Motion Capture Facility in Hyderabad
x

‘అవతార్‌’కు వాడిన టెక్నాలజీ ఇక హైదరాబాద్‌లోనే? మోక్యాప్ చాప్టర్ షురూ!

దేశంలోనే అత్యంత అధునాతన మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌ను రాజమౌళి ప్రారంభించారు. అసలు ఈ ల్యాబ్ ఎందుకు? దీని స్పెషాలిటీ ఏంటి?


సినిమా.. ఈ రంగుల ప్రపంచం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతిక్షణం కొత్త టెక్నాలజీతో మరో రంగు పులుముకుంటోంది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు మరో పెద్ద ముందడుగు పడింది. దేశంలోనే తొలి అత్యాధునిక మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీ హైదరాబాద్‌లో షురూ అయింది. దీంతో భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. దీనిని దర్శకధీరుడు రాజమౌళి ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో దేశంలోనే అత్యంత అధునాతన 'మోషన్ క్యాప్చర్' (MoCap) ల్యాబ్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం 'వారణాసి' (మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు) లోని కీలక సన్నివేశాలను ఇప్పటికే ఈ టెక్నాలజీతో చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోషన్ క్యాప్చర్ ల్యాబ్

అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాత శోభు యార్లగడ్డకు చెందిన మిహిర విజువల్ ల్యాబ్స్ సంయుక్తంగా ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాయి. హాలీవుడ్ దిగ్గజ సంస్థ 'యానిమాట్రిక్ ఫిలిం డిజైన్' టెక్నాలజీ సహకారంతో ఇది రూపుదిద్దుకుంది. రాజమౌళి మాట్లాడుతూ, గతంలో 'బాహుబలి', 'ఈగ' వంటి సినిమాలు చేసేటప్పుడు భారత్‌లో ఇలాంటి సదుపాయం లేక విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ లోటు తీరిందని ఆనందం వ్యక్తం చేశారు.

అసలు మోషన్ క్యాప్చర్ అంటే ఏమిటి?

మోషన్ క్యాప్చర్ లేదా 'మో-క్యాప్' అనేది వ్యక్తులు లేదా వస్తువుల కదలికలను రికార్డ్ చేసే ఒక ప్రత్యేక టెక్నాలజీ. నటులు ప్రత్యేకమైన సూట్లు ధరించి నటించినప్పుడు, వారి శరీర కదలికలు, ముఖ హావభావాలను కెమెరాలు రికార్డ్ చేస్తాయి. ఈ డేటాను కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సాయంతో త్రీడీ (3D) మోడళ్లకు అన్వయిస్తారు. ఫలితంగా వర్చువల్ ప్రపంచంలో పాత్రలు అత్యంత సహజంగా కనిపిస్తాయి. కేవలం సినిమాలకే కాకుండా వీడియో గేమ్స్, వైద్య రంగం (గాయాల విశ్లేషణ), క్రీడలు, మిలిటరీ శిక్షణలో కూడా దీనిని విస్తృతంగా వాడుతున్నారు. ఈ మోక్యాప్ ద్వారా రికార్డ్ చేసిన డేటాను గ్రాఫిక్స్ పాత్రలపై అమర్చినప్పుడు ఫోటోరియలిస్టిక్ యానిమేషన్ సాధ్యమవుతుంది.

అత్యాధునిక మోక్యాప్ ల్యాబ్‌లో హై రిజల్యూషన్, హై స్పీడ్ కెమెరాలు, ప్రత్యేక ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్, ఫేషియల్, ఫింగర్ క్యాప్చర్ సిస్టమ్స్, పెద్ద స్టూడియో స్పేస్, రియల్ టైమ్ ప్రాసెసింగ్ వర్క్‌స్టేషన్స్ ఉంటాయి. ఈ సదుపాయం ప్రీవిజువలైజేషన్ సాధనంగా కూడా పనిచేస్తుంది. దర్శకులు కెమెరా యాంగిల్స్, లెన్స్ ఎంపికలు, కదలికలు ముందుగానే వర్చువల్ వాతావరణంలో పరీక్షించవచ్చు. ప్రధాన చిత్రీకరణకు ముందే సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చు. దీంతో సమయం, ఖర్చు తగ్గుతాయి.

ల్యాబ్ ఏర్పాటుకు ఖర్చు ఎంత?

