
విప్లవకవి జ్వాలాముఖి సంస్మరణ సభ వినిపించిన ధిక్కార స్వరం
జ్వాలాముఖి కవితాజ్వాల.. పుస్తకం మలిముద్రణ ఆవిష్కరణ సభ విశేషాలు
విప్లవ కవి జ్వాలాముఖి గారి 17వ వర్ధంతి సభ, వారి ఎంపిక చేసిన కవితల సంకలనం కవితాజ్వాల [ మలిముద్రణ ఆవిష్కరణ కార్యక్రమం 14-12 -2025 న జ్వాల పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వహించబడింది. అతిథులు, కవులు, రచయితలు, సాహిత్య ప్రేమికులు సాహిత్యాభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేశారు.
15-09-2025 న కనుమూసిన జ్వాల జీవన సహచరి శ్రీమతి సీతాదేవిగారు జ్వాలాముఖి గారి కి ఎంతో వెన్ను దన్నుగా వుండేవారు. జ్వాల ప్రచురణలకు ఆమె ఎంతో సహకరించారు. ఆ దంపతుల స్మృతికి నివాళి పలుకుతూ సభను నిర్వహించారు. 1985 లో జ్వాలాముఖి రాసినప్పటకి, 2025 కి మరింత ప్రాసంగికంగా అనిపించే “కవి సమ్మేళనం” అనే కవితా పఠనం తో సభ ఆరంభమయ్యింది.
“కవి సమ్మేళనమా -వద్దు, వద్దు-మీరు మమ్మల్ని బట్టబయలు చేస్తారు
పోనీ పాత పద్యాలైన చదువుతాం – వద్దు వాటికి కొత్త అర్ధాలు తీసి మమ్మల్ని రాక్షసులుగా నిలబెడతారు.
పోనీ ఆ చావిట్లో నిలబడనీoడి-వద్దు, వద్దు-మీరు నిలబడితే చాలు నలుగురు పొగయి మాకు ఊపిరి సలుపనీరు
సరే! నిశ్శబ్దంగా వుంటాం- వద్దు, వద్దు- మీ నిశ్శబ్దం మహా సముద్రం-మాకెసరు పెడుతుంది
అయితే ఏం చేయమంటారు -మా నిలయ విద్వాంసులు కండి-- ఆపడుపు కూడు మాతో కానిపని
మేము పోతన వారసులం, బతుకు హాలికులం, మహా పరివర్తన వైతాళికులం”
తొలుత డా. జతిన్ కుమార్ అందరికీ ఆహ్వానం పలుకుతూ-- ఈ రోజు మనమంతా ఇక్కడ ఒక గొప్ప విప్లవ కవిని, ప్రజల గుండెల్లో అగ్ని జ్వాలలా వెలుగుతున్న శ్రీ జ్వాలాముఖి గారిని స్మరించుకునేందుకు 17వ వర్ధంతి సందర్భం గా సమావేశమయ్యాము. జనం కవిగా, రచయితగా, అనువాదకునిగా, మహా వక్తగా ఎంతో పేరు పొందిన శ్రీ జ్వాలా ముఖి రచనలు దిగంబర కవుల మూడు సంపుటాలు [ దిక్కులు], ‘ఓటమి తిరుగుబాటు” కవితాసంపుటి మాత్రమే గతంలో ప్రచురింపబడ్డాయి. ఆయన అనువాదం చేసిన దేశదిమ్మరి ప్రవక్త శరత్ బాబు, రాంగేయ రాఘవ జీవిత చరిత్రలను కేంద్ర సాహిత్య అకాడమీ గతంలో ప్రచురించింది. ఇక మిగతా రచనలు చాలా భాగం ఆయన జీవించివున్న కాలంలో పుస్తకాలుగా ప్రచురింపబడలేదు. ఈలోటును తీర్చటానికే ‘జ్వాల పబ్లికేషన్స్’ పేర మిత్రులు కొందరు కలిసి ఆయన మరణానంతరం 2009 నుంచి వరసగా ఆయన సాహిత్యాన్ని కొన్నిపుస్తకాలుగా వెలువరించారు.
