అవార్డు పొందిన కవిత ‘నది వదిలేసిన తీరం’  సమీక్ష
x
Source: Giovanni Bragolin via Frida Bibi Pinterest

అవార్డు పొందిన కవిత ‘నది వదిలేసిన తీరం’ సమీక్ష

కీ.శే శ్రీమతి చింతా ముత్యాలు శ్రీ చింతా శేషరత్నం గార్ల స్మారక దసరా కవితాపోటీలో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్న కవిత



నది వొదిలేసిన తీరం


(మిరప మహేష్)

ఉడుకు తగలకుండా వేడన్నాన్ని

ఊదూది గోరెచ్చగా తినిపించిన

అమ్మతనం దూరమైన పసితనం

ఇటుక బట్టీ పొగలకో

ఊక పొయ్యి సెగలకో

బొబ్బలెక్కిపోతుంటే

రంగుల రెక్కలిప్పని

మొరటు గొంగలిగానే

ఇప్పటికీ మూల్గుతున్నాను

నా కన్నీళ్లను కడుపారా తాగిన

ఊరి మట్టరుగుల ముందే

పుసులుగట్టిన నిద్ర కళ్ళను

శూన్యానికి తగిలించి

నిన్నటి గాయాలన్నీ ప్రతి ఉదయం

పచ్చిగానే మేల్కొంటుంటే

నేను మాత్రం ఏరోజుకారోజు

ఆకలికి సమాధి కట్టే పనిలోనే

చస్తూ బతుకుతున్నాను

నువ్వు కోడిపిల్లలకి నూకలేసినట్టు

కుక్కపిల్లలకి అన్నం ముద్దలేసినట్టు

కనీసం నాలుగెంగిలి మెతుకులైనా

నాకెవ్వరూ విదల్చటం లేదు

ఇక్కడందరూ మాటల దారం తెగిపోయిన గాలిపటాలే

సాయం చేతులు నరికేసుకున్న

రాతిబొమ్మలే

తెలీని చీకటికి నన్నప్పజెప్పి

నీ దీపాన్నార్పేసుకున్నాక

పొద్దు తెలియని వెలుతురునై

చీదరింపుల తీరంలో

పెనుగులాడుతున్నాను

చీకటి పురుగుకి జడిసి

ఉలికిపాటు లోయల్లో

మెలకువను తొరుపుకుంటూ

నడిరాత్రులెన్నిసార్లు

పొడికళ్ళతో కలవరించానో

పొర్లిపోని చేదు జ్ఞాపకాలకి

బాగా తెలుసు

అమ్మా.!

కలల కలనేత మరచిపోయిన

నా కంటి మగ్గం సాక్షిగా

నది వొదిలేసిన తీరాన్ని నేను

ఇప్పుడు నా సంతకం అనాథ




సమీక్ష


(పుష్యమి సాగర్)


ఒక అస్తిత్వ వేదన

కవిత్వం ఏమి చేస్తుంది మనుషుల్ని కదిలిస్తుంది అలా కదిలించే దే కవిత్వం అంటే. చాలా మంది చాలా వాదా ల కవిత్వం రాసినా ఈ కవి తానూ మాత్రం విభిన్న వస్తువు ఎంచుకున్నాడు. సామజిక వాస్తవికత (social reality) వి ఎంచుకొని వాటిని ప్రతీక వాదం (symbolism) తోను ప్రతీకల తో ఆలోచింపచేస్తాడు.

ప్రతి రచయత కి ఒక్కో సమస్య పై ఒక empathy ఉంటుంది. దాన్నే మనం తాదాత్మ్యం (Empathy)... అంటాము ఒక రచయత తన రచనతో గాని, రచనలో ని ముఖ్య పాత్రలో కానీ మమేకమై పోయిన స్థితి ని తాదాత్మ్యం అంటారు ...రచయత లే కాకుండా పాఠకులు కూడా ఒక రచన తో గాని అందులోని పాత్రా తో (ఎంపతీ చూపడం జరుగుతుంది) ..అలాంటి ఒక వస్తువు ని తీసుకున్నాడు ఈ కవి. అనాధ అవ్వడం, అనాధ గా బతకడం . పుట్టుకతో అనాధ గా మిగలడం, జీవితం లో తండ్రి తల్లి మధ్య లో నే నిష్క్రమించడం. ఆ తరువాత ఏర్పడిన కఠిన పరిస్థితులు ఓ చోట ఇలా అంటాడు

"నిన్నటి గాయాలన్నీ ప్రతి ఉదయం/పచ్చిగానే మేల్కొంటుంటే

నేను మాత్రం ఏరోజుకారోజు/ఆకలికి సమాధి కట్టే పనిలోనే /చస్తూ బతుకుతున్నాను"

నిన్నటి చేదు నిజాన్ని మర్చిపోలేక నిత్యం వేదన తో ప్రతి రోజు బతుకు ఒక యుద్ధమే చేస్తున్నాడు. ఆకలి రాక్షసుడి ని చల్లార్చే పని లో నిత్యం చావు తో చెలగాటమే ....

