మిమిక్రీ వేణుమాధవ్  గురించి కొన్ని జ్ఞాపకాలు
x

మిమిక్రీ వేణుమాధవ్ గురించి కొన్ని జ్ఞాపకాలు

నేరెళ్ల వేణుమాధవ్ (డిసెంబర్ 28,1932-జూన్19,2018) కు నివాళి


కాలక్షేపం కబుర్లలో ఇంత హాస్యం వ్యంగ్యం జోడించడం విశేషం. తన ఈ రచనను వేణుమాధవ్ స్వయంగా తన గొంతులో అన్ని స్వరాలు పలికిస్తూ, రైలు బయలుదేరిన చప్పుడూ, క్రమంగా వేగం పెరగడం, నెమ్మదించడం… కాఫీ చాయ్ గోల, రకరకాల ధ్వనులు వివరిస్తూ ముసలి వారి గొంతును అనుకరిస్తూ గల్పిక రసవత్తరంగా సాగిపోతూ ఉంటే ప్రేక్షకులెవరికీ మరో ఆలోచన రాదు. నవ్వు ఆగదు. సభాసదులంతా గొల్లున నవ్వుతూ ఉంటే ఎంత వింత? ఎంత ఆశ్చర్యం? ఎంత వినోదం? ఎక్కడ దొరుకుతుంది? వేణుమాధవ్ స్వర్గంలో మిమిక్రీ చేస్తూ దేవతలను అలరిస్తున్నాడా అనిపిస్తుంది.

