ఆర్చ్ లు, ఆర్ట్ ల్లో దాగున్న సెయింట్ లూయిస్ సౌందర్యం
x

ఆర్చ్ లు, ఆర్ట్ ల్లో దాగున్న సెయింట్ లూయిస్ సౌందర్యం

సెయింట్స్ లూయీస్ నగరం సందర్శింస్తే కాలంలో వెనక్కి వెళ్లిన వచ్చిన అనుభూతి కలుగుతుంది...



అమెరికా లోని మిస్సోరి రాష్ట్రంలో సెయింట్ లూయీస్ నగరం ఉన్నది . దీనిని 1764 లో ఫ్రెంచి వారు స్థాపించారు. తొమ్మిదో ప్రెంచ్ రాజు పేరు మీదుగా నగరానికి ఈపేరు వచ్చింది. ఈ నగరానికి ముచ్చటగా మూడు పేర్లు ఉన్నాయి. తూర్పు వైపు నుంచి మిస్సోరి నది గుండా పశ్చిమ ప్రాంతానికి వలస వెళ్ళే ప్రజల వలన" గేట్ వే టు ద వెస్ట్ " అనే పేరు వచ్చింది . ఇది అమెరికా తూర్పు పడమటి మధ్యలో ఉంది కాబట్టి " గేట్ వే ఆఫ్ ద సిటీ " అనే పేరు కూడా ఉన్నది. " మౌండ్ సిటీ " అని కూడా పిలుస్తారు. మౌండ్ అంటే కృత్రిమ కొండ అని అర్థం. ఈ నగర పరిసరాలలో ఇవి ఎక్కువగా ఉండేవట. నగరాభివృద్ధిలో భాగంగా అవి ఇప్పుడు లేవు. ప్రస్తుతం మెట్రోపాలిటన్ నగరం. 1904 లో మొదటి ఒలంపిక్ క్రీడలు, వరల్డ్ ఫెయిర్ ఇక్కడే నిర్వహించారు. ఆర్థిక వ్యాపార క్రీడా కళారంగాలలో ఈ నగరం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముద్దుగా ఈ నగరాన్ని సెయింట్ ల్యూ, ది ల్యు అని పిలుచు కుంటారు. ఈ నగరం అమెరికా పడమటి వాకిలి.





గేట్ వే ఆర్చ్ నేషనల్ పార్కు అమెరికాలో ఉన్న నేషనల్ పార్కుల అన్నింటిలో తక్కువ స్థలంలో ఏర్పాటయింది. దీని విస్తీర్ణం తొంభైమూడు ఎకరాలు మాత్రమే. పక్కనే మిస్సోరినది, మిసిసిపి నదుల సంగమం ఉన్నది.




దానిలో పడవ ప్రయాణం చేసే ఏర్పాటు ఉన్నది. ఇక్కడ ఉన్న ఆర్చ్ అర్ధ చంద్రాకారం లో ఉన్న స్టెయిన్లెస్ స్టీలు నిర్మాణం. దీని రూపశిల్పి ఈరో సారినన్ (Eero Saarinen). 1963 ఫిబ్రవరి 12 తేదీన మొదలైన నిర్మాణం 1965 అక్టోబర్ కు పూర్తయింది. జూన్ 10 - 1967 లో దీనిని ప్రారంభించారు. దీనిని అమెరికా ప్రజలకు అంకితం చేశారు. దీని ఎత్తు ఆరు వందల ముప్పై అడుగులు. ప్రపంచం లోనే ఎత్తైన ఆర్చ్. పడమటి దిక్కు సాగిన అమెరిక దేశ విస్తరణకు స్మారకంగా దీనిని నిర్మించారు. పాశ్చాత్య దేశాలలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తయిన మానవ నిర్మిత చిహ్నం లేదు. ఇది సెయింట్ లూయిస్ నగరానికి అంతర్జాతీయ చిహ్నమయింది.

