సింగరెేణి  పెళ్లల కింద పారుతున్న త్యాగాల జాలు చూపే పుస్తకం
x

సింగరెేణి పెళ్లల కింద పారుతున్న త్యాగాల జాలు చూపే పుస్తకం

నిత్య నిర్బంధంలో, ప్రజలు పక్షాన నిలబడి పోరాడిన చరిత్ర ను అనుభవాలను, స్ఫూర్తి ని డాక్యెమెంటు చేసిన పుస్తకమే గురజాల రవీందర్ ‘బొగ్గు రవ్వలు’


-రమణా చారి

దినదినగండంగా 40 నుండి 50 డిగ్రీల వేడిలో భూమి లోపల 300 మీటర్ల లోతులో బొగ్గు గని కార్మికుల జీవితాల సజీవ రూప చిత్రణ బొగ్గు రవ్వలు . రచయిత గురజాల రవీందర్ ఈ పుస్తకంలో భూలోక నరకంగా భావించే సింగరేణి కార్మికుల యాతనలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.బొగ్గు గనుల్లో శ్వాస కోశ వ్యాధులతో, గని ప్రమాదాల్లో అర్థాంతరంగా కార్మికుల జీవితాలు ముగుస్తుంటాయి.మొదటగా భూగర్భ ఖనిజం, భూమి పొరల్లో సింగరాయపల్లె గ్రామంలో బయటపడింది. సింగరేణిలో బొగ్గు మాత్రమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి (థర్మల్ పవర్ స్టేషన్) రంగం లోకి అడుగు పెట్టింది.అధునాతన యంత్రాల రాకతో కార్మికుల భాగస్వామ్యం తగ్గి కార్మికుల జీవితాలలో విధ్వంసానికి తెరతీసింది.



సింగరేణిలో దొరల పెత్తనం, కాంట్రాక్టర్లు,గుండాలు, రౌడీలు,వడ్డీ వ్యాపారులు,లిక్కర్ మాఫియా పెత్తనం పెరిగిపోయింది. జాతీయ ట్రేడ్ యూనియన్ ల పెత్తనం కూడా బాగా పెరిగింది.బడుగు, బలహీన వర్గాల, దళితులు మాత్రమే కార్మికులు గా ఉంటే పై స్థాయిలో అధికారులు ఉన్నత వర్గాల వారుండేవారు. బొగ్గు కార్మికుల వాడలు త్రాగునీరు, కరెంటు వసతి లేదు.పందులు తిరుగాడే గుడిసెలే వారి ఆవాసాలు. సరిగ్గా ఇదే సమయంలో సింగరేణి బొగ్గు గనుల్లో అన్నలు నాటిన విత్తనాలు ఎర్రజెండాలు అయి ఎగిసి సింగరేణి కార్మిక సమాఖ్య ( సి.కా.స.) పురుడుపోసుకుంది.


భారత దేశంలో రైల్వే కార్మికుల సమ్మె తరువాత , అతి పెద్ద కార్మిక సమ్మె సి.కా.స. నాయకత్వంలో 56 రోజులు జరిగి విజయం సాధించింది. సింగరేణి లో కార్మికవర్గంలో చైతన్యం రగిలించి, సి.కా.స. ను నిర్మించి నడిపిన నాటి పీపుల్స్ వార్ నాయకులు నల్లా ఆదిరెడ్డి , గజ్జెల గంగారాం, కటకం సుదర్శన్ , మల్లోజుల కోటేశ్వరరావు లాంటి ఎందరో నేతలతో సహా వందకు పైగా ఉద్యమకారులు పీడిత ప్రజలకోసం పనిచేస్తూ నేలకొరిగారు. నిత్యం నిర్బంధంలో, ప్రజలు పక్షాన నిలబడి పోరాడిన చరిత్ర ను అనుభవాలను, స్ఫూర్తి ని సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి గా పనిచేసిన గురజాల రవీందర్ బొగ్గు రవ్వలు పుస్తకం లో చిత్రీకరించారు.


ఈ బొగ్గు రవ్వలు పుస్తకావిష్కరణ సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ లో ఉద్యమాభిలాషుల సమక్షంలో ఘనంగా జరిగింది. పౌరహక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ జి. హరగోపాల్ ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ పాల్గొన్నారు. ప్రధాన వక్తగా ఆంధ్ర జ్యోతి పత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్ విచ్చేశారు. అతిధులుగా పుస్తక ప్రచురణ సంస్థ పర్ స్పెక్టివ్ నుండి ఆర్.కె., తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్టు రమణాచారి, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ హాజరయ్యారు.


డాక్టర్ చమన్ సింగ్ సభకు అధ్యక్షత వహించగా, జర్నలిస్టు హెచ్. రవీందర్ పుస్తక సమీక్ష చేశారు. ఆవిష్కరణ సభకు లిఖిత (పుస్తక రచయిత రవీందర్, సరళ దంపతుల కూతురు) స్వాగతం పలికారు.మసకబారిన బొగ్గు గని కార్మికుల పోరాటాలతో, భగభగమండే నిప్పుకణికల ప్రతిరూపంగా బొగ్గు రవ్వల పుస్తకాన్ని సభలో వక్తలు అభివర్ణించారు.


సింగరేణిలోని ప్రతి బొగ్గు పెల్లకు, అమరుల రక్తం అంటుకుంది అని రచయిత వ్రాసిన వాక్యాలు హృదయాలను కదిలిస్తాయని వక్తలు కొనియాడారు. ప్రస్తుతకాలంలో ఈనేల త్యాగాలను గుర్తించేందుకు ఈ పుస్తకం ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. స్వార్ధరాహిత్యంతో ,ప్రపంచాన్ని మార్చడం కోసం తపన పడే వ్యక్తులు ఈ పుస్తకంలో తారసపడతారు అన్నారు. చట్టబద్ధ పాలన, మానవీయ విలువలు, రాజ్యాంగ రక్షణ కొరవడుతున్న కాలంలో చరిత్రను అక్షర బద్దం చేసి రికార్డు చేయాల్సిన, ఆవశ్యకత, ప్రాముఖ్యతలను గుర్తుచేశారు. పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్ లో ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల, అధికారులపై జరిగిన ప్రతిఘటనతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందని వక్తలు అన్నారు. సభలో పుస్తక రచయిత రవీందర్ సహచరి సరళ, సోదరుడు కిషన్ రావు,అనేక మంది విప్లవకారులు,నాటి నేటి ఉద్యమకారులు పాల్గొని ప్రశంసించారు



Read More
Next Story