పూలండోయ్ పూలూ… విజయవాడ నిండా రంగురంగుల పూలు!
x

పూలండోయ్ పూలూ… విజయవాడ నిండా రంగురంగుల పూలు!

“నీ పూజ కొసం పూలు కొసుకొద్దామని ప్రొదున్నె మా తోటలోకి వెళ్ళాను ప్రభూ…”


సీతాకాలం వచ్చిందంటే పూల పండుగ మొదలయ్యిందన్న మాట. మనసుకు తెలియకుండానే పువ్వు కనిపిస్తే ముట్టుకొని వాసన చూడాలనిపిస్తుంది.

ఇదే పువ్వుల మాయ. పువ్వులు మనిషిని, మనసుని కదిలిస్తాయి.

ఎంతటి కఠినాత్ముడైనా పూలతో కదిలిపోవాల్సిందే.

అందుకేనేమో ఈ పూల ప్రపంచానికి భావకవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘పుష్పవిలాపం’ అని పేరు పెట్టి మనల్ని ఎక్కడికో తీసుకువెళతారు.

“నీ పూజ కొసం పూలు కొసుకొద్దామని ప్రొదున్నె మా తోటలోకి వెళ్ళాను ప్రభూ…” అంటాడు. ఆయన కవితలో పువ్వే నోట మాట్లాడుతుంది. అమ్మాయిల చేతుల్లో మాలలుగా మారే పూలు తమ ఆత్మకథను చెబుతాయి.

“ఊలు దారాలతో గొంతు కురి బిగించి…
గుండెలో సూదులు గురుచ్చి కూర్చి…
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము…”
అని పువ్వు వాపోయినప్పుడు, మనిషి ఆనందానికి కూడా ఒక “దుర్వినియోగపు బాధ” ఉంటుందని కరుణశ్రీ మనకు గుర్తు చేస్తాడు.

కానీ అదే పుష్పం, దేవాలయంలో దేవుడి పాదాల కింద పడినపుడు భక్తి పరిమళమౌతుంది.
ఇదే పువ్వుల ద్వంద్వజీవితం. ఇదే కవికి కనిపించిన సత్యం.

ఇప్పుడు ఆ కవిత్వం విజయవాడ పూల మార్కెట్‌కు చేరింది.
ఇక్కడ ప్రతి ఉదయం పుష్పానికి కొత్త జన్మ.

వీచే ప్రతి గాలీ ఓ సువాసనే. ప్రతి దారిలో రంగుల మయమే.
పూల సీజన్ మొదలయ్యిందంటే ఈ మార్కెట్‌కి అసలు బ్రేక్ ఉండదు.
కోయంబత్తూరు మొదలు తిరుపతి, బెంగుళూరు వరకు- పూల ట్రక్కులు, బడుగు రైతుల బుట్టలు, మధ్యవర్తుల బండ్లు అన్నీ ఒకే జంక్షన్‌కి చేరిపోతాయి.

కొన్ని రకాల పూలు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగవుతుంటే ఇంకొన్ని దూర ప్రదేశాల నుంచి వస్తున్నాయి.
మొత్తం మీద విజయవాడ మార్కెట్ రంగుల మయం అయింది. ముద్దుగా మెరిసిపోతోంది.

అదేదో సినిమాలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ వాడిన "వాడికేదైనా పూల వాసన చూపించడర్రా…!" డైలాగ్ నవ్వు కోసం చెప్పినా, పువ్వులు నిజంగా మనసు నిగ్రహించే శక్తి కలిగి ఉన్నాయి.

ఇప్పుడు పండుగల సీజన్. మకర సంక్రాంతి వస్తే దొరకని పువ్వు ఉండదంటారు.
పువ్వులు కేవలం అలంకారం కాదు —
పువ్వులు మన సంస్కృతి.
పువ్వులు మన పూజ.
పువ్వులు మన ప్రేమ భాష.
పువ్వులు మన దుఃఖానికి సాంత్వన.
పువ్వులు మన జీవితానికి జ్ఞాపకం.

పువ్వులలో రంగులు ఉంటాయి. ఆ రంగుల్లో భావాలు ఉంటాయి. ఆ భావాల్లో మనుషుల కథలు ఉంటాయి.
కరుణశ్రీ చెప్పినట్టే..
పువ్వుల బాధని కూడా మనమే సృష్టించినా,
పువ్వుల అందాన్ని ఆస్వాదించే అధికారం కూడా మనదే.
“పూలండోయ్ పూలు… రంగురంగుల పూలు…

మన మనసు కట్టిపడేసే సీతాకాలపు వాసనల పండుగ మళ్లీ వచ్చేసింది!”
(ఫోటోలు- పి.రవి కుమార్, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్)
Read More
Next Story