తిరుమల కొండమీద శ్రీలంక సర్పాలు
x
Source: The Sri Lankan flying snake seen in India. Credit: Bubesh Guptha (Nature)

తిరుమల కొండమీద శ్రీలంక సర్పాలు

దీని భావమేమి తిరుమలేశా!


తిరుపతి సమీపంలోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ (Seshachalam Biosphere Reseve: SBR) ప్రాంతంలో 22 రకాల పాములు నివసిస్తున్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా విషపూరితమైనవి, మరికొన్ని హానికరం కానివి. భారతదేశంలో పాముకాటు కారణంగా ఎక్కువ మంది మరణాలకు గురవుతుంటారు. ముఖ్యంగా ‘బిగ్ ఫోర్’ గా పిలవబడే నాలుగు అత్యంత ప్రమాదకరమైన పాములు – రస్సెల్స్ వైపర్, ఇండియన్ కోబ్రా, కామన్ క్రైట్, సా-స్కేల్డ్ వైపర్ ( King Cobra, Krait, Saw scaled vipers and Russell’s Viper) శేషాచలం హిల్స్‌లో ఉన్నాయి. ఈ మధ్య కొన్ని కొత్త రకాల పాములు కూడా ఈ ఎస్ బిఆర్ లో కనబడుతున్నాయి. ఇక్కడ రెండు ప్రత్యేక అంశాలను పేర్కొనాలి.

మాక్రోపిస్తోడోన్

మాక్రోపిస్తోడోన్

2020లో శేషాచలం కొండల్లో మా బృందం (ఎమ్ గోవిందరాజ భాస్కర్ అండ్ టీం) మలబార్ పిట్ వైపర్ (Craspedocephalus malabaricus) కనుగొనింది. ఈ సర్పం పశ్చిమ కనుమల్లో మాత్రమే ఉంటుందని భావించేవారు, కానీ శేషాచలం హిల్స్‌లో కనుగొనడంతో దీని విస్తృతి పెరుగుతున్నట్లు అనుకోవలసి వస్తున్నది. ఈ పాము తేమ ఉన్న అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని హీమోటాక్సిక్ విషం ప్రాణాంతకమైతే కాదు, కానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

తర్వాత చెప్పుకోవలసిన మరొక డిస్కవరి స్లేన్డెర్ కోరల్ స్నేక్. ఇది విషపూరితమైనది.

ఎం. బూబేష్ గుప్త

ఎం. బూబేష్ గుప్త

వైల్డ్లైఫ్ కన్సల్టెంట్ (Wildlife Consutant) ఎం. బూబేష్ గుప్త (Bubesh Gupta) బృందం రెండు అరుదైన సర్పాలను కొనుగొంది. ఇందులో ఒకటి స్లేన్డెర్ కోరల్ స్నేక్ [ slender coral snake]. దీని శాస్త్రీయ నామం కాలియోఫిస్ మెలనూరస్ (Calliophis melanurus). తర్వాత ఆయన బృందం శ్రీలంక ఫ్లైయింగ్ స్నేక్ (Sri Lankan flying snake)కనుగొంది. ఈ రెండు అరుదైనవే. అయితే, శ్రీలంక ఫ్లైయింగ్ స్నేక్ (Chrysopelea taprobanica) వెనక ఒక ఆసక్తికరమయిన కథం ఉంది. ఈ ఫ్లైయింగ్ స్నేక్ శ్రీలంకలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. 2013లో ఈ పాము తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి 23 కి.మీ దూరాన ఉన్న చామల అనే ప్రాంతంలో ఒక చెట్టుమీద కనిపించింది. చెట్టు ఎక్కి గుప్త పామును పట్టుకుని నిశితంగా పరిశీలించాడు. దాదాపు మూడు అడుగుల పొడవనున్న ఈ పాము చర్మం బూడిద వర్ణం లో ఉంటుంది. ఆలివ్ గ్రీన్ కడుపు ఉంటుంది. వొల్లంతా గీతల బ్లాకులుంటాయి. తర్వాత ఇదే అడవిలో ఈపాము మరొక రెండు చోట్ల కనిపించింది. అంటే, ఇంతవరకు ఎవరికంటా పడని ఈ పాములు శేషాచలం అడవుల్లో భారీగా జీవిస్తున్నట్లే లెక్క.

