
హైదరాబాద్ నగరంలో వెల్లివిరిసిన జకాత్ దానాలు
హైదరాబాద్‌లో రూ.400 కోట్ల జకాత్ దానాలు: నిరుపేదల జీవితాల్లో వెలుగులు
జకాత్ నిధులతో స్వయం ఉపాధి… పేదరిక నిర్మూలనకు కొత్త దారి
హైదరాబాద్ నగరంలో పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా జకాత్ దానాలు నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉపాధి, విద్య, వైద్యం వంటి రంగాల్లో జకాత్ నిధులు ఆశాకిరణంగా మారుతున్నాయి.ఈ ఏడాది హైదరాబాద్‌లో జకాత్ దానాలు రూ.400 కోట్లకు చేరనున్నట్లు అంచనా. ఉపాధి, విద్య, వైద్యం రంగాల్లో జకాత్ నిధులు వేలాది నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయి.దానం మాత్రమే కాదు, అభివృద్ధికి దారి చూపే సాధనంగా జకాత్ హైదరాబాద్‌లో రూపాంతరం చెందుతోంది.
సైకిల్ మెకానిక్ నుంచి సొంత షాపుదారుడిగా… బస్తీలో గాజులు అమ్మిన యువకుడు దుకాణ యజమానిగా హైదరాబాద్‌లో జకాత్ దానాలు పలువురు నిరుపేదల జీవితాలను మార్చేస్తున్నాయి.
- హైదరాబాద్ నగరంలోని కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ హమీద్ 8 ఏళ్లుగా సైకిల్ మెకానిక్ గా ఓ షాపులో పనిచేస్తున్నాడు. అరకొర జీతంతో జీవితం గడుపుతున్న హమీద్ కు జకాత్ సెంటర్ ఇండియా జకాత్ నిధిని దానంగా అందజేసింది. జకాత్ నిధులతో హమీద్ సైకిల్ స్పేర్ పార్టులు, టూల్స్ కొనుగోలు చేసి సొంతంగా సైకిల్ రిపేరు షాపు పెట్టి నడిపిస్తుండటంతో అతనికి ఉపాధి లభించింది.
- సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన ముహమ్మద్ సులేమాన్ బస్తీల్లో తిరుగుతూ గాజులు విక్రయించేవాడు. పెట్టుబడి లేక కొన్ని గాజులు కొని తిరిగి అమ్ముకునేవాడు. జకాత్ సెంటర్ ఇండియా సులేమాన్ కు గాజుల వ్యాపారం చేసేందుకు వీలుగా జకాత్ నిధిని దానంగా అందించింది. అంతే ఈ దానంతో సులేమాన్ గాజులు విక్రయించే దుకాణం ఏర్పాటు చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
సైకిల్ రిపేరర్ అబ్దుల్ హమీద్,గాజుల వ్యాపారి ముహమ్మద్ సులేమాన్ లే కాదు హైదరాబాద్ నగరంలోని పలు నిరుపేదలకు జకాత్ దానం అందించడంతో వారి జీవితాల్లో వెలుగు నిండింది. ఎందరో నిరుపేదలకు జకాత్ దానాలతో ఉపాధి కలిగింది.
నిత్యావసరాలతో కూడిన రమజాన్ కిట్ పంపిణీ
దానధర్మాలు చేసే నెల
పవిత్ర రమజాన్ మాసాన్ని దానధర్మాలు చేసే నెలగా ముస్లింలు భావిస్తుంటారు. ఏడాది కాలం సంపాదనలో రెండున్నర శాతం విధిగా జకాత్ నిధిని నిరుపేదలకు దానం ఇచ్చి వారు గౌరవప్రదంగా జీవించేలా చూడాలి.ఆర్థికస్థోమత ఉన్నవారు జకాత్ నిధిని పేద విద్యార్థుల చదువుకు, యువతుల వివాహాలకు అందిస్తుంటారు.హైదరాబాద్ నగరానికి చెందిన జకాత్ ఛారిటబుల్ ట్రస్టు సంస్థ జకాత్ నిధులతో నిరుపేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా వికారాబాద్ లో కాలేజీని సైతం స్థాపించారు.హ్యుమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, సఫా బైత్ ఉల్ మాల్, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్,ఖత్మే నబూవత్, దారుల్ అన్సార్ తదితర స్వచ్ఛంద సంస్థలు జకాత్ నిధులను సేకరించి పేదలకు అందిస్తుంటాయి. జకాత్ నిధితో ఇచ్చే దాన ధర్మాలను గోప్యంగా ఉంచుతారు. జకాత్ దాన ధర్మాల వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవడంతోపాటు నిరుపేదలకు ఉపాధి లభిస్తుందని పాతబస్తీకి చెందిన ఇస్లామిక్ రచయిత ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
జకాత్ నిధి ఎంతంటే...
