
ఉత్తరాంధ్ర ‘వలస’ జీవుల వ్యథలకు అద్దం పట్టే నాటకం
ప్రొఫెసర్ కెఎస్ చలం రాసిన ‘వలస’ నాటకం సమీక్ష
ఆచార్య కె. ఎస్. చలం చాలా మందికి ఆర్థిక వేత్తగా, బహుజన తాత్వికుడిగానే పరిచయం. బయటి ప్రపంచానికి ఆయన రచయిత, అందునా నాటక రచయిత అనేది తెలియదు. ఇటీవల వలస అనే నాటకం రాశారు. ఉత్తరాంధ్ర నుంచి బతుకు దెరువుకు సూదర ప్రాంతాలకు వలసవెళ్లే బతుకుల మీద రాసిన నాటకం ఇది. ఈ నాటకం గురించి నాలుగు ముక్కలు
-బద్రి కూర్మారావు
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పైన, ఉత్తరాంధ్ర సంస్కృతి, ఉత్తరాంధ్ర సమస్యలపై ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉంది. ఆయన వెనుక బాటు తనానికి మారుపేరైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉత్తరాంధ్రవాసి. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో అనేక వ్యాసాలుతో పాటు త్రికలింగ మొదలగు తెలుగులో 16 పుస్తకాలు ఆంగ్లములో 27 పుస్తకాలు రాశారు. ఆయన కలము నుండి జాలువారిన మరో రచన వలస నాటకం. తెలుగు నాట ఉత్తరాంధ్ర, రాయలసీమ, పాలమూరు (తెలంగాణ ) వలసలకు మారుపేరయ్యాయి.
పుట్టిన గడ్డపై బతుకు తెరువు కరువై ఇచ్చట ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస పోతూనే ఉన్నారు. వీటిపై లోతైన పరిశోధన గాని, పరిష్కార మార్గాలు గాని ఇంతవరకు కనుగొనబడలేదు. మన నాయకులకు వాటిపై అంత మక్కువ లేదు. అటువంటి వలసల్లో ఉత్తరాంధ్ర గ్రామీణ ప్రజల వలస ఒకటి. ఈ వలసలు నేటివి కావు క్రీస్తు పూర్వం నుండి ఇచ్చట ప్రజలు బతుకుతెరువు కోసం దక్షిణాఫ్రికా, బర్మా, మలేషియా, సింగపూర్, మారిషస్ వంటి దేశాలకు వలస, పోతూనే ఉన్నారు. భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవులు కలకత్తా, అస్సాం చెన్నై , బెంగళూరు, హైదరాబాదు విజయవాడ బిలాయి వంటి ప్రాంతాలకు నిత్యము వలస పోతూనే ఉన్నారు . వీటిపై ఇంతవరకు రచనలు గాని పుస్తకాలు గానీ రాలేదు.
ఉమ్మడి శ్రీకాకుళం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుండి సుమారు 15 లక్షల మంది వరకు వలస కార్మికులు బయట రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ ఉంటారని అంచనా. ఇక 30 ఏళ్లుగా సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్ వంటి ప్రాంతాలకు కూలీలుగా తరలిపోతున్నారు. ఈ ప్రాంతాల ప్రజలు మిగతా ప్రాంత ప్రజలలాగా విద్య కోసమో ,మెరుగైన ఉద్యోగాల కోసం వలసపోవడం లేదు. . పొట్టకూటికోసం పిల్లాపాపలతో మూట ముళ్ళు కట్టుకొని వలస పోయిన వారు కొందరైతే కుటుంబాలను ఊర్లో విడిచిపెట్టి ఇంటి యజమాని ఒక్కడే (మొక్లిస్ ), అల్లమ్మ కాకై దేశాలు, రాష్ట్రాలు తిరిగి పనిచేసుకుంటూ రెండేళ్లకు మూడేళ్లకు ఒకసారి పండుగలకు పబ్బాలకు సొంత ఊర్లకు చేరుకుంటారు. ఈ మజిలీలో వీరు పడే ఇబ్బందులు అనేకం. మరోపక్క ఉత్తరాంధ్రలో సరైన వర్షాలు లేకఉన్న భూములకు నీటి శ్రీనీటిపారుదల సదుపాయం లేక పొలాలను అమ్ముకుంటూ వలసపోయిన వారి మరి కొంతమంది. అటువంటి వారి కోసం చలంగారు.