జీవన వైరుధ్యాల మధ్య సంఘర్షణల ద్వారా పొందిన భావపరిణామ వికాస ప్రతిఫలనం, జ్వాలాముఖి సుదీర్ఘ కవితాయానం ‘కవితాజ్వాల’; ‘మత విద్వేష కల్లోలంలో ఎగిసిన రసార్ద్ర జ్వాల, శోషిత స్వప్నాల విచలిత దుఃఖ గానం, మూడు దీర్ఘకవితల సంకలనం ‘భస్మ సింహాసనం’; ఆటవిక న్యాయాన్ని తలపించే ఉరిశిక్ష రద్దుకావాలని కోరుకునే మానవీయ మకరంద భావాల స్వరం ‘వేలాడిన మందారం’ నవల; పన్నెండు కథల సంకలనం ‘కథాజ్వాల’ “అన్ని పరిణామాలకు కర్తలు, భర్తలు భారత శ్రామికులు. వాళ్ళు రాజకీయ విప్లవాలకెలా నాయకులో విప్లవ సాహిత్యానికి కూడా అలానే నాయకులు” అని గుర్తించి వారు సృష్టించిన ఎర్రని మైలురాళ్లకు ప్రతిధ్వనిగా వినిపించిన కొన్ని ఉపన్యాసాల, వ్యాసాల సంకలనం “వ్యాస జ్వాల”, ఈ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఇలా జ్వాలాముఖి, కవిగా నడిచి వచ్చిన అన్ని దశలకు -మానవతా వాదం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వంలోని వివిధ ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సాహిత్యం ప్రచురింపబడి వున్నది. కవిత అంటే “అల్పత్వా లను, అతీతత్వాలను అధిగమిస్తూ భూమిని మేలుకొలిపే కాల చక్షువు” కావాలని ఆయన అభివ్యక్తి ఆరాటం. అది విముక్తి పోరాటం. రోజులు గడుస్తున్నాకొద్దీ, పరిస్థితులు మరింత దిగజారుతూ ఆయన రచనలు, భావాలు మరిoత ఎక్కువ ప్రాసంగికత ను సంతరించుకుంటున్నాయి. ఆయన కవిత్వాన్నిలోతుగా పరిశీలించ వలసిన ఆవశ్యకత, వాటికి తిరిగి ప్రాచుర్యం కలిగించవలసిన అవసరం అధికమవుతున్నది. జన విప్లవ విజయం పట్ల విశ్వాసం, మంచి భవిష్యత్తును నిర్మించుకోగలమనే అపారమైన నమ్మకం ఆయన సాహిత్యానికి ఆయువు పట్టు. ఒకరకమైన నిర్వేదం, నిరాశ సమాజాన్ని కమ్ముకుంటున్న వేళ ఆయన సాహిత్యాన్ని తిరిగి చదువుకోవటం మనలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఉద్యమాల తప్పిదాలను సరి చేసుకునే దృష్టి ని కలిగిస్తుంది. అందుకే కవితా జ్వాలను మనిషీ కవితను కూడా కలిపి పునర్ ముద్రించాము అని చెప్పారు.
పుస్తక ఆవిష్కర్త శ్రీ నిఖిలేశ్వర్. మాట్లాడుతూ జ్వాలాముఖితో తనకున్న సుదీర్ఘమైన స్నేహాన్ని అనేక ఉద్యమాలలో కలిసి చేసిన ప్రయాణాన్ని వివరించారు. యువకులుగా డిబేట్లు, యువజన కార్యక్రమాలు నిర్వహించిన నాటి నుండి, దిగంబర కవులుగా, విప్లవ కవులుగా పరిణామం చెందుతూ విప్లవోద్యమ కార్యకర్తలుగా సాహిత్యోద్యమ నేతలుగా వేలాది సభల్లో చేసిన ఉపన్యాసాల పరంపర వరకు అవిచ్చిన్నంగా సాగిన తమ ఉద్యమ ప్రయాణాన్ని వివరించారు. తమ కుటుంబాల మధ్య వెల్లివిరిన సంబంధబాంధవ్యాలను, ఈతిబాధ లను, ఆర్ధిక ఇబ్బందులను, కలిసి గడిపిన జైలు జీవితాలను, ఉద్విగ్నంగా పంచుకుంటూ ఏ పరిస్థితులలోను నమ్మిన ప్రజాతంత్ర విప్లవోద్యమ బాటను వీడని ఆయన దీక్ష కు జోహార్లు చెబుతూ సభను భావోద్వేగానీకి లోను చేశారు.
