
సౌర శక్తి తో సాగు సమస్యలకు విముక్తి!
సాగుకు సౌర శోభ వచ్చేస్తుంది.. రైతుకు నీటి కష్టాలు తీరినట్లేనా..!
జీడిమామిడితోటల మధ్య నుండి పొలాల్లోకి బయలు దేరాం. కొంత దూరం వెళ్లాక పొలాలకు దిగువన గెడ్డ ( చిన్న కాలువ ) ప్రవహిస్తోంది. దూరం నుండి ఒక రైతు జంట ఒక బండిని తోసుకుంటూ వచ్చి, ఆ కాలువ దగ్గర ఆపి బండి మీద మడిచి ఉన్న సోలారు ప్యానల్స్ విడదీసి ఎండలో పెట్టి, పైపులను కాలువలోకి విసిరి, స్విచ్ ఆన్ చేశారు. నీళ్లు పైకి పంప్ అయి సమీపంలోని పొలాల్లోకి పార సాగాయి.
‘దీనిని సోలార్ బండి అంటామండీ... ఎక్కడికైనా, ఎప్పుడైనా సులువుగా తీసుకెళ్ల వచ్చు. కాల్వల్లో, కుంటల్లో నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు .’ అన్నాడు రైతు సవర భాస్కరరావు.

సీతంపేటలో సోలార్ బండితో రైతు జంట
పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట ఐటిడిఏ ప్రాంతంలో సాగు నీరు లేక రబీ కాలంలో సుమారు 74శాతం పొలాలను ఖాళీగా వదిలేస్తున్నారు.
కుంటలు, ఊట నీటి ప్రవాహాలున్నప్పటికీ అవి దిగువన, పొలాలు ఎగువన ఉండటం వల్ల సేద్యానికి నీరు అందని పరిస్ధితి ఏర్పడి పంటపొలాలన్నీ బీడుగా మారిపోతున్నాయి. ఇదంతా గమనించాడు యువ ఇన్నోవేటర్ గౌతమ్.

Gowtham
గిరిజన ప్రాంతాల్లో అన్నదాతలకు పెట్టుబడి తగ్గించే అరుదైన ఆవిష్కరణలను తయారు చేయడం మొదలు పెట్టాడు. చివరికి మొబైల్ సోలార్ పవర్ కార్ట్‌ని రూపొందించి రైతుల మనసు గెలిచాడు.
‘ మామూలుగా బోరుబావులు, కాలువల్లోని నీళ్లను ఎత్తిపోయాలంటే కరెంట్ మోటారో డీజిల్ ఇంజనో ఉండాల్సిందే! అవి కూడా అక్కడున్న పొలం వరకే పరిమితం . మరో పొలం దగ్గర పెట్టాలంటే మరింత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా చిన్న రైతులు భరించలేరు. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా మొబైల్ సోలార్ బండిని రూప కల్పన చేశాను. ఈ సోలార్‌బండిని చెరువులు, కుంటలు ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్లి నీటిని పొలానికి మళ్లించవచ్చు. సౌరశక్తితో పనిచేసే 0.5, 2, 3 హర్స్ పవర్స్‌తో నడిచే మోటార్లు కూడా తయారు చేశాను. వీటికి వాడే ప్యానళ్లు గాజుతో కాకుండా సిలికాన్ తో తయారుచేశాం. అందువల్ల ఎక్కువ మన్నిక వస్తాయి. వీటితో పాటు రైతులకు ఉపయోగపడే చాలా పరికరాలు తయారు చేశాం.సోలార్ ప్లేట్లను ట్రాలీకి అమర్చి నీరున్న చోటుకు తీసుకెళ్లి పైపుల సహయంతో పొలాలకు నీటిని పంపించవచ్చు ’ అన్నాడు గౌతమ్, ఆయన ‘ వాసన్ స్వచ్ఛంధ సంస్ధలో టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్నారు.

