
అమ్రాబాద్ అభయారణ్యం మధ్యలో గిరిజన గ్రామం : తరలింపు
పులుల కోసం గ్రామాల తరలింపు:గిరిజనులకు కొత్త జీవితం, అడవికి కొత్త శ్వాస
అమ్రాబాద్‌లో పులుల సంరక్షణకు పెద్ద అడుగు
నల్లమల అరణ్యంలో (Amrabad Tiger Reserve)పులుల సంచారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పులుల సహజ ఆవాసాలను విస్తరించేందుకు, మానవ–వన్యప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు తెలంగాణ అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ ఏరియాలో ఉన్న నాలుగు అటవీ గ్రామాలను తరలిస్తూ 417 కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా అభివృద్ధి–పర్యావరణ సమతుల్యతకు మార్గం సుగమమైంది.
నల్లమల అడవుల్లో...
పచ్చని ఎతైన చెట్లతో కూడిన నల్లమల అడవులు...చుట్టూ కొండలు, గుట్టలు...జాలువారుతున్న జలపాతాలు... గలగల నీటి గలగలలతో కూడిన కృష్ణానదీ తీరంతో కూడిన అమ్రాబాద్ పులుల అభయారణ్యం దేశంలోనే రెండో అతి పెద్ద టైగర్ రిజర్వుగా పేరొందింది. 2611.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల కోసం ఏడు అటవీగ్రామాలను అడవి బయటకు తరలించాలని నిర్ణయించారు. అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులులతోపాటు చీతల్, సాంబార్ , లంగూర్, నీలుగాయి, చౌసింగా, జింకలు, అడవి పందులు ఉన్నాయి. అచ్చంపేట, అమ్రాబాద్ అటవీ డివిజన్లలో 36 పులులు సంచరిస్తున్నాయని 2025 పులుల గణనలో వెల్లడైంది. ఇందులో 13 మగ పులులు, 20 ఆడపులులు, మూడు పులి కూనలున్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
అటవీశాఖ కీలక నిర్ణయం
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోపల ఉన్న ఏడు గ్రామాలను బయటకు తరలించాలని రాష్ట్ర అటవీశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి దశలో సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాల పెంట, కోలంపెంట గ్రామాలను అడవి బయట ఉన్న పెద్ద కొత్తపల్లి మండలం బాచారం గ్రామంలోకి తరలించారు. నాలుగు గ్రామాల పరిధిలోని 2,526 ఎకరాల భూమిని 417 కుటుంబాలు సాగుచేస్తున్నాయి. నాలుగు గ్రామాల్లో గిరిజనులతోపాటు గిరిజనేతరులు ఉన్నారని అధికారులు గుర్తించారు. సార్లపల్లి గ్రామంలో 462 మంది, కుడిచింతలబైలులో 389 మంది, తాటిగుండాల్ పెంటలో 48 మంది, కొల్లంపెంట గ్రామంలో 57 మంది జనాభా నివాసం ఉండగా వారికి బాచారం గ్రామంలో పునరావాసం కల్పించారు. ఈ నాలుగు అటవీ గ్రామాల్లో మూడువేలకు పైగా పశువులున్నాయి. నాలుగు అటవీ గ్రామాలను అచ్చంపేట అటవీ డివిజన్ పరిధిలోని లింగాల్ రేంజ్ బాచారం గ్రామంలోని నాలుగు వేలకు పైగా హెక్టార్ల భూములను కేటాయించారు. అటవీగ్రామాల ప్రజలకు ఒక్కో కుటుంబానికి రూ.15లక్షల చొప్పున పంపిణీ చేశారు.ఈ నిర్ణయం ద్వారా 1501 హెక్టార్ల అటవీ భూమి పునరుద్ధరించబడుతుందని, పులులు సహా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు ఏర్పడతాయని సునీల్ హీరేమత్ తెలిపారు. పులుల సంఖ్య పెంపునకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెండో దశగా మూడు గ్రామాల తరలింపు
రెండో దశలో భాగంగా అడవిలోని వట్ వర్లపల్లి,ఫరహాబాద్ పెంట, కొమ్మన్నపెంట గ్రామాలను అమ్రాబాద్ అడవి నుంచి మైదాన ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నివసిస్తున్న గిరిజన కుటుంబాల అభివృద్ధి, అటవీ, వన్యప్రాణి సంరక్షణను సమన్వయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని గిరిజన గ్రామాలకు చెందిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.ఇందులో భాగంగా మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన మొత్తం 417 కుటుంబాలకు పునరావాసం కల్పించే దిశగా ముందడుగు పడింది. అసెంబ్లీ కౌన్సిల్ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో 14 గిరిజన కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.