జ్వాలాముఖి సోదరి శ్రీమతి విజయారంగనాథం చిన్నతనం నుంచి అన్నయ్య తనను ఒక ఆడపిల్లలా కాక వ్యక్తిత్వం వున్న మనిషిలా ఎదగటానికి ప్రేరేపించారని, ఇక తన వదిన తనకో తల్లిలా, అక్కలా మంచి ఆత్మీయ స్నేహితురాలుగా అడుగడుగునా శ్రద్ధవహించి కుటుంబాన్ని మధురంగా చేసిందన్నారు. ఒక సంప్రదాయా కుటుంబంలో పుట్టిన తన అన్న, తండ్రిని, చుట్టూ వున్న వాతావరణాన్ని ఎక్కడికక్కడ ఎదిరిస్తూ తననో మానవీయ మూర్తిగా మార్చుకున్నాడని అనేక సంగతులు గుర్తుచేసుకున్నారు. తనచదువు, వివాహం, ఉద్యోగం అన్నిటా తనకు మద్దతుగానిలిచి అభిరుచుల కనుగుణంగా ప్రవర్తించే స్వేచ్చాయుత వాతావరణాన్ని కల్పించటానికి కుటుంబంతో ప్రతి నిత్యం పోరాడేవాడని చెప్పారు. అన్నయ్య కవి అని గొప్పలు చెప్పుకోవడమేకాని ఆయన ఎంత విశిష్టమైన కవొ తనకు అప్పుడు తెలియదని కానీ, పుస్తకాలు ప్రచురించుకోలేని స్థితికి మాత్రం చాలా బాధపదుతుండటం మాత్రం తనకు బాగా గుర్తని ఆవిడ అన్నారు.
ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసా చార్య కవితా జ్వాలను ఆమూలాగ్రం పరిశీలించుతూ ఆయన కవిత్వంలో కూడా ఉపన్యాస ధోరణి వుంటుందని, విషయాలను పురాణ ప్రతీకలు, సంస్కృత పదబంధాల ద్వారా అభివ్యక్తీకరించటానికి ఆయన ప్రయత్నించారని , తొలిరోజుల్లో ప్రసాలో వ్రాయటమే కవిత్వం అని భావించారేమో అని అనిపిస్తున్నది. అలాగే కొన్ని పదాల మమీద ఆయనకు వున్న మోజు వాటిని ఆయన వివిధ అదరధాలతో ప్రయోగించే నేర్పు ఆశ్చర్యం కలిగిస్తుందని ఎత్తిచూపారు. చాలలా సాధారణ భాషలో ప్రవహిస్తున్న కవితలో అకస్మా త్తు గా పాషాణాల లాంటి పదాలు ప్రయోగించటం, ఎవరూ ఊహించని గంభీరమైన ఉపమానాలను ప్రయోగించటం ఆయన పాండిత్య ప్రకర్షకు నిదర్శనం . ఇది కవిత్వాన్ని సంక్లిష్టం చేస్తున్నదేమో అని ఆయన సంకోచించడు. ఆయన వస్తువు ప్రజా ప్రయోజనకారకం కనుక శైలి కూడా ప్రజలని ఆకట్టుకునేది. పదం అర్ధం కాకపోయినా ఆసారం అండరి హృదయాలకు దగ్గరగా వెళ్ళేది. అసలు ఆయన కవిత్వం లో సామాన్యులకు కొంత పండితులకు కొంత ఉద్దేశించారెమో అని కూడా అనుకోవచ్చు. అభివ్యక్తిని ఆయుధంగా మలుచుకున్న అరుదైన కవి. రసనిష్పన్నత కు భావావేశం తో భాషా నిపుణతను కలగలిపిన గొప్పకవి అని నివాళులు అర్పించారు . ఆయన