కాలువలో నీటిని సోలార్ కార్ట్ ద్వారా పంపింగ్ చేస్తున్న రైతులు
కాలుష్య నివారణి
‘ ఈ సోలార్ బండి వల్ల డీజిల్ ఖర్చు తగ్గించడమేకాక కాలుష్యాన్ని నివారించ వచ్చు. ఎలాంటి శబ్ద కాలుష్యం కూడా కాదు. సోలార్ పవర్ వల్ల పంటలకు ఎక్కువ నీటి అవసరం ఉన్నపుడే, ఎక్కువ ఎనర్జీ కూడా లభిస్తుంది. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, కూరగాయల సాగుకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది ’ అన్నారు తోటలకు నీరు పెడుతున్న విజయలక్ష్మి.
ఎవరీ గౌతమ్
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గెంబలి గౌతమ్, కంప్యూటర్స్ డిగ్రీతో పాటు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన గౌతమ్ సోలార్ టెక్నాలజీ ,కంప్యూటర్ పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించాడు.

గౌతమ్ రూపొందించిన ఈబైక్‌ని చూసి అభినందించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్.
హైస్కూల్‌లో చదువుతున్నప్పటి నుంటే సాంకేతికాంశాలు తెలుసుకొని, భిన్నమైన పరికరాలు తయారు చేసేవాడు. గౌతమ్‌కి రూ.80 వేల జీతంతో ముంబయిలో ఉద్యోగం వచ్చింది. కానీ, తన మన్యంలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలనే తపనతో ఇన్నోవేషన్స్ పై ఆసక్తితో ఉద్యోగం వదిలేసి అగ్రి టెక్ ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు. ఇతడి ప్రతిభను గుర్తించిన గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్న ‘ వాసన్ సంస్థ ’ రైతుల శ్రమ , సమయం తగ్గించే నూతన ఆవిష్కరణలు చేయమని ప్రోత్సహించింది. వాసన్ ఆర్ధిక తోడ్పాటుతో అగ్రి ఇన్నోవేటర్‌గా ప్రయాణం ప్రారంభించాడు గౌతమ్.తనతో పాటు కొందరు యువకులకు పార్వతీపురంలోని తమ యూనిట్‌లో శిక్షణ ఇస్తూ ఉపకారం వేతనంగా 15 వేల రూపాయలు ఇస్తున్నారు.

గౌతమ్ రూపొందించిన వివిధ రకాల ఈ బైక్ లు.
జీవామృతం తయారీ యూనిట్
జపాన్ సాంకేతికతతో చీడపీడల నివారణ మందుల పిచికారీ చేసే బ్యాటరీ పరికరం తయారు చేశాడు.ప్రకృతి వ్యవసాయం కోసం ఆవు పేడ, మూత్రం, శనగపిండి, బెల్లం మొదలైన వాటిని నిత్యం కలియబెట్టేందుకు ఇద్దరు మనుషులు అవసరం ఉంటుంది. ఆ శ్రమను తగ్గించే సోలార్ పవర్‌తో పనిచేసే కంట్రోలింగ్ యూనిట్ ఆవిష్కరించాడు. అవసరం ఉన్నపుడల్లా పంపు తిప్పితే జీవామృతం వస్తుంది. బక్కెట్లతో రైతులు పట్టుకొని పొలాల్లో వేసుకోవచ్చు. ఉత్తరాంధ్రలోని, అరకు , రాయలసీమలోని కదిరి లో జీవన ఎరువుల కేంద్రాల్లో ఈ సోలార్ యూనిట్‌ని ఉపయోగిస్తున్నారు.
మిల్లెట్ మినీ మిక్సీ
కొర్రలు, సామలు తదితర చిరుధాన్యాలు బియ్యంగా మారాక ఎక్కువ కాలం నిలువ ఉండవు! అవసరం మేరకే మర పట్టించుకోవడానికి వీలుగా మిల్లెట్స్ ని బియ్యంగా మార్చే మిల్లెట్ మిక్సీ తయారు చేశాడు గౌతమ్.
గంటకు 8 నుండి 10 కిలోల వరకు మరపట్టవచ్చు.రెండు గంటలకు 1యూనిట్ విద్యుత్ ఖర్చుఅవుతుంది. ఈ మిక్సీతో మహిళలు ఉపాధి కూడా పొందుతున్నారు.

