సైబేరియా టు తెలంగాణ సరస్సులకు : సంతానోత్పత్తి కోసం కొంగల వలస
x
చింతపల్లి గ్రామంలోని చెట్టుపై కూర్చున్న సైబేరియా వలస కొంగలు (ఫొటోలు కర్టసీ : కృష్ణారావు, చింతపల్లి )

సైబేరియా టు తెలంగాణ సరస్సులకు : సంతానోత్పత్తి కోసం కొంగల వలస

5వేల కిలోమీటర్ల పక్షుల వలస జర్నీ: వందేళ్ల అనుబంధం…చింతపల్లికి తిరిగి వచ్చిన సైబీరియన్ అతిథులు


ప్రపంచంలోనే అత్యంత చల్లని సైబేరియా ప్రాంతం నుంచి దాదాపు 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సైబీరియన్ కొంగలు(Siberian storks) తెలంగాణ సరస్సులకు చేరుకున్నాయి. సంతానోత్పత్తి కోసం ప్రతి సంవత్సరం వచ్చే ఈ వలస పక్షులు నాలుగేళ్ల విరామం తర్వాత ఖమ్మం జిల్లా చింతపల్లిలో మళ్లీ సందడి చేస్తున్నాయి. సైబీరియన్ కొంగల రాకతో గ్రామంలో మళ్లీ ప్రకృతి సోయగం, ఆనందం వెల్లివిరిసింది.

- తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చింతపల్లి దూబాలమ్మ, వరంగల్ జిల్లా పాఖాల, ఆదిలాబాద్ జిల్లా కవాల అభయారణ్యంలోని కడెం, జన్నారం ప్రాంతం, హైదరాబాద్ శివార్లలోని అమీన్ పూర్, అమ్రాబాద్ అడవిలోని సరస్సులకు సంతానోత్పత్తి కోసం తరలివచ్చాయని తెలంగాణకు చెందిన పక్షి శాస్త్రవేత్త డాక్టర్ ఎనుగందుల వెంకట్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

కడెం ప్రాంతంలో సైబేరియన్ కొంగ (ఫొటో కర్టసీ : డాక్టర్ ఎనుగందుల వెంకట్)

సైబేరియన్ కొంగలు ఎలా ఉంటాయంటే...
తెలుపు,నలుపు రంగుతో కూడిన పొడవైన రెక్కలు...కాషాయరంగుతో మొనతేలిన పొడవాటి ముక్కు...ఎతైన కాళ్లు...చూడచక్కని ఆకారంతో ఉండే సైబీరియన్ కొంగల తీరు ఇది.ఈ సైబేరియన్ కొంగలను పెయింటెడ్ స్టార్క్(Painted stork) అని పిలుస్తారు. మంచు గడ్డకట్టే శీతల ప్రాంతమైన సైబేరియా నుంచి సంతానోత్పత్తి కోసం తెలంగాణలోని పలు సరస్సులకు ప్రతీ జనవరి నెలలో వలస వస్తుంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల అభయారణ్యం పరిధిలోని కడెం డ్యామ్, ఉధంపూర్, ఇందన్ పల్లి, దోస్త్ నగర్, జన్నారం, వెంకట్రావుపేట, జగిత్యాల,వరంగల్ జిల్లాలోని పాఖాల, అమ్రాబాద్ అడవిలోని నల్లమల సరస్సులు, హైదరాబాద్ శివార్లలోని అమీన్ పూర్ సరస్సులకు తరలివచ్చాయి.
ఈ అపురూపమైన సైబేరియా కొంగల రాకతో తెలంగాణలోని పక్షిప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లి వాసి ముత్యాల కృష్ణారావు

మూడేళ్ల తర్వాత మా ఊరుచ్చాయి : ముత్యాల కృష్ణారావు

ఖమ్మం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి గ్రామంలో ఎతైన చింతచెట్లు...దుబాలమ్మ పెద్ద చెరువు...అందులో చేపలు...సైబేరియన్ కొంగల ఆవాసానికి నిలయాలుగా మారాయి. వందల ఏళ్ల నాటి నుంచి వస్తున్న ఈ కొంగలు గత మూడేళ్లుగా చింతపల్లి చింత చెట్లపైకి రావడం మానేశాయి. ఈ కొంగలు పెట్టే రెట్టలు, కిందకు వదిలే చేప ముక్కలతో గ్రామంలో తీవ్ర దుర్గంధం వెలువడుతుండంతో కొందరు గ్రామంలో చింత చెట్లు నరికి వేశారు. దీనికి తోడు గ్రామంలో పెరిగిన కోతులు స్వైరవిహారం చేస్తూ చెట్లపై కొంగల గూళ్లలో ఉన్న గుడ్లను కిందపడేయటం, పక్షుల గూళ్లపై దాడుల కారణంగా నాలుగేళ్ల పాటు వలస కొంగలు తమ గ్రామానికి రాకుండా ముఖం చాటేశాయని చింతపల్లి గ్రామ నాయకుడు, మాజీ సర్పంచ్ ముత్యాల కృష్ణారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