వ్యక్తిత్వం లో సమగ్రతను సందర్శించటమె వున్నది. శకలాలను ఆయన చూడలేదు. చూడలేడు. శకలీకరణ విచ్చిన్నకరమని, మార్క్సిస్టు తత్వమే సమగ్ర దృక్పథమని ఆయన నిస్సంకోచంగా నమ్మాడు అందుకే అస్థిత్వ ఉద్యమాలను ఆయన పక్కదారులుగా భావించి అవాటిని అంగీకరించలేదు కవిత్వంలో ఈ దృష్టి ప్రస్పుటంగా వున్నది అని జ్వాలలోని భిన్నమైన కోణాన్ని కూడా శ్రీ దర్భాశయనం ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత, కవి శ్రీ నాళేశ్వరం శంకరం, తాను జ్వాలాముఖిగారి బహిరంగ కళాశాల శిష్యుడనని, ఆయన ఉపన్యాసాలు ఎక్కడ వుంటే అక్కడకు పరుగెత్తుకువెళ్ళి వినేవాడిననని , సామాజిక, సాహిత్య , సాంస్కృతిక విషయాలు ఎన్నో నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఆయనతోకలిసి ఎన్ని ఆధ్యాత్మిక సమావేశాలకు వెళ్లానని మనప్రత్యర్ధులు ఏ వాక్కులతో ప్రజలను మత్తులో ముంచుతున్నారో ప్రత్యక్షంగా విని వాటిని నిర్మూలించే ఆయుధాలను [వాదాలను] మనం తయారు చేసుకోవాలని ఆయన చెప్పేవారు. ఆయన ఉపన్యాసం సూటిగా వుంటుంది. కవిత్వం కాస్త కఠినంగాను , సంక్లిష్టంగాను అనిపిస్తుంది కానీ అది ప్రజలకు దూరం కాదు ఆయన చెప్పిన విషయం ప్రజలకు ప్రియమైనది అవసరమైనది. ఆయన కృషిచేసిన విప్లవ సాహిత్య రంగం గురించి “ఆ మీ కవిత్వo లో ఏమి వుంది? చంపు, నరుకు, అనీ లేకపోతే అమరులకు జోహార్లు, లాల్ సలాములే కదా” అన్నచిన్నచూపు ఒకటుండేది. బహుశా దాన్ని పూర్వపక్షం చేయటానికి ఆయన అరుదైన పదాలు వాడటం, క్లిష్టమైన సంస్కృత పద బంధాలు విసరటం. కావాలని చేశాడేమో అనిపిస్తుంది. అలాగే ఆయనలోని వస్తు వైవిధ్యoకూడా. ప్రతి దానికి విప్లవ దృష్టి కల్పించాడు. ఆయనవి అతి స్పష్టమైన భావాలు. ఏమాత్రం సందిగ్ధo కానివి. అందుకే ఆయన ప్రజలు అభిమానిచే కవి అయ్యాడు. ఇక వ్యక్తిగా ఎంతో ప్రేమాస్పదుడు. స్నేహ శీలి. మానవతా మూర్తి. అభిప్రాయాలలో ఎంత నిక్కచ్చిగా వున్నా ప్రత్యర్ధులను కూడా అక్కున చేర్చుకునే అద్భుతమైన లక్షణం ఆయనది. ఆయన పోయి 17 సంవత్సరాలై నా రాత్రే నన్ను నాటకానికో, సినిమాకో తీసుకుపోయి స్కూటర్ మీద తెచ్చి మాయింట్లో వదిలిపెట్టినట్లు అనిపిస్తోంది మరిచిపోలేని గొప్ప మనిషి జ్వాలాముఖి సారు” అని తన జోహార్లు అర్పించారు.