గిరిజనుల జీవితాల్లో వెలుగు
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అమ్రాబాద్ అడవుల్లో శతాబ్దాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తున్న గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో అటవీ, వన్యప్రాణి సంరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.గిరిజన కుటుంబాలను స్వచ్ఛందంగా పునరావాసం చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పులులు సహా వన్యప్రాణులకు సహజ ఆవాసాలు తిరిగి లభిస్తాయని అన్నారు.
గిరిజనుల అభివృద్ధి, వన్యప్రాణి సంరక్షణ రెండూ సమానంగా ముఖ్యం.— ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
గిరిజనులకు పునరావాస పథకం
గిరిజనులకు పునరావాస పథకం కింద 160 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల నగదు పరిహారం అందించారు.మరో 257 కుటుంబాలకు నాగర్‌కర్నూల్ జిల్లా బాచారం వద్ద ఆధునిక గృహ వసతితో పాటుగా 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నామని అధికారులు తెలిపారు.సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాలపెంట, కొల్లంపెంట గ్రామాలకు చెందిన కుటుంబాల అభివృద్ధికి మొత్తం రూ.62.55 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రూ.24 కోట్లు నగదు పరిహారం కోసం, రూ38.55 కోట్లు గృహ వసతి కోసం వినియోగిస్తున్నామన్నారు. బాచారం వద్ద ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్లు అమ్రాబాద్ అభయారణ్యం ప్రాజెక్టు డైరెక్టర్ సునీల్ హీరేమత్ చెప్పారు. పునరావాసం తర్వాత గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా, ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా కల్పించనున్నట్లు తెలిపారు.గిరిజన పిల్లలకు ఆధునిక పాఠశాలలు, అంగన్‌వాడీలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
1500 హెక్టార్లకు పైగా అటవీ భూమి పునరుద్ధరణ అవుతుంది. పులులు, వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించగలుగుతాయి.— ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సునీల్ హీరేమత్
మోడల్ గ్రామంగా బాచారం
బాచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని అన్ని మౌలిక వసతులతో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, కమ్యూనిటీ హాల్లు, రైతు వేదికలు వంటి అన్ని సదుపాయాలు ఒకేచోట అందుబాటులో ఉంచుతామన్నారు.
కవాల అభయారణ్యంలో రెండు గ్రామాల తరలింపు
గత సంవత్సరం కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 94 కుటుంబాలను అటవీ శాఖ తరలించింది. కవ్వాల్ ఫారెస్ట్‌లోని రాంపూర్, మైసారం నుంచి 94 కుటుంబాలను మద్దిపడగ గ్రామానికి కు తరలించారు. నిర్వాసితులకు రూ.15లక్షల నగదు పరిహారం లేదా భూమిని అందించాలని ప్రతిపాదించారు. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించి నగదు లేదా భూమిని ఎంపిక చేసుకునే అవకాశం లబ్ధిదారుకే ఇచ్చారు. ఇప్పటికే గుర్తించిన భూమిని అభివృద్ధి చేసి రోడ్డుమార్గం, నీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించాలని వివిధ శాఖలను ఆదేశించారు.
పులుల పరిరక్షణ కోసం గ్రామాల తరలింపు ఒక సాధారణ పరిపాలనా చర్య కాదు... ఇది పర్యావరణ పరిరక్షణ, గిరిజన సంక్షేమం, అభివృద్ధి అనే మూడు లక్ష్యాలను సమన్వయం చేసిన పెద్ద మార్పు. అమ్రాబాద్ అడవుల్లో పులులకు కొత్త ఆవాసం లభిస్తుండగా, గిరిజనులకు కొత్త జీవితం ప్రారంభమవుతోంది. ఇది భవిష్యత్తులో పర్యావరణ–మానవ సమతుల్యతకు ఆదర్శంగా నిలవనుంది.
Next Story

