నిశబ్దంగా ఊళ్లు, గూళ్లు కూలుతున్న దృశ్యం కనబడుతోందా!
ప్రాజక్టుల పేర సాగుతున్న విధ్వంసం మధ్య మూలవాసి సంస్కృతిని నమోదు చేసి భావితరాలకు అందించేందుకు పాండు కామ్టేకర్ రాసిన ‘ఆత్మ ఘోష’ అంతరంగ పరిశీలన
-అలజంగి మురళీధరరావు
ఆమధ్య ఒక కన్నడ అనువాద కథ చదివేను. కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి నదిపై ఒక డ్యామ్ కట్టే సమయములో ఎన్నో ఊర్లు మునుగుతాయి, ఎందరో మనుషులు నిర్వాసితులవుతారు. కథలోని ప్రధాన పాత్ర అలాంటి నిర్వసితులలో ఒకడు. ఇంటిని, ఊరుని ఖాళీ చేసి ఎక్కడో సుదూరాన మెల్లగా జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ రెండు దశాబ్దాల కాలం గడిచే టప్పటికి పూర్తిగా స్థిరపడి పోక చెట్ల తోటలు, సారవంతమైన భూమి, నాణ్యమైన గృహము సమకూర్చు కుంటాడు. మంచి ఆదాయం కూడా వస్తూ వుంటుంది. ఇలా వుండగా ఒక మధ్యాహ్నం వరండాలో తీరికగా కూర్చొని వుంటాడు. అప్పుడు తన ఇంటి పై నుంచి పెద్ద శబ్దం విన్పిస్తుంది. ఏంటాని తల పైకెత్తి చూస్తే ఒక విమానం ఇంటి పై నుండి, పోక చెట్ల తోటల మీది నుంచి, ఊరిపై నుంచి చక్కర్లు కొడుతూ ఉంటుంది.
అలా ఒక మూడు, నాలుగు రోజులు ఇదే తంతు. ఉరి వారందరూ సేకరించిన సమాచారం అతని చెవిన పడుతుంది. త్వరలోనే అక్కడికి దగ్గరలో నున్న నదిపై ప్రభుత్వం ఒక డ్యామ్ నిర్మించబోతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ముంపుకు గురయ్యే గ్రామాలను విమానం ద్వారా ప్రభుత్వం సర్వే చేయిస్తున్నదట. ఆ విమాన చక్కర్ల శబ్ధాలే తాను విన్నవి . మరో మారు ఈ ఇంటిని, తోటను, భూమిని, ఊరిని, ఊరి జనాన్ని విడిచి పెట్టక తప్పదా!? అని గుండెల్లో పిడుగు పడ్డట్టు అవుతుంది అతనికి . శూన్యంలోకి చూస్తూ స్థాణువై పోతాడు.
పాండు కామ్టేకర్ గారి “ఆత్మ ఘోష” పుస్తకం చదినప్పుడు నాకు ఈ కథ గుర్తుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమం పర్యవసానంగా వందలాది ఆదివాసీ గ్రామాలు, లక్షలాది ఎకరాల సారవంతమైన భూములు మునిగి పోతున్నాయి. వనాలు, అడవులు, జంతువులు, ఎన్నో రకాలైన కీటకాలు, ఔషధ మొక్కలు, ఖనిజ సంపద అదృశ్యం కాబోతున్నాయి. వేలాది మంది ఆదివాసీలు నిర్వాసితులై చెల్లా చెదురు కాబోతున్నారు. అంతకు మించిన విషాదమేమిటంటే మానవ నాగరికతలకు మూల ధాతువులైన ఆదిమ భాషా సంస్కృతులు కూడా అదృశ్యం కాబోతున్నాయి .
సమ సమాజమనే ఉత్కృష్ట జీవన విధానానికి ఒక మూల నమూనా (archetype )గా నిలుస్తున్న గిరిజన సమాజం కొండెక్క బోతుంది. ప్రజా స్వామ్యంలో మానవత్వం అసలు ఉన్నదా అనే సందేహానికి తావిస్తున్నాయి ప్రజా ప్రభుత్వాల ఈ నిర్మాణ కార్య కలాపాలు. పర్యావరణ అసమతుల్యతకు, ఆదిమ సంస్కృతి, సమాజాల విచ్ఛిన్నతకు దారితీసే ఈ డ్యామ్ ల నిర్మాణాలు జాతుల హననానికి తక్కువగాని ఒక నేరపూరిత చర్యగానే పరిగణించాలి. ఎటువంటి అభివృద్ది నమూనాలోనైనా అట్టడుగు జాతుల సమూహాలు (marginalized groups) బలి కావడం అన్నది చరిత్ర కర్కశంగా చేస్తున్న ఒక పరిహాసం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పర్యవసానంగా ఖమ్మం, భద్రాచలం, తూర్పు గోదావరి జిలాల్లోని శబరి, సీలేరు, గోదావరి నదుల పరివాహక ప్రాంతాలలో శతాబ్ధాలుగా అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అదివాసులైన కోయ, కొండ రెడ్డి , నాయక పొడు మొదలగు ఆదిమ జాతులు నిర్వాసితులు కాబోతున్నారు. వారి మనుగడ ప్రశ్నార్థకం కాబోతుంది. దానితో పాటు వారి సమాజము , సంస్కృతులు కూడా.
