కృష్ణమ్మ ఒడిలో పురాతన సోమేశ్వరాలయం
x
సోమేశ్వరాలయం లో విశాలమైన రాతి మండపం

కృష్ణమ్మ ఒడిలో పురాతన సోమేశ్వరాలయం

ఇక్కడ శివలింగం వేప కొయ్యితో చేసింది. శతాబ్దాల తరబడి ఏడాదిలో సగం రోజులు నది నీటిలో ఉంటున్నాఅది చెక్కుచెదరకపోవడం ఒక విశేషం.


చుట్టూ పరుచుకున్న పచ్చని కొండలు. నీలాకాశంలో రెక్కలల్లారుస్తూ సాగుతున్న తెల్లని కొంగలు. అక్కడక్కడా మబ్బు తునకలు. మధ్యలో మెల్లగా కదలాడుతున్న కృష్ణమ్మలో అలల సవ్వడులు. నదీమతల్లి మిలమిలా మెరిసిపోతోంది. తన అందాలకు తానే మురిసిపోతోంది. పురాతనమైన సోమేశ్వరాలయం చూడ్డానికి శనివారం సోమశిలకు వెళ్ళాం. అక్కడి ఆప్రకృతి సౌందర్యానికి తన్మయులైపోయాం. కృష్ణా నదిలో పడవ ప్రయాణంతో ఆ సోయగాలను ఆస్వాదించాం.

కృష్ణమ్మ ఒడ్డునే సోమశిల గ్రామం. అక్కడే పురాతనమైన సోమేశ్వరాలయం. ప్రధాన మైన సోమనాథ జ్యోతిర్లింగం సహా మొత్తం పన్నెండు ద్వాదశి లింగాలకు ప్రత్యేక ఆలయాలను ఒకే చోట నిర్మించిన ఆలయాల సముదాయం ఇది. ఆదివారం శివరాత్రి కావడంతో శనివారం నుంచే భక్తుల రాక మొదలైంది. నది ఒడ్డున జనం పరవళ్ళు తొక్కుతున్నారు. అక్కడి వాతావరణం జన జాతరలా తయారైంది.

సోమేశ్వరాలయం ముందు భాగం

సోమేశ్వరాలయం కృష్ణా నది ఒడ్డున ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇప్పుడిది నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి వచ్చేసింది. కొల్లాపూర్ నుంచి సోమశిలకు తొమ్మిది కిలోమీటర్లు. మహబూబ్ నగర్ నుంచి 105 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి అయితే 186 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.

పురాతనమైన సోమేశ్వరాలయం

ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా భిన్నమైంది. పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం మొత్తం రాతి కట్టడమే! చాలా అందంగా చెక్కిన రాతి స్తంభాలతో ఒక విశాలమైన మండపం, రాతి తోనే నిర్మించిన పై కప్పు ఆ నాటి నిర్మాణ కౌశలానికి సాక్ష్యంగా నిలిచాయి.

సోమేశ్వరాల యం దక్షిణాభిముఖంగాను, లలితా దేవీ ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంటాయి. ప్రధాన సోమేశ్వరాలయానికి ఆనుకుని వరుసగా మరో పదకొండు ద్వాదశి జ్యోతిర్లింగాల ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో పేరుతో శివలింగాలున్నాయి. ఈ ఆలయం చాలా పురాతనైమంది. ఏడవ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో దీన్ని నిర్మించారు.

సోమేశ్వరాలయం గర్భగుడి

శ్రీశైలం డ్యాం నిర్మాణం 1960లో మొదలై, 1980లో పూర్తయింది. ఈ సందర్భంగా అనేక గ్రామాలతో పాటు ఈ ఆలయం కూడా ముంపునకు గురైంది. ఆ సమయంలో ఈ ఆలయం కృష్ణమ్మ ఒడిలో మునుగుతూ, తేలుతూ రెండేళ్ళ పాటు అలా నీటి అలలతో ఒలలాడింది. ఈ నది ఒడ్డునే ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ 1979లో పునర్నిర్మించింది.

ఈ ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఒక్కొక్క రాయికి నెంబర్లు వేసుకుని తొలగించారు. ఆ నెంబర్ల ప్రకారం ఆ రాళ్ళతోనే అదే విధంగా పునర్నిర్మించారు. ముంపునకు గురవడానికి ముందున్న ఆలయానికి, పునర్నిర్మించిన ఆలయానికి ఏ మాత్రం తేడా లేదు. అవే రాళ్ళు, అవే శివలింగాలు. కొయ్యతో చేసిన ఎత్తైన ధ్వజస్తంభం. ఆలయ సముదాయం చుట్టూ ప్రాకారం. ఆలయానికి దక్షిణాన పురాతనమైన రెండు శిలాశాసనాలున్నాయి.

