‘పల్లెమంగలి కథలు’  రచయిత తుమ్మల రామకృష్ణ మృతి
x

‘పల్లెమంగలి కథలు’ రచయిత తుమ్మల రామకృష్ణ మృతి

గతంలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం వైఎస్ చాన్స్ లర్ గా పనిచేశారు.



ఆంధ్ర ప్రదేశ్ కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైఎస్ చాన్స్ లర్,రచయిత, ప్రముఖ సాహిత్య విమర్శకుడు, ఆచార్య తుమ్మల రామకృష్ణ(67) మరణించారు. కొద్దిరోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నరామకృష్ణ సోమవారం ఉదయం చికిత్సపొందుతూ కన్నుమూశారు.

రామకృష్ణ స్వస్థలం చిత్తూరు జిల్లా ఆవులపల్లి. ఆయన మంగళి కులానికి చెందిన రచయి. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘తెలుగులో హాస్యనవలలు’అనే అంశంపై పరిశోధన చేసి 1988లో పీహెచ్‌డీ అందుకున్నారు. తర్వాత ఏడాది కర్నూలులోని ఎస్వీయూ పీజీ సెంటరులో తెలుగు లెక్చరర్‌గా చేరారు. అక్కడ పనిచేస్తున్న కాలంలోనే మిత్రులతో కలిసి ‘తుంగభద్ర ప్రచురణలు’ పేరుతో ‘పల్లెమంగలి కథలు’ సంకలనాన్ని 1996లో ప్రచురించారు. ఇది ఆ రోజుల్లో సంచలనం. ఎంతో కాలంగా కథలు రాస్తున్నా, ఈ పుస్తకతో ఆయన చాలా మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సాహిత్యంలో వృత్తికథల ప్రయోగాలకు నాంది పలికిన వ్యక్తిగా రామకృష్ణ గుర్తింపు పొందారు. ‘ఫ్యాక్షన్‌ కథలు’, ‘హైంద్రావతి కథలు’ తదితర సంకలనాలకు సంపాదకత్వం వహించారు.

రామకృష్ణ రాసిన కథానికలు ‘మట్టిపొయ్యి’ సంపుటిగా వెలువడింది. ‘తెల్లకాకులు’ కథ విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆధునిక తెలుగుసాహిత్య వ్యాసాలు, సమీక్షలు, ప్రసంగాలు ...‘పరిచయం’, ‘బహుముఖం’, ‘అభిచందనం’, ‘అవగాహన’, ‘బారిస్టర్‌ పార్వతీశం - ఒక పరిశీలన’ తదితర పుస్తకాలుగా ప్రచురించారు.

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2004నుంచి 2020 వరకు తెలుగు ఆచార్యుడిగా, ఆ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ద్రవిడ వర్సిటీ వీసీగా 2020 నవంబరు నుంచి మూడేళ్లు సేవలందించారు. రామకృష్ణ మృతికి హెచ్‌సీయూ తెలుగు శాఖాధ్యక్షుడు పిల్లలమర్రి రాములు, సాహితీవేత్తలు సంగిశెట్టి శ్రీనివాస్‌, దార్ల వెంకటేశ్వరరావు, పులికొండ సుబ్బాచారి, ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ ఆచార్య లక్ష్మీనారాయణ, తెలుగు వర్సిటీ పూర్వ వీసీ ఎస్వీ సత్యనారాయణ సంతాపం తెలిపారు. తుమ్మల రామకృష్ణ అంత్యక్రియలు మంగళవారం లింగంపల్లిలోని శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


బిఎస్ రాములు నివాళి

ఆచార్య తుమ్మల రామకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు అధ్యాపకులు. వీరు మంగలి కులవృత్తి పై కథల సంకలనం తెచ్చి సంచలనం సృష్టించారు. అందరి దృష్టిని ఆకర్షించారు. ద్రవిడ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గా పని చేసారు. చాలా కాలం నుండి షుగర్ పేషెంటు. ఆరోగ్యం బాగుండలేదు. మంచి మనిషి. బహుజన సాహిత్యానికి చేయగలిగినంత చేయలేకపోయాను. అవకాశాలు వినియోగించుకోలేదు. అవకాశాలు విస్తరింప చేసుకోలేదు. అనారోగ్యమే వారిని వెంటాడింది. అయినా సాహిత్య చరిత్రలో, ప్రమోషన్ల వరుసలో చక్కని గుర్తింపు పొందారు. బహుజన సాహిత్య ఉద్యమమే అందుకు పునాది వేసింది. ఆ క్రమంలో పైకి వచ్చిన వారు ఎందరో వ్యక్తిగతంగా నిలదొక్కు కున్నారు. వారిలో తుమ్మల రామకృష్ణ గారొకరు. ఎదిగిన వారు ఎదగాలిసిన వారిని ఎదగడానికి కారణ భూతమైన ఉద్యమాలను , వాటి చరిత్రను పట్టించుకోవాలి. తలుచుకోవాలి. బహుజన , బీసీ ఉద్యమాలలో కూడా ఇది సజావుగా సాగడం లేదు. గతంలో కృషిచేసినవారిని, సమకాలికులను కనీసం ఉచ్చరించడం సైతం వదిలి వేస్తున్నారు. తద్వారా కొంత కాలం తరువాత ఆయా వ్యక్తులు చరిత్రలో కనుమరుగవుతున్నారు. ప్రధాన చరిత్ర వ్యాప్తి ఎంత విస్తృతంగా సాగిందో తెలియదు. ఇది చరిత్రకు రాబోయే తరాలకు జరుగుతున్న నష్టం. తుమ్మలకు నివాళి సందర్భంగా అందరు ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం అని భావిస్తున్నాను.

అరసం నివాళి

ఆచార్య తుమ్మల రామకృష్ణ చిత్తూరు జిల్లా వాసి. మంచి కథకుడు. విమర్శకుడు. తెలుగు ఆచార్యుడు. కర్నూలు పిజి సెంటర్ లోను, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోను అధ్యాపకులుగా పని చేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేశారు.బహుజన కథారచయిత. శ్రేయ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్య జి ఎన్ రెడ్డి, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ,ఆచార్య జి నాగయ్య మొదలైన అధ్యాపకులు దగ్గర చదువుకున్నారు. చేతిలో కాగితం లేకుండా నవల ,కథానికలు లోని వాక్యాలను ఒప్పజెప్పేవారు. కర్నూలులో రాప్తాడు గోపాలకృష్ణ మొదలైన మిత్రులతో కలిసి కథాభివృద్ధికి కృషి చేశారు. ఆయన అనారోగ్యంతో ఈరోజు ఉదయం పదిగంటలకు హైదరాబాద్ లో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం సంతాపం ప్రకటిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నదని.

ఆంధ్రప్రదేశ్ అరసం, అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.



Read More
Next Story