శేషభట్టర్ ‘అనల్పం’లో తారాడే ఆ ఆత్మని గుర్తు పట్టగలరా?
శేషభట్టర్ రఘు "అనల్పం" కవితా సంపుటి ఆవిష్కరణ ఈనెల 25న రవీంద్రభారతిలో జరుగుతుంది. అందుకే ఈ ముందుమాట
-నస్రీన్ ఖాన్
కవిత్వం
బిరబిరా పారాడే నదీ ప్రవాహం
కవిత్వం
నిశ్చలంగా ఉండే తటాకం
కవిత్వం
హృదయాన్ని స్పృశించి పరుగులెత్తే పిల్ల తెమ్మెర
కవిత్వం
గుండెలను ఎర్రగా మండించే నిప్పు కణిక
....
.... ఇలా ఎన్నో రకాలుగా వర్ణించుకుంటుంటాం కదా. అయినా కవిత్వానికి ఒక స్థిరమైన నిర్వచనం లేదంటారు కవి పండితులు. ఎంత భిన్నంగా అభివర్ణించినా సరే... ఆ మాటలకు ఇమడనిదే కవిత్వమంటారు. ఏ ఒక్క నిర్వచనంలోనూ ఒదిగిపోని ఝరి అంటూ తమ ప్రేమను ప్రకటించుకుంటుంటారు. కవిత్వం అంటే కవిత్వమే తప్ప మరేదీ కాదు అంటున్నారు ప్రముఖ కవి శేషభట్టర్ రఘు. కవిత్వం అంటూ మదిలో గూడుకట్టుకుంటే వస్తువు వెతుక్కునే అవసరమే లేదని స్పష్టం చేస్తారు. కవిత్వాన్ని ప్రేమిస్తూ, కవిత్వాన్ని శ్వాసిస్తూ, కవిత్వాన్నే పలవరిస్తూ కవిత్వానికి వస్తువే అక్కరలేదని చెప్పే ఆయన ఈ నెల 25వ తేదీన 'అనల్పం' పేరుతో తన ఎనిమిదో కవిత్వ సంపుటిని ఆవిష్కరించబోవడం ఆశ్చర్యకరం. 'ఫెడరల్ తెలంగాణ' ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించింది. తన కవిత్వమంత సున్నితంగా, సుమధురంగా తన ప్రయాణాన్ని, అనుభవాలను పంచుకున్నారు.
కవిత్వానికి వస్తువు కవిత్వమే:
సామాజిక పరిస్థితులకు అనుగుణంగా భిన్న నేపథ్యాలలో భిన్న స్వరాలుగా పరిపుష్టం అవుతున్న కవితా ప్రపంచంలో తన గొంతుక వేరు అంటున్నారు రఘు. 1997లో 'ఒక స్వాప్నికుడి శ్వేత సంతకం' పేరుతో కవిగా సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన ఏనాడూ తన పంథాను వీడలేదు. కవిత్వం అంటూ మనలో ఉంటే దానంతటదే బయటకు వస్తుందని, వస్తువును వెతుక్కోనక్కరలేదని నమ్ముతారు. అంతేకాదు. వార్తాపత్రికల్లోని శీర్షికలు కవితా వస్తువులు కావని కరాఖండిగా చెబుతారు.
తన అక్షరాలపై ఉన్న నమ్మకమే సూర్యుడు పొడిచిన రాత్రి(దీర్ఘ కవిత), నిద్రపోని మానవకోయిల, నేను-కల-వెన్నెల, లిపి తడిసిన తరుణం, మోహధూపం, దిశాంతర స్వప్నంలను రాయించి ఇప్పుడు అనల్పందాకా ప్రయాణింపజేసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఇన్ని కవితా సంపుటాలలో వస్తువు ఏమై ఉంటుందా అనే సందేహం కలగక మానదు. ఇదే ప్రశ్నని ఆయన ముందుంచితే "జీవితకాల అభ్యాసం తర్వాత దక్కే పరుసవేది లాంటి శిల్పంతో వెలగటమే కవితకు సాఫల్యం కనుక ఒక్కొక్క మాటని బంగారం తూచినంత శ్రద్ధగా పొదగటం అలవాటు." అని తన పుస్తకంలో రాసుకున్న ముందుమాటలోని వాక్యాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు కవికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే విషయంలోనూ ఆయనకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి.