ఈ నేపథ్యంలో ప్రజా పాలకుల పాశవిక అభివృద్ధి నమూనాలను ఒక ప్రక్క ప్రశ్నిస్తూనే , మూలవాసి సంస్కృతిని లిఖిత పూర్వకంగా నమోదు చేసి ఒక ప్రజా పోరాట చరిత్రగా నిలపాలని, భావితరాల అధ్యయనానికి అందించాలనే ఒక సత్ సంకల్పంతో రచయిత పాండు కామ్టేకర్ “ఆత్మ ఘోష “ అనే ఈ పుస్తకం తీసుకొచ్చారు. ఇదొక మానవాభివృద్ది(anthropological), సామాజిక (sociological ), ఆర్థిక ,రాజకీయ మనో వైజ్ఞానిక (psychological ) ట్రీట్ మెంట్ తో ఆదిమజాతులపై వచ్చిన రచన.
సబ్ ఆల్టర్న్ (subaltern) చరిత్రలను వెలికి తీసి, వెలువరిస్తున్న నేటి ఆధునికానంతర వాద (Post-Modern) చారిత్రక సందర్భములో కామ్టేకర్ గారి “ఆత్మ ఘోష” అనే ఈ రచన ఒక మేలిమి రచనగా నిలుస్తుంది. E H కార్ అనే చరిత్రకారుని పునర్మూల్యాంకనంలో నుంచి వచ్చిన చరిత్ర (History from Below) అనే యధార్థ చరిత్ర రచనా విధానానికి ఒక అద్భుతమైన నమూనాగా ఈ పుస్తకం తెలుగులో రావడం ఒక గొప్ప శుభపరిణామం. అందుకు పాండు కామ్టేకర్ గారు ఎంతైనా అభినందనీయులు. 12 సంవత్సరాల పాటు చింతూరును కేంద్రంగా చేసుకుని కామ్టేకర్ గారు స్థానిక కోయ, కొండరెడ్డి, నాయకపోడు తదితర ఆదిమ తెగలకు విద్యా పరమైన సేవలను అందించారు. ఈ క్రమంలోనే వారు గిరిజన గ్రామాలన్నింటినీ తిరుగుతూ, వారు పెట్టిందే తిని, వారితోనే గడిపి, వారిలో ఒకడిగా మారి వారి జీవన విధానం, సంస్కృతి భాషలలోని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలను కూడా వెలికి తీసి నమోదు చేసుకున్నారు. సేకరించిన సమాచారాన్ని ఒక పద్ధతిలో పేర్చి, క్రోడీకరించి, పాఠకులకు అనుకూలమైన సరళ భాషలో రాసి వెలువరించడానికి తనకు 5 సంవత్సరాలు పట్టిందని రచయిత అంటారు.
నిర్వాసితుల బాధలను, బతుకులను, ఆవేదనలను తనవిగా చేసుకుని తానే స్వయంగా ఒక అదివాసిగా మారిపోయి రచించిన ఈ “ఆత్మ ఘోష”లో నిర్వాసితుల అస్థిత్వ వేదనున్నది, వారి జీవితం సమాజం వున్నాయి, వారి భాషా సంస్కృతులున్నవి, వారి ఆట పాటలున్నాయి, వారి పండుగలు , ప్రకృతి ఆరాధనలు , పరిసరాలతో మమేకమైపోయే వారి తీరు తెన్నులు కూడా వున్నాయి. ఆధునిక సంస్కృతి సమాజాలలోని ఎన్నో వ్యవహారాలకు తొలి ముద్రలు ఆదిమ సమాజ సంస్కృతులలోనే దృశ్యాదృశ్యంగా ఉన్నాయనే ఒక ఎరుక ఈ పుస్తక అధ్యయనం ద్వారా మరింత ద్విగుణీకృతమవుతుంది.
