ఉద్వేగ భరితంగా విరసం రాష్ట్ర మహా సభలు
x

ఉద్వేగ భరితంగా విరసం రాష్ట్ర మహా సభలు

ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగ వాదం’ ప్రాధాన చర్చనీయంశంగా విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహాసభలు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియం ఆవరణలో జరిగాయి



-అలూరు రాఘవశర్మ

‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగ వాదం’ ప్రాధాన చర్చనీయంశంగా విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహాసభలు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియం ఆవరణలో ఉద్వేగ భరితమైన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జనవరి 27, శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి.



ఎన్కౌంటర్ హత్యకు గురైన విజయవాడకు చెందిన వెంకన్న సహచరి వీరమ్మ ఎర్రజెండాను ఆవిష్కరించారు.

విరసం జెండాను సంగ్రామ్ ఆవిష్కరించగా, అమర వీరుల స్థూపాన్ని సూరపనేని జనార్ధన్ సోదరుడు పూర్ణ మోహన్ రావు, ఎల్.ఎస్.ఎన్. మూర్తి అన్నకుమారుడు భారవి, సంయుక్తంగా ఆవిష్కరించారు.




‘‘కత్తులు దూసుకు వచ్చినా, బాంబుల వర్షం కురిసినా ఎత్తిన జెండా దించకోయ్, మన అరుణ పతాకకు జై, మన విజయ పతాకకు జై’ అంటూ పాడిన పాటకు జననాట్య మండలి కళాకారుల లయబద్ధ నాట్యం అందరినీ అందులో లీనమయ్యేలా చేసింది.ఈ ప్రారంభకార్యక్రమంలో పౌరహక్కుల నేత హరగోపాల్ , కాకరాల వంటి మునుపటి తరం వారే కాకుండా, కొత్త తరానికి చెందిన అనేకానేక మంది కవులు, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.


ఆదివాసీ కళాకారుల ప్రదర్శన

ఛత్తీస్ గఢ్ నుంచి ‘మూల వాసి సాంస్కృతిక కళా మంచ్ ’ కళా బృందం వారు రెండు రోజుల కాలి నడకన విజయవాడ వచ్చారు.తలకు నెమలి పింఛాలు, సుత్తి కొడవలి గుర్తున్న త్రికోణాకారంలోని ఆకుపచ్చ జెండాలు, కోలాటాల కర్రలతో నాట్యం చేశారు. ఎర్రెర్ర పొద్దు పొడిచి ఆకాశం ఎర్రబడే’ అంటూ తెలుగుహిందీ కలబోత యాసతో పోరాట పాటలు పాడుతూ, కీబోర్డు, డప్పులు వారే వాయిస్తూ నాట్యం చేశారు.వారంతా నవయవ్వనంలోకి అడుగిడుతున్న యువతీ యుకులు. ఒకే కళా సంస్థ కు చెందిన రెండు సాంస్కృతిక కళా బృందాలు ఈ ప్రదర్శనలిచ్చాయి. సిలింగేర్ నుంచి వచ్చిన బృందం వారు ‘గోమాతాజీ గోమాతాజీ’ అనే రూపకాన్ని ప్రదర్శించారు.



‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగ వాదం’ అన్న అంశం చర్చనీయాంశంగా విరసం సభలు శని, ఆది వారాలు రెండు రోజులు ‘కామ్రెడ్ నర్మద వేదిక’ అని నామకరణం చేసిన సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో జరిగాయి.

‘‘పాలస్తీనా.. పాలస్తీనా.. పాలస్తీనా’’ అన్న మౌమితా అలం రాసిన కవితకు ఉదయమిత్ర అనువాదాన్ని ఆహ్వానం పలికిన శివరాత్రి సుధాకర్ చదివి వినిపించారు. విరసం అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ సిద్దిఖీ కప్పన్ గురించి పరిచయం చేస్తూ, 45 నెలలు, అంటే 850 రోజులు అక్రమ నిర్బంధంలో గడిపి బయటకు వచ్చినప్పటికీ ఏమాత్రం సడలిపోకుండా, వడలిపోకుండా దేశమంతా తిరుగుతున్నారని గుర్తు చేశారు.

‘‘ హిందుత్వ రాజకీయాలతో ముడపడి ఉన్న రాజకీయాల గురించి విరసం మాట్లాడుతోంది. విద్యార్థులు, రైతుల ఆత్మహత్యల గురించి గతంలో మాట్లాడాం, ఇప్పుడూ మాట్లాడుతున్నాం . ఇవాళ ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం గురించి మాట్లాడుతున్నాం.ఈ రాజ్యాంగం ప్రజలకంటే సంపన్న వర్గాలకు, బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు ఎక్కువగా ఉపయోగపడుతోంది.మైనారిటీలకు చాలా తక్కువగా ఉపయోగపడుతోంది. రాజ్యాంగం అనేది దేశాన్ని పూర్తిగా రక్షించే సాధనంగా, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దోహదం చేసేదిగా ఉండాలి. రాజ్యాంగం వెనకాల భిన్న సమూహాల అస్తిత్వం, హామీ ఉందన్న విషయం మరువకూడదు.ఎక్కడ దగాపడ్డామో దాని గురించి మాట్లాడుకుందాం’’ అని అరసవిల్లి కోరారు.