సోమేశ్వరాలయం వద్ద ఉన్న పురాతన శిలా శాసనాలు.

శనివారం మధ్యాహ్నం మేం సోమశిలకు చేరే సరికి, అప్పటికే అనేక మంది యాత్రికులు వచ్చారు. పన్నెండేళ్ళ క్రితం సోమశిలకు వెళ్ళినప్పుడు ఆలయం వద్ద ఈ హడావిడి ఏమీ లేదు. చాలా తక్కువ మంది మాత్రమే వచ్చి చూసిపోయే వారు. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆలయం సమీపంలో రకరకాల హోటళ్ళు, ఖరీదైన కాటేజీలు వెలిశాయి. పక్కనే కృష్ణా నదిలో బోటు షికారు ప్రజలను ఆకట్టుకుంటోంది.

శివరాత్రి సందర్భంగా ఆలయం ఆవరణలో అనేక వస్తు సామాగ్రి అమ్మకానికి పెట్టారు. శివరాత్రి కనుక ఆదివారం ఉదయం నుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారు. రద్దీ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కూడా ఏర్పడుతోంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చేశారు. మహా శివరాత్రితో పాటు కార్తీక పౌర్ణమికి, కృష్ణా పుష్కరాలకు కూడా పెద్ద ఎత్తున యాత్రికులు వస్తుంటారు.

అమ్మవారి గర్భ గుడి

రోజురోజుకూ ప్రజల సమస్యలు పెరగడంతో, ఆలయాలకు వచ్చే ప్రజలు కూడా పెరుగిపోతున్నారు. తమ సమస్యలను విన్నవించుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసం ఆలయాలకు వస్తున్నారు. నిజానికి ప్రజలు తమకు తాము చేసుకునే ఒక ఓదార్పులాంటిది. కాంక్రిట్ వనాల్లో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యే ప్రజలను ఆలయాల పరిసర ప్రాంతాల్లోని ప్ర కృతి ఆకర్షిస్తోంది. ‘‘ఆలయాలను ఉపాధి కేంద్రాలుగా అభి వృద్ధి చేస్తాం’’ అని గతంలో ఒక ముఖ్యమంత్రి సెలవిచ్చారు. ఉత్సవాల సమయంలో ఆలయాల వద్ద కొబ్బరి కాయలు, హారతి కర్పూరం వంటి పూజాసమాగ్రి అమ్మడం కూడా ఒక ఉపాధిగా వారు భావిస్తుట్టున్నారు. సోమేశ్వరాలయం సహా దాదాపు అన్ని ఆలయాల వద్ద యాచకులు కనిపిస్తారు. యాచించడం కూడా ఒక ఉపాధిగా ఏలిన వారు భావించినట్టున్నారన్న సందేహం వీరిని చూసినప్పుడు కలుగుతుంది.

నదిలో పడవ ప్రయాణం

పెడలింగ్ బోట్

కృష్ణానదిలో పడవ ప్రయాణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ! పదేళ్ళ క్రితం ఈ సదుపాయం అంతగా లేదు. తెలిసిన వాళ్ళు అడిగితే, నదిలో ఉన్న సంగమేశ్వరాలయానిక తెప్పలపై తీసుకెళ్ళే వారు. మరపడవలపై నదిలో విహారం ఊపందుకుంది. మనిషికి వంద రూపాయలు. తెప్పలపై తెడ్లు వేసుకుని వెళ్ళి వస్తే మనిషికి రెండు వందల రూపాయలు. కృష్ణా నదిలో ఇద్దరు పెడలింగ్ చేస్తూ, మరో ఇద్దరిని కూర్చోబెట్టుకుని పావు గంట తిరిగి వస్తే, ఒక్కొక్కరికి వంద రూపాయలు. నీటిపై స్కూటర్ లా నడిపే ఫన్నీయాక్ బోట్ వెనుక కూర్చుని వెళితే అయిదు వందల రూపాయలు. వంద మంది పట్టే పెద్ద బోట్ లో సోమశిల నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే రెండు వేల రూపాయలు. ఇది ఆరుగంటల ప్రయాణం.

కృష్ణా నదిలో కొండల మాటకు వెళ్ళిపోతున్న సూర్యుడు

శనివారం సాయంత్రం కృష్ణా నదిలో విహరిస్తున్నసమయాన సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం ఎంత ఆహ్లాదంగా ఉందో ! అలలపై తేలాడుతూ సాగుతున్న పడవలు. గూళ్ళకు చేరడానికి ఆకాశంలో బారులు తీరిన తెల్లని కొంగలు. నదికి ఆవల కొండలమాటకు సూర్యుడు వెళ్ళిపోతున్న సూర్యుడు. రాష్ట్ర విభజన జరిగాక సోమేశ్వరాలయం తెలంగాణా రాష్ట్రం పరిధిలోకి వచ్చేసింది. నది మధ్యలో ఉన్న కొండ నుంచి ఆంధ్ర ప్రదేశ్ పరిధిలోకి వచ్చేసింది.

