
ఆకాశం లో సగం -అన్నిటా వారే!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'విశిష్ట తెలుగు మహిళలు' ( సమీక్ష )
- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
మార్చి 8న వచ్చే మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్ తో జరుపుకుంటూ ఉంటాం. ఈ 2026 సంవత్సరానికి Give to Gain అనే థీమ్ ప్రతిపాదితమైంది. ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ అందరూ ప్రయోజనం పొందటం ఈ థీమ్ ఉద్దేశం. దీనివల్ల సమాజ పురోగతి సాధ్యపడుతుంది.
మహిళా సాధికారత, సమానత్వం, నాయకత్వం వంటి అంశాల పట్ల అవగాహన పెంచే విధంగా ఈ థీమ్ రూపొందింది. ఈ రోజు,మహిళలు సాధించిన విజయాలను గుర్తించి, గౌరవించుకునే రోజు. ఆధునిక మహిళ ఎంతో ప్రగతి సాధించింది. సాధిస్తోంది. తన హక్కుల కోసం పోరాటం సాగిస్తోంది.
ఈ సందర్భంగా, స్త్రీలకు విద్యావకాశాలు, బయటకు వెళ్లే పరిస్థితులు లేని రోజుల్లో, ఉన్నా పరిమితంగా ఉన్న, నాటి నుంచి,నేటి దాకా చారిత్రక, సాహిత్య, పత్రిక, నాటక, చలన చిత్ర, కళా,శాస్త్ర, క్రీడా, సేవా, రాజకీయ రంగాలలో తమకున్న పరిస్థితుల్లో, తమదైన శైలిలో కృషి చేసి,ప్రసిద్ధి పొంది, సమాజ పురోభివృద్ధికి దోహదం చేయడమే కాక, తర్వాతి తరాలకు స్ఫూర్తినిస్తున్న విశిష్ట మహిళా మణులు కొందరి చిరు పరిచయం.
“విశిష్ట తెలుగు మహిళలు “
‘108 మహిళా మణుల జీవన రేఖలు,’అనే గ్రంథ రచయిత డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వీరు వక్తగా, గ్రంథ సమీక్షకులుగా, అనువాదకులుగా ప్రసిద్ధులు. బహు గ్రంథ కర్త. ఈనాడు అంతర్యామి లో 2005 నుండి వ్యాసాలు రాస్తున్నారు.
చారిత్రక రంగంలో నాయకురాలు నాగమ్మ ను పరిచయం చేస్తూ రచయిత, రాచరిక వ్యవస్థ లో తొలి తెలుగు మహిళా మంత్రిగా ఈమెను అభివర్ణించారు. చరిత్ర లో రాజ్యాలను పాలించిన రాణులున్నారు. ఝాన్సీ లక్ష్మీ బాయి, రుద్రమదేవి వంటి వీర వనితలు యుద్దాల్లో కత్తి పట్టి పోరాటం చేసినట్లు మనకు తెలుసు. కాని, నాగమ్మ లా మంత్రిత్వం నెరపినవారు అరుదు. 12వ శతాబ్ది కి చెందిన పల్నాటి చరిత్ర లో నాగమ్మ ది కీలక పాత్ర. పల్లె లో పుట్టి పేద రైతు ఇంట పెరిగిన నాగమ్మ తన ఆత్మ శక్తి తో రాజ్య తంత్రం నడిపిన సమర్ధురాలు.
సాహిత్య రంగంలో విజయనగర సామ్రాజ్య సంస్కృత కవయిత్రి గంగాదేవి. మధురా విజయం కావ్యాన్ని 8సర్గలలో, వేరు వేరు ఛందస్సులలో రచించిన విశిష్ట కవయిత్రి. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క, “సుభద్రా కల్యాణం “కావ్యాన్ని మంజరీ ద్విపద లో రచించింది.
తొలి తెలుగు రామాయణ కవయిత్రి మొల్ల. ఈమె వ్యక్తిత్వం లో మూడు విశిష్టతలు చెపుతారు రచయిత. తరతరాలు గా అగ్ర వర్ణ పండితులకు మాత్రమే చెందిన సాహిత్య సంపదను తాను కైవసం చేసుకుంది. సంస్కృత శబ్దాడంబరంతో, గూడార్ధాలతో ఉన్న అప్పటి కావ్య రచన లో తెలుగు కవిత్వం ఎలా ఉండాలో నిర్భయంగా సాహిత్య లోకానికి చాటి చెప్పింది. రాచరిక వ్యవస్థలో కావ్యాలను ప్రభువులకు అంకితం చేసే పద్ధతి చేధించింది.
ఆధునిక సాహిత్యానికి వస్తే, మొట్టమొదట స్త్రీల చరిత్ర ను రాసిన మహిళ గా, సంఘ సేవకురాలిగా పేరు పొందిన బండారు అచ్చమాంబ, ప్రథమ గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీత కనుపర్తి వరలక్ష్మమ్మ. ఇంకా ఎందరో!
స్త్రీలకు విద్యావకాశాలు లేని రోజుల్లో మహిళల కోసం ‘సావిత్రి ‘అనే మహిళా పత్రికను నడిపిన సాహసి తొలి తరం మహిళా సంపాదకురాలు పులగుర్త లక్ష్మీ నరసమాంబ.
నాటక రంగంలో పురుషులే స్త్రీ పాత్రలు ధరిస్తున్న రోజుల్లో, నాటకాల్లోకి ప్రవేశించిన కొద్ది మంది మహిళా మణుల్లో ఒకరు పువ్వుల రామ తిలకం. పద్య పఠనంలో మేటి.ఇంకా సురభి కమలబాయి కూడా!
చలన చిత్ర రంగంలో తమ నటనతో, ప్రేక్షకులను నవ్వించి, ఏడ్పించి, ఆనందింప జేసి, మన మనసులను దోచుకున్న నటీ మణులు శ్రీరంజని, కాంచనమాల, సూర్యకాంతం, భానుమతి వంటి వారు లబ్ద ప్రతిష్టులు.
సంగీత సాహిత్య, నృత్య, గాన, అభినయాల సమాహార కళ హరికథ. ఈ కళలో రాణించిన రావు కమలకుమారి. పండిత పామర రంజకమైన వినోద కళారూపం బుర్రకథ చెప్పటంలో మేటి తొలి తరం మహిళలు మోటూరు ఉదయం, తాపీ రాజమ్మ మొదలైన వారు.
శాస్త్ర రంగంలో కుష్టు వ్యాధి చికిత్స లో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఇందిరా నాథ్, పాలనా రంగంలో ప్రథమ తెలుగు మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి మనకు గర్వకారణం. ఆకాశవాణి రేడియో అక్కయ్య గా పేరు పొందిన బాలనంద కార్యక్రమం నిర్వాహకులు న్యాయపతి కామేశ్వరమ్మ.
సేవా రంగంలో డొక్కా సీతమ్మ, కందుకూరి రాజ్యలక్ష్మి, మల్లాది సుబ్బమ్మ, హేమలతా లవణం…వీరు సమాజానికి చేసిన సేవలు ఎనలేనివి. రాజకీయ రంగంలో అలనాటి 1882-1956కి చెందిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ, సంఘ నిర్మాణంలో, జన సమీకరణలో, నిధుల సేకరణలో ఆమె చూపిన నైపుణ్యం సాటి లేనిది. పోరాటమే ఊపిరిగా జీవించిన మల్లు స్వరాజ్యం. ఎందరో నారీ మణులు! స్త్రీలు తలచుకుంటే సాధించలేనిదేదీ లేదు అని చాటి చెప్పే విశిష్ట గ్రంథం ఇది!