చింతపల్లి గ్రామస్థుల్లో పరివర్తన

గడచిన మూడేళ్ల పాటు సైబేరియన్ కొంగలు గ్రామానికి రాకపోవడంతో ఆయా గ్రామస్థుల్లో పరివర్తన వచ్చింది. కొంగల రెట్టల వల్ల దుర్గంధం వెలువడుతుందని చెప్పి కొంగల ఆవాస కేంద్రమైన చింత చెట్లను నరికారు. దీనివల్ల మూడేళ్లపాటు కొంగలు గ్రామానికి ముఖం చాటేశాయి. తర్వాత ఈ ఏడాది కొంగల రాకతో శుభసూచకంగా గ్రామస్థులు భావిస్తున్నారు. కొంగలు వస్తే సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి వచ్చిన వలస కొంగలను తాము కాపాడుకుంటామని, వేటగాళ్లు వాటిని చంపకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులు ముక్తకంఠంతో చెప్పారు. మరోవైపు కోతుల బెడదను నివారించి, కొంగలను కాపాడాలని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు మొర పెట్టుకున్నారు.
‘‘మా గ్రామస్థులు వలస వచ్చిన కొంగలకు సంరక్షణగా నిలవడంతో ఈ ఏడాది నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చాయని, కొంగల రాకతో మా గ్రామంలో సంతోషం వ్యక్తమవుతుంది’’అని కృష్ణారావు వ్యాఖ్యానించారు.

కొంగలను కాపాడేందుకు చర్యలు : శ్రీనివాస్, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్

చింతపల్లిలో పక్షులను,వాటి ఆవాసాలను రక్షించడానికి తాము చర్యలు చేపట్టామని కూసుమంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గ్రామంలో సైబేరియన్ పక్షులను సంరక్షించాలని కోరుతూ బోర్డులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన కొంగలను జాగ్రత్తగా చూసుకోవాలని తాము ప్రజలను కోరామని ఆయన తెలిపారు.చింతపల్లి గ్రామంలోని పక్షులను తాము పరిరక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

పైలెట్ పక్షులు వచ్చి పరిశీలించి...

గత మూడు సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం గ్రామీణ మండలంలోని చింతపల్లికి వలస పక్షుల రాకతో స్థానికులు, పక్షి ప్రియులు, ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్నిచ్చింది.‘‘100 సంవత్సరాలకు పైగా డిసెంబర్ చివరి వారంలో ముందుగా సైబేరియా నుంచి కొన్ని పైలట్ పక్షులు గ్రామానికి వేల మైళ్ల దూరం ప్రయాణించి, చింతపల్లి వాతావరణాన్ని గమనించి జనవరిలో మందలుగా గ్రామానికి తిరిగి వస్తుంటాయి.

రామిశెట్టి విజేత

‘‘ఈ కొంగలు చింతచెట్లపై గూడు కట్టుకుని ఆరు నెలల పాటు ఇక్కడే నివాసముండి జూన్ వరకు తమ పిల్లలను పెంచి, తిరిగి సైబేరియాకు వెళుతుంటాయి. ఈ వలస పక్షుల రాకను నేను నాలుగు దశాబ్దాలుగా చూస్తున్నాను’’అని ఖమ్మం గ్రామీణ సీనియర్ జర్నలిస్ట్ రామిశెట్టి విజేత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పక్షుల రాక శుభసూచకం

సైబేరియా పక్షుల రాక వల్ల గ్రామంలో తమ పంటలకు శుభసూచకం అని చింతపల్లి వాసుల నమ్మకం.‘‘పక్షులు గ్రామంతో తమ అనుబంధాన్ని వదులుకోలేదని, మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చాయని ,పక్షులను రక్షించడానికి ప్రభుత్వం గ్రామంలో కోతుల బెడదను పరిష్కరించాలి’’అని చింతపల్లి గ్రామ సర్పంచ్ ఆరెపుల మరియమ్మ అధికారులను కోరారు. తమ గ్రామస్థులు ఈ కొంగలను అతిథులుగా భావిస్తారని, పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు జనవరి నుంచి జూన్ వరకు పక్షులను చూడటానికి గ్రామాన్ని సందర్శిస్తుంటారని ఆమె పేర్కొన్నారు.