పాడేరులో మిల్లెట్ మిక్సీతో సామలు మరపడుతున్న రైతు.
‘ అవసరం మేరకు మిల్లెట్స్ ని మరపట్టడం వల్ల ఎక్కువ కాలం కొర్రలు, సజ్జలు, రాగులు నిలువ ఉంటున్నాయి. ఇంట్లోనే మిక్సీ ఉండటం వల్ల మిల్లెట్స్ తో వివిధ రకాల వంటలు తినాలనే ఆసక్తి పెరిగి ఆరోగ్యం కాపాడు కుంటున్నాం.’ అన్నారు పాడేరులో మిక్సీ ఎలా పనిచేస్తుందో మాకు చూపించిన యువ రైతు సాంబ.
చిరుధాన్యాలు సక్రమంగా ప్రాసెసింగ్ చేసేలా రూపొందించిన సరికొత్త ఈ మిక్సీలు పాడేరు , అరకు ప్రాంతాల ప్రజల ఆధరణ పొందాయి.
ఈవీ వాహనాల్లో విప్లవం
ఎలెక్ట్రిక్ బైక్‌ల( Electric bikes ) రూపకల్పనలో గెంబలి గౌతమ్ అద్భుతాలు చేస్తున్నాడు. 10 సంవత్సరాలకు పైగా అనేక ప్రయోగాలు చేసి ఈ-బైక్ డిజైన్, అభివృద్ధిలో అనుభవం సాధించి పర్యావరణ హిత రవాణా పద్ధతులకు కొత్త దారి చూపారు.

సౌర శక్తి తో సాగు సమస్యలకు విముక్తి!
1, స్టీరింగ్ లేకుండా నడిచే దేశ తొలి కారు రూపొందించారు. మరి కొన్ని పరీక్షల తరువాత ఇది రోడ్ మీదకు వస్తుంది.
2, సోలార్‌తో నడిచే ఈ-బైక్ 3, డ్యూయల్ యాక్సిలరేషన్ బైక్
4, మహిళలు, పిల్లలు, వృద్ధులు, విద్యార్థులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఈ-బైకులు.
ఈ-బైకుల ప్రత్యేకతలు:
మన్నికైన ఎం.ఎస్. బాడీ, స్థానిక వనరులతో స్వదేశీ ఉత్పత్తి. డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, ట్యూబ్‌లెస్ టైర్లు. 3 గంటల్లో పూర్తిగా చార్జింగ్. ఒక్కసారి చార్జింగ్‌తో 70 నుండి 80 కి.మీ. ప్రయాణ సామర్థ్యం.
లైసెన్స్ అవసరం లేదు, పర్యావరణ హితం, పొల్యూషన్ లేదు. శబ్దరహితంగా నడుస్తుంది. వాటర్‌ప్రూఫ్ డిజైన్ .
గౌతమ్ ఇటీవల ప్రారంభించిన నేచర్ ఫార్మ్ ఈజీ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్( Nature Farmeasy Tech Solutions Pvt. Ltd. ) ద్వారా పర్యావరణ హిత వ్యవసాయ పరికరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సోలార్ పంపులు, ఎలెక్ట్రిక్ వ్యవసాయ పరికరాలు వంటి ఆవిష్కరణల తో రైతులకు అండగా ఈ సంస్ధ పనిచేస్తుంది.
గౌతమ్ ఆవిష్కరణలు అన్నీ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ హిత, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీకి వెలుగు బాటలు వేస్తున్నాయి ( ఈ టెక్నాలజీ పై ఎలాంటి సందేహాలున్నా గౌతమ్ ఫోన్ నెం.96763 33221 )