దీనిలో ఒకసారికి 160 మంది ఎక్కవచ్చు. ఒక ట్రాం లో ఐదుగురు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. పైకి వెళ్ళడానికి నాలుగు నిమిషాలు దిగడానికి మూడు నిమిషాల సమయం పడుతుంది. పైన ఎనిమిది నిమిషాలు ఆగుతుంది.పై నుంచి చూసినప్పుడు ఫెడరల్ కోర్టు భవనం తోపాటు సెయింట్ లూయిస్ నగరం కనిపిస్తుంది.




మరోవైపు నది కనిపిస్తుంది. ప్రయత్నించి మరింత ముందుకు వంగి చూస్తే మనం ఉన్న ఆర్చీ సగభాగం కనిపిస్తుంది. పైన ఆగిన సమయంలో ఫోటోలు తీసుకోవచ్చు.


ఆర్చ్ మీది నుంచి సెయింట్ లూయిస్ నగరం ఇలా కనిపిస్తుంది


అమెరికా సివిల్ వార్ కు సంబంధించిన చాలా ఫోటోలు అక్కడ ఉన్నాయి. ట్రాం ప్రయాణం పదిహేను నిమిషాలే అయినా ఒక గంట ముందునుంచే సందర్శకులు అక్కడ ఉండాలి. సిబ్బంది దానికి సంబంధించిన విశేషాలు మనకు వివరిస్తారు. ఇరుకుగా కనిపించే అర్థ చంద్రాకారంలో ఉన్న అంత ఎత్తైన ట్రాం లో ప్రయాణించడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ట్రామ్ లోకి వెళ్లడానికి ముందు చిన్న మ్యూజియం ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు దానిని చూడవచ్చు. మాకు సమయం ఎక్కువగా లేనందువల్ల మేము మ్యూజియం చూడ లేదు.

నేషనల్ పార్కుకు కొద్ది దూరంలో పురాతనమైన చర్చి ఉన్నది. దాని పేరు బాసిలికా ఆఫ్ సెయింట్ లూయిస్, కింగ్ ఆఫ్ ఫ్రాన్స్. ఆయన పేరుతోనే ఆ నగరానికి సెయింట్ లూయిస్ అనే పేరు వచ్చింది. ఇది రోమన్ కాథలిక్ చర్చి. 1834 లో దీనిని ప్రారంభించారు. జోసెఫ్ లావెల్లి మరియు జార్జి మార్టిన్ అనే వారు దీని రూపశిల్పులు. 134 అడుగుల పొడుగు, 84 అడుగుల వెడల్పు, 95 అడుగుల ఎత్తుతో గ్రీకు శిల్పనిర్మాణ పద్ధతిలో ఉంటుంది.




సెయింట్ లూయిస్ నగరంలో మరో ఆకర్షణ ఆర్ట్ మ్యూజియం. మూడు అంతస్తుల భవనంలో ఉన్న ఆర్ట్ మ్యూజియం లో ప్రపంచం నలు మూలల నుంచి సేకరించిన ఎన్నో శిల్పాలు, ఆయిల్ పెయింటింగ్స్, ఆయా ప్రాంతాల సంస్కృతిని తెలియపరిచే ఎన్నో వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.




మేము బస చేసిన హోటల్ ను ఆమెరికా ప్రభుత్వం చారిత్రాత్మక ప్రదేశాలలో ఒకటిగా గుర్తించింది. అది తొంభై మూడు యేళ్ల నాటి భవనం అప్పట్లో స్పోర్ట్ అకాడమీ అధీనంలో ఉండేది. దేశవిదేశాల నుంచి వచ్చిన వివిధ ఆటగాళ్లకు అక్కడ వసతి ఏర్పాటు చేసేవారు.




అక్కడ ఒక హాలులో అప్పటి ఆటగాళ్లకు చెందిన ఎన్నో వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. మాకు తెలియకుండానే మేము ఒక ప్రశస్తమైన హోటలు గదిలో బస చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.

Read More
Next Story