
శ్రమ విలువను చాటిన కవితా ‘సిందూరం’
ఉన్నం, ఉష దంపతుల కావ్యగానం
మనిషి పుట్టుక నుంచి, నేటి ఆధునిక సమాజం వరకు జరిగిన మానవుడి నాగరికత పరిణామక్రమాన్ని కవిత్వీకరించి చెప్పిన కావ్యం ‘సిందూరం’. సీనియర్ జర్నలిస్టు ఉన్నం వెంకటేశ్వర్లు, ఉష దంపతులు సంయుక్తంగా ఈ ఆధునిక కావ్యాన్ని ఇలా రచించారు.
‘వర్గసమాజపు దుర్గం కూల్చి
విజయపతాకను ఎత్తండి
ధనిక పేదా తేడాలను కూల్చి
విద్యవైద్యం హక్కైపొందగ
కూడు నీడకు లోటే ఎరుగని,
సమతా దుర్గం నిర్మిద్దాం
రాజ్యభోజ్యం మనదే..మనదే
అది శ్రమహక్కేనని ప్రకటిద్దాం’
కారల్ మార్క్స్ ‘క్యాపిటల్’ స్ఫూర్తితో సాగిన ఈ రచనలో అటవిక, బానిస, ఫ్యూడల్, పెట్టుబడిదారి వ్యవస్థల్లో మానవుడి జీవన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చెపుతారు.
ఉత్పత్తి, పంపిణీ విధానాన్ని వివరించే అర్థ శాస్త్రం ‘క్యాపిటల్’. ‘క్యాపిటల్’లో అసలు ఏముంది? ‘క్యాపిటల్’లో శ్రమదోపిడీని ఎలా నిర్మూలించాలో ఉంది. యుద్ధాల నుంచి, సంక్షోభాల నుంచి, వర్గ విభేదాల నుంచి, హింస నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, అజ్ఞానం నుంచి శాశ్వతంగా ఎలా విముక్తి పొందాలో ‘క్యాపిటల్’ చూపిస్తుంది. ఆదిమ సమాజం మినహా, మిగతా సమాజాల్లో ఇప్పటివరకు సాగిన శ్రమ దోపిడీ ఎలా ఉందో వివరించి, దానిని ఎలా నిర్మూలించాలో చెపుతుంది. ఇప్పుడున్న సమాజానికి భిన్నమైన సమాజాన్ని ప్రతిపాదిస్తుంది.
మనిషి దాటుకుంటూ వచ్చిన ఒక్కొక్క సమాజాన్ని ‘సిందూరం’లో వివరిస్తారు. జంతువుల నుంచి మనుషులుగా ఎలా పరిణామం చెందారో చెప్పే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ‘తొలి చలనం’లో ఇలా గుర్తు చేస్తారు. ‘జ్వలించిన జాతి సంఘర్షణలో, వెనుకటి కాళ్ళపై కాయం నిలిపి, ముందటి కాళ్ళను చేతుల్లా కదిపి, ప్రకృతి అవసరాలు తీర్చుకోవడం నేర్పిన రెండు కాళ్ళ జంతువే మనిషి’ అంటారు.
ఆదిమ సమాజం-వర్గరహిత ఆదర్శసమాజం
‘ఆహారోత్పత్తులు సమస్తం అందరికీ సమంగా పంచడం ఆదిమ జీవనం నేర్పిన పాఠం.’ అంటూ ఆదిమ సమాజంలో సమష్ఠి జీవనం సాగిందని, అదొక ఆదర్శ సమాజమని అంటారు. ఈ ఆదిమ సమాజంలో ‘మనిషికి మనిషి తోడై, సైగలతో సంభాషిస్తూ, సమూహంగా జీవిస్తారు.’ ఆహార సాధనలో రాళ్ళు, తరువాత బరిసెలు, ఆ తరువాత విల్లంబులు ఆయుధాలుగా ఎలా పరిణామం చెందాయో చెపుతారు.
అటవిక దశలో అందరూ పనిచేయాలి. సమష్ఠి జీవనం సాగించాలి. ఈ దశలో ఆహారం నిల్వ చేయడం ఉండదు. పశువులను మచ్చిక చేసుకుని, మనుషులు గుంపులు గుంపులుగా జీవించడం మొదలవుతుంది.
