
హన్మకొండలో ఆదివారం ఐదు పుస్తకాల సందడి...
ఒకే రోజు ఒకే సభలో ఐదుగురి రచయిత్రుల పుస్తకాలు విడుదలయ్యాయి. రుద్రమ ప్రచురణల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఐదు గ్రంధాల ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది
భారతీయ సమాజంలో మహిళలు అణచివేయబడటానికి భూస్వామ్య సంస్కృతియే ప్రధాన కారణమని అంపశయ్య నవీన్ అన్నారు. పురుషులను ద్వేషించడం స్త్రీ వాదమే కాదని పునరుద్ఘాటించారు. ఆదివారం హన్మకొండలోని మర్కజీ పాఠశాలలో రుద్రమ ప్రచురణల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐదు గ్రంధాల ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది.
"చిమమండ అడిచి" స్త్రీ వాదం గ్రంధాన్ని ఆవిష్కరించి అంపశయ్య నవీన్ మాట్లాడుతూ మహిళల పట్ల అణచివేత దోరణిలో ఆలోచించే ఆధిపత్య విలవలను స్త్రీ వాదం వ్యతిరేకించాలని కోరారు. భారతీయ సమాజంలో ఇప్పటికీ ఫ్యూడల్ సంస్కృతి ప్రభావం సజీవంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పురుషుల దృక్పథంలో మార్పు రావాలని కోరారు. మహిళలను తమతో సమానంగా చూసే వైఖరిని పురుషుల పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.
ప్రపంచంలో కమ్యూనిస్టు మానిపెస్టోతో సమానంగా ఫెమినిజాన్ని గుర్తించాలని నవీన్ కోరారు. బెర్నార్డ్ షా గొప్ప ఫెమినిస్టు గా చెప్పుకోవచ్చని గుర్తు చేశారు. 1980 తర్వాత ఫెమినిస్టు రచనల ఉధృతి విపరీతంగా పెరిగిందన్నారు. ఫెమినిస్టు సాహిత్యం మరిత రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో పుస్తక పఠనం పెరిగితేనే మార్పునకు మార్గం అవుతుందన్నారు. తమ్మెర రాధిక రాసిన కథల పుస్తకం 'హవేలి దొర్సానీ' ఆవిష్కరించి ప్రముఖ కథా రచయిత బివిఎన్ స్వామి మాట్లాడుతూ రాధిక రచనల్లో వస్తువు, దృక్పథం, కథన శైలి పాఠకులను ఆకర్షిస్తుందన్నారు.
అనిశెట్టి రజిత రచించిన "కాలం కాన్వాస్ మీద" కవిత్వం వి.ఆర్. విద్యార్థి ఆవిష్కరించారు. టి. రాధిక కవిత్వం "కాలం జాడలు తీస్తూ" పుస్తకాన్ని పొట్లపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
అనిశెట్టి రజిత, కొమర్రాజు రామలక్ష్మి సంపాదకత్వంలో వచ్చిన "భారతదేశంలో వితంతు వ్యవస్థ " పుస్తకం డాక్టర్ తిరునగరి దేవకిదేవి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రమ ప్రచురణల నిర్వాహకులు అనిశెట్టి రజిత, కొమర్రాజు రామలక్ష్మీ, డాక్టర్ బండారు సుజాత, డాక్టర్ మురాడి శ్యామల, బి.రమాదేవి, వల్లంపట్ల నాగేశ్వరరావు, బిల్ల మహేందర్, బిట్ల అంజనీదేవి, కొలిపాక శోభ, మడూరి అనిత, సింగరాజు రమాదేవి, చంద్రకళ, నిధి, వీరస్వామి, మాలతీలత,విజయచంద్ర, మెట్టు రవీందర్, రామశాస్త్రి, పి.చందు, వంగాల సంపత్ రెడ్డి టి.రమేష్, కోడం కుమార్ తదితరులు పాల్గొన్నారు.