జ్వాలాముఖి తమ్ముడు డాక్టర్. ఏ.వి. రామాచారి మాట్లాడుతూ హెచ్ ఎస్ సి రెండుసార్లు తప్పి ఏవోవ చిన్న చితకా ఉద్యోగాలు చేసుకుంటూ మమ్ములను విద్యావంతులుగా చేశాడు. నేను ప్రాధేయపడితే తాను స్వయం కృషితో ఎం. ఏ తెలుగు, ఎల్ ఎల్ బి, హిందీభూషణ్ పాస్ అయ్యాడు. అదీ ఆయన పట్టుదల. చిన్న క్లర్కు నుండి కాలేజీ లెక్చరర్ గా ఎదిగాడు. ఆయన కవిత్వంలో భాష, శైలి, పాండిత్యం ఇవికాదు చూడవలసింది. అవి నాకు తెలియదు కూడాను కానీ అన్నయ్య కవిత్వం, సాహిత్యం, అసలు ఆ జీవితం పేదల కోసం, కూలీల కోసం, రైతుల కోసం అంకితమైంది. అన్నయ్య చరితార్ధుడు. జనo కోసమే బతికిన మనిషి. ఆయన లేకుండా 17 ఏళ్లు గడిచినా మీరంతా ఇంత ప్రేమతో, గౌరవం తో ఇప్పటికీ ఆయనను తలచుకుంటున్నారు. కష్టపడి పుస్తకాలు వేస్తున్నారు. ఈ సభలు నిర్వహిస్తున్నారు. ఇదంతా సామాన్యమైనది కాదు. మీ అందరికీ మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెప్పటం తప్ప ఇంకేమీ చేయగలను అంటూ అంజలి ఘటించారు.
చివరిలో జ్వాలాముఖి కుమారుడు వాసు పంపిన కవితాత్మక సందేశాన్ని డాక్టర్ జతిన్ చదివి వినిపించారు. “తన వ్యక్తిగత సంతోషాలను సైతం పక్కన పెట్టి, సమాజ మార్పు కోసం తన జీవనాన్ని అర్పించిన సంఘర్షణ యోధుడు మానాన్న. నాన్న వల్లనే నాకు నేర్పబడింది – బతకడం అంటే కేవలం జీవించడం కాదు, బతకడం అంటే సమాజం కోసం పోరాడడం అని. ఈ రోజు ఆయన శరీరం మన మధ్య లేదు…కానీ ఆయన ఆశయం ఉంది, ఆయన ఆలోచన ఉంది, ఆయన కలం సృష్టించిన చైతన్యం ఉంది. ఆ విప్లవం నిష్క్రమించదు”
వైరుధ్యాల మధ్య కవితావేశం తో తాను ఏమిటో నిరంతరం పరిశీలించుకుంటూ, సమీక్షించుకుంటూ యుగ అవసరాలకు అనుగుణంగా ఎదిగిన ప్రతిధ్వని జ్వాలాముఖి. నాలుగు దశాబ్దాల అస్తిత్వ ఉద్యమాలలో అధికభాగం ఈ రోజు అధికార పాలకవర్గాల చేతి పాచికలుగా, భారత రాజ్యాంగ చట్రపు పరిధిలో కుంచించుకు పోయాయి. తనకాలం లోనే ఈ పరిణామ అనివార్యతను గుర్తించి హెచ్చరించిన జ్వాలాముఖి సాహిత్యం ఈనాటికీ పఠనీయం. “ఆయన ఒక కవి మాత్రమే కాదు. ఒక ఉద్యమం…ఒక ఆలోచన…ఒక అగ్నిజ్వాల…అది అణగారిన వర్గాల కోసం మండింది, అది అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపింది, అది కలం ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నించింది, అది పదాల ద్వారా విప్లవాలను సృష్టించింది. ఆయన కవిత్వం వినోదానికి కాదు – అది పోరాటానికి. ఆయన రచనలు అలంకారాల కోసం కాదు – అవి అవగాహన కోసం. ఆయన మాటలు తేనెలు కాదు – అవి అగ్ని కణాలు.” అన్న సందేశంతో ఈ సమావేశం ముగిసింది.