"లోచూపు చిక్కబడే వరకు ఓపిగ్గా ఉండటం కవికి ఉండాల్సిన మొదటి లక్షణం. నువ్వొక కవిత మొదలుపెట్టి మధ్యలో వదిలావంటే వస్తువులోకి ఇంకా దూరలేదని అర్థం. రాస్తున్నప్పుడు నేను బొమ్మలు చెక్కేవాడిని. లేదా ధ్యానంలో ఉన్న చిత్రకారుడ్ని. ఏకాగ్ర చిత్తంతో రాసుకుంటాను. అది దాచలేని ఉధృతితో ఉబికినప్పుడు వస్తువొక నెపం మాత్రమే!" అని నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కవిత్వ ప్రయోజనం..?
రఘు రాసే కవిత్వం అప్పుడే పూచిన గులాబీ అంత మృదువుగా ఉంటుంది అంటారు ప్రముఖ కవి ప్రసాద మూర్తి. అనల్పం పుస్తకానికి ఆయన ముందుమాట రాసారు. ఈ సున్నితత్వం మాటున సామాజిక ప్రయోజనం ఏదైనా ఉంటుందా అనే ప్రశ్నకు అర్ధమే లేదని తేల్చి పారేశారు రఘు. కవిత్వానికి కవిత్వమే ప్రయోజనం. దైనందిన జీవితంలో తనకు వృత్తి, కవిత్వం రెండు ఊపిరితిత్తులని చెప్పారు. కవిత్వం రాయడానికి సమయం, సందర్భం అంటూ ఏదీ చూసుకోరు. ఒకవైపు కార్యనిర్వహణలో నిమగ్నమై ఉన్న తన చిన్న మెదడు అంతర్లీనంగా కవితా పాదాలు అల్లేస్తుంటుందని చెప్తారు. ఇదే అంశాన్ని ప్రముఖ కవి వంశీ కృష్ణ "కవిత్వం రాయడం రఘుకు ఆటవిడుపులాంటిది" అని అభివర్ణించారట. ఇంతకుమించిన సామాజిక ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తారు ఆయన. అంతేకాదు తాను రాసిన కవిత్వంతో ఎనిమిది పుస్తకాలు తీసుకు వచ్చినా ఏ ఒక్క కవితా పునరావృతం కాలేదని గర్వంగా చెబుతారు. శైలి ప్రాధాన్యంగా నడిచే కవితలు ఆయన ప్రత్యేకత.
వృత్తి రీత్యా న్యాయ సలహాదారు అయినప్పటికీ తన ప్రవృత్తి కవిత్వంపై దాని ప్రభావం ఎంత మాత్రమూ లేదని చెబుతారు.
కవిగా రఘు పంచుకునే
"రాయటం ఒక అలవాటుగా ఉన్నప్పుడు
పలుచటి నీటి అలల కింద ఈదుతున్న చేపల్ని
చూసినట్టు లోకాన్ని చూడాలి"
ఇటువంటి కవితా పంక్తుల తోపాటు మరిన్ని విశేషాలను పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వినొచ్చు.
కవిత్వం అంటేనే ఆమడ దూరం పరుగెత్తిన తనకు కాలేజీ రోజుల్లో ఏదో పత్రికలో తారస పడిన కవితా వాక్యాలు తిరుగులేని కవిని చేశాయి. ఆ వాక్యాలు ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మవి. ఆ తరువాత కాలంలో ఆయనే గురువు, దైవం, ఆత్మగా మారారని ఉద్వేగంగా చెబుతారు శేషభట్టర్ రఘు.
తన "అనల్పం" కవితా సంపుటిని ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో ఆవిష్కరిస్తున్నారు. రవీంద్రభారతిలోని కాన్ఫరెన్స్ హాలులో సాయంత్రం 6గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రముఖ కవులు ఏనుగు నర్సింహారెడ్డి అధ్యక్షులుగా, సిద్ధార్థ ఆవిష్కర్తగా, అంబటి సురేంద్రరాజు, కొప్పర్తి, ప్రసాద మూర్తి తదితరులు వక్తలుగా హాజరవుతున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బోధి ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
Next Story