
‘జముకు’ ఆయుధంగా న్యాయకోసం పోరాడిన కళాకారుడు
దేశమంతా ఘనసంపద వీసమంత మాకందదు ఆశ పోతులంతచేరి దోచుకు పోతున్నారు: సుబ్బారావు పాణిగ్రాహి
అరసవిల్లి కృష్ణ
కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి అమరత్వం చెంది అయిదున్నర దశాబ్దాల కాలం నడిచింది. ఆయన స్మృతి ఈనాటికీ విప్లవోద్యమ ప్రభావాలలో ఒకటిగా కలగసిపోయింది. భారత విప్లవోద్యమ చరిత్రలో భూమి, భుక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో పాణిగ్రాహి అమరత్వపు కొనసాగింపు ఇప్పటికీ కొనసాగుతుంది.
మానవ జీవితంలో పాణి గ్రాహి వంటి నూతన మానవులు ఉంటారా! అనేది భారత సమాజానికి ఇవాల్టికి మింగుడు పడని అంశం. నక్సల్బరీ వసంత మేఘగర్జన పిలుపు అందుకొని భారత పాలకవర్గాలకు వ్యతిరేకంగా కొనసాగించిన పోరాటంలో పాణిగ్రాహి చేతిలో ఉన్న సాంస్కృతిక ఆయుధం జముకు మాత్రమే. ఒక సంప్రదాయ వాయిద్య పరికరం విప్లవాన్ని, అమరత్వాన్ని వాగ్దానం చేసింది. జీవితంలోని ఒక సాంస్కృతిక అల్లిక బీదరికం నుండి ప్రారంభమై, అమరత్వం దగ్గర ముగిసింది. ఈ పేదతనం తనకి మాత్రమే సంబంధించిన అంశం కాదు. ఆనాటి సమాజపు కోట్లాదిమంది అన్నార్తుల జీవన దృశ్యం.
పాణి గ్రాహి శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. సంప్రదాయ కులంలో పుట్టినా తన జ్ఞాన విస్తృతిలో విశాల హృదయంగల ఆలోచనా పరునిగా తయారయ్యాడు. సాహిత్య అభినివేశం, కళాత్మక సృజన కలగలిసిన ప్రజా వాగ్గేయకారుడు. ఇంతటి కళాత్మక , సృజనాత్మకత శక్తిని ఎక్కడ నుంచి స్వీకరించాడు. కళా ప్రయోజనాన్ని ప్రజల కోసం అనువర్తింపజేయడం వెనుక దాగిన మానవ హృదయాన్ని ఎక్కడ పొందాడు. ఆ వెలుగులో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అతను వేసుకున్న దారి ఏమిటి? ఇదొక మానసిక విశ్లేషణ మాత్రమే కాదు, మానవుడిగా విస్తరిస్తున్న కొలది పడిన మానసిక శ్రమ ఈ రూపం తీసుకుంది .ఆ వెలుగులో అతను అమరత్వం చెందే కాలం నాటికి భారతీయ సమాజపు చలనం ఏదిశగా కొనసాగుతున్నది చరిత్ర ll
గ్రామీణ నేపధ్యం నుండి బయలుదేరి కళాత్మక అంతరంగ ఘర్షణ నుండి విప్లవ మానవునిగా మారాడు.ఈ మార్పు వెనుక 1925లో ఏర్పడిన కమ్యూనిస్టు భావజాలం ఉన్నది. సుబ్బారావు పాణి గ్రాహి ఇక్కడ నుండి స్ఫూర్తి పొందాడు . సైద్దాంతిక అవగాహన జీవితంలోని ఖా ళీ ఇవన్నీ కలగలిసిన సాంస్కృతిక సాయుధ మానవుడు . పాణిగ్రాహి అమరత్వం వెనుక మానవ జీవన సంఘర్షణ ఉన్నది. దానిని అధిగమించడానికి సాయుధ పోరాట లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు .గ్రామీణ జీవితాన్ని సంఘటిత పరిచాడు . ఉద్యమరూపాన్ని తీసుకురావడంలో పాణి గ్రాహి ప్రయత్నం అతని అమరత్వంతో ఆగిపోలేదు. భారత విప్లవోద్యమ కొనసాగింపును అంచనా వేసినప్పుడు భారత విప్లవోద్యమానికి యానాని శ్రీకాకుళం .విప్లవోద్యమానికి తెలుగు నేలపై బీజం వేసిన శ్రీకాకుళ చరిత్రలో విప్లవ భావజాల కొనసాగింపు ఉన్నది. ఈ నేపథ్యానికి అనేక కారణాలు . భూమిపై ఏర్పడిన నాగరికత, సంస్కృతిలో ఆకలి, పేదరికం ప్రధానమైన అంశాలు .ఈ పునాదిపై నిర్మించబడిన కళారంగంలో సుబ్బారావు పాణిగ్రాహి నిర్మించిన సాంస్కృతిక విధానం అనేకుల అమరత్వాన్ని నమోదు చేసింది.