‘వలస’ నాటకం గురించి
పలాసలో బయలుదేరిన రైలు తిలారు స్టేషన్ మీదగా కోటబొమ్మాలి,శ్రీకాకుళం, విజయనగరం .. విశాఖపట్నం మీదుగా పోతున్నప్పుడు ఆ రైలు లో జనరల్ గా బోగిలలో కిక్కిరిసిన జనాలతో మనకి వలస కార్మికులు కనిపిస్తారు. విజయవాడ నెల్లూరు, హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై వంటి పట్టణాలకు వలస పోయిన వ్యవసాయ కూలీలు అచ్చట రాడ్ బెండింగ్ కార్మికులుగా, తాపీ మేలుగా తోపుడుబండ్లు పై సామాన్లు అమ్ముకునే వారుగా హెూటల్ లో పనిచేసే కార్మికులుగా చాలీచాలని గదులలో జీవిస్తారు.
***
చలం ‘ముందు మాట’
ఈ నాటకం రాయటంలో ఒక అవేదన వుంది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం, నిరాదరణ గూర్చి మాట్లాడుతూనే వున్నాం. పెద్దగా మార్పువచ్చినట్లు లేదు. రాష్ట్రం వేరయింది, పెద్ద తేడా రాలేదు. స్థానికుల్లో చైతన్యం ఈ సమస్య పై పెద్దగ కలగ లేదు. స్థానిక నాయకత్వం సంగతి మనకు తెలిసిందే. ఇది ఇలా కొనసాగితే మొత్తం ఉత్తరాంధ్ర గుర్తింపే గందర గోళం అవుతుంది. యిక్కడకు వ్యాపారం పేరు మీద, భూములు రియల్ ఎస్టేట్ పేర్ల మీద మోతుబరులు వస్తున్నారు. వారిని తట్టుకునే స్థానిక నాయకత్వం కొరవడింది. అయితే ప్రజలకు ముఖ్యంగా అవకాశాల కోసం ఎదురు చూసే స్థానిక, గ్రామీణ ప్రజలకు జరిగిన జరుగుతున్న విషయాలు తెలియజేస్తే కొంత మార్పు వస్తుందేమో అన్న ఆశ ఉపన్యాసాలు, పుస్తకాలు చదివే తరం యిప్పుడు లేదు. అందరికీ అర్ధమయ్యేలా నాటకం, మిగతా సాంస్కృతిక రూపాల్లో చెప్పాలి అన్న కోరిక ఇది. రాసేలా చేసింది. కొంతమందితో మాట్లాబా, రాయమన్నారు, చర్చించా. ఇది రఫ్ ప్రతి ఒకటి రెండు ప్రదర్శనల తరువాత మార్పులు చేర్పులు చేసిన తరువాత. ప్రింట్ చేద్దాం అన్నారు.
యిందులో ఒకటి రెండు చోట్ల సమయం పెంచటానికి డాన్స్, పాటలు పెట్టవచ్చు. అలాగే ఏ పూరిలో అయితే నాటకం వేస్తున్నారో ఆ ఊరి సమస్యలు ముఖ్యంగా వలసలు వారి అనుభవాలతో కూడిన ఒక సన్నివేశం వీలు అయితే స్థానికులతో పెట్టుకోవచ్చు. ఆ విధంగా మూడు జిల్లాలు తాకేలా సీన్లు వున్నాయి. ఇది ఒక ఉత్తరాంధ్ర గుర్తింపుకు జరుగుతున్న అపస్మారక దోపిడీ ని ప్రజలకు తెలియజేసి మన హక్కుల సాధన కోసం చేస్తున్న చిన్న ప్రయత్నం. ఆదరిస్తారని…
ప్రొఫెసర్ కెఎస్ చలం
విశాఖ పట్నం
***
మగవారు సిమెంట్ పనులు చేస్తుంటే ఆడవారు ఇతర ఇండ్లలో పాచి పనులు చేస్తారు . ఇంకో పక్క సిక్కోలు మత్స్యకారులు వేలాదిగా గుజరాత్, • పారాదీప్ వంటి ప్రాంతాలకు వలస పోతూనే ఉన్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో జూట్ మిల్లులు, పంచదార. పరిశ్రమలు మూతపడడంతో ఆ కార్మికులంతా ని దిక్కుతోచని వారిగా మారి తలోప్రాంతానికి చెదిరిపోతున్నారు. మరోపక్క ఈ వలసల్లో గిరిజనులు కూడా ఉపాధి కోసం వలస పోవడం ఆలోచించ దగ్గ విషయం. ఈ కార్మికులు సిమెంట్ పనులు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఐదు అంతస్తుల భవనాలపై నుండి కిందకు పడి మరణించినప్పుడు వారి కుటుంబాలు పడే వేదన అంతా ఇంత కాదు. అలాగే చనిపోయిన వారి మృతదేహాలను ఊరికి తీసుకురావడానికి కూడా.
