ఆడపడచుల ఆత్మరక్షణకు శిక్షణ,అదే  మా లక్ష్యం అంటున్న కరాటే కపుల్స్
x
బాలికలకు కరాటే కోచ్ లక్ష్మీ సామ్రాజ్యం సెల్ఫ్ డిఫెన్స్ పాఠాలు

ఆడపడచుల ఆత్మరక్షణకు శిక్షణ,అదే మా లక్ష్యం అంటున్న కరాటే కపుల్స్

బాలికలు,మహిళా ఉద్యోగినులు,మహిళా కండక్టర్లు, గృహిణులు... ఆడపడచులందరికీ ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తున్నారు కరాటే కపుల్స్ లక్ష్మీసామ్రాజ్యం, డాక్టర్ రవి.


హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు గ్రౌండ్...ఉదయాన్నే తరలివచ్చిన వేలాది ఆడపడచులకు నిత్యం లక్ష్మీ సామ్రాజ్యం, డాక్టర్ రవి దంపతులు కరాటేలో శిక్షణ ఇస్తున్నారు.

- నేటి సమాజంలో ఆడపడచుల ఆత్మరక్షణ కోసం వారికి వివిధ మెళకువలను కరాటే కపుల్స్ నేర్పిస్తున్నారు.
- కరాటేలో మాస్టర్లుగా కఠోర శిక్షణ పొంది ఎన్నెన్నో బెల్టులు,అవార్డులు, రివార్డులు పొందిన ఈ దంపతులు ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా మహిళలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చి పలు రికార్డులు సాధించారు.
- మహిళలంటే అబలలు కాదు సబలలని నిరూపించేందుకు వారికి కరాటే శిక్షణ ఇస్తున్న కరాటే కపుల్స్ సెల్ఫ్ డిఫెన్స్ జర్నీ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి.
...
‘‘మాది ఒంగోలు జిల్లా పాతపాడు గ్రామం. మా తల్లిదండ్రులు నర్రా వెంకటరత్నం, శారద. నా తండ్రి అంధుడైనా వ్యవసాయం చేసేవారు. మా ఇంట్లో ముగ్గురం అమ్మాయిలు కావడంతో నేను కొడుకులా పెరిగాను. మా తాత స్వాతంత్ర సమరయోధుడు నర్రా నారాయణ. మా అమ్మా నాన్నలు, తాత ఇచ్చిన స్ఫూర్తితో నేను పోలీసు అధికారిణి కావాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాను.’’
స్కూలులో జరిగిన ఈవ్ టీజింగ్ ఘటన మలుపు తిప్పింది...
‘‘నేను పాఠశాలలో చదువుతుండగా ఓ ఆకతాయి నా స్నేహితురాలిని లైంగికంగా వేధించాడు. ఈ ఘటనను నేను స్వయంగా చూసి ఎలాగైనా ఈవ్ టీజర్లకు బుద్ధి చెప్పాలనుకున్నాను. మగపిల్లల్ని ఎదుర్కోవాలంటే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాలనుకున్నాను. అప్పట్లో ఒంగోలు పట్టణంలో డాక్టర్ రవి కరాటే క్లాసులు నిర్వహిస్తుండే వారు. నేను రవి గారి వద్దకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు వారి శిక్షణ సంస్థలో విద్యార్థినిగా చేరాను. రెండేళ్లలోనే కరాటేలో శిక్షణ తీసుకొని బ్లాక్ బెల్ట్ సాధించాను.’’

కరాటేలో గురుకుల పాఠశాల బాలికలకు శిక్షణ
‘‘నేను బ్లాక్ బెల్ట్ సాధించాక ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోచ్ గా మారాను. నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు డాక్టర్ వి రవి గారితో కలిసి నేను గురుకుల పాఠశాలలకు వెళ్లి వారికి ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చేదాన్ని. అలా కొన్నాళ్లు సాగిన మా ప్రయాణంలో మా ఇద్దరి వృత్తులు ఒకటే కావడంతో ప్రేమలో పడ్డాం. మేం శుభముహూర్తం చూసి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల బాలికలు, పోలీసు శిక్షణ కేంద్రాల్లో ట్రైనీలకు కరాటేలో మేం శిక్షణ ఇచ్చాం.’’


