తిరుపతి: శ్రీనివాస మంగాపురంలో రథయాత్ర
x

తిరుపతి: శ్రీనివాస మంగాపురంలో రథయాత్ర

ఫిబ్ర‌వ‌రి 16న చక్రస్నానం


శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయం 7.45 గం.లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి రథోత్సవ మహోత్సవం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం నాలుగు మాడ వీధులలో మహా వైభవంగా రథయాత్ర సాగింది. రథోత్సవం సందర్భంగా భక్తుల సందడి, విశ్వాసం, ఆనందోత్సాహాలు ప్రత్యేకంగా కనిపించాయి.

“గోవిందా… గోవిందా…” అంటూ నినాదాలు చేస్తూ రథాన్ని లాగిన భక్తులు, తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు. దేవదేవుడి దివ్య దర్శనం కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ర‌థోత్స‌వంలో ఎస్ఇ శ్రీ మ‌నోహ‌రం, ఆలయ ప్రత్యేక అధికారి మ‌రియు సిపిఆర్వో డా. టి.రవి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వీజీవో శ్రీ సురేంద్ర, ఏఈవో శ్రీ గోపినాథ్‌, కంకణభట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్ర‌వ‌రి 16న చక్రస్నానం :
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన సోమవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9.00 గం.ల నుండి 09.55 గం.ల మధ్య వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉద‌యం 9.55 గం.లకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.


Read More
Next Story