అనేక ఇబ్బందులు పడుతుండడం పత్రికల్లో చదువుతాం. ఆ సమస్యలన్నిటిని చలం గారు తన వలస నాటకంలో మనకి కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఎన్నికలవేల రాజకీయ"నాయకులుకు వలస కార్మికు లు గుర్తొస్తారు. ఆయా ప్రాంతాల్లో వీరు పర్యటించి గ్రామాలకు రప్పించి ఓట్లు వేయించుకుంటారు. తరువాత కథ 3 మామూలే. ఇక అభివృద్ధి చెందింది అనుకున్నా విశాఖపట్నం కూడా ఉత్తరాంధ్రవాసులుది కాదు.
నెల్లూరు, గుంటూరు, గోదావరి జిల్లాల బడా బాబుల చేతుల్లో ఇక్కడ వ్యాపారాలు ,రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు నడుస్తున్నాయి. ఒకప్పుడు ఉత్త రాంధ్ర వెనుకోబాటు తనంపై సభలు సమావేశాలు పెట్టినప్పటికీ, వంగపండు ప్రసాద్ రావు వంటి వారు దబెల్-దుబెల్ వంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మన నాయకులు లో పెద్ద మార్పు లేదు. ఇక ప్రస్తుతం ఉద్యమాలు కూడా చల్లబడ్డాయి. ఇప్పుడు జరుగుతుందల్లా వాట్సాప్ ఉద్యమాలు . మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చలం గారు ఎంచుకున్న ఆయుధం ఈ వలస నాటకం.
ఈ నాటకంలో చివరలో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లో ఉన్న ప్రవా సాంద్రులు అందరూ ఏకమై విశాఖపట్నంలో సమావేశం జరిపి మన ప్రాంతం వలసలు ఆగాలంటే విశాఖలో మనకు న్యాయబద్ధంగా రావలసిన అవకాశాల కోసం మొదటి పోరాటం అని చెప్పి సభ జరిపించడం ఇక్కడితో ఈ ఉద్యమం ఆగదని చెప్పి ఉత్తరాంధ్ర వర్ధిల్లాలని వాక్యాలతో చలం గారు తన నాటకాన్ని ముగించారు. ఉత్తరాంధ్ర యాస, భాష, మాండలికాలతో ఈ నాటకం సాగింది. ఈ నాటకం పలుచోట్ల ప్రదర్శించబడాలి అనేది చలం గారి ఆకాంక్ష. ఇంకా ఏవైనా చేర్పులు మార్పులు ఉంటే మలిదశలో చేరుస్తామనడం ఆయన పెద్ద మనసుకి నిదర్శనం.
ఈ నాటకాన్ని చదివి కళాకారుల ప్రదర్శించడంతోపాటు, ఉద్యమకారులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు చదవడంతో పాటు ప్రజల్లో సామాజిక చైతన్య కల్పించడంతోపాటు ఉత్తరాంధ్రలో వలసలకు కారణాలు అన్వేషించి. మూతపడిన కర్మాగారాలను తెరిపించి ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలను మెరుగుపడే వరకు ఉద్యమాల ద్వారా ఇటువంటి రచనలు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయ వలసిన అవసరం ఎంతైనా ఉంది.
(ప్రొఫెసర్ కెఎస్ చలం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగానే కాకుండా ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి గాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగాను పనిచేశారు.)