బాల్యం ఎవ్వరికైనా మధుర అనుభూతి ఇవ్వాలి. కానీ కొన్ని జీవితాలకి బాల్యం ఒక శిక్ష అది మధ్య లో వచ్చిన ధీ అయితే మరీ దారుణం. ఇక్కడ విధి వశాత్తు తండ్రి ని తల్లి ని స్వల్ప కాలం లో కోల్పోయిన వాడి మానసిక స్థితి ని వివిరించాడు.

మొదటి పంక్తులలో నే వాస్తవాన్ని వివరించాడు చూడండి

"ఉడుకు తగలకుండా వేడన్నాన్ని /ఊదూది గోరెచ్చగా తినిపించిన

అమ్మతనం దూరమైన పసితనం "

తల్లి గోరు ముద్దలు తినే అదృష్టం కేవలం అమ్మ లు ఉన్నవాళ్ళకి కానీ పాపం ఈ అనాధ కి ఆ అదృష్టం కూడా లేదు ..అమ్మతనం దూరమైనా పసితనం ఎలా ఉంటుంది ...ఇక అమ్మ నాన్నల్ని దూరం అయ్యాక ఆకలి ని చెంపేందుకు బాల కార్మికుడి గా అవతారం ఎత్తుతాడు ఇదిగో ఇలా అంటాడు

"ఇటుక బట్టీ పొగలకో /ఊక పొయ్యి సెగలకో /బొబ్బలెక్కిపోతుంటే/రంగుల రెక్కలిప్పని

మొరటు గొంగలిగానే/ఇప్పటికీ మూల్గుతున్నాను"

ఆకలి ప్రపంచం లో అతి పెద్ద నేరస్థుడు ఇదే...ఒక మనిషి ని ఎత్తుకు ఎదగాలి అన్నా, దిగజారాలి అన్నా ఇదే ఆకలి ...ఈ బాలుడు కూడా దానికి అతీతుడు కాదు అందుకే ప్రతి దినం

"నేను మాత్రం ఏరోజుకారోజు

ఆకలికి సమాధి కట్టే పనిలోనే

చస్తూ బతుకుతున్నాను" అవును ఆకలి ని చంపేందుకు ఒక యుద్ధం చేస్తున్నాడు

"అన్నపూర్ణ నా దేశం " అని మాటల్లో రాతల్లో రాసుకుంటాం కానీ నిజానికి వాస్తవికత (reality) వేరు గా ఉంటుంది. మనుషుల్లో సానుభూతి, .సానుభూతి అంటే ఇతరుల దురదృష్టం పట్ల జాలి మరియు విచారం, తాదాత్మ్యం కొరవడింది. మనిషి సామజిక జీవి అన్నప్పుడు సాటి జీవి కష్టానికి స్పందించాలి ఇక్కడొక సూటి ప్రశ్న వేస్తాడు ...ఎలా

"నువ్వు కోడిపిల్లలకి నూకలేసినట్టు/కుక్కపిల్లలకి అన్నం ముద్దలేసినట్టు/.కనీసం నాలుగెంగిలి మెతుకులైనా నాకెవ్వరూ విదల్చటం లేదు"

కనీసం మూగ జంతువుల ఆహరం అంతా కాదు కదా నా జీవితం కొన్ని మెతుకులు ఒక అనాధ జీవితాన్ని నిలబెడతాయి కదా అది ఎందుకు ఆలోచించారు

మనిషి కి మాట సాయం చాలు ..కొన్ని సార్లు చేతలు కానప్పుడు మాట సాయమే నిలబెడుతుంది అలాంటి మాట సాయం ఇంకా సాయం చేసే చేతులు కూడా తెగకొట్టుకొని అరణ్యం లో బతుకుతున్నారు రా అని నిలదీస్తాడు ...