విరసం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు గుంటూరు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ, రాజ్యాంగంలో సమాన హక్కులు, సోదర భావం రాసి ఉన్నాయని, వాస్తవానికి ఇవాళ లౌకిక భావం మతంతో నూ , సోదర భావం కులంతోను ముడిపడి ఉన్నాయని అన్నారు. దేశం హిందూ రాజ్యం వైపు పయనిస్తోందనుకున్నాం కానీ, హిందూ రాజ్యంలో ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. ఈ రాజ్యాంగం సంపూర్ణం కాదన్నారు.

విరసం కార్యవర్గ సభ్యులు పాణి మాట్లాడుతూ ఆదివాసీలు తమ పౌరులు కాదని ఈ ప్రభుత్వం భావిస్తోందని, అందుకునే వారి పైన బాంబుదాడులు చేస్తోందని అన్నారు. కార్యదర్శి నివేదికను రివేర సభకు సమర్పించారు.

కీలకోకపన్యాస సభకు అధ్యక్షత వహించిన విరసం సీనియర్ నాయకులు సీ.ఎస్.ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ, ఫాసిజానికి వ్యతిరేకంగా జరగాల్సిన పోరాటాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి చేసే పోరాటంగా భావించడం సరికాదన్నారు.
ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో రాజ్యాంగంలో అందివచ్చే హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యం గురించి, పౌర సమాజం గురించి మాట్లాడకుండా, వర్గపోరాటం చేయకుండా రాజ్యాంగం అడ్డుపడుతుందని సీ ఎస్ ఆర్ ప్రసాద్ అన్నారు.ఈ సభలో వరలక్ష్మీ కీలకోపన్యాసం చేశారు. ఆ కీలకోపన్యాసంలోని కొంత భాగం ఇది.

‘‘రాముడొచ్చాడని పత్రికలు రాశాయి. ఈ వచ్చిన రాముడు పౌరాణిక రాముడు కాదు, ఫాసిస్టు రాముడు. రిపబ్లిక్ డేకు నాలుగు రోజుల మందు ఆరూపాన్ని చూశాం. హిందూ రాష్ట్రాన్ని స్థాపిస్తామని ఎప్పుడో ప్రకటించారు. మార్పులు వేగంగా జరుగుతున్నాయి. రాజ్యాంగం ఇవాళ లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య విధానానికి భిన్నంగా కనిపిస్తోంది. రాజ్యాంగాన్ని మేం కాపాడుకుంటామంటుంటే, దానికి వ్యతిరేకంగా మీరు దాడి చేయడమేంటని ప్రశ్న వేస్తున్నారు. రాజ్యాంగంలో ప్రకటించిన ఆదర్శాలను అమలు పరిచే యంత్రాంగం రాజ్యాంగంలో లేదు. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మర్యాదగా ఉంటే కుదరదు. ఫాసిజం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయదు, తమకు అనుకూలమైన వాటిని రాజ్యం కాపాడుతుంది. ప్రజలకు అనుకూల మైనవాటిని మాత్రమే ధ్వంసం చేస్తుంది. న్యాయస్థానాల్లో కూడా రాజ్యాంగ బద్దమైన తీర్పులు రావడం లేదు. భారత దేశం జాతుల బందిఖానాగా తయారైంది. రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛను, హక్కులను పరిమితంగా గుర్తించింది. అది సామూహిక హక్కులను, స్వేచ్ఛను గుర్తించలేదు. రాజ్యాంగం వర్గసమాజంతో పాటు, కుల సమాజం, పితృ స్వామిక స్వభావం కలిగి ఉంది. ప్రజలను కాపాడడానికి కోర్టులు ఉన్నాయి, ప్రజల నుంచి ప్రభుత్వాన్ని కాపాడడానికి కోర్టులు ఉన్నాయా? రాజ్యాంగం గురించి కూడా ఇవే ప్రశ్నలు, ఇవే సమాధానాలు. అన్ని మతాలకు సమాన అవకాశాలు ఉంటాయనడం లౌకిక తత్వం కాదు.మతాలతో ప్రమేయం లేనిదే లౌకిక తత్వం.రాజకీయాల్లోకి మతం వచ్చేసింది. మతమే రాజకీయమైంది.’’ అంటూ చాలా అర్థవంతమైన కీలకోపన్యాసం చేశారు.