మలబార్ పిట్ వైపర్

మలబార్ పిట్ వైపర్

శ్రీలంకలో ఎక్కువగా కనిపించే ఈ పాము శేషాచలం కొండల్లో ఎలా కనిపించింది. దీని మీద పరిశోధన మొదలయింది. ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడయింది. అదేమిటంటే, శ్రీలంక, దక్షిణ భారతదేశం ఒకపుడు కలిసే ఉండేవి. ఇది 17,000 వేల సంవత్సరాల కిందటి మాట. ఈ రెండు భూభాగాలు కలిసే ఉన్నపుడు ఈ పాములు అటు ఇటు సంచరించివుండవచ్చని గుప్తా ‘నేచర్’ పత్రికకు చెప్పారు. శ్రీలంక భూభాగం , దక్షిణ భారత భూభాగం విడిపోయినపుడు ఈ పాములు ఎక్కడివక్కడే మిగిలిపోయాయి. శేషాచలం అడవిలో గుప్తా కనుక్కున్న మరొక పాము బ్రౌన్ వైన్ స్నేక్ (Ahaetulla pulverulenta). ఇది శ్రీలంక సర్పమే. ఆయన ఈ అడవిలో కనిపించిన మరొక పాము నాగార్జన సాగర్ రేసర్ (Coluber bholanathi). శేషాచలం బయోడైవర్శిటీ రిజర్వు తూర్పుకనుమల్లో భాగం. ఈ అడవుల్లో పరిశోధిస్తే ఇంకా చాలా రకాల పాములు కనబడతాయని గుప్తా చెప్పారు. ఇన్ని రకాల పాములు ఈ అడవుల్లో ఎందుకున్నాయి?

కామన్ క్రైట్

కామన్ క్రైట్

పాములకు శేషాచలం అనువైన నివాస స్థలం

శేషాచలం ప్రాంతంలో పాములు నివసించేందుకు అనువైన వాతావరణం ఉంది. ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ పరిసరాలతో ఉంటుంది. పాములు కోరుకునే తడి-పొడి నేలలు, రాతి గుహలు దండిగా ఉన్నాయి. ఇవన్నీ పాములకు అనువైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. ఈ కారణంగా, ఈ ప్రాంతాలలో తిరిగే ట్రెక్కింగ్ ప్రియులు, గ్రామీణ ప్రజలు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాముకాటు సంభవించినప్పుడు తక్షణ వైద్య సహాయం పొందడం ఎంతో అవసరం.

రాక్ పైథాన్

రాక్ పైథాన్

శేషాచలంలో కనిపించే ముఖ్యమైన విషసర్పాలు

1. రస్సెల్స్ వైపర్ (Daboia Russelii)

శేషాచలం ప్రాంతంలో విస్తృతంగా కనిపించే ఈ పాము తీవ్రమైన హీమోటాక్సిక్ (రక్తాన్ని ప్రభావితం చేసే) విషం కలిగి ఉంటుంది.

దీని కాటు తీవ్ర నొప్పి, కణజాల నాశనం, అంతర్గత రక్తస్రావం కలిగించి ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తుంది.

2. కామన్ క్రైట్ (Bungarus Caeruleus)

రాత్రిపూట చురుకుగా ఉండే ఈ పాము (కట్లపాము) ఇది. ఇది కరిచినపుడు నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే న్యూరోటాక్సిక్ విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పాము కాటుకు భయంకరమైన పరిణామాలు ఉంటాయి.

3. ఇండియన్ కోబ్రా (Naja Naja)

శేషాచలం ప్రాంతంలో విస్తరించిన మరో ప్రమాదకర పాము భారతీయ కోబ్రా. నాగుపాము.

ఇది తీవ్రమైన న్యూరోటాక్సిక్ విషంతో నాడీ వ్యవస్థ వైఫల్యాన్ని కలిగించగలదు.

అత్యంత విస్ఫోటనశీలంగా దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.