కమ్యూనిస్టులం మేము కష్ట జీవులం .అవునన్నా కాదన్నా అదే ఇస్టులం. ఎరుపు అంటే కొందరికి భయం భయం. వారి కంటే పసిపిల్లలే నయం నయం. ఇవాల్టి తెలుగు సమాజం ఈ పాటలను తమ జీవితాలలోకి అన్వయించుకుంటున్నది. దీని వెనుక అనేక కారణాలను వెతకవచ్చు సామాజిక చలనంలో పాలకుల పీడన ఇవాల్టికి కొనసాగుతుంది. కూడు లేని గూడు లేని నిర్భాగ్యుల జీవనాలు పాడు సావసిద్ధ పడుతుంటే ఆయుధాల ఆకు వేసి తుపాకీతో నడిస్తే మీ ఊహలు సాగవులే తలకిందులై తీరుతాయి. వర్తమాన కాలయవనిక లో పాణిగ్రాహి రూపొందించుకున్న కళా రంగం రచన,పాట, గాత్రము ఒకనాటి పాలకవర్గాలను బైకంపితులను చేసిన కళాత్మక, ప్రజా పోరాటాల గురించి ఇంతకాలం కాలం మాట్లాడింది .ఇక్కడ కాలమంటే రక్తమాంసాలతో నడిచిన మనుషులు. పట్టపగలు నత్తడివ గూండాలు పెత్తందారులు రక్షక బటుల ఎదుట కక్షగట్టి కొడుతుంటే దెబ్బల రక్షణ లేకపోగా దెబ్బలు తిన్నవాలనే ఖైదు చేసి ఇది !పిశాచాల రాజ్యమా!
ఆధునిక గణతంత్ర రాజ్యం ముసుగు అనేకమంది గిరిజనోద్యమ విప్లవ కారులను చంపివేసింది. తామాడ అంకమ్మ,తెలకల సరస్వతి, పంచాది నిర్మల రమేష్ చంద్ర సాహు చెల్లూరి ఉమారాణి యున్నారు.నామవాచకాలతో పనిలేదు. ఉద్దానం నెత్తురుతో ఈ ప్రాంత నదులన్నీ కన్నీళ్లు కలగలిసిన నీటిపాయలుగా ప్రవహించాయి .ఒక ఆకాంక్ష, ఆశయం, దోపిడీ రహిత భారత ప్రజాస్వామ్యం కోసం సాగిన పోరాటంలో అమరత్వం ఉన్నది. అమరత్వ పరంపర భారతదేశ రాజకీయాలలో అల్లుకొని ఉన్నది. కళ, పోరాటం ,ప్రజలు వీటి మధ్య ఉన్న సమతుల్యత పోరాట రూపాన్ని ఎత్తిపెట్టింది .ఈ ప్రజల కలల వెనుక త్యాగం ఉన్నది. ఈ త్యాగపూరిత జీవితాల వెనుక శ్రమ జీవన సంస్కృతి ఉన్నది. న్యాయ బద్ధమైన నూతన ప్రజాస్వామిక భావన ఉన్నది. ఏభై అయదేళ్ళ క్రితం అమరత్వం నేల కోసం, భుక్తి కోసం సాగింది. అది ఆనాటి కనీస జీవన అవసరం. భూమి వెలుపుల ప్రజలు ఉన్నారు. భూమి కేంద్రంగా బుగతులు ఉన్నారు. అనుకునే రాజ్య న్యాయం.
ఇవాళ సందర్భం మారింది. భారతదేశ మధ్య ప్రాంతంలో ఆదివాసులకు పాలక పక్షాలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ నేల మరో రూపం తీసుకుంది. కోట్లాది రూపాయలు కోసం దేశీయ అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు, డాలర్ల డేగల కాసుకుని కూర్చున్నాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్ భారత పాలకవర్గాలు కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్ కొనసాగుతుంది. విప్లవోద్యమాన్ని నిర్మూలించడంలో భాగంగా ఆదివాసుల హననం కొనసాగుతుంది. పైకి మాత్రం మావోయిస్టు నిర్మూలననే పదాన్ని పలికినా దీని వెనుక ఆదివాసులను విస్తాపనకు గురి చేయడమే దళారీ పాలకవర్గాల అంతిమ నిర్ణయం .అయితే ప్రపంచ చరిత్రను గమనిస్తే బస్తర్ భారతీయ వియత్నాం. అయితే న్యాయం ఎవరి వైపు ఉంటుందో చరిత్ర స్పష్టం చేస్తుంది. అపారమైన సహజవనరుల కోసం ఆదివాసులుపై వేట అనేక రూపాలలో కొనసాగుతుంది. అడవి నుండి బలవంతంగా లేదా విస్తాపనకు గురిచేయడం తద్వారా భారత పాలకవర్గాలు సహజ వనరులును తమ తైనాతీయులకు కట్టబెట్టడం. ఈ దళారీ పాత్ర అవగత మయితే కగార్ ను అర్థం చేసుకోవచ్చు. సుబ్బారావు పాణిగ్రాహి అమరత్వాన్ని ఎత్తి పట్టడం అంటే ఇవాళ దేశంలో జరుగుతున్న వివిధ వర్గాలపై దాడులను నిరసించడమే.ఆధిపత్య సంస్కృతి స్థానే ప్రజా సంస్కృతిని వ్యాప్తి చేయడమే .ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడి పాలకులు కొనసాగిస్తున్న రాజకీయార్థిక విధానాలకు వ్యతిరేకంగా నిలబడటమే. వీటన్నిటి కేంద్రంగా ప్రజా క్షేత్ర, కళాత్మక రంగంలో పనిచేయడం ద్వారా సుబ్బారావు పాణిగ్రాహి అమరత్వానికి అసలైన నివాళి అవుతుంది.
(సత్యప్రచారక్ సమాజ్ వెబ్ సైట్ నుంచి)