‘లాల్ బనో గులామీ చోడో..’ అఖిల భారత రచయితలు, ఉద్యమకారులతో సమాలోచన జరిగింది. తమిళనాడు నుంచి వచ్చిన విద్యార్థి నాయకురాలు వలర్మతి, కేరళనుంచి వచ్చిన రావన్న , పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు తథాగథ, ఒడిస్సా నుంచి వచ్చిన గిరిజన ఉపాధ్యాయ నేత హేమంతలు తమ సందేశాన్నిచ్చారు. సాయంత్రం రాంకీ ఆధ్వర్యంలో పుసక్తకావిష్కరణలు జరిగాయి. అనంతరం కవిగాయక సభ జరిగింది. పి.వరలక్ష్మి రచించిన ‘నీడలు’ నాటికను ప్రదర్శించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

రెండవరోజు సభ
రెండవ రోజు ఆదివారం పుస్తకావిష్కరణలు జరిగాయి.
అనంతరం రివేర అధ్యక్షతన ‘రాజ్యాంగం యథాతథస్థితి: వర్గపోరాటం’ అన్న అంశంపై ప్రముఖ రచయిత అల్లం రాజయ్య ప్రసంగించారు.
‘సమకాలీన సమాజం తన అవసరాల మేరకు పదేపదే వ్యాఖ్యానిస్తుంది’ అని ఈహెచ్ కార్ చెప్పిన మాటతో అల్లం రాజయ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు.వారి ప్రసంగంలోని ముఖ్యమైన భాగం ‘‘బాల రాముణ్ణి తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రధాని, పూజారి, సనాతన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే సందర్భంలో ఇదొక ప్రదర్శనగా కనిపించింది. రాముడి కాలంలో కాండవ దహనం జరిగింది. అంటే గిరిజనులు నివసించే అడవులను తగుల పెట్టారు. ఇప్పుడు వేలాది మంది ఆదివాసీల శిబిరాల బీద దాడి చేశారు. వీటన్నిటినీ ఎట్లా చూడాలన్నది ముఖ్యం. వీటిని సమీక్షించుకోవాలి. ఇది సమకాలీనం. రాజ్యాంగాన్ని రాజ్యం నుంచి విడదీసి మాట్లాడడం సాధ్యం కాదు.స్థల కాల తాత్విక వర్గపోరాటాలను నిర్ణయించేది ఉత్పత్తి విధానమే. రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు అందులో చేర్చిన వన్నీ పాత చట్టాలే. హక్కులు మాత్రం కొత్తగా వచ్చి చేరాయి. నెహ్రూ తరహా సోషలిజం అనేది ట్రాట్స్కీ ప్రవేశపెట్టదలిచిన మిశ్రమ ఆర్థిక విధానమే తప్ప మరొకటి కాదు. ‘రాజ్యాంగం అనేది తాత్కాలిక ఒడంబడిక. దాన్ని మార్చుకోకపోతే ఫాసిజం వస్తుంది’ అని అంబేద్కర్ 1948లోనే హెచ్చరించారు.’’ అంటూ అల్లం రాజయ్య తన ప్రసంగంలో వివరించారు.
‘ఫాసిస్టు సందర్భంలో మన రచన, ఆచరణ’ అన్నఅంశంపై ఎస్.మల్లారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. మతం అంటే హింస, మతం అంటే ద్వేషం అని తరతరాలుగా చరిత్ర చెప్పిందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా దాదాహయత్ ప్రసంగంలోని కొంత భాగం.‘‘ ఫ్యాసిజం అంటే నాజిజం. నిర్వచనమే లేదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం మధ్య జరిగిన పరిణామాలే ఫాసిజం. ఫాసిజం అంటే కమ్యూనిజానికి వ్యతిరేకంగా పుట్టింది. ముస్సోలినీ చేత ఫాసిజాన్ని అమలు చేయించింది అమెరికానే. ఫాసిజం వేదకాలం నుంచి వచ్చిందనడం సరికాదు.
కమ్యూనిస్టు ఛాయలు ఎక్కడ కనిపించినా ఫాసిజం అణచివేస్తుంది. కమ్యూనిజం 1905 లోనే విజయం సాధించింది. రాజ్యాంగాన్ని ఇస్తున్నానని జార్ చక్రవర్తి అన్నాడు.దాన్ని లెనిన్ అంగీకరించలేదు. లెనిన్ రాజ్యాంగ వాదాన్ని వ్యతిరేకించాడు. మానవ హక్కుల ప్రకటన తరువాతనే మన రాజ్యాంగం వచ్చింది. హిట్లర్ కూడా ఎన్నికల ద్వారానే అధికారంలోకి వచ్చాడు.

మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ధ్వారానే అధికారంలోకి వచ్చారు. మోడీ రాజదండాన్ని పట్టుకుని పార్లమెంటు అంతా తిరిగారు. ఆయన రాజ్యాంగ చ్రకవర్తి. స్వస్తిక్ కాలచ్రకానికి చిహ్నం. అది ఆర్యుల ఆధిపత్యానికి చిహ్నం. హిట్లర్ దాన్ని తిప్పి పెట్టాడు. కాస్తోకూస్తో ఉన్న ఉదార వాదం కాస్తా పోతే, సమాన్యులు ఎట్లా జీవించాలి?’’ అంటూ దాదా హయత్ ప్రశ్నించారు.

సామాజిక మాద్యమాల్లో అభ్యుదయ గొంతులు వస్తున్నాయని, దీన్ని ఎదుర్కోవడానికి పార్టీలు ట్రోలింగ్ కు పాల్పడుతున్నాయని ప్రజారచయిత్రుల వేదికకు చెందిన రచయిత్రి మల్లీశ్వరి మాట్లాడుతూ అన్నారు.
ఈ సందర్భంగా రచయితలంతా ప్రజలదగ్గరకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. డానీ మాట్లాడుతూ ‘‘ఫ్యాసిజం పైన రాయడమంటే ఫ్యాసిస్టులపైన రాయడమే. హిట్లర్ పైన చార్లీ చాప్లిన్ సినిమానే తీశాడు. ఫాసిజం బాధితులపైన కథలురాశాం. అది సరిపోదు. ఇంకా వివిధ ప్రక్రియల్లో రావాలి. ‘అయ్యో..అయ్యో..’ అనే కథలు మానేసి, ‘వాళ్ళ అంతు చూస్తాం’ అనే కథలు రావాలి. కాల్పనిక సాహిత్యమైనా సరే మన శత్రువుల పైన రాయాలి.’’ అని సూచించారు.

‘‘నేను నాస్తికుణ్ణి, హేతువాదిని. అయ్యప్ప భక్తులను నా కారుతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించానని నా పై ఆరోపిస్తూ కేసు పెట్టారు. నా కారు ప్రమాదానికి గురై మైలు రాయిని ఢీకొట్టింది.అదేదో ప్రభుత్వ అస్తిని ధ్వంసం చేసినట్టు నా పైన పెట్టిన కేసు లో పేర్కొన్నారు. నన్ను అరెస్టు చేసినప్పడు స్టేషన్ బెయిలిచ్చి పంపే అవకాశం ఉన్నా, 46 రోజులు జైల్లోనే ఉంచారు.’’ అంటూ బైరి నరేష్ తన అనుభవాలను వివరించారు.

కాత్యాయని విద్మహే మాట్లాడుతూ, ‘‘2014 నుంచి ఫాసిజం సందర్భం మనకు అనుభవంలోకి వచ్చింది.కల్భుర్గి కావచ్చు, గౌరి లంకేష్ కావచ్చు, వీరి హత్య జరిగినప్పటి నుంచి ఫాసిజాన్ని చూస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీలో ఉత్సవాలు, ఊరేగింపులు ఎలాంటి తరాన్ని తయారు చేస్తున్నాయో తలుచుకుంటే బాధేస్తోంది. స్త్రీలు కొత్తగా వీటిని అలవరచుకుంటున్నారు. వారికి ఆసక్తి లేకపోయినా, కమ్యూనిటీలో కలవకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. మతం వ్యక్తిగతం కావలసిన చోట, మతం జీవితాన్ని శాసించే పరిస్థితికి చేరుకుంది.మనందరిలో మనువాదం ఉంది. మనలోని మనువాదంతో మనం యుద్ధం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.




అనంతరం సాంస్కృతిక కార్య్రకమాలు జరిగాయి.

విరసం నూతన కార్యవర్గం
-
విరసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షులుగా అరసవిల్లి కష్ణ, కార్యదర్శిగా రివేరా తిరిగి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పాణి, రాంకి, చిన్నయ్య, వరలక్ష్మి, కోడం కుమార్, బాలసాని రాజయ్య, ఉజ్వల్, వెంకన్న, సాగర్, కళావతి, కిరణ్, నాగేశ్వర్, శివరాత్రి సుధాకర్ ఎన్నికయ్యారు. చివరగా జరిగిన బహిరంగ సభలో నూతన అధ్యక్షుడు అరసవిల్లి కష్ణ , నూతన కార్యదర్శి రివేరాతోపాటు, జి.హరగోపాల్, జి.కళ్యాణరావు, పాణి తదితరులు ప్రసంగించారు. దీంతో ఘనంగా జరిగిన విరసం 29వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. ఈ మహా సభలకు దాదాపు 600 మందికి పైగా ప్రతినిధులు, సాంస్కృతిక కళాకారులు, అభిమానులు హాజరయ్యారు.


Read More
Next Story