బానిస సమాజం-తొలి వర్గ సమాజం
‘సంపదైన పశువుల అపహరణకు, గుంపులపై గుంపులు దాడులు, ఓడిన గుంపులు కాపరులుగా, మనిషికి మనిషి బానిసను చేసిన తొలి రూపం’ అంటూ తొలి వర్గ సమాజం; బానిస సమాజం ఎలా ఏర్పడిందో చెపుతారు. ఐరోపా దేశాల్లో ఉన్నట్టు మన దేశంలో బానిస సమాజం లేకపోయినప్పటికీ, మన దేశంలో యజమాని, శ్రామికుడు అనే వ్యవస్థ బానిస వ్యవస్థకు ఏమాత్రం తీసిపోదు.
ఈ బానిస సమాజంలోనే ’వానకు తడిసి, నిప్పుకు దడిసి, ఉత్పాతాలకు భీతిల్లాడు, ఉందొక శక్తని ప్రణమిల్లాడు.’ అంటూ మొదలైన ప్రకృతి ఆరాధన క్రమంగా మతమై, మతమౌఢ్యంగా స్థిరపడింది. ఈ దశలోనే ‘మూఢత్వపు చీకటి చీలుస్తూ, లేచిన నాటి చార్వాకం, పరిఢవిల్లిన బౌద్ధం’ అంటూనే, ‘అరుపుల్లో మాట మెరుపు మెరిసింది, మాట నోటి పలుకయ్యింది, అదే భాషగా తయారైంది.’ అంటూ భాష పుట్టుకని కూడా వివరిస్తారు.
వ్యవసాయం మొదలవడంతో, సంచార జీవనం వదిలేసి, మైదాన ప్రాంతాల్లో స్థిర నివాసం ప్రారంభమైంది. ‘ఉత్పత్తి క్రమంలో వర్గాలు పుట్టాయి, ఉత్పత్తి పంపిణీలో మోసాలు, మిగుళ్ళు పొంగిన వ్యక్తి సంపద, దాని ముద్దు పేరే సొంత ఆస్తి’.
‘అంతులేని పనిభారం మోస్తూ, ఆకలి తీరని దినాలు గడుపుతూ, బతుకే ఒక బందిఖానాగా, పైశాచిక హింసలు భరిస్తూ, బెదిరింపులను ఎదిరిస్తే, నడివీధిలో నిర్దయగా శిరచ్ఛేదాలు జరిపించారు.’ అంటూ బానిస వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో చెపుతారు.
ఫ్యూడల్ వ్యవస్థ
ఇక్కడే ఫ్యూడల్ వ్యవస్థకు పునాదులు పడ్డాయి. బానిస వ్యవస్థ పోయింది కదా అనుకుంటే, మళ్ళీ ప్యూడల్ వ్యవస్థ వచ్చి కూర్చుంది. ‘ఏనుగంత భారం దింపినంతలో, మళ్ళీ కొండంత చాకిరీ ఎక్కితొక్కింది.’ అని ఆవేదన వ్యక్తం చేస్తారు.
ఈ ఫ్యూడల్ వ్యవస్థలోనే, రుగ్వేదంలోని పురుషసూక్తం చాతుర్వర్ణ ధర్మాలను ప్రవచించింది. వాటి ఆధారంగానే మనువు రాసిన తొలి రాజ్యాంగం ‘మను ధర్మం’ పుట్టింది. ఇందులోని చాతుర్వర్ణ ధర్మాలకు రాజ్య వ్యవస్థ అధికార ఆమోద ముద్ర పడడంతో అది స్థిరపడిపోయింది. చాతుర్వర్ణ ధర్మాల స్థానంలో కుల వృత్తులు మొదలై, కుల వ్యవస్థ బలపడింది. కుల కట్టుబాట్లకు కులాచారాలు చుట్టేశారు.
