద్దగా దృష్టి పెట్టకుండా అది ఏమిటోలే అనుకున్న.ఈమధ్య కొండవీడు వెళ్ళినప్పుడు మేడం! టోర్నమెంట్స్ కు మా టీములు వెళుతున్నాయి అన్నాడు.ఇంట్రెస్ట్ వచ్చి వివరాలు అడిగాను.కొద్దిరోజుల క్రితం టోర్నమెంట్స్ లో వచ్చిన అవార్డ్స్, ప్రైజుల గురించి చెప్పాడు.పూర్తిగా తెలుసుకోవాలి అని గుంటూరు వెళ్లి ఆ పిల్లోడిని కలిసాను.ఇప్పటికీ 20 నిండని బక్క పలసని పిల్లోడిలాగే కనిపించాడు.'నాని'గా పిలవబడే "మంకు లక్ష్మీనరసింహ"తో జరిగిన ఆ మాటలను ఆసక్తిగా మీతో పంచుకుంటున్నాను.
1.నీ కర్రసాము చూస్తుంటే భలే ఉంది.నీలో చెప్పలేనంత చురుకుదనం కనిపిస్తుంది.మామూలుగా చూస్తున్నప్పుడు అమాయకంగా చిన్నపిల్లోడిగా కనిపించే నువ్వు కర్రసాము చేస్తుంటే పందెంకోడిలా,ఒంగోలు గిత్తల కనిపిస్తున్నావు.దీనికి మీరేమంటారు.
మంకు లక్ష్మీ నరసింహ్మం: ఎనిమిది సంవత్సరాల నుంచి కర్ర సాము చేస్తున్న.నాలోనే కాదు నేర్చుకునే అందరిలోనూ ఆ చురుకుదనం కనిపిస్తుంది. నేర్చుకునే ముందు అందరిలోనూ ముందుకన్నా, చేరిన రెండు మూడు వారాలలో ఆ చురుకుదనం కనిపిస్తుంది.మీకు ప్రణయ్ అనే అబ్బాయి గురించి చెప్తాను.ఎనిమిది సంవత్సరాలు ఈ అబ్బాయిని కర్రసాములో వాళ్ళ అమ్మ బలవంతంగా చేర్చింది.మొదటి వారంలో నీరసంగా తన లోకంలో తనే ఉన్నాడు.ఆ ప్రణయ్ ఇప్పుడు అందర్నీ లీడ్ చేస్తున్నాడు.డిసెంబర్ 6, 7 తేదీల్లో జరిగిన సౌత్ జోన్ టోర్నమెంట్స్ లో జూనియర్ మెడల్ సాదించాడు.
2. కర్రసాము పై ఆసక్తి అనురక్తి ఎలా వచ్చింది.ఇది దాదాపు కనుమరుగై పోయింది కదా? ఏమి చదువుతున్నావు?
ల.న: మా తాతయ్యలు,మామయ్యలు చేస్తుండేవాళ్ళు.వాళ్ల నుంచి కొంత ప్రేరణ ఉన్నది.వాళ్ళ వలన చిన్నప్పటినుండి అలవాటు ఉంది. ఫామ్ డి మూడవ సంవత్సరం చదువుతున్నాను.
3. కావటి కర్రసాము బోర్డు కనిపించింది.కావటి అంటే ఏమిటి?సపోర్టు ఉందా?
ల.న : కావటి అనేది మామయ్య వాళ్ళ ఇంటి పేరు.ఈ ఇన్స్టిట్యూట్ ను మామయ్య స్థాపించాడు. ప్రస్తుతం మామయ్య హైదరాబాద్లో చూస్తున్నాడు. ఇక్కడ నేను చూస్తున్నాను.గుంటూరులో మూడు చోట్ల సెంటర్లున్నాయి. నేను చదువుతున్న నలంద కాలేజీ ప్రిన్సిపాల్ బ్రహ్మం సారు కర్రసాము నేర్చుకోవడానికి, ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి బాగా సపోర్ట్ చేస్తారు.
4.ఈకర్రలు,కత్తులు కొనడానికి, సంస్థ నిర్వహణకు ఖర్చులు ఎలా
ల.న: పిల్లలు ఇచ్చే బేసిక్ ఫీజ్ కొంత ఆదాయంగా ఉంటుంది.కాని ఇన్స్టిట్యూట్ నిర్వహణ ప్రధాన ఉద్దేశం ప్రతి గ్రామంలోకి ఈ పురాతన కళను తీసుకువెళ్లాలని.
5.సెంటర్ పెట్టడంలో బలమైన కారణం ఉందా?
ల.న: ఉంది మేడం.నేటి ఆధునిక యుగంలో మనిషి అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నారు.శారీరక శ్రమ లేకపోవడం వల్ల మానసిక రుగ్మతులకు గురవుతున్నారు.మన పూర్వీకులు అందించిన ఈ విద్యను అబ్యసించడం వలన ఏకాగ్రత,ఆత్మవిశ్వాసం,చురుకుదనం,వ్యాధి నిరోధక శక్తి పెంపొందించవచ్చును.అధికబరువు తగ్గించవచ్చు.ముఖ్యంగా యువతులకు, స్త్రీలకు ఆత్మరక్షణ కొరకు ఈ విద్య ఉపయోగపడుతుంది."కర్రసాము నేర్చుకుందాం దృఢమైన భారత్ ను నిర్మాణం చేద్దాం" అన్న నినాదంతో తీసుకు వెళుతున్నాను.
