పార్లమెంటుకు ఎన్నికైన తొలి అంధుడెవరో తెలుసా?
x

పార్లమెంటుకు ఎన్నికైన తొలి అంధుడెవరో తెలుసా?

సాధన్ గుప్తా.. పార్లమెంటుకు ఎన్నికలైన తొలి అంధుడని మీకు తెలుసా? ఆయన పుట్టుక కూడా చారిత్రాత్మకమైన రోజునే జరిగింది.


భారత పార్లమెంటుకు ఓ అంధుడు ఎన్నికయ్యారని మీకు తెలుసా? బహుశా ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవొచ్చు కానీ పార్లమెంటుకు ఓ చూపులేని వ్యక్తిని ఎన్నుకున్న ఘనత భారతీయులకు ఉంది. ఆయనే సాధన్ గుప్తా. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సాధన్ గుప్తా ఏకంగా మూడు సార్లు గెలిచారు. చిత్రమేమిటంటే ఆయన ఎన్నికే కాదు ఆయన పుట్టుక కూడా ఓ చరిత్రాత్మక దినమైన రోజే సంభవించింది. రష్యా సోషలిస్ట్ విప్లవం జరిగిన 1917 నవంబర్ 7న ఢాకాలో జన్మించిన సాధన్ గుప్తా మన పార్లమెంటులో అడగుపెట్టిన మొట్టమొదటి అంధ సభ్యుడు. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. స్వాతంత్ర్యానికి పూర్వం ఆయన మేటి న్యాయవాది అన్న ఖ్యాతి ఉండేది. బ్రిటిష్ చక్రవర్తికి-శివనాథ్ బెనర్జీకి మధ్య జరిగిన వ్యాజ్యంలో ఆయన వాదనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే ఆయనకు మశూచి సోకి చూపు కోల్పోయారు. కోల్ కతాలోని అంధుల పాఠశాలలో చదువుకున్నారు. మెట్రిక్యులేషన్ పరీక్షలో మొదటి పది స్థానాలలో నిలిచారు. ప్రెసిడెన్సీ కళాశాలలో మొదట ఎం.ఎ. అర్థ శాస్త్రం పూర్తి చేసి అదే విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బి‌లో ఉత్తీర్ణులయ్యారు. కళాశాల విద్య అభ్యసిస్తున్నప్పుడే వామపక్ష విద్యార్థి ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. బెంగాల్ ప్రొవిన్షియల్ విద్యార్థి సమాఖ్యకు అధ్యక్షుడయ్యారు. 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. సీపీఐ చీలినప్పుడు ఆయన సీపీఐఎంలో చేరారు. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1962 దాకా లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. మూడు దఫాలు సాధన్్ గుప్తా కోల్కతా ఆగ్నేయ నియోజక‌వర్గానికి ప్రాతినిధ్యం వహించారు.


అంధుల జాతీయ సమాఖ్యకు తొలి అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత అంతర్జాతీయ అంధుల సమాఖ్య భారత విభాగానికి అధ్యక్షులయ్యారు. బెంగాల్ అడ్వొకేట్ జనరల్‌గా కూడా పని చేశారు. ఆయన తండ్రి జోగేశ్ చంద్ర గుప్తా కూడా ప్రసిద్ధ బారిష్టర్. సాధన్ చంద్ర గుప్తా (7 నవంబర్ 1917 - 19 సెప్టెంబర్ 2015) ఒక భారతీయ న్యాయవాది. రాజకీయవేత్త. గుప్తా 1953లో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి అంధ పార్లమెంటేరియన్. పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు. ఆయన తండ్రి జాతీయ కాంగ్రెస్ నాయకుడు. సాధన్ గుప్తా తన బాల్యంలో మశూచి వ్యాధి బారిన పడి శాశ్వతంగా అంధుడిగా మారాడు. గుప్తా కలకత్తా బ్లైండ్ స్కూల్‌లో పాఠశాలకు వెళ్లాడు. తర్వాత ప్రెసిడెన్సీ కాలేజీ (ఎకనామిక్స్) ఆనర్స్‌తో పట్టభద్రుడయ్యాడు.