తెలంగాణా వైపు ఉన్న పడవలన్నీ పర్యాటక శాఖ ఆధీనంలో నడుస్తున్నాయి. ఆంధ్రప్రాంతం నుంచి వచ్చే పడవలన్నీ ప్రైవేటు కాంట్రాక్టరు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం మళ్ళీ పడవలో నది మధ్యలోకి వెళ్ళాం. నది మధ్యలో ఉన్న కొండ వైపు వెళ్ళి, అక్కడి నుంచి ఆటోలో కొండ ఆవలికి చేరాం. ఆ కొండ ఒడ్డున మరో శివాలయం. అక్కడ మళ్ళీ మరపడవలున్నాయి. ఆ మరపడవలో నదిమధ్యలో మునిగిపోయి ఉన్న సంగమేశ్వరాలయం వద్దకు వెళ్ళాలనుకున్నాం.

కృష్ణా నదిలో మునిగి పోయిన సంగమేశ్వరాలయం గోపురం పై నున్న జెండా

మునిగిపోయిన సంగమేశ్వరాలయం గోపురం పైనున్న జెండా దూరం నుంచి కనిపిస్తోంది. మా పడవ ఆ జెండా సమీపానికి వెళ్ళింది. నీటిపై తేలాడుతున్న జెండా కింద సంగమేశ్వరాలయం నదిలో సమాధి అయి ఉంది. జెండా కేంద్రంగా ఆ ఆలయం చుట్టూ మా పడవ రెండు చుట్లు చుట్టి వచ్చింది. వర్షాకాలంలో నది నీటి మట్టం పెరిగి సంగమేశ్వరాలయం క్రమంగా మునిగిపోతుంది. మళ్ళీ ఏప్రిల్ నుంచి నీటి మట్టం తగ్గుతుండడంతో సంగమేశ్వరాలయం బైటపడుతుంది.

సోమేశ్వరాలయం లాగానే సంగమేశ్వరాలయం కూడా చాలా పురాతనమైంది. ఇక్కడ శివలింగం వేప కొయ్యితో చేసింది. ఈకొయ్యశివలింగం శతాబ్దాల తరబడి ఏడాదిలో సగం రోజులు నది నీటిలో ఉంటున్నా, చెక్కుచెదరకపోవడం ఒక విశేషం. దీన్ని ధర్మరాజు స్థాపించాడని ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ఈ ఆలయం కూడా రాతితో నిర్మించింది. ఆలయ స్తంభాలు ఎంతో అందంగా చెక్కారు.

అదే పడవలో నదిమధ్యలోని కొండ దగ్గరకు వచ్చాం. ఆటోలో కొండ ఆవలికి చేరాం. మళ్ళీ పడవెక్కి సోమేశ్వరాలయం వైపు సాగుతున్నాం. ఎండ చుర్రుమంటోంది. దూరంగా నది ఒడ్డున స్నాన ఘట్టాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నదీసన్నానాలు చేస్తున్నారు. కొందరు పడవలపై నదిలో విహరిస్తున్నారు. నది మధ్యలో పడవ ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంది. అలలపై తేలాడుతూ సాగుతున్న మా పడవ మళ్ళీ సోమశిలకు చేరాం. సోమేశ్వరాలయ పరిసర ప్రాంతాలు చాలా కోలాహలంగా ఉన్నాయి.

కృష్ణా నది స్నాన ఘట్టం లో మునుగుతున్న యాత్రికులు

మధ్యాహ్నం సోమశిలలోనే భోజనాలు ముగించుకుని తిరుగుప్రయాణమవుతున్నాం. సోమశిల యాత్రికులతో కిటకిటలాడుతోంది. ట్రాఫిక్ స్తంభిస్తోంది. సోమశిలకు వచ్చే ప్రజలు పెరుగుతున్నారు. శివరాత్రికి ఆదివారం అనేక మంది సోమశిలలోనే నిద్ర చేస్తారు. అందుకునే ఇంత రద్దీ. సోమవారం మధ్యాహ్నం వరకు సోమశిల రద్దీగానే ఉంటుంది. మంగళవారం నుంచి సోమశిల బోసిపోతుంది. అయినా కొందరు ప్ర కృతి ప్రియులు సోమశిలను సందర్శిస్తూనే ఉంటారు. కృష్ణానదిలో పడవ ప్రయాణం కోసం ఇక్కడి కాటేజీలలో బస చేస్తూనే ఉంటారు. సోమశిల ఇప్పొడొక యాత్రా స్తలమే కాదు, ఒక విహార కేంద్రంగా కూడా ప్రజల్ని ఆకర్షిస్తోంది.

Read More
Next Story