6.కర్రసాము తెలుగు రాష్ట్రాలలోనే ఉందా?
ల.న: నాకు తెలిసి చాలా రాష్ట్రాల్లో ఉన్నది. కర్రసాము భారతీయ యుద్ధవిద్య.వేల సంవత్సరాలనాడు మన పూర్వీకులు అందించిన గొప్ప విద్య.తెలుగు రాష్ట్రాలలో కర్రసాము, తమిళనాడులో సిలంభం, కేరళలో కలరి, మహారాష్ట్రలో మర్దని ఖేల్, కర్ణాటకలో కొలుహారట,ఉత్తరప్రదేశ్లో లతి అని అంటారు.పూర్వపు రోజులలో రాజులు దేశరక్షణ కోసం,వినోదంకోసం కత్తిసాము,కర్రసాము అభ్యసించేవారు.దీనిలో సైనికులకు శిక్షణ ఇచ్చేవారు.రాచరిక పాలన అంతమైన తర్వాత, ఆంగ్లేయుల పాలనలో 1760--1799 ఈ విద్యపై నిషేధం విధించారు.నాటి స్వాతంత్ర సంగ్రామములో ఈవిద్య కీలక పాత్ర పోషించింది.గొప్ప చరిత్రగల విద్యలు అంతరించిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం 2020లో ఆరు యుద్ధ విద్యలకు గుర్తింపు ఇచ్చింది.వాటిలో కర్రసాము ఒకటి. ప్రభుత్వం యుద్ధ విద్యలకు,కళలకు,సంస్కృతికి ప్రోత్సాహాన్నిస్తుంది.దీని కొరకు రాష్ట్రీయ అవిష్కర్ అభయాన్ కు శ్రీకారం చుట్టింది.
7. కర్రసామునే ఎందుకు ఎన్నుకున్నావ్?
ల.న : ప్రస్తుత కాలంలో పిల్లలందరికీ వేదవిద్య,యుద్ధ విద్య చెప్పాలి.వేద విద్య చెప్పలేం కాబట్టి యుద్ధ విద్యా చెప్పాలి అనుకున్నాను.అందులో ఒకటి కర్రసాము,కత్తిసాము.కర్రసాము పూర్తిగా వచ్చిన తర్వాత కత్తిసాము చెప్తాము.
8 మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?
ల.న: గుంటూరులో 40 మంది హైదరాబాదులో 30 మంది.
9.విద్యార్థులకు ఎంత వయసు ఉండాలి?
ల.న: ఆరు సంవత్సరాలు కచ్చితంగా ఉండాలి. ఎంత వయసు వారైనా నేర్చుకోవచ్చు. కానీ గుండె సమస్యలు లాంటివి ఉండకూడదు.
10. స్త్రీలు కర్రసాము పట్ల ఆసక్తి చూపుతున్నారా?
ల.న : కచ్చితంగా చూపుతున్నారు. ప్రస్తుతం పదిమంది మహిళలు ఉన్నారు ఒకామె తన బాబును చేర్చటానికి వచ్చి ఆ చురుకుతనం చూసి తను కూడా నేర్చుకుంటుంది.చేరకముందు,చేరిన తర్వాత వాళ్లను వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు.తేడా వాళ్ళకే తెలుస్తుంది.
11.కర్రసాము చేస్తున్నప్పుడు ఆ కర్రలు తగిలితే పుచ్చలు ఎగిరిపోతాయేమో అనిపిస్తుంది.అలా ఎప్పుడన్నా జరిగిందా?
ల.న: చిన్న చిన్న గాయాలు కామన్ గా ఉంటాయి.ప్రారంభం నుంచే కర్రలు తగలకుండా,తగిలించుకోకుండా శిక్షణ ఇస్తాం.కర్రసాము యొక్క ప్రధాన ఉద్దేశం ఎదుటి వాళ్ళని దెబ్బతీయటం,చంపటం కాదు.ఎదుటవారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం.సమస్యల నుండి అధిగమించడం.
12.మీ కర్రసాములో ఏదో కొత్తదనం కనిపిస్తుంది.అంటే మోడ్రనైజ్ చేసినట్లుగా.
ల.న: ఇప్పుడు అదనంగా చాలా మెళ్ళుకువ పద్ధతులు చేర్చాం.మా చిన్నప్పుడు కొద్దిగా మొద్దుతనంగా ఉండేది.ఇప్పుడు నేర్పటంలో కొంత సుళ్ళువుతనం ఉంది.
13. కర్రసాము నేర్పే దశలను అంటే వన్ బై వన్ వివరిస్తావా?