వస్తు మార్పిడి స్థానంలో డబ్బు మారకం మొదలైంది. పనికి చెల్లించే ధాన్యం బదులు, డబ్బులివ్వడం మొదలు పెట్టారు. ఫ్యూడల్ వ్యవస్థ కోరల్లో విలవిల్లాడలేక బైట పడిన కొందరు పట్టణాలకు వలస వెళ్ళారు. అలా వెళ్ళలేని వారు గ్రామాల్లోనే రోజు కూలీలయ్యారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ
‘కొత్త ధనపతులు పెట్టుబడిదార్లు, పెట్టుబడి జగతినే ప్రగతిగ చూపారు, దోచి దాచిన ‘సొంత ఆస్తి’ కోటలను ధనం కట్టిన ‘లాభంగా బొంకారు’ అంటూ పెట్టుబడిదారీ వ్యవస్థకు దారి తీసిన పరిణామాలను వివరిస్తారు.
ఆధునికంగా తలెత్తిన కార్ఖానాలో ఉత్పత్తులు కొత్త కాంతులీనాయి. చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. ఆధునిక పనివిభజన మొదలైంది. సరుకుల మారకం బదులు కరెన్సీ వచ్చింది. రోడ్డు, విమాన, జలరవాణా మార్గాలు పెరిగాయి.
క్రమంగా మార్కెట్ రూపం మారింది. గ్రామ సంతలు దెబ్బతిన్నాయి. సొంత అవసరాలకు కాకుండా, పరుల అవసరాలకు వస్తూత్పత్తి, ఎగుమతులు పెరిగాయి. తోలు నాణేల స్థానంలో కరెన్సీ వచ్చింది. ఉత్పత్తి పంపిణీలో తేడాలు వచ్చాయి. శ్రమశక్తి వాటాను జీతంగా మార్చారు. మిగులువిలువను దోచుకుని, దాన్ని లాభంగా చూపారు. ఇది పెట్టుబడిదారీ సమాజని కృష్ణ రూపం.
‘అలనాడు ఆవిరిలో లేచిన శక్తులు, యంత్రభూతాలయి బుసకొట్టాక, చేతి వృత్తులు కరిగి విరిగి పడ్డాక, పల్లెలో బతుకులు చిరుగులయ్యాక, ఏ దిక్కూమొక్కూ లేని కూలిజనం, ఆ తల్లెదుట ఎంత కన్నీరు కార్చారో?’ అంటూ ఉన్నం, ఉష ఆవేదన వ్యక్తం చేస్తారు.
ఉత్పత్తి అంతా అమ్మకం, కొనుగోలు సరుకైంది. అన్నిటినీ డబ్బుతో కొలిచే పరిస్థితులు దాపురించాయి. సరుకు, డబ్బుయుగం మొదలైంది. పెట్టుబడిదారులకు రెక్కల్ని అమ్ముకునే వాళ్ళు, మేధస్సును అమ్ముకునే వాళ్ళుగా కొత్త వర్గాలు తయారయ్యాయి. కాంట్రాక్టింగ్, ఔట్ సోర్సింగ్ వంటి చౌక వేతనాల వ్యవస్థను ఏర్పరిచారు.
అమెరికా, యూరప్ లో ఫ్యూడల్ వ్యవస్థను పూర్తిగా తుదముట్టించాక పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించింది. భారత దేశంలో అందుకు భిన్నంగా ఫ్యూడల్ వ్యవస్థను నాశనం చేయకుండానే పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు వ్యవస్థలూ కలిసి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
సమాజం సంఘర్షణల రంగస్థలమైపోయింది. వర్గాల మధ్య ఘర్షణలకు రణభూమిగా తయారైపోయింది. కార్మిక వర్గాలు తలెత్తి పోరాడకుండా, కులం, మతం, మద్యం వంటి సమస్త వికారాలను ప్రయోగించారు. ఈ వ్యవస్థలో కష్టాలపై పోరాడాలంటే, ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల్లో మార్పుకోసం పోరాడాలి. అదే వర్గపోరాటం అంటారు ఉన్నం, ఉష. ఈ అర్ధభూస్వామ్య, అర్ధ బానిసత్వం పాలనాధికారాన్ని కూల్చాలంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న భావనతో ముందుకు కదలాలని పిలుపునిస్తారు.
