పుస్తకాలు(కితాబే ): సర్దార్ హస్మి కవిత.
x

పుస్తకాలు(కితాబే ): సర్దార్ హస్మి కవిత.

తెలుగు అనువాదం గీతాంజలి . నేడు ఈ రోజు సఫ్దర్ హష్మీ(12 April 1954 – 2 January 1989) వర్ధంతి


పుస్తకాలు మాట్లాడుతాయి!

గత కాలం గురించి,

ప్రపంచం గురించి,

మనుషుల గురించి,

ఈరోజు, రేపు గురించి

ఒక్కొక్క క్షణం గురించి

పుస్తకాలు మాట్లాడతాయి

.....
మనుషుల జీవితాల్లోని సంతోషాల గురించి,
కష్టాల గురించి పువ్వుల గురించి,
మొక్కల గురించి,
విజయాపజయాల గురించి,
ప్రేమ గురించి దెబ్బల గురించి
పుస్తకాలు మాట్లాడుతాయి
....
నువ్వు వినవా ఏంటి
పుస్తకాలు మాట్లాడే మాటలు?
పుస్తకాలు
ఏమో చెప్పాలనుకుంటున్నాయి
కాస్త విందూ రా!
చూడు పుస్తకాలు
నీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నాయి.
* పుస్తకాల్లో పక్షులు ఆడతాయి తెలుసా!
పుస్తకాల్లో
పచ్చని పంట పొలాలు నాట్యమాడుతాయి !
పుస్తకాల్లో
జలపాతాలు దుంకుతాయి ఏమనుకుంటున్నావ్?
పుస్తకాలు దేవతల కథలు వినిపిస్తాయి
పుస్తకాల్లో
రాకెట్ల రహస్యం దాగుంటుంది
పుస్తకాల్లో సైన్సు పిలుపు ఉంటుంది
పుస్తకాల్లో
ఎంత పెద్ద లోకం దాగుందనుకున్నావ్?
పుస్తకాల్లో జ్ఞానబండాగారం ఉంటుంది.
ఇప్పుడు చెప్పు!
నువ్వు ఈ పుస్తక సంసారంలోకి
వచ్చేయాలని అనుకోవడం లేదా?
విను
పుస్తకాలు ఏమో చెప్పాలనుకుంటున్నాయి!
పుస్తకాలు నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాయి !
ఇంకేం! ఇటు రా.,పుస్తకం పిలుస్తోంది!...


హష్మి పరిచయం: జనవరి 2 -1989 భారత కమ్యూనిస్టు వీధి నాటక రచయిత, దర్శకుడు, గేయ రచయిత, సిద్ధాంతకర్త, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్త సఫ్దర్ హస్మి హత్యకు గురై చనిపోయిన రోజు.

హస్మి 12 ఏప్రిల్ 1954లో ఢిల్లీ లో జన్మించారు.
1973లో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ నుండి ఉద్భవించిన జననాట్యమంచ్ పీపుల్స్ థియేటర్ ఫ్రంట్ వ్యవస్థాపక సభ్యుడుగా ఉన్నారు. సఫ్దర్ హస్మి భారతదేశంలో అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు)లో సభ్యుడు. ఎకనమిక్ టైమ్స్ లో , ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఢిల్లీలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయ్యారు. 1984లో సఫ్దర్ హస్మి తన ఉద్యోగాన్ని వదులుకొని పూర్తి సమయం రాజకీయ కార్యకలాపాలకు అంకితం చేసుకున్నారు. 1989లో జండాపూర్లో "హల్లా బోల్" అనే వీధి నాటకం ప్రదర్శిస్తుండగా ఆయన హత్యకు గురయ్యారు.
సఫ్దర్ హష్మీ రాసిన నాటకాలు కుర్చీ, కుర్చీ కుర్చీ, మెషిన్, చిన్న రైతుల దుస్థితిపై గౌస్య శాఖ, క్లరికల్ ఫాసిజంపై హత్యారే కే, నిరుద్యోగంపై టీం కోర్ట్ మహిళలపై హింసపై ఔరత్, ద్రవ్యోల్బణం పై డిటిసి కి దందృలి నాటకాలు రాసి ప్రదర్శించారు. దూరదర్శన్ కోసం అనేక డాక్యుమెంటరీలు టీవీ సీరియల్స్ నిర్మించారు. గ్రామీణ సాధికారతను వ్యక్తపరిచిన అనేక నాటకాలనీ రచించారు. పిల్లల కోసం అనేక కవితల పుస్తకాలు రాశారు. అనేక విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. ఆయన నాటకాలను దాదాపు నాలుగు వేల ప్రదర్శనలను ఎక్కువగా శ్రామిక తరగతి పరిసరాలు, కర్మాగారాలు మరియు వర్క్ షాప్ లలో ప్రదర్శన ఇచ్చారు.
సఫ్దర్ హస్మి రచనలలో రెండు ప్రొసీనియం నాటకాలు ఉన్నాయి మాక్సిమ్ గోర్కి రాసిన ఎనిమీస్ మరియు సత్యాగ్రహ యొక్క అనుసరణ రాశారు అనేక పాటలు టెలివిజన్ సిరీస్ స్క్రిప్టు పిల్లల కోసం కవితలు నాటకాలు, డాక్యుమెంటరీలు, చిత్రాలు, ఈయన దర్శకత్వంలో వచ్చాయి.
ప్రజా కళాకారుడైన సఫ్దర్ హస్మి ఫస్ట్ జనవరి 1989 జనం బృందంతో ఘజియాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సాహిబాబాదులోని జండాపూర్ గ్రామంలో హల్లాబోల్ (మీ గొంతు పెంచండి) అనే వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ బృందంపై భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు అన్న ఆరోపణ ఉంది. దీనిలో హస్మి తీవ్రంగా గాయపడి జనవరి రెండో తారీకు మరణించాడు. ఆయన మరణించిన రెండు రోజుల తర్వాత జనవరి 4 .1989న ఆయన భార్య మోలో శ్రీ హస్మి, జనం బృందంతో మళ్లీ అదే ప్రదేశానికి వెళ్లి దిక్కారంగా నాటకాన్ని పూర్తి చేసింది.


Read More
Next Story