మిమిక్రీ వేణుమాధవ్ (నేరెళ్ల వేణుమాధవ్) మనదేశపు గొప్ప మిమిక్రీ కళాకారుడు, వెంట్రిలాక్విస్ట్, "భారతీయ మిమిక్రీ పితామహుడు", ప్రముఖుల గొంతులను, స్థానిక మాండలికాలను అనుకరించడంలో నిపుణుడు, ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన ఇచ్చిన తొలి కళాకారుడు, ప్రపంచంలోనే మొదటిసారిగా మిమిక్రీ డిప్లొమా కోర్సును తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు.
డిసెంబర్ 28, 1932న జన్మించి వేణుమాధవ్ జూన్ 19, 2018న, సహస్ర చంద్రదర్శనం వయసుదాటి 86 సంవత్సరాలు ఈ భూమ్మీద జీవించి, ఏదో అర్జంటు పని ఉన్నట్టు, వారిని నవ్వించడానికి ఐక్యరాజ్యసమితికి మిమిక్రీ ప్రోగ్రాంకు వెళ్లినట్టు స్వర్గానికి వెళ్లిపోయాడు.
నేరేళ్ల మిమిక్రీ వేణుమాధవ్ హాస్య గుళికలు
వరంగల్లు అంటే ఒక రామప్ప. వేయిస్తంభాలగుడి, ఓరుగల్లు, ఆ వరసలో ఉండేవాడు వేణుమాధవ్.
వరంగల్లు స్వయంగా ఒక కళాకేంద్రం, అందులో నేరెళ్ల వేణుమాధవ్. మరిచిపోలేని మహానుభావుడు. జనధర్మలో ఓ గల్పిక ను వేణుమాధవ్ రచించారు. దాని సారాంశం ఇది. ఒక వృద్ధుడు మరో వృద్ధుడితో రైల్లో మాట్లాడుతూ ఉంటాడు. రైలు ధ్వని, రైల్లో రకరకాల జనులు, వారి మాటలు, కాఫీ చాయ్ పల్లీలు సమోసాలు అమ్ముకునే వారి గోల, అంతా వినిపిస్తూ ఉంటుంది. రైలు కుదుపులకు నిలబడ్డవారు ఊగిపోతూ ఉంటారు. కూర్చున్నవారు కూడా కుదురుగా ఉండరు. పైబెర్తులో పడుకున్నవారు కూచున్నవారు కూడా కదులుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో కింది కుర్చీలలో ఎదురెదురు కూర్చున్న ఇద్దరు వృద్ధుల సంభాషణ.
ఒకరు: ఒరేయ్ నీ వయస్సెంతరా?
మరొకరు: ఆ…. ఎంతో కొంత నీకెందుకు రా?
ఒకరు: ఎంతో కొంత అనే కన్న ఎంతో చెప్పవచ్చుకదా. నీకెందుకు అంటావేమిటి? కావాలంటే నా వయసు చెబుతాగానీ నీ వయసు ఎంతో చెప్పు.
మరొకరు: నీ వయసు చెబుతానన్నావు కదా. ముందు చెప్పు. తరువాత నా వయసు చెబుతా…
ఈ విధంగా ఇద్దరూ ఎటూ తెమలకుండా ఓ పది పదిహేను నిమిషాల పాటు వయసు చెప్పుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. వినే వాళ్లు వీరికి ఎంత వయసుంటుందబ్బా అని ఎదురుచూస్తుంటారు. వీరు ఎంతకూ చెప్పరు. విసుగు వస్తూ ఉంటుంది.
మరొకరు: సరే విను చెబుతా. నా వయసు బహుశహా ఇరవై పాతిక మధ్య ఉండవచ్చురా…
ఒకరు: అవునా మరీ ఏమిట్రా అంత వయసైన వాడిలా ఎంతో పెద్ద వాడి వలె కనిపిస్తున్నావేం రా? నిజమేనా.
మరొకరు: మరి మనం ఎన్ని కష్టాలు పడ్డాం. అందుకే ఎక్కువ వయసనిపిస్తుంది.. అది సరే నీ వయస్సెంతరా?
ఒకరు: అబ్బే నీ అంత వయసు కాదులే…
మరొకరు: ఏమిటీ నా అంత కాదా… పళ్లూడి పోయి సరిగ్గా మాటలు కూడా రావడం లేదు. నీది నాకన్నా చిన్న వయసా… ఇంతకీ ఎంతంటావు చెప్పు.
ఒకరు: వేసుకోవచ్చు… పద్దెనిమీ ఇరవై మధ్య….
అందరూ నవ్వు ముఖం పెట్టి ఆశ్చర్యపోతూ ఉంటే…. పై బెర్తునుంచి ఠపీమని ఒకడు కింద పడ్డాడు. ఇద్దరు వృద్ధులూ నోరెళ్ల బెట్టి కిందికి చూస్తారు. ఏమిటి నాయనా ఇది అని అడుగుతారు. దానికతడు చెప్పిన జవాబు:
’’నేనిప్పుడే పుట్టాను‘‘
జనధర్మలో వేణుమాధవ్ గల్పికలు
వరంగల్లునుంచి మానాన్నగారు ఎం ఎస్ ఆచార్య నడిపే జనధర్మ వార పత్రికలో ఆయన రెండు మూడు గల్పికలు రాసినాడు. అవి నేను కంపోజ్ చేసి, చేయించి జనధర్మపేజిలో కూర్చి శీర్షికను అందంగా చేర్చి ముద్రించిన గుర్తుంది. అవి చిలకమర్తి ప్రహసనాల వలె ఉండేవి. అద్భుతమైన హాస్యం పండించే సన్నివేశాలను ఊహించి, స్క్రీన్ ప్లేతో సహా నిర్మించి ప్రదర్శించే శక్తి యుక్తులు ఆయన సొంతం.
ఎంత వ్యంగ్యం, ఎంత హాస్యం?
మనకు కళాకారుల ప్రదర్శనాభిలాష పైన అనేక జోకులున్నసంగతి తెలిసిందే. ఒక వార్షికోత్సవంలో, చివరి కళాకారుడు ప్రోగ్రాం ఇస్తున్నాడట. ఆయనకు ఒకే ప్రేక్షకుడు మిగిలాడట. అందుకు ఆయన ధన్యవాదాలు చెబితే, ‘‘నేను ఉండక తప్పదు సార్, మీ కార్యక్రమం అయిపోయింతర్వాత ఆ తివాచీ తీసుకుపోవాలి’’ అన్నాడట. ఈ జోకును వేణుమాధవ్ ఎంతబాగా మలిచాడో చూడండి.. ఒక్కడైనా ఉన్నందుకు ఆ కళాకారుడు ధన్యవాదాలు చెబితే, ఆ ప్రేక్షకుడు.. ‘‘మీ తరువాత నా మిమిక్రీ ప్రోగ్రాం ఉందండి’’ అన్నాడట. ఎంత వ్యంగ్యం, ఎంత హాస్యం కదా?


Read More
Next Story