‘అలనాడు ఆవిరిలో లేచిన శక్తులు, యంత్రభూతాలయి బుసకొట్టాక, చేతి వృత్తులు కరిగి విరిగి పడ్డాక, పల్లెలో బతుకులు చిగురులయ్యాక, ఏ దిక్కూమొక్కూలేని కూలి జనం, ఆ తల్లెదుట ఎంత కన్నీరు కార్చారో !?’ అని ఆవేదన వ్యక్తం చేస్తారు.
పెట్టుబడిదారి వికృత రూపాలు
చికాగాలో కార్మికులు అలనాడు రక్తం చిందించి ఎనిమిదిగంటల పనిదినాన్ని సాధించుకున్నారు. ఆ దినాన్నే మనం మేడేగా జరుపుకుంటున్నాం. కానీ, ఇప్పుడేమైంది? ‘పనిగంటల ముల్లుకు స్కేటింగ్ చక్రాలు తొడిగి, ఎనిమిది పన్నెండుకు పెంచి, ఇబ్బడి ముబ్బడిగా దోచేశారు, వెట్టి చాకిరీ చేయిస్తున్నారు.’ అంటారు.
స్వేచ్ఛకు సంకెళ్ళేశారు. కార్మికుల కండలు పిండి, వారి నెత్తుటి మద్దలతో లాభాలు ఆర్జించారు. ‘స్వేచ్ఛ ఒక పచ్చి అబద్దమైంది. డబ్బును డబ్బు పొదిగిందంటే, అక్కడే లాభం పుట్టిందంటే, గుడ్డిగా ఏ తీరున నమ్ముతారు?’ అని ప్రశ్నిస్తారు.
‘ఆకలి కెలికిన కడుపు మంటలు, పోరే దారిలో మోగే గంటలు’ ‘ఉచితాలతో ఊరించారు, ఇదే ఉద్దరణంటూ ఊరేగించారు.’ అంటూ కుండబద్దలు కొడతారు.
అంతర్జాతీయ పరిణామాలు
‘వర్గపోరు చరిత్రలో కరుకు తేలిన మార్క్సిజం, తప్పదన్నది సోషలిజం, కమ్యూనిస్టు శక్తులపైకత్తులు దూసినోళ్ళు, రష్యాలో జారైనా, చైనాలో చాంకైషేకైనా, ముస్సోలినీ హిట్లరైనా, కాలిపోయిన రాలిపోయిన కనిపించని తోక చుక్కలు.’ అంటూ దెప్పిపొడుస్తారు.
‘విదేశీ మార్కెట్టు లాభాల వేటతో పొడుచుకొచ్చిన సామ్రాజ్య వాదం’ అంటారు. ఆధునిక కాలంలో సామ్రాజ్యవాదం వికృత యుద్ధ రూపం గురించి ఇలా వ్యాఖ్యానిస్తారు. ‘ఇరాక్ పై అమెరికా విధ్వంసం, పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాష్టీకం, ఓ వైపు అమెరికా నగ్న కిరాతకం, ఇంకో వైపు పశ్చిమ దేశాల ఘాతుకం’
విలువ-ధర-శ్రమ తర్కం
‘శ్రమశక్తి ఖర్చుతో పుట్టిందే శ్రమ, శ్రమలో శ్రమశక్తిని సరుకు చేసి, నిరుద్యోగ మార్కెట్ లో రేటుకు కొనేసి, దాన్నుంచి శ్రమ విలువను పిండేసి, వాల్చుకున్నదే అదనపు పెట్టుబడి’ అని పెట్టుబడి ఎలా శ్రమ దోపిడీ నుంచి పుట్టిందో తేలిగ్గా వివరిస్తారు. మార్క్స్ ‘క్యాపిటల్’ ప్రభావంతో రాసినదే ‘సిందూరం’ లోని ఈ కవితా విశ్లేషణ.
నిజానికి ‘క్యాపిటల్’ అంత తేలిగ్గా అర్థం అయ్యేది కాదు. ‘క్యాపిటల్ ’ ను అర్థం చేసుకుని, సులభ శైలిలో పరిచయం రాయడానికి రంగనాయకమ్మకు పదిహేనేళ్ళు పట్టింది. తన జీవిత సహచరుడు, భాషా శాస్త్ర ఆచార్యులుగా పనిచేసిన బాపూజీ సహకారంతో అది సాధ్యమైంది. ఇంత గొట్టు విషయాన్ని ఉన్నం, ఉష దంపతులు కవిత్వీకరించబూనడం నిజంగా గొప్ప సాహసం.
