ఉద్యోగానికి రాజీనామా చేసి మునగ సాగు చేస్తున్న సైంటిస్ట్!
x

ఉద్యోగానికి రాజీనామా చేసి మునగ సాగు చేస్తున్న సైంటిస్ట్!

2022లో మునగ ఆకుకు అంతర్జాతీయంగా 9.5 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్నట్లు జియాన్ మార్కెట్ రీసెర్చ్ పేర్కొంది. మార్కెట్‌లోని గిరాకీలో 80శాతం ఇండియానుంచే వెళుతోంది.


మునగ అంటే చాలామందికి గుర్తొచ్చేది మునగకాయలు మాత్రమే. కానీ మునగ ఆకులలో అనేక ఔషధగుణాలు, పోషకాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. నిజానికి మునగను ఇప్పుడు సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తున్నారు. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సాయిల్ సైంటిస్ట్‌గా పని చేసిన డాక్టర్ శరవణన్ కందసామి 2017లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మునగ సాగును చేపట్టి మునగ ఆకును విదేశాలకు ఎగుమతి చేస్తూ విదేశీమారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు.

శరవణన్ తండ్రి, తాతలది వ్యవసాయ కుటుంబం. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా సోమన్‌కొట్టై గ్రామంలో వారికి మునగతోట, కొబ్బరి తోట ఉన్నాయి. అయితే వారు ఆ మునగతోటలో కేవలం మునగకాయలు మాత్రమే పండించేవారు. అయితే మునగతోటలు ఎక్కువగా ఉండటంతో దిగుబడి సమృద్ధిగా ఉండి, మార్కెట్‌లో రేటు తక్కువగా పలికేది. కేజీ మునక్కాయలు కిలో రు.100 నుంచి రు.150 దాకా పలికేది. అయితే ఉత్పత్తి అత్యధిక స్థాయికి చేరినప్పుడు రేటు దారుణంగా రు.5 కు కూడా పడిపోతుండేది.

శరవణన్‌కు సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ కెమిస్ట్రీలో డాక్టరేట్ ఉంది. ఈ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం, ఏడేళ్ళపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీలో పని చేయటంవలన వచ్చిన జ్ఞానాన్ని పూర్వీకులనుంచి సహజంగా సంక్రమించిన వ్యవసాయ పరిజ్ఞానంతో జోడించి నేరుగా పొలాలలో వినియోగించాలని శరవణన్ నిర్ణయించుకున్నారు. మంచి హోదా, గుర్తింపు ఉన్న ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకోవటాన్ని ఆయన తండ్రి మొదట వ్యతిరేకించారు. అయితే శరవణన్ పట్టుదల, ముందు చూపు చూసి చివరికి అంగీకరించారు.

మునగ ఆకుకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉన్నట్లు శరవణన్ గుర్తించారు. 2022లో మునగ ఆకుకు అంతర్జాతీయంగా 9.5 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్నట్లు జియాన్ మార్కెట్ రీసెర్చ్ పేర్కొంది. మార్కెట్‌లోని గిరాకీలో 80శాతం ఇండియానుంచే వెళుతోంది. దీనికి కారణం మునగ సాగుకు భారతదేశంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం. మునగ ఆకులను మొక్కనుండి కోసి, ఎండబెట్టి, మర ఆడించటంద్వారా మునగ ఆకు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిలో పోషకాలు, ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని డయిటరీ సప్లిమెంట్‌గా కూడా వాడతారు.

జీరో బడ్జెట్ సహజ వ్యవసాయ పద్ధతిని పాటించాలని, నేల కోతకు గురికాకుండా చూడాలని శరవణన్ నిర్ణయించుకున్నారు. నేలను నాగలితో దున్నటం వంటి పాత పద్ధతులను ఆయన వాడరు. ట్రాక్టర్ నాగలితో దున్నటంవలన కలుపు బాగా పెరుగుతుందని చెబుతారు. తాను పాటించే సేంద్రియ సాగు పద్ధతులకు ఏ ట్రాక్టరూ అవసరం లేదని అంటారు. మేకల వ్యర్థాలను, పొలాలలో వచ్చే పెంటపోగును మాత్రమే ఎరువుగా వాడుతున్నారు. కలుపును నియంత్రించటంకోసం ఒక వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎండు ఆకులను పొలంలో మొక్కల వరుసల పక్కన పరుస్తున్నారు. దీనితో కలుపు గణనీయంగా తగ్గింది.

మామూలుగా మునగతోటలో మొక్క మొక్కకూ మధ్య 15 అడుగుల ఖాళీ వదులుతుంటే, శరవణన్ తన పొలంలో మొక్కకు-మొక్కకూ మధ్య ఆరు అడుగుల ఖాళీ వదిలారు. ఎకరానికి రెండువేల మొక్కలు వేశారు. నీటి కోసం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ మొక్కలనుంచి ఐదు ఏళ్ళపాటు దిగుబడి వస్తుందని శరవణన్ తెలిపారు. తన లక్ష్యం మునగకాయలు కాకుండా, మునగ ఆకులు కావటంతో, చెట్టుకు పూత రానీయకుండా చేస్తారు. పూత పూయనిస్తే, ఆకులలో ఉండే పోషకాలు మునగ కాయలకు వెళ్ళిపోతాయని, దీనివలన ఆకులలో శక్తి తగ్గుతుందని శరవణన్ చెబుతారు. మొక్క పూతకు రావటానికి ముందు ఆకులు కోసేస్తారు. మొక్క రెండు అడుగులు పెరగగానే గిల్లేస్తారు. అప్పుడు కొమ్మలు గుబురుగా పెరుగటంతోపాటు, ప్రతి రెండు నెలలకూ ఒకసారి ఆకులు కోతకు వస్తాయి. ఏడాది పొడుగునా ఆకులు కోయవచ్చని శరవణన్ తెలిపారు.

ప్రస్తుతం శరవణన్ మునగాకు పొడిని కిలో రు.800 చొప్పున అమెరికా, కెనడా, యూరప్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆకులను నీడలో ఎండబెట్టటంవలన ఆ ఆకులతో మునగ ఆకు పొడితో పాటు అనేక ఆహారపదార్థాలను, క్యాప్సూల్స్, సూప్‌లను, మునగాకు కారం, మునగాకు సూప్ పొడిలను కూడా తయారుచేస్తున్నారు. ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కేవలం ఆకులద్వారా ఏటా రు.1.25 లక్షలు వస్తాయని శరవణన్ చెప్పారు.

శరవణన్ కొబ్బరికాయలు, బొప్పాయి కూడా పండిస్తారు. మునగ సాగు నాలుగు ఎకరాలలో జరుగుతుండగా, కొబ్బరిని మూడు ఎకరాలలో, బొప్పాయిని రెండు ఎకరాలలో సాగుచేస్తున్నారు.

Read More
Next Story