"ఇక్కడందరూ మాటల దారం / తెగిపోయిన గాలిపటాలే /సాయం చేతులు నరికేసుకున్న

రాతిబొమ్మలే " మనిషి గా నువ్వు ఆలోచించలేనప్పుడు రాతి బొమ్మవే కదా..

మనిషి కి ఆత్మ గౌరవం చాలా ముఖ్యం అది లేనప్పుడు మనిషి కుంగిపోతాడు అదిగో నేను అనాధ అనే బాధతో, ఆత్మ నూన్యతా భావం తో చీకట్లో మగ్గిపోతాడు పొద్దు తెలియని వెలుతురు కోసం పాకులాడుతూ చీదరించబడతాడు

"తెలీని చీకటికి నన్నప్పజెప్పి/నీ దీపాన్నార్పేసుకున్నాక/పొద్దు తెలియని వెలుతురునై

చీదరింపుల తీరంలో/పెనుగులాడుతున్నాను" ఇది నిజం ఇదే నిజం..

గతం తాలూకు గాయాలు బాధిస్తుంటే ఉలికి పాటు కి గురి అయ్యి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో పాపం పసివాడు .కళ్ళ నుంచి దాటి పోనీ జ్ఞాపకాలు ని అడుగు కన్నీటి కధలు చెప్తాయి. చీకటి కి జడిసి నిద్ర పోవడమే గగనం అయ్యింది అందుకే ఆ చేదు జ్ఞాపకం దాటిపోలేదు

"నడిరాత్రులెన్నిసార్లు /పొడికళ్ళతో కలవరించానో.పొర్లిపోని చేదు జ్ఞాపకాలకి

బాగా తెలుసు.. ...అవును జ్ఞాపకం ఎప్పుడు తీపి నే కానక్కర్లేదు చేదు కూడా ...

ఒక నేత కార్మికుడి కుటుంబం అర్థాంతరం గా లోకం విడిచిపోతే వారి పిల్లల భవిష్యుత్తు ఏమిటి అన్నది మొత్తం కవిత సారాంశం. ...ఇప్పటికి చాలా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అనేక ప్రదేశాల్లో నేతన్న ల స్థితి అలానే ఉంది. ఇది ఏ పాలకులు పట్టించుకోరు.

కవితని ముగించడం లో చక్కగా వ్యక్తీకరించడము ఈ కవి ప్రత్యేకత. అమ్మా నది వదిలేసినా తీరాన్ని నేను ఇప్పుడు నేను ఒక అనాధ సంతకం అంటాడు. అమ్మా నాన్న లై పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు వారి జీవితాన్ని అలా గాలికి వదిలేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు ....

"అమ్మా.!/కలల కలనేత మరచిపోయిన

నా కంటి మగ్గం సాక్షిగా/నది వొదిలేసిన తీరాన్ని నేను/ఇప్పుడు నా సంతకం అనాథ" సంతకం అనాధ అంటే నా అస్తిత్వం ఇప్పుడు వొట్టి దే ...అని చక్కగా చెప్పి ముగిస్తాడు.

మిరప మహేష్ కవిత్వం లో ప్రకృతి సహజ వాదం (naturalism) ఉంది.

వాస్తవం పట్లా, సహజత్వం పట్లా ఆసక్తి కనపరుస్తూ దాన్ని రచన లో ప్రతిబింబించడం

నిత్యా జీవితం లో ఎదురయ్యే సంఘటన లను పాత్ర ను తీసుకొని రచన మలచడం...ప్రతి కవి కి కవిత్వం రాసేప్పుడు ఒక నేపధ్యం ఉంటుంది. అది ఊహాత్మయికానా అయ్యి ఉండాలి/లేదు వాస్తవం గా జరిగిన సంఘటన నుంచి అయినా ప్రేరణ పొంది ఉండాలి. బహుశా తన చుట్టూ జరిగే వాటినే కవిత్వం గా మలిచి ఉంటాడు.

ఇంకా ఈ కవి కవిత్వం లో చాలావరకు కట్టడి వాదం (constructism) .కనిపిస్తుంది కవిత్వం అనేది ఒక కట్టడం లా ఉండాలి ..కట్టడానికి ఒకదాని తో ఒకటి ఎలా సంబంధం ఉంటాయో అలాగే కవిత్వం లో వాడే పదాలు, ప్రతీకలు, భాష ఇతరమైనవి అన్ని ప్రధాన వస్తువు తో ముడి పడి ఉండాలి .