తన సంపాదనలో రెండున్నర శాతం జకాత్ కింద దానం చేస్తుంటారు.జకాత్ ఒక బాధ్యత. ముస్లింలు ఇస్లాం యొక్క ఐదు స్తంభాల్లో ఒకటైన జకాత్‌ను వారి వార్షిక పొదుపుపై లెక్కిస్తారు. ఇది ప్రధానంగా రమజాన్ సందర్భంగా పంపిణీ చేస్తుంటారు. ఏడాది సంపాదన రూ.10 లక్షలుంటే జకాత్ కింద రూ.25వేలు దానం చేయాల్సి ఉంటుంది. 52 తులాల వెండి, అంతే విలువగల బంగారం ఉన్నా, నగదు నిల్వలున్నా జకాత్ ఇవ్వాలి. స్థిరాస్థులు, చరాస్తులున్నా దానం ఇవ్వాలని ఇస్లాం ధర్మం చెబుతుంది.
ఎవరికి దానం ఇవ్వాలంటే...
జకాత్ నిధులను దానం ఇచ్చేటపుడు ముందుగా ఇంటి ఇరుగుపొరుగున ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇచ్చి ఇవ్వాలి. ఆ తర్వాత తమ బంధువుల్లో పేదలకు జకాత్ ఇవ్వాలి. రమజాన్ నెలలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను అందిస్తుంటారు. హ్యుమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రేషన్ సరుకులతోపాటు కొత్త దుస్తులను పేదలకు పంపిణీ చేస్తుంది.
నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం
నిరుపేదలకు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంస్థ ఉచిత న్యాయ సహాయం అందజేస్తుంది. తప్పుడు కేసుల్లో జైలు పాలైన యువకులకు, జరిమానా సొమ్ము చెల్లించలేని ఖైదీలకు వారి జరిమానా సొమ్మును చెల్లించి వారిని జైళ్ల నుంచి విడుదల చేయిస్తుందని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఉస్మాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బాలికల విద్యాభివృద్ధికి జకాత్ ఫౌండేషన్ బాటలు
నిరుపేదల అభ్యున్నతికి కార్యక్రమాలు
హైదరాబాద్ నగరంలో జకాత్ సెంటర్ ఇండియా జకాత్ నిధులతో నిరుపేదల అభ్యున్నతికి కార్యక్రమాలు చేపడుతుంది. నిరుపేదలకు దుకాణాలు, స్టాళ్లు నిర్మించి ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తుంది. మిషన్లు, ఇతర పరికరాలను అందించడం ద్వారా వారికి ఉపాధి బాట చూపిస్తుంది. నిరుద్యోగ పేద యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి వారి స్వయం ఉపాధికి బాటలు వేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఆర్థికసాయం అందిస్తుంది. జకాత్ నిధుల పంపిణీ కోసం 405 దరఖాస్తులు రాగా వారిని ఇంటర్వ్యూలు చేసి, ఫీల్గు వెరిఫికేషన్ చేసి రూ. 73 లక్షలను పంపిణీ చేశామని జకాత్ సెంటర్ ఇండియా కార్యదర్శి తన్వీర్ ఉల్ హక్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, షహీన్ నగర్, నాంపల్లి, మల్కాజిగిరి, టోలిచౌకి, ఆసిఫ్ నగర్, చార్మినార్, అంబర్ పేట, గోల్కొండ, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా, బోరబండ, సంతోష్ నగర్, శంషాబాద్, ఫలక్ నుమా ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు జకాత్ నిధులను పంపిణీ చేశామని ఆయన వివరించారు. మురికివాడలు, బస్తీల్లో పేదలను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. సైకిల్ రిపేరు షాపులు, గాజుల విక్రయ దుకాణాలు, మొబైల్ యాక్సెస్ షాపు, ఎలక్ట్రీకల్ షాపుల ఏర్పాటు ద్వారా నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నారు.
రమజాన్ ప్రాజెక్టు 2026
రమజాన్ నెలలో ఉపవాసం ఉన్న ముస్లింలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు వీలుగా ఒక్కో కుటుంబానికి రూ.3వేల జకాత్ దానంతో బియ్యం, గోధుమపిండి, ఆయిల్, పంచదార, కందిపప్పు, శనగపిండి, టీ, ఉప్పు, ఖర్జూరం, ఘీ, రోహబ్జా పానీయంతో కూడిన 35 కిలోల కిట్ ను హైదరాబాద్ కు చెందిన జకాత్ అండ్ ఛారిటబుల్ ఫౌండేషన్ పేదలకు అందించింది. 2,09,950 మందికి ఫుడ్ కిట్ లను అందజేసింది.