4. సా-స్కేల్డ్ వైపర్ (Echis Carinatus)

చిన్న పరిమాణం కలిగినప్పటికీ, ఇది అత్యంత వేగంగా దాడి చేసే పాములలో ఒకటి.

దీని కాటు హీమోటాక్సిక్ విషాన్ని విడుదల చేసి రక్తస్రావాన్ని ప్రేరేపిస్తుంది.

శేషాచలం అడవులలో విషపూరిత పాములే కాకుండా విషరహిత పాములైన రాక్ పైథాన్, ర్యాట్ స్నేక్, పసిరికా పాము, రెడ్ సాండ్ బోవ ,మాక్రోపిస్తోడోన్ మొదలైన వాటికి కూడా ఈ శేషాచల అడవులు నివాసం.

రస్సెల్స్ వైపర్

రస్సెల్స్ వైపర్

జాగ్రత్తలు & పాముకాటుకు ప్రథమ చికిత్స

1. పాముకాటు సంభవించిన వెంటనే కదలకుండా ఉండి, వైద్య సహాయం పొందాలి.

2. పామును చంపడానికి ప్రయత్నించకూడదు – ఇది పర్యావరణానికి హానికరం.

3. పాము కాటు చేసిన ప్రదేశాన్ని బిగుగా కట్టకూడదు – ఇది విషాన్ని త్వరగా వ్యాపించేలా చేస్తుంది.

4. స్థానిక ఆసుపత్రికి వెళ్లి యాంటీవెనమ్ చికిత్స పొందాలి.

శేషాచలం విష సర్పాల గురించి బాలాపల్లి రేంజర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “కింగ్ కోబ్రా, మోనాకుల్డ్ కోబ్రా, స్పెక్టక్ల్డ్ కోబ్రా, రస్సెల్స్ వైపర్ వంటి విషపూరిత పాములు ‘1972 వనం & అడవి ప్రాణుల సంరక్షణ చట్టం (Wildlife Protection Act, 1972)’ ప్రకారం షెడ్యూల్-II కింద రక్షిత జంతువుల జాబితాలోకి వచ్చాయి. అందువల్ల వాటిని చంపడం లేదా అక్రమంగా పట్టుకోవడం నేరం. దానికి కఠిన శిక్షలు విధించబడతాయి. ఈ చట్టం ప్రకారం, గరిష్ఠంగా 3 నుంచి 7 సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది, ,” అనిచెప్పారు.

సా-స్కేల్డ్ వైపర్

సా-స్కేల్డ్ వైపర్

అలాగే విషరహిత పాములలో ఒకటైన భారతీయ రాక్ పైథాన్ (Indian Rock Python) 1972 వనం & అడవి ప్రాణుల సంరక్షణ చట్టం (Wildlife Protection Act, 1972) ప్రకారం షెడ్యూల్-I కింద రక్షణ పొందిన జాతి అని దేశంలో ఆసియా ఏనుగుకు ఉన్నంత స్థాయిలోనే పైథాన్‌కు కూడా రక్షణ కల్పించబడిందని ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు

సంక్షిప్తంగా...

పాములు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పాములు ఎలుకలను , చీమలను , ఇతర చిన్న పురుగులను తినడం ద్వారా వాటి సంఖ్యను నియంత్రిస్తాయి.

ఇది వ్యవసాయ రైతులకు మేలు చేస్తుంది, ఎందుకంటే ఎలుకలు పంటలకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి.

పాములు గొబ్బిలాలు, పిట్టలు, చిన్న జంతువులను తింటూ వాటి జనాభాను నియంత్రిస్తాయి.

మరోవైపు, పాములు ఈగల్స్, ముంగిసలు, అడవి పిల్లులు వంటి జంతువులకు ఆహారంగా మారుతాయి. ఈ సమతుల్యత వల్ల ప్రకృతి సజీవంగా ఉంటుంది. శేషాచలం హిల్స్‌లో విషపూరిత పాముల సంఖ్య పెరుగుతోంది, ఇది పర్యావరణ మార్పులను & పాముల పరిరక్షణ అవసరాన్ని సూచిస్తోంది. పాములపై అవగాహన పెంచడం, జాగ్రత్తలు పాటించడం మన ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తుంది.

Read More
Next Story