నేను ఈ కవి కవిత్వం లో చాలా వరకు గమనించింది ఏమిటి అంటే వ్యక్తీకరణ వాదం (expressionsim) . రచయతలు/కళాకారులు అంతరింగికత అనుయభావాలకి రూపధారణమిచ్చే ధోరణి.. ఈ వాదం ప్రకారం ఒక విషయము చెప్పిన విధానమే దాని రూపాన్ని నిర్ణయిస్తుంది ఉపయోగించే ప్రతీకలు, భావ చిత్రాలు, వాక్య నిర్మాణం, వాడిన ప్రతేయక పదాలు రూపాన్ని నిర్ణయిస్తాయి.

ఈ కవి చాలా వరకు వైయక్తిక ప్రతీక (subjective symbol) ఎంచుకున్నాడు అనిపించింది

రచయత కేవలం తనకు మాత్రమే అర్ధమయ్యే, పరిమితమయ్యే ప్రతీక ని వాడితే అది వైయక్తిక ప్రతీక. కవిత వస్తువు ని ఎన్నుకొని దాన్ని నేరుగా కాకుండా దానితో (వస్తువు లేదా భావం లో ) సామ్యం ఉన్న మరో వస్తువు ప్రతినిధి గా ఉంచి చెప్పడం ప్రతీకవాదం ..ఇలా ప్రతీక లు ఎంచుకున్నప్పుడు అందరికి తెలిసిన చాలా సామాన్యమైన ప్రతీకల్నే ఉపయోగిస్తారు ...కాబట్టి పాఠకులు విషయాన్ని తొందరగా గ్రహిస్తారు. తమ వ్యక్తిగత విషయాల్ని అనుభవాలని వివరించేందుకు వ్యక్తిగతమైన ప్రతీకలు వాడతారు దాన్ని సూచన ప్రాయమైన కూడా వివరించారు. అది చదవడం ద్వారా అసలు విషయము అర్ధం కాదు ...

అయితే ఈ కవి తో నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ప్రతీక వాదం . ఎక్కువ గా వ్యక్తిగత ప్రతీకలు వాడుతూ కవిత్వాన్ని నిర్మాణం చేసాడు . అది తప్పు అని అనను కానీ వైయక్తిక ప్రతీకలు వాడుతున్నప్పుడు అందరికి తెలిసిన సాధారణ ప్రతీకలతో నే కవిత్వాన్ని అర్ధవంతం గా ముగించవచ్చు. ....చాలా వరకు కఠినం గా ఉన్నప్పుడు పాఠకుడు కవిత్వ ని ఆస్వాదించలేడు తద్వారా వదిలేసి పోయే ప్రమాదం ఉంది.

మిరప మహేష్ గారి కవిత్వాన్ని మొదటి నుంచి చూసిన వాడిగా చెప్తున్నాను మొదట్లో ఉన్నటువంటి విధం గా అయితే లేదు .. చాలా పరిపక్వత వచ్చింది అయితే తానూ ఎంచుకున్న కవితా వస్తువుల్ని సంక్లిష్టం గా మలచకుండా ...సరళత వైపు గా మరలిస్తే మరింత గా సాహిత్య పాఠకుల మనసు ని దోచుకుంటాడు. అలా అని పూర్తి గా మెట్లు దిగ జారక్కర్లేదు. ...చెప్పే విషయాన్నే సరళత తో పాటు అందరికి తెలిసిన ప్రతీకల్ని వాడుతూ కవిత గా మలిస్తే మరింత మందికి చేరువ అవుతాడు.

ఈ కవి వ్యహరిక కవిత్వం (Applied Poetry ) విధానం లో రాసుకుంటూ పోతే కవిత్వానికి తనకి ప్రయోజనకరం గా ఉంటుంది. ఉపయోగ్య కవిత్వం ఉపయోగిస్తే అది ప్రతీ ఒక్క పాఠకుడి కి చేరుతుంది.

"కవి/రచయత" ఎప్పుడు ప్రజల పక్షమే ఉండాలి. ఈ కవి ఎప్పుడు ప్రజల వైపే ఉంటాడు. వారి సమస్య ల పై తన కలాన్ని ఎక్కుపెడుతూ ముందుకు వెళ్తున్నాడు. మరిన్ని మంచి కవితలతో అలరించాలి అని ఆశిస్తూ ......దసరా కవిత ల పోటీలో మొదట గా నిలిచి నందుకు అభినందలు.....


Read More
Next Story