బాలికలకు కరాటేలో శిక్షణ

ఒంగోలు నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాం
‘‘ఒంగోలు నుంచి హైదరాబాద్ కు మకాం మార్చి ఆర్టీసీ క్రాస్ రోడ్డు కేంద్రంగా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీని నెలకొల్పాం. మా అకాడమీ ఆధ్వర్యంోల మేమిద్దరం హైదరాబాద్ నగరంలోని పోలీసు శిక్షణ కేంద్రాలు, హోంగార్డులు, ఆర్టీసీ కండక్టర్లు, ఐటీ ఉద్యోగినులు, మహిళా ఉద్యోగినులకు శిక్షణ ఇస్తున్నాం.’’

ఆత్మరక్షణపై కరాటే కపుల్స్ ప్రదర్శన

లక్షలాది మందికి శిక్షణ ఇచ్చాం...

‘‘నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 6వ డాన్ గా అంతర్జాతీయ గోల్డ్ మెడలిస్ట్ సాధించి ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోచ్ లక్షలాదిమంది మహిళలకు శిక్షణ ఇచ్చాను. పోలీసు అకాడమీలో కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, డీఎస్పీలు, హోంగార్డులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తరగతులు నిర్వహించాం. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు శిక్షణా సెషన్లు నిర్వహించాం. మహిళా కళాశాలలు, బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటేలో శిక్షణ ఇచ్చాం.ఎల్ఐసీ, బ్యాంకులు వంటి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు కూడా కరాటే శిక్షణ ఇచ్చాం.’’
సెల్ఫ్ డిఫెన్స్ అవేర్‌నెస్ ఈవెంట్‌లు
‘‘మేం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరాటేలో పోలీసులకు శిక్షణ ఇవ్వడంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ అవేర్‌నెస్ ఈవెంట్‌లు నిర్వహిస్తున్నాం. కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు శిక్షణ తరగతీులు నిర్వహిస్తున్నాం. నేను పోలీసు అధికారి కావాలనే నా కల నెరవేరకపోయినా పోలీసులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఆడపడచుల ఆత్మరక్షణ కోసం శిక్షణ ఇవ్వడంలోనే మాకు సంతృప్తి ఉంది’’ అంటారు లక్ష్మీ సామ్రాజ్యం, రవి దంపతులు.తాము భవిష్యత్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరాటే అకాడమీలు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని వివరించారు లక్ష్మీ సామ్రాజ్యం, రవి కరాటే కపుల్స్.
---
ఎన్నెన్నో అవార్డులు
అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న కరాటే మాస్టర్ నర్రా లక్ష్మీ సామ్రాజ్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2009వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ చేతుల మీదుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం అందుకున్నారు.
- 2012వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లక్ష్మీ సామ్రాజ్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం అందుకున్నారు.
- 2016లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నుంచి ప్రపంచ రికార్డు షీ టీమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఈవెంట్ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు.
- నిజామాబాద్ ఎమ్మల్సీ కె.కవిత నుంచి మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డును అందుకున్నారు.

ప్రపంచ రికార్డులు...
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమికి కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యం తెలంగాణ షీ టీమ్స్ సహాయంతో రెండు వేల మంది మహిళలకు 200 మంది కరాటే మాస్టర్లతో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. సీఐడీ కమిషనర్ స్వాతి లక్రా,రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంయుక్తంగా మోస్ట్ నంబర్ ఆఫ్ ఉమెన్ డిస్‌ప్లేడ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ పేరిట ప్రదర్నన నిర్వహించారు.
- స్వశక్తి స్వీయ రక్షణ శిక్షణతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 21,276 మంది మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను ప్రదర్శించారు.
- జనగామలో 2017 జనవరి 24వతేదీన 13,863 మంది సభ్యులతో ప్రదర్శన నిర్వహించి మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
- 2012లో లక్ష్మీ సామ్రాజ్యం నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు పొందారు.
సినీనటులు సుమన్,విజయశాంతి, బాబు మోహన్ ల నుంచి లక్ష్మీ సామ్రాజ్యం చేసిన సేవలకు ప్రశంసలు లభించాయి.


Read More
Next Story