తెలంగాణ సంక్రాంతి సోయగాలు అన్నీ ఇన్నీ కావు !
x

తెలంగాణ సంక్రాంతి సోయగాలు అన్నీ ఇన్నీ కావు !

ఈ మూడు రోజులు ఊర్లో గడిపితే చాలు మిగిలిన ఏడాదికి సరిపడా మధుర జ్ఞాపకాలు దక్కుతాయి.


‘‘ఉదయం నాలుగు గంటలు అవుతుంది. ఎప్పుడూ తొమ్మిది వరకు పిన్‌డ్రాప్ సైలెంట్‌గా ఉండే మా ఇల్లు ఈ రోజు మాత్రం నవ్వులు పిల్లల కేరింతలతో హోరెత్తుతోంది. ఆ శబ్దాలకు నిద్ర లేచిన నాకు గది నుంచి బయటకు వచ్చాక అర్థమైంది — సంక్రాంతి పండుగ వచ్చింది. బిజీ లైఫ్‌లో బంధాలు బంధుత్వాలను చాలామంది మర్చిపోతుంటాం. కానీ ఆ బాధను ఒక్క క్షణంలో మటుమాయం చేసింది సంక్రాంతి. నిద్ర మత్తు ఇట్టే పటాపంచలైంది. తెలియని ఉత్సాహం నన్ను కమ్మేసింది’’ అంటూ తన సంక్రాంతి సంబరాలు ఎలా మొదలయ్యాయో చెప్పాడు ఖమ్మం జిల్లా తల్లపాడుకు చెందిన శ్రీకాంత్.

గజగజలాడించే చలి ఉన్నా తెల్లవారుజామునే ఒక మంట వేసుకుని దాని చుట్టూ పిల్లలు చేరారంటే సంక్రాంతి సందడ్లు మొదలైనట్టే. తెలంగాణ పల్లెలు పండుగకు ఇలానే స్వాగతం పలుకుతాయి. ఇంటి దగ్గర పిల్లల అల్లరి ఇంట్లో చుట్టాల సందడి పల్లె అంతటా కళకళలాట నింపుతుంది. అంతేకాదు పొలం అంచున నిలబడి రైతు సూర్యునికి నమస్కారం పెడుతున్నప్పుడు పంట పండిన ఆనందం అతని కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంక్రాంతిని ప్రతి పల్లె ఎంతో అద్భుతంగా జరుపుకుంటుంది. ఈ మూడు రోజులు ఊర్లో గడిపితే చాలు మిగిలిన ఏడాదికి సరిపడా మధుర జ్ఞాపకాలు దక్కుతాయి.

తెలంగాణలో సంక్రాంతి పండుగ గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. భోగి మకర సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో పల్లెలు పండుగ వాతావరణంతో మార్మోగుతాయని తమ ఊర్లో ప్రత్యేక సంతలు నిర్వహిస్తారని చెప్పాడు ఆదిలాబాద్‌కు చెందిన శ్రీనివాస్. ఆ సంతలో దొరకని వస్తువులు ఉండవని ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తే ఖర్చు వందల్లో ఉన్నా ఆ ఆనందం మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాడు.

‘‘మా ఇంట్లో సంక్రాంతి హడావుడి పది రోజుల ముందే మొదలవుతుంది. పిండి వంటలు మిఠాయిలు అన్నీ రెడీ చేయడం మొదలుపెడతారు. పండుగ రోజున ఉదయాన్నే ఇంటి ఇలవేల్పు దేవతకు పూజలు చేస్తాం. ఇంట్లో పూజలు చేయడానికి వీలు లేకపోయినా పూజలు చేయడం రాని వాళ్లయితే ఊళ్లోని గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. మా ఇంట్లో పూజలు అయిన తర్వాత పొంగలి గారెలు సకినాలు వంటివి వండుతారు. నేను ఉదయం గాలిపటాలు ఎగరేసుకోవడానికి వెళ్లిపోతా. ఉదయం వెళ్తే మధ్యాహ్నం దాకా రకరకాల ఆటలు ఆడుకుంటాం. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తాం. ఆ సమయం చాలా హ్యాపీగా ఉంటుంది. రకరకాల కబుర్లు చెప్పుకుంటూ తినేస్తాం. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి చాలా విషయాలు పంచుకుంటాం. ఇంట్లోనే అందరితో కలిసి రకరకాల బోర్డ్ గేమ్స్ ఆడుకుంటాం. సాయంత్రం అవుతుంది అనగానే మార్కెట్‌కు వెళ్తాం. మా ఊళ్లో నాటకాలు వేస్తారు చాలా బాగుంటాయి. అవి చూస్తాం. అక్కడ ఉన్నవన్నీ చూసుకుని ఇంటికి చేరతాం’’ అని నిజామాబాద్‌లో నివసించే వెంకటేశ్వర్లు చెప్పాడు. ఈ మూడు రోజుల్లో తాము చేసేవి చెప్పుకోవడానికి ఎక్కువ లేకపోయినా జ్ఞాపకాలు మాత్రం చాలానే ఉంటాయని వివరించాడు.