చింతపల్లి చెరువును అభివృద్ధి చేస్తాం

చింతపల్లి చెరువు ను దుబాలమ్మ చెరువుగా పిలుస్తుంటారని, దీన్ని నోటిఫైడ్ వెట్‌ల్యాండ్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాము ప్రతిపాదన సమర్పించినట్లు ఖమ్మం జిల్లా అటవీ అధికారి (డిఎఫ్‌ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. నోటిఫై చేసిన తర్వాత, ట్యాంక్ సరిహద్దులు, బఫర్ జోన్ నిర్ణయిస్తామన్నారు. ఈ చెరువులో జీవవైవిధ్య సర్వే చేపట్టడంతో పాటు, వలస పక్షుల సంరక్షణ కోసం కేంద్ర నిధులు తీసుకువస్తామని చెప్పారు. నిస్సారమైన వెట్‌ల్యాండ్‌లు, ట్యాంక్‌లో సమృద్ధిగా ఆహారం ఉండటం,సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో వలస పక్షుల వేసవి బసకు ఈ ట్యాంక్‌ను అనువైన ప్రదేశంగా చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

వందేళ్ల ఏళ్ల అనుబంధం

సైబీరియన్ కొంగలకి, చింతపల్లి గ్రామస్థులకు దాదాపు వందేళ్ల అనుబంధం ఉంది. అయిదు వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రతీయేటా వచ్చే సైబీరియన్ పక్షులను చింతపల్లి గ్రామస్థులు వాళ్ల బంధువుల్లా చూస్తుంటారు. ఈ విదేశీ కొంగలు ఐదు నుంచి ఎనిమిది కేజీల వరకు బరువు పెరుగుతాయి. ‘‘డిసెంబర్ నెలాఖరులోనే కొన్ని పైలట్ కొంగలు వచ్చి ఇక్కడి పరిస్థితులను, ఆహార లభ్యత, నివాస పరిస్థితులను గమనించి తిరిగి వెళ్లాయి.
అన్నీ అనుకూలంగా ఉంటే జనవరి నుంచి జులై వరకు వెయ్యికిపైగా కొంగలు ప్రతీయేటా చింతపల్లి గ్రామానికి వలస వస్తుంటాయి’’అని చింతపల్లి మాజీ సర్పంచ్ ముత్యాల కృష్ణారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

సరస్సుల్లో విరివిగా చేపలు

చింతపల్లి దుబాలమ్మ చెరువులోనే కాకుండా సమీపంలోని పాలేరు, వైరా జలాశయాలు, బయ్యారం చెరువు, గుండ్రాతి చెరువుల్లో పుష్కలంగా చేపలు ఉండటంతో సైబేరియన్ కొంగలు అక్కడి నుంచి చేపలను నోట కరచుకువచ్చి తమ పిల్లలకు తినిపిస్తుంటాయి. చింతపల్లి గ్రామంలోని చింత చెట్లు, తుమ్మ చెట్లపై గూళ్లను ఏర్పాటు చేసుకొని, సమీపంలోని చెరువులతోపాటు పాలేరు రిజర్వాయర్ వరకు వేటకు వెళ్లి చేపలను ఆహారంగా తీసుకుంటూ ఇక్కడే గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి. గుడ్డు నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్లకు పిల్లలతో కలిసి తల్లులు కూడా తిరిగి సైబేరియాకు వెళుతుంటాయి.

కొంగలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పక్షుల వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన భరించలేక కొందరు గ్రామస్థులు పెద్ద చింత, తుమ్మ చెట్లను నరికివేశారని, దీనికితోడు కోతుల వల్ల కూడా కొంగల రాకపై ప్రభావం పడిందని అటవీశాఖ రేంజ్ అధికారి నాగేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అందుకే కొంగలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించేలా ప్లాన్ చేశామని, చింతపల్లి, పాలేరు రిజర్వాయర్ దగ్గర పక్షుల కోసం కృత్రిమంగా బర్డ్ స్టాండ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఈ వలస కొంగలు మన సరస్సులు, చెట్ల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడితేనే ఈ అపురూప అతిథుల రాక తరతరాల పాటు కొనసాగుతుంది.
Read More
Next Story