కలకత్తా విశ్వవిద్యాలయం (లా)లో చదువుకున్నాడు. 1939లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి తన విద్యార్థి దశలోనే రాడికల్ రాజకీయాల్లో పాల్గొన్నారు. గుప్తా 1942లో కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా నమోదై యువ న్యాయవాదిగా ప్రఖ్యాతిగాంచారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన అనేక కేసులను వాదించారు. 1945 హెబియస్ కార్పస్ కేసు "చక్రవర్తి వర్సెస్ శివనాథ్ బెనర్జీ" కేసులో కలకత్తా హైకోర్టులోనూ, ఆ తర్వాత ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాలో వాదించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలను మహాత్మా గాంధీ సహా ఆనాటి ప్రముఖులు అనేక మంది నుంచి ప్రశంసలు పొందారు.

1951లో పార్లమెంటుకు జరిగిన తొలి ఎన్నికల్లో కలకత్తా సౌత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆనాటి జనసంఘ్ నేత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేతిలో ఓడినా 1953లో ముఖర్జీ మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కలకత్తా సౌత్ ఈస్ట్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. గుప్తాకు 58,211 ఓట్లు (55.24%) లభించాయి. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి అంధ పార్లమెంటేరియన్ అయ్యాడు. సీనియర్ న్యాయవాది అయిన రాధాబినోద్ పాల్‌ను కూడా సాధన్్ గుప్తా ఓడించారు. తప్పులు లేకుండా ఇంగ్లీషు మాట్లాడడంలో ఆయన దిట్టని పేరు. పార్లమెంటులో ఆయన గళం విప్పితే ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు మంత్రుల వరకు ఎందరో ఆసక్తిగా వినేవారు.

పార్లమెంటులో చర్చలు సాగేటపుడు ఆయన బ్రెయిలీ లిపిలోనే టైపు చేసుకుని తన వాదనలను వినిపించేవారు. పార్లమెంటేరియన్‌గా ఉన్నప్పుడు కూడా గుప్తా తన న్యాయవాద వృత్తిని కొనసాగించారు. కలకత్తా హైకోర్టుతో పాటు శ్రీనగర్, జైపూర్, జోధ్‌పూర్, పాట్నా, అలహాబాద్, కటక్, జంషెడ్‌పూర్, జబల్‌పూర్, చిట్టగాంగ్ (తూర్పు పాకిస్తాన్‌లో) కోర్టు కేసులకు కూడా హాజరయి తన వాదనలు వినిపించేవారు. గుప్తా 1957 సాధారణ ఎన్నికలలో కలకత్తా తూర్పు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. 1,43,350 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సీపీఐ చీలిపోయినపుడు ఆయన సీపీఎంలో చేరారు. 1967లో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో చౌరింగీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధార్థ శంకర్ రే చేతిలో ఓడిపోయారు. 1969 ఎన్నికలలో కాళీఘాట్ నియోజకవర్గం నుంచి పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1977లో పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినప్పుడు భూ సంస్కరణలకు సంబంధించిన కేసులు వచ్చినప్పుడు వాటిపై సుదీర్ఘ కసరత్తు చేసి తన వాదనలు వినిపించి పేదల పక్షం వహించారు. 1979లో పశ్చిమ బెంగాల్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమితులై చాలా కాలం పని చేశారు. ఆ పదవిని చేపట్టిన మొదటి దృష్టి లోపం ఉన్న వ్యక్తి కూడా సాధన్ గుప్తా కావడం విశేషం. గుప్తా సామాజిక సేవలోనూ ముందుండే వారు.

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్‌ని స్థాపించి అనేక మంది అంధులకు అండగా నిలిచారు. డిజేబుల్ పీపుల్స్ ఇంటర్నేషనల్- ఇండియా చాప్టర్ కి తొలి అధ్యక్షునిగా వ్యవహరించారు. పలు కార్మిక సంఘాలకు నాయకునిగా ఉన్నారు. గుప్తా సంగీత ప్రియుడు. రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన కవితన్నా, జానపద సంగీతమన్నా చెవి కోసుకునే వారు. అటువంటి నిస్వార్థ జీవి 2015 సెప్టెంబర్ 19న కన్నుమూశారు. ఈ సందర్భంలో అనేక మంది ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ.. భారతీయ ఉత్తమ పార్లమెంటేరియన్లలో ఒకర్ని దేశం కోల్పోయిందని నివాళులు అర్పించారు.

Read More
Next Story