సాధారణంగా మకర సంక్రాంతినాడు సూర్యునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అభ్యంగన స్నానం తర్వాత ఇళ్లలో దేవుడికి పొంగలి నువ్వులు బెల్లం చెరకు నైవేద్యంగా సమర్పిస్తారు. రైతులు పొలాల వద్ద భూమాతకు పూజలు చేసి పంటకు కృతజ్ఞత తెలుపుతారు. గ్రామ దేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయి.



‘‘మా ఇంట్లో బోగి నుంచే సంబరాలు స్టార్ట్ అవుతాయి. పాత వస్తువులను తెచ్చి భోగి మంటలు వేస్తాం, ఉదయం పొలాల వద్దకు వెళ్లి ఇంటికి తోరనాల కోసం మామిడి ఆకులు, రేగిపండ్లు తీసుకొస్తాం, గుమ్మానికి తోరణాలు మనమే కడుతాం, రంగుల ముగ్గులు వేసే సయమంలో అమ్మలకు హెల్ప్ చేస్తా, గొబ్బెమ్మలు.. ఇక, పిండి వంటలు.. అందులోనూ హెల్ప్ చేస్తాం.. సకినాలు, మురుకులు, బూరెలు, వంటి సంప్రదాయ వంటకాలు అమ్మ చేస్తుంది. ఊరి నుంచి పెళ్లి అయిన అక్క వాళ్ళు వస్తారు. మేము హైదరాబాద్ నుంచి ఊరికి పండుగకు ఇంటికి వస్తాము. పతంగులు గ్రౌండ్‌లో, ఇంటి మిద్దెపై ఎగరవేస్తాం, ఊర్లో ఉండే అంజనేయ స్వామి గుడికి పోతాం. దొస్తులతో కబుర్లు చెప్పుకుంటాం. గంగిరెద్దులు, జానపద పాటలు తెలంగాణ పండుగకు ప్రత్యేక ఆకర్షణ. పలు గ్రామాల్లో ఎద్దుల పోటీలు, ఆట పాటలు జరుగుతాయి. (మా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ పెడతారు). రైతులు పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక, పండుగ రోజు చుక్క, ముక్క (పూజలు అన్ని చేసిన తర్వాతనే..) (పూజలు చేసేది ఇంట్లో అమ్మలు మా సైడ్)’’ అని నల్లగొండ జిల్లా డిండికి చెందిన నాయిని రమేష్ తన పండగ సంబరాలు పంచుకున్నాడు.

సంక్రాంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక వంటకాలు ఘుమఘుమలాడతాయి. అరిసెలు సకినాలు బూరెలు వంటి పిండి వంటకాలు దాదాపు ప్రతి ఇంట్లో తయారవుతాయి. కొత్త బియ్యంతో చేసిన పొంగలి పండుగకు ప్రత్యేక రుచిని జోడిస్తుంది. పిల్లలు పతంగులు ఎగరవేస్తూ ఆకాశాన్ని రంగులతో నింపుతారు. యువత కబడ్డీ వాలీబాల్ వంటి క్రీడలతో పండుగ సందడిని పెంచుతారు. అనేక గ్రామాల్లో జాతర వాతావరణం కనిపిస్తుంది.

నగరాల్లో నివసించే కుటుంబాలు సంక్రాంతికి స్వగ్రామాలకు చేరుకుంటూ పల్లెలను కిటకిటలాడేలా చేస్తున్నారు. సంప్రదాయం ఆధునికతతో కలుస్తూ ఈ పండుగ కొత్త తరానికి గ్రామ జీవన విలువలను పరిచయం చేస్తోంది. మొత్తంగా తెలంగాణలో సంక్రాంతి పంట పండుగ మాత్రమే కాదు. కుటుంబ బంధాలను బలపరిచే వేడుక. గ్రామీణ సంస్కృతిని నిలబెట్టే ఉత్సవం.

Read More
Next Story