ల.న: కచ్చితంగా.1అడుగులు 2కర్ర ఊలు (ముంజేతులు రొటేట్) తిప్పటం. 3.దొమ్మి తిప్పడం (మొత్తం చేతిని సోల్డర్ వరకు తిప్పడం)4 కర్ర మీద గ్రిప్ రావడం కోసం నేల దెబ్బలు నేర్పిస్తాం.5 రొటేట్ తిప్పడం. శత్రువు నుండి బాడీ (శరీరాన్ని)ని ప్రొటెక్ట్ చేసుకోవడం.(దీనిలో సింగిల్ స్టిక్,డబల్ స్టిక్ తో కూడా)6 కర్రలతో ఫైట్ చేయటం.8తాడు తిప్పడం. కర్ర,తాడు అయిన తర్వాత కత్తి సాము నేర్పిస్తాం.
14.ఈ దశలన్నీ నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది.అన్ని నేర్చుకున్నవాళ్ళు ఉన్నారా?
ల.న:సుళువుగా రెండు సంవత్సరాలు పడుతుంది.మొత్తం నేర్చుకున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు.
15. డ్రస్ కోడ్ ఉందా?
ల.న: ఉంది.'లోగో'తో ఉన్న తెల్ల టీషర్టు మగవారికి,మహిళలకు బ్లాక్ టీషర్టు. ట్రాక్ ఫాంటు.
16.కర్రసామును ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళతారు?
ల.న:ఎక్కువగా విద్యార్థుల ద్వారా.నా ప్రోగ్రాంల ద్వారా. ఫ్రెండ్స్ ద్వారా కొంత ప్రచారం చేస్తున్నాం.నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా.ఇప్పుడిప్పుడే కొంత మీడియా ద్వారా.
17. టోర్నమెంట్స్ ఎక్కడ జరిగాయి?
ల.న: 2025 డిసెంబర్6,7 లలో గుంటూరులోని తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమ సుందరం కాలేజీలో జరిగాయి.ఇవి జోన్ టోర్నమెంట్స్. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి, మన రాష్ట్రంలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వెస్ట్ గోదావరి కృష్ణ కర్నూలు అనంతపురం జిల్లా నుండి వచ్చిన టీమ్లు పాల్గొన్నాయి.
టోర్నమెంట్ కు రెడీ అంటున్న విద్యార్దులు.
18.ఈ టోర్నమెంట్స్ను ఎవరి నిర్వహించారు?
ల.న: సిలంభo (silambam Assoociation) అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నిర్వహించింది.తులసి సీడ్స్ చైర్మన్ రామచంద్ర ప్రభు గారు సాన్సర్షిప్ (sponsorship) చేశారు.
19.మీ విద్యార్థులు ఎంతమంది? ఎన్ని పేజెస్లో పాల్గొన్నారు.ఎన్ని ప్రైజులు తెచ్చారు?
ల.న: మా విద్యార్థులు మూడు ఫేజెస్ లో పాల్గొని, గుంటూరు టీం 22 మెంబర్స్ 15 గోల్డ్, 7 సిల్వర్ మెడల్స్, హైదరాబాద్ టీమ్ 5 గోల్డ్, మూడు సిల్వర్, రెండు బ్రోంజ (bronze) సంపాదించారు.విద్యార్థుల ప్రైసెస్ తో పాటు నాకు సిలబం అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ "బెస్ట్ కోచింగ్ సెంటర్ ఆఫ్ ది ఇయర్ 2025" అవార్డ్ ప్రకటించారు.ఈ సంవత్సరము ఇది మాకు నూతనోత్సాహం కలిగించింది.
గోల్డ్,సిల్వర్ మెడల్స్ తో విద్యార్థులు
20. టోర్నమెంట్లో మొత్తం ఎన్ని పేజెస్లో జరుగుతాయి?
ల.న: టోర్నమెంట్స్ మొత్తం తొమ్మిది పేజెస్ లో జరుగుతాయి. పాల్గొనే ప్రతి విద్యార్థి 2 పేజెస్ లో తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి.మా విద్యార్థులు త్రీ పేజెస్ అనగా ఫైట్ , సింగిల్ స్టిక్, డబల్ స్టిక్ లోనే పాల్గొన్నారు.
21. కర్రసాము గురించి ప్రజలకు ఏమైనా చెపుతారా?
ల.న: చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అంతరించిపోతున్న మన ప్రాచీన యుద్ధ విద్య అయినా కర్రసాము, కత్తిసాము నేర్పించండి.ఇది శరీరానికి పటిష్టతకు, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి మంచి ఎక్సర్సైజు.మరుగున పడుతున్న ఒక యుద్ధ విద్యకు ప్రాణం పోయండి.
22.ఏ టైమింగ్స్ లో ?
ల.న: గుంటూరులో, మెయిన్ బ్రాంచ్ అరండాలపేట లో సాయంత్రం 6-8 వరకు. బ్రాడీపేటలో రెండో బ్రాంచ్ లో 8-9 సాయంత్రం.గుంటూరువారి తోటలో మూడో బ్రాంచి ఉదయం 5.30 to 7.30. ఆన్లైన్లో కూడా చెప్తాను. మంకు లక్ష్మీనరసింహ.9390218047. హైదరాబాదులో కావటి వెంకట్.8639146040 .

