
తురకలపల్లి రాతిచిత్రాలు వెలుగులోకి
నాగర్ కర్నూలులో తురకలపల్లి రాతిచిత్రాలు వెలుగులోకి. మధ్యరాతియుగం నుంచి చారిత్రకయుగం వరకు పురాతన జీవన గాథలు బయటపడ్డాయి.
నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలంలోని తురకలపల్లి గ్రామం బయట ఉన్న చిన్నగుట్ట గుహలో చిత్రిత శిలాశ్రయం ఉన్నది. ఉత్తర అక్షాంశం 16.686861 డిగ్రీలు, తూర్పురేఖాంశం 78.658680డిగ్రీలపై నెలవైన ఈ రాతిచిత్రాల తావును కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు యాదేశ్వర్ దంతేటికర్, కలగోని కిరణ్ కుమార్ గౌడ్ గుర్తించారు.
వీటిని పరిశీలించినపుడు ఎరుపు, తెలుపు, నలుపు రంగులలో గీసిన ఈ రాతిచిత్రాలు వివిధరాతియుగాలకు చెందినవని కొత్త తెలంగాణచరిత్రబృందం సలహాదారులు, రాతిచిత్రాల నిపుణుడు బండి మురళీధర్ రెడ్డిగారు నిర్ధారించారు.
ఎరుపురంగు రాతిచిత్రాలు (Red colour): గుర్తించడానికి వీలుపడని ఒక పెద్ద జంతువు, చిన్న సరీసౄపం, రెండు గీతలు క్రాస్ అయి ఉండటం, పొడవైన కొమ్మువంటి, ఎముకలవంటి ఆకారాలు, మసకబారిన త్రిభుజాలు, అనిశ్చిత డిజైన్లు, ఇతర గీతలు, మానవ ఆకృతి?ఇవన్నీ మెసోలిథిక్ కాలానికి చెందిన రాతిచిత్రాలు. ఎరుపు రంగు గీతలు కొన్నిసార్లు ఒకదాని పై ఒకటి అధ్యారోపణం(super imposition) చేయబడి ఉంటాయి.
తెలుపురంగు రాతిచిత్రాలు (White colour): కొమ్ములుగల మూపురపుటెద్దు (humped bull), మూపురంలేని కొమ్ముల ఎద్దు (hump less cattle), 10 స్పోక్స్(ఆకులు)గల అలంకరణ వృత్తం - నియోలిథిక్ కాలానికి చెందినవి. కొన్ని నలుపురంగు రాతిచిత్రాల పైన కూడా తెలుపురంగు వేయబడి ఉంది. ఇది తర్వాతకాలంలో చేయబడి ఉండాలి.
నలుపు రంగు రాతిచిత్రాలు (Black colour): వృత్తాలు, లోపల X గుర్తు ఉన్న డబుల్ లైన్ దీర్ఘచతురస్రం, 8 గీతలు, డాట్స్ ఉన్న అర్ధవృత్తాకార అలంకరణ మోటిఫ్, బయట చిన్నగీతలు, సాధారణ జంతువులు - కొమ్ములు లేని మూపురపు జంతువు (humped animal without horns), పొడవైన మెడ, పొడవైన తోక ఉన్న 6 కాళ్ల జంతువులు, పొడవైన తోకతో 4 కాళ్ల జంతువులు, కుడి చేతిలో కత్తి పట్టుకున్న మానవ ఆకృతులు, కుడి చేతిలో కత్తి పట్టుకుని 4 కాళ్ల గుర్రంవంటి జంతువు మీద సవారీ చేస్తున్న మనిషి, సరిగా కనిపించని ఏనుగురూపం, పడుకున్న స్థితిలో కనిపించే అనిశ్చిత రూపాలు, వాటి పైన ఆయుధంతో మనిషి చిత్రం. ఈ రాతిచిత్రాలలో సౌష్టవం లేదు, అసమాన చిత్రణ ఉంది. ఇవి చారిత్రక కాలానికి చెందిన రాతిచిత్రాలు.
గ్రూవ్స్ (Grooves): ఇక్కడ పరుపుబండలమీద కనిపిస్తున్న లోతైన నూరుడుగుంటలు కొత్తరాతియుగం రాతిపనిముట్లు పదునుపెట్టుకోవడానికి పనికొచ్చేవి. ఒకేచోట వివిధకాలాలకు చెందిన రాతిచిత్రాలు లభించడం వేర్వేరు కాలాలకు చెందిన పురామానవులు ఈ తావును ఆవాసంచేసుకుని జీవించారని, తమ జీవనసంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను గీసారని, ఈ చిత్రాలే మనకు వారు అందించిన చరిత్రపుటలని కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.