“ఆత్మ ఘోష” అనే ఈ పుస్తకం ఒక పాఠ్య పుస్తకం (academic reader) మాదిరిగా కాకుండా, సులభంగా సాగే ఒక కాల్పనిక కథనంలా, ఆసక్తికరంగా చదివించే రీతిలో మలిచేరు రచయిత పాండు కామ్టేకర్. ప్రభుత్వం వాహనాలు, యంత్రాలతో వచ్చి గ్రామాల్లోని జనాల్ని బలవంతంగా ఖాళీ చేయించి, ఊర్లన్నింటినీ నేల మట్టం చేస్తుంది. అంతటా ఒక విధ్వంసం !!.. ఒక శ్మశాన నిశ్శబ్ధం!!!... గ్రామ దేవతలుగా పూజలు అందుకుంటున్న ముత్యాలమ్మ చెట్టు, మద్ది చెట్టు, ఈ విధ్వంస కాండకు మూగ సాక్షులు. ఇక్కడే రచయిత తన సృజనాత్మక నైపుణ్యం చూపిస్తూ ఆ రెండు చెట్ల ఆత్మలు తమ కళ్ళముందే జరిగే నిర్వాసిత కాండను చూస్తూ, దుఃఖిస్తూ, ఆ ఊళ్ళు, ఆ వాడలు, వాగులు, వనాలు, నేల మట్టమైన ఆ ఇండ్లు, వాకిళ్ళు, ఇలా అన్నింటినీ కలియ తిరుగుతూ, తమ గిరి బిడ్డల జీవనం లోని సకల పార్శ్వాలను, భాషా సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటున్నట్టుగా చిత్రిస్తాడు. అలా ఒక్కొక్క స్మృతిని ఒక్కొక్క అధ్యాయంగా తీర్చి దిద్ది మొత్తం 28 అధ్యాయాలు గల గ్రంథంగా ఈ”ఆత్మ ఘోషను” వెలువరించారు రచయిత.
ఇది ఆదివాసి అస్థిత్వ సాంస్కృతిక సంఘర్షణ, కోయ, కొండరెడ్డి, నాయక పోడుల జీవన్మరణ ఘోష. ఈ పుస్తకంలో కోయ పల్లే, పురుడు పోయటం, కొడకలపటం, బాణం తయారీ, సంతకు తయారు, భూమిపండుగ, సుక్కుడు కాయ పండుగ, తాటి పండుగ, ఇప్ప పూల పండుగ, కొలుపుల పండుగ, పెద్ద మనిషి, చావు, కీడు నీళ్ళు, దినాలు మొదటి రోజు, దినాలు రెండవ రోజు, పేతర్ల ముంత, ఇంటి నిర్మాణము , గ్రంధాలయం, పెండ్లి, నేల - ఉపాది, చీమ గుడ్ల కారం, ఆదివాసీ మతమా ? కులమా ?, పోలవరం-నిరసనలు, ఒంటరి మహిళలు-జీవన విధానం, గుజీడి, పోలవరం ప్రాజెక్టు తీరు తెన్నులు, ఓదార్పు -సమస్త జీవ జాల మద్దతు, మరియు సమస్త సమాజానికి సూటి ప్రశ్న అనే అధ్యాయాలు ఉన్నాయి.
గిరి జీవితాల్లోని ప్రత్యేకతను పట్టిచ్చేవిగా ఒక్కొక్క అధ్యాయాన్ని మలిచేరు రచయిత. దీక్షతో, బాధ్యతతో చదువాల్సిన అరుదైన పుస్తకమిది. ఆధునికత, ప్రజాస్వామ్యం, అభివృద్ది , ప్రపంచీకరణ లాంటి భావ జాలాలకు కూృరంగా బలియైపోతున్నవారు సామాజిక నిచ్చెనలోని అట్టడుగు వర్గాలైన ఆదివాసీలు, మూల వాసులే. వారి చరిత్రను పునర్లిఖించి, వారి న్యాయ బద్ధమైన జీవించే హక్కులు పరిరక్షించే ప్రక్రియలో సభ్య సమాజమంత బాగస్వాములు కావాలని మనసారా కోరుకుంటున్నారు రచయిత పాండు కామ్టేకర్ ఈ “ఆత్మ ఘోష” అనే పుస్తకం ద్వారా. ఈ పుస్తకం చదివిన పాఠకునికి తన మనుస్సులో, హృదయంలో అదివాసులకు జరిగే అన్యాయాన్ని క్షణ మాత్రమైనా జాలి, అపరాధ భావం, పాశ్చాత్తాపం లాంటివి ఏ మాత్రం కలిగించినా తన ప్రయత్నం సఫలం అయినట్లేనని అంటారు రచయిత పాండు కామ్టేకర్.
(రచయిత అర్థ శాస్త్ర ఉపన్యాసకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల , పాడేరు- 531 024. అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆంధ్రప్రదేశ్)