అన్నార్తులకు ఉచితంగా ఆహారం పంపిణీ
నిరుపేదలు, అనాథ విద్యాభివృద్ధికి నిధులు
హైదరాబాద్ జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ (HZCT) 1992వ సంవత్సరంలో ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థుల విద్యాభాసానికి జకాత్ నిధులను వెచ్చిస్తున్నారు. నిరుపేద, అనాథ బాలబాలికలకు చదివించి వారికి ఆశాజనకమైన భవిష్యత్ కల్పిస్తున్నారు. ఈ ట్రస్టు గత 31 ఏళ్లుగా 16.40 లక్షలమందికి రూ.155 కోట్ల జకాత్ ను అందించి వారి చదువుకు తోడ్పడ్డారు. వికారాబాద్ కేంద్రంగా ఈ ట్రస్టు ప్రత్యేకంగా కాలేజీని కూడా ఏర్పాటు చేసింది. విద్య ద్వారానే పేదల అభ్యున్నతి సాధ్యమనే వాస్తవాన్ని గ్రహించిన ట్రస్టు పేదలు, అనాథల విద్యాభివృద్ధికి జకాత్ నిధులను వెచ్చిస్తుంది.
పేద రోగులకు మంచుల పంపిణీ
మొబైల్ క్లినిక్ లతో ఉచితంగా వైద్యం, మందులు
వివిధ జబ్బులతో అనారోగ్యంతో `బాధపడుతున్న నిరుపేదలకు ఉచితంగా వైద్యం, మందులు అందించేందుకు వీలుగా జకాత్ అండ్ ఛారిటబుల్ ఫౌండేషన్ నగరంలో మొబైల్ క్లినిక్ లు నిర్వహిస్తోంది. వైద్యులతో ఉచితంగా కన్సల్ టేషన్ తోపాటు ఉచితంగా మందులను పంపిణీ చేస్తుంది. మెడికల్ క్యాంపులు నిర్వహించడంతోపాటు 53,019 మందికి ఉచిత వైద్యం అందించారు.అన్నార్తులకు భోజనాన్ని అందించి వారి ఆకలిని తీరుస్తున్నారు.
జకాత్ తీసుకునే వారు ఇచ్చేస్థాయికి ఎదగాలనేదే లక్ష్యం
జకాత్ ఇవ్వడం ద్వారా పేదరిక నిర్మూలన సొసైటీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వారికి ఉపాధి బాట చూపిస్తున్నారు. జకాత్ తీసుకున్న వారు జకాత్ వ్యాపారం చేయడం ద్వారా జకాత్ ఇచ్చే స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ ఏడాది రమజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో జకాత్ వసూళ్లు రూ.400 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. చాలా మంది యువకులు ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి బదులుగా విద్య, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి నేరుగా జకాత్‌ను పంపిణీ చేస్తున్నారు.
జకాత్ పంపిణీపై సందేహాలు
హైదరాబాద్ నగరంలో పలు సామాజిక సంస్థలు జకాత్ సేకరణలోకి ప్రవేశించడంతో జకాత్ దాతల నుంచి విరాళాలుగా సేకరించిన భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడంపై సమాజంలో సందేహాలు తలెత్తుతున్నాయి.మురికివాడలను సందర్శించి పేదలను గుర్తించి, విద్యార్థుల విద్యకు నిధులు సమకూరుస్తున్నారు.
ఈ ఏడాది రూ.400కోట్ల జకాత్ దానాలు
ప్రతీ ఏటా హైదరాబాద్ నగరంలో రూ.300కోట్లను జకాత్ కింద దానాలు చేస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో ఈ ఏడాది జకాత్ దాన ధర్మాలు రూ.400 కోట్లకు పెరిగాయి. చాలా సంస్థలు, ఎన్ జీఓలు జకాత్ కలెక్షన్స్ చేస్తున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి, విద్య కోసం జకాత్ నిధులను ముస్లిం యువత వెచ్చిస్తున్నారు. చదువుకుంటూనే ఫుడ్ డెలివరీ బాయ్ లుగా పనిచేస్తున్న వారు బైక్ లేదా క్యాబ్ టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి జకాత్ నిధులు అందిస్తున్నారు.
జకాత్ కేవలం దానం కాదు... పేదరిక నిర్మూలనకు ఒక సామాజిక వ్యవస్థ.జకాత్ తీసుకున్న వారు స్వయం ఉపాధితో ఎదిగి, భవిష్యత్తులో జకాత్ ఇచ్చే స్థాయికి చేరుకోవాలనేదే సేవా సంస్థల లక్ష్యం.బస్తీల్లో వెలిగిన చిన్న దీపాల్లా జకాత్ దానాలు నిరుపేదల జీవితాల్లో వెలుగునింపుతున్నాయి. ఒక చిన్న సహాయం ఒక కుటుంబానికి జీవనాధారంగా మారుతోంది. దానం చేసే చేతులు పెరిగితే, ఆశతో ఎదిగే జీవితాలు మరింత విస్తరిస్తాయి.
Next Story

