సాహసం పట్టుదలతోనే ట్రెక్కింగ్ : వకుళాభరణం
‘శేషాచలం కొండల్లో..’ పుస్తకావిష్కరణ
‘‘ట్రెక్కింగ్ అనుభవాలు చాలా సాహసోపేతంగా ఉంటాయి. సీనియర్ జర్నలిస్ట్ రాఘవ నలభై అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి దూకడాన్ని తలుచుకుంటేనే గుండెలు అదురుతాయి. ట్రెక్కింగ్ కు వెళ్ళాలంటే సాహసం పట్టుదల కావాలి’’ అని ప్రముఖ చరిత్ర కారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ అన్నారు.
రాఘవ రచించిన ‘శేషాచలం కొండల్లో..’ పుస్తకాన్ని గురువారం ఉదయం ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ సెమినార్ హాల్లో జరిగిన సభలో వకుళాభరణం ఆవిష్కరించారు. ఎస్వీ యూనివర్సిటీ ఓరియంటల్ రిసెర్చి ఇన్ స్టిట్యూషన్, జిల్లా పౌరచైన్య వేదిక, తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘పుస్తకం గురించి చెప్పడం కష్టం. ట్రెక్కింగ్ గురించి రాయడం కాదు, అడవుల్లో నడవడం కష్టం. అందుకే సి.నారాయణ రెడ్డి ఉదయం నా హృదయం. నడక నా ప్రాణం అంటారు. నిజానికి ట్రెక్కింగ్ లో చెప్పలేని ఆనందం ఉంటుంది. రాఘవ లాగా జలపాతాల్లో దుమికితేనే ఆ ఆనందం తెలుస్తుంది. కొత్త ప్రదేశాలు కనుగొనడం, వాటిని చూసి ఆనందించడం, ఆరాధించడం, వాటి గురించి అందరికీ తెలిసేలా రాయడం; ఇదే ఆనందం. ట్రెక్కింగ్ జాగ్రత్తలు పాటిస్తూ, యువకులతో కలిసి నడుస్తూ, వాటిని అక్షర రూపంలో పెట్టడం అందరికీ సాధ్యం కాదు. అందుకునే రాఘవను మిస్టర్ వాకర్ అంటాను. చేయి తిరిగిన జర్నలిస్టు రాఘవ రాతలో ఉండే సొగసును, మధురమైన రుచిని కూడా చూపించగలరు’’ అని వ్యాఖ్యానించారు.
ఎస్వీ యూనివర్సిటీ ఓరియంటల్ రిసెర్చి ఇన్ స్టి ట్యూషన్ విభాగాధిపతి ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు ‘శేషాచలం కొండల్లో..’ పుస్తకాన్ని సమీక్షిస్తూ, తెలుగులో వచ్చిన యాత్రా సాహిత్యంలో ఏనుగల వీరాస్వామి రాసిన నా కాశీయాత్ర తొలి గ్రంథమని, తరువాత అమెరికా, కాశ్మీర్ వంటి ప్రాంతాలకు యాత్రలు చేసిన వారు కూడా తమ అనుభవాలను రాశారని గుర్తు చేశారు. రాఘవ రాసిన ఈ పుస్తకం వాటికంటే భిన్నమైందన్నారు. ఈ పుస్తకంలో శేషాచలం కొండల్లో ఏమున్నాయో చరిత్రను, పర్యావరణ రహస్యాలను సామాజిక బాధ్యతతో నిక్షిప్తం చేశారని కొనియాడారు. ఈ పుస్తకం ఆత్మానందం కోసం రాయలేదు, ఒక సామాజిక బాధ్యతతో రాశారన్నారు. రాఘవ జావితాన్ని అర్థం చేసుకున్నారు కనుకనే ప్ర కృతిని అర్థం చేసుకున్నారని, అందుకునే ప్ర కృతి ముందు మోకరిల్లా లంటారని చెప్పారు. మతం నుంచి ట్రెక్కింగ్ ను విడదీసి వర్తమానంలో జీవించమని పిలుపునిస్తారని, సమూహంలో భాగంగా ఎలా ఉండాలో చెపుతారని తెలిపారు. అన్ని రకాల జంతువులను, వృ క్షజాతులను బతకనిస్తేనే జీవవైవిధ్యం అని, దాని వల్లనే మానవ మనుగడ సాధ్యమవుతుందని గుర్తు చేశారు.
సభలో అతిథిగా పాల్గొన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, శేషాచలం కొండల్లో అరుదైన వృక్షాలు, ఔషధ మొక్కలు ఉన్నాయని, అతి శీతల వాతావరణంలో, అతి వేడి వాతావరణంలో బతికే మొక్కలు శేషాచలం కొండల్లో ఉన్నాయని తెలిపారు. ట్రెక్కింగ్ కు వెళ్ళేటప్పుడు అనుభవజ్ఞుల నుంచి కొన్ని సూచనలు, సలహాలు తెలుసుకుని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో అడవులు నాశనం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రెక్కింగ్ ఇప్పుడు వినోదంగా మారింది కానీ, నిజానికి అది మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన పౌరచైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ మాట్లాడుతూ, రాఘవతో కలిసి తొలిసారిగా గుంజనకు వెళ్ళానని, శరీరానికి ఎలాంటి కసరత్తు లేకుండా వెళ్ళడం వల్ల రెండు రోజులు కాళ్ళు నొప్పులతో బాధపడిపోయానని అన్నారు. రాఘవ ముప్ఫై ఏళ్ళ ట్రెక్కింగ్ అనుభవం, సాహసం, శ్రమ కలగలిసే ఈశైలి వచ్చిందని పేర్కొన్నారు. గుంజన జలపాతానికి వెళ్ళిన తన అనుభవాలను కూడా వివరించారు.
చివరగా రచయిత రాఘవ మాట్లాడుతూ, తన ట్రెక్కింగ్ అనుభవాలను వివరించారు. ఏడాది పొడవునా జాలువారే గుంజన జీవ జలపాతమని పేర్కొంటూ, అది మన నయాగరా అని అభివర్ణించారు. ఆరోగ్యం, పర్యావరణంతో పాటు, ఒక సామాజిక బాధ్యతతో ట్రెక్కింగ్ చేసినట్టు చెప్పారు. పౌరచైతన్య వేదిక జిల్లా కార్యదర్శి ఏ.ఎన్. పరమేశ్వరరావు ఆహ్వానం పలుకుల్లో శేషాచలం సౌందర్యాన్ని గుర్తుచేస్తూ, ఆపుస్తక ఆవశ్యకతను వివరించారు. పౌరచైతన్య వేదిక కోశాధికారి హరీష్ వందన సమర్పణ చేశారు. సభలో సాకం నాగరాజు, బాలుబండారు, ఆచార్య దామోదర నాయుడు, డాక్టర్ ప్రసాద్, తిరుమల రెడ్డి, గంగాధర ప్రసాద్ తోపాటు అనేక మంది ట్రెక్కర్లు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
Next Story