ఒక ప్రొఫెషనల్ స్థాయి మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం భారీ ఖర్చుతో కూడుకున్న పని. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కోసమే సుమారు 75 వేల డాలర్ల నుండి 5 లక్షల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. మల్టీ-యాక్టర్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ స్టూడియోల కోసం 1 మిలియన్ డాలర్ల (సుమారు ₹8.3 కోట్లు) కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇందులో హై-స్పీడ్ ఆప్టికల్ కెమెరాలు, సెన్సార్లు, సర్వర్లు, డేటా ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఖర్చు: 75,000 డాలర్ల నుంచి 5 లక్షల డాలర్లకు పైగా

హై ఎండ్ స్టూడియోలు: 1 మిలియన్ డాలర్లకు మించి

కెమెరా వ్యవస్థలు: 50,000 నుంచి 3 లక్షల డాలర్లకు పైగా

స్టూడియో నిర్మాణం: 50,000 నుంచి 2 లక్షల డాలర్లు

వర్క్‌స్టేషన్స్, నెట్‌వర్కింగ్: 25,000 నుంచి 60,000 డాలర్లు

నిర్వహణ ఖర్చు: మొదటి ఏడాదికి 10,000 నుంచి 30,000 డాలర్లు

చిన్న స్థాయి ఇనర్షియల్ సిస్టమ్స్ ఖర్చు సుమారు 2,000 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.

మోషన్ క్యాప్చర్ ఎన్ని రకాలు

మోషన్ క్యాప్చర్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి..

ఆప్టికల్ సిస్టమ్: ఇది మార్కర్ల ఆధారంగా పనిచేస్తుంది. హాలీవుడ్ చిత్రాలైన 'అవతార్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి భారీ బడ్జెట్ సినిమాలకు దీనిని వాడుతారు. దీని ధర 25 వేల నుండి 5 లక్షల డాలర్ల వరకు ఉంటుంది.

ఇనర్షియల్ సిస్టమ్: ఇది బాడీ సెన్సార్ల ద్వారా పనిచేస్తుంది. తక్కువ బడ్జెట్ సినిమాలు, ఇండీ ప్రాజెక్టులకు ఇది అనువైనది. దీని ఖర్చు 2 వేల డాలర్ల నుండి మొదలవుతుంది. వీటితో పాటు.. వీడియో లేదా మార్కర్‌లెస్ అనే పద్దతిని కూడా వాడతారు. ఇందులో మార్కర్ల అవసరం లేకుండా సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంకా హైబ్రిడ్ సిస్టమ్ అనేదానిని వినియోగిస్తారు. ఇది ఆప్టికల్, ఇనర్షియల్ కలయిక. వర్చువల్ ప్రొడక్షన్‌కు అనుకూలంగా ఉంటుంది.

ఎలా ఉపయోగిస్తారు?

దీనిని వినియోగించడానికి ముందు నటుడు మోక్యాప్ సూట్ ధరించాలి. వారి కదలికలను కెమెరాలు రికార్డ్ చేస్తాయి. ఈ డేటాను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుంటారు. అక్కడ రికార్డ్ చేసిన కదలికలను 3డీ పాత్రకు రీటార్గెటింగ్ చేస్తారు. అవసరమైతే ఫేషియల్ యానిమేషన్‌ను యాడ్ చేస్తారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ‘స్టార్ వార్స్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘అవతార్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో విస్తృతంగా వినియోగమైంది. యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ అనే సంస్థ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’, ‘స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్’ వంటి చిత్రాలకు సేవలందించింది.

దేశంలోనే మొదటిది

భారత్‌లో ఇప్పటివరకు అక్కడక్కడా మోషన్ క్యాప్చర్ సదుపాయాలు ఉన్నప్పటికీ, అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏ&ఎం ల్యాబ్ దేశంలోనే అత్యంత అధునాతనమైనదిగా, హాలీవుడ్ ప్రమాణాలకు సరితూగేదిగా గుర్తింపు పొందింది. దీనివల్ల షూటింగ్ ప్రారంభానికి ముందే దర్శకులు తమ ఊహలను వర్చువల్ స్క్రీన్‌పై చూసుకోవచ్చు (Pre-visualization). కెమెరా లెన్స్‌లు, ఫ్రేమ్ రేట్లు ముందే నిర్ణయించుకోవడం వల్ల లైవ్ షూటింగ్‌లో సమయం, డబ్బు భారీగా ఆదా అవుతాయి. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ఈ ల్యాబ్ ప్రారంభం కావడం భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో మరో ముందడుగు అని నాగార్జున, శోభు యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story