అలవాటులో జరిగే పొరపాట్లు
ఎంతో గొట్టుగా ఉండే ఆర్థిక, సామాజిక విషయాలను ఉన్నం, ఉష దంపతులు ‘సిందూరం’(పెట్టుబడికి కవితల కట్టుబడి)లో చాలా సరళమైన భాషలో చక్కగా కవిత్వీకరించారు. ‘మన ఆలోచనలు, అభిప్రాయాలు ఆధునికమైనప్పుడు మనం ఉపయోగించే భాష కూడా ఆధునికం కావాలి.’ అంటారు ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య జి.ఎన్. రెడ్డి.
‘వాళ్ళమ్మ మొగుడి సొమ్ములా’(పేజి33), ‘రాజకీయ రంకులు దెప్పకుంటే’(పేజి45) వంటి కాలం చెల్లిన జాతీయాలు వాడకుంటే మరింత బాగుండేది. ‘పైశాచిక హింసలు భరిస్తూ’(పేజీ33), ‘అప్పటి వరకు కిరాతకులకు’( పేజీలు 35,74,124) వంటి వాక్యాల్లో పైశాచికులు, కిరాతకులు అనేవి కొన్ని జాతుల పేర్లు. ఆయా జాతులను దుర్మార్గానికి పర్యాయపదంగా వాడడం సరికాదు.
‘కిరాతకులు’ అనేది పక్షులను వేటాడి జీవించే ఒక గిరిజన జాతి. అలాగే ‘పైశాచికులు’ అనేది ఆఫ్రికా నుంచి భారత దేశానికి వలస వచ్చి స్థిరపడిన ఒక జాతి. ‘పైశాచికులు’ మాట్లాడే భాషను ‘పైశాచిక భాష’ అనే వారు. ‘పైశాచిక భాష’కు లిపి లేదు. కానీ, వారు గొప్ప మౌఖిక సాహిత్యాన్ని సృష్టించారు. ‘పైశాచికుల’ కథాసర్వస్వం బహత్కథ నుంచే కాళిదాసు ‘మేఘసందేశం’, బాణుడి ‘కాదంబరి’ వంటి అనేక రచనలు వచ్చాయని ‘కాదంబరి’కి రాసిన ముందుమాటలో పండిత పాత్రికేయుడు విద్వాన్ విశ్వం అంటారు.
ఇలాంటి పొరపాట్లు ఉద్దేశ్యపూర్వకంగా జరిగినవని నేను అనడం లేదు. అలవాటులో పొరపాట్లుగా దొర్లినవే. ‘సిందూరం’లో ఉపయోగించలేదు కానీ పత్రికల్లో ‘కసాయి’ పదాన్ని దుర్మార్గానికి మారుగా వాడుతున్నారు. ‘కసాయి’ కూడా వ్యవసాయం లాగానే (మాంసం) ఆహారాన్ని తయారుచేసే వృత్తి. ఏ వృత్తినీ కించపరచకుండా ఉండడమే భాషలో సామాజిక ఆధునికత.
గతంలో శ్రీశ్రీ కూడా, దుర్మార్గానికి పర్యాయపదంగా ‘కసాయిబు’ అన్న పదాన్ని ప్రయోగంచారు. దీని వల్ల అనేక విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ‘కసాయిబు’ పద ప్రయోగం వల్ల కసాయి వృత్తినే కాదు, సాయిబు పదం వల్ల ముస్లింలను కూడా కించపరచడమే అవుతుంది.
గతంలో సి.వి. ‘ప్యారిస్ కమ్యూన్’ కూడా కవితాత్మకంగా రాశారు. అది తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన రచన. ఆ దిశగా ఉన్నం వెంకటేశ్వర్లు, ఉష దంపతులు రాసిన ‘సిందూరం’ కూడా పాఠకాదరణ పొందుతుందని ఆశించవచ్చు.