ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా..
x
పీవీ నరసింహరావు ఇంటిలోని వేపచెట్టు

ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా..

నా పొట్ట చాలా పెద్దది. నేను ఎక్కడికి నడవలేను. అందుకే ఉన్నచోటు నుంచే ప్రపంచాన్ని.. కాదు మా ఊరిని చూస్తూ ఉంటా. ఊరంతా నా దగ్గరికే వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు ఊరిలో ఉన్న వాళ్లలో ఒక్కరూ కూడా నేను పుట్టినప్పుడు లేరంటే నా వయస్సు ఎంతో మీరు ఊహించండి.


నేను నిలుచున్న చోట నుంచి చూస్తే నాకు ఊరి బయట కిలోమీటర్ దూరం వరకూ కనిపిస్తుంది. నేను ఎవరితోను మాట్లాడను కానీ, అర్థం చేసుకోగలను. ఓ మహనుభావుడు పుట్టి, తన గుర్తుగా నాకు ప్రాణం పోశాడట. నాకు కూడా సరిగా గుర్తు లేదు. ఎందుకంటే నేనూ చిన్నదాన్నే కదా. అది 1920 వ దశకం అని లీలగా గుర్తు, ఆయన పేరు పాములపర్తి వెంకట నరసింహరావు. అందరూ ముద్దుగా పెద్దొర, పీవీ, రావుసాబ్ అని పిలిచేవారు.

ఊరు మొత్తానికి వీరి కుటుంబమే పెద్ద దిక్కు. వందల ఎకరాల భూమి, దొరలని పెద్ద పేరు ఉన్న ఎలాంటి ఆడంబరం లేకుండా జీవించేవారు. నన్ను నేను చూసుకునే అవకాశం ఉంటే వాళ్లలా నేను ఉండేదాన్ని కావచ్చు. ప్చ్... కానీ నాకు ఆ అదృష్టం లేదు.. చెప్పాను కదా.. నేను ఎక్కడికి కదలలేను.. అలాగే నోరు తెరిచి అడగలేను కూడా.

నా మిత్రుడు పీవీ అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకసారి ఆడుకుంటూనే పశువుల కొట్టాన్ని అగ్నికి ఆహూతి చేశాడు. అబ్బో శడుగు పిలగాడు అన్నరు. అప్పడప్పుడూ యాదికొస్తే నవ్వాగదు. అయితే ఎదిగే కొద్ది మా దొర క్రమశిక్షణలో ఒదిగిపోయాడు. జీవితమంటేనే పోటీ. నిరంతరం మనల్ని మనం మలుచుకోకపోతే ఉన్నచోటే ఉండిపోతాం. ఈ విషయంలో పీవీ ఓ అడుగు ముందే ఉన్నాడు. కొన్ని అమూల్య, అనూహ్య పోరాటాల అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించాడు. పదవుల కోసం పోరాటాలు, ఆరాటాలు, కుట్రలు లాంటివి ఏం లేకుండానే ఉన్నత పదవులు వరించాయి. ఉన్నంతలో సర్దుకునే మనస్తత్వం కావడంతో అవి అలంకారంగా మారాయి.

నేను ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికలు చూశాను. మధ్యమధ్యలో ఊరులో వేరే పార్టీల వాళ్లు కూడా గెలవడం గమనించాను. అంతే ఎవరి భావజాలం గొప్పగా అనిపిస్తే వాళ్లే విజేతలవుతారు. కొన్నిసార్లు ఎన్నికల్లో మా ఊళ్లో రంగు నీళ్లు, రంగు కాగితాలు ఇవ్వడంతో గ్రామస్తులు నాదగ్గరే రెండుగా విడిపోయారు. అయితే అదృష్టవశాత్తూ గొడవలు జరగలేదు. ఈ ఎన్నికలు చూశాక పాత ఎన్నికలే బాగున్నట్లు అనిపించింది. మొదట్లో వంగరలో ఎక్కడా చూసిన ఒకే జెండాలు కనిపించేవి. సంవత్సరానికి రెండుసార్లు ఓ మూడురంగుల జెండా పైకెత్తేవారు.

ఓ రెండు మూడు సంవత్సరాల కనుకుంటా, ఇంకొన్ని జెండాలు కనిపించాయి. వరుసగా వారం రోజులు కనిపించి.. మళ్లీ మాయం అయ్యేవి. అదేంటో మొదట్లో నాకు తెలిసేది కాదు.. తరువాత అవి ఎలచ్చన్లు అని .. ఊరంతా నా దగ్గరికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు విన్నాను. దొరని ఈసారి మనం నిలబెట్టుడు ఏందో వాళ్లకు సరిగా అర్థమయిత లేదు. అంతా చిత్రంగా చూస్తున్నారు. దొరని మనం నిలబెట్టుడు ఏందీ.. పుట్టినప్పుడే ఆయన మన దొర కదా అని అమాయక గ్రామీణులు అనుకునేవారు. కానీ అప్పడు మా దొర ఓడిపోయాడు. అయితే తరువాత జరిగిన అన్ని ఓట్ల పండగలో గెలిచి తన పేరు నిలబెట్టుకున్నాడు. గెలిచాక ఇంకా చెప్పేదేముందీ.. ఎప్పుడు రానీ వాళ్లు కూడా వచ్చారు.

సంవత్సరానికి ఓసారైన పీవీ సాబ్ ఇక్కడి వచ్చేవారు. పెద్ద దొర వచ్చిండు అంటేనే నాకు సంబరంగా అనిపించేది. నన్ను అప్యాయంగా చూసేవాడు. తనకు ఉన్న జీబులో పెద్దగట్లు, పొట్టి గుట్ట దగ్గరికి సరదాగా వెళ్లి రావడం ఆయనకి ఉన్న అలవాట్లలో ముఖ్యమైంది. కొన్నిరోజులకు మేము ఉంటున్న ఇంట్లో పెద్ద పండగ జరిగింది. అప్పటి వరకూ నాకు తెలియని కొంతమంది ఆయన చుట్టూ ఉండడం, జాగ్రత్తగా మసలుకోవడం గమనించాను. మధ్యలో ఒకరోజు ఊరందరిని పిలిచి, వాళ్ల చేతులకి ఏవో కాగితాలు ఇస్తే.. వంగి వంగి దండాలు పెడుతున్నారు.

అంతకుముందు ప్రతి ఐదు సంవత్సరాలకు ఇలా ఏదో జరిగేది. కానీ ఈసారి ఎన్నికలు అయిపోయాక ఇది జరిగింది. తరువాత చూస్తే వాళ్ల భూమిలో సగాన్ని మా ఊరి వాళ్లకి, ముఖ్యంగా వాళ్ల కుటుంబానికి సేవలు చేస్తున్న వాళ్లకి పంచి ఇచ్చారు. ఎంత గొప్ప మనసు.. నాలానే ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి సేవ చేశారని నాకు ఇంకాస్త గౌరవం పెరిగింది. ఇంతమంచి పని చేసిన తరువాత తిరిగి వంగరకి వచ్చిన మా స్నేహితుడి కళ్లలో ఏదో బాధ కనిపించింది. అదేంటో నాకు తెలియదు. ఎవరైనా చెబుతారేమోనని చాలా రోజులు చూశా, కానీ తెలియలేదు. కానీ ఊరు మాత్రం కొద్దిగా మారుతోంది. మట్టి స్థానంలో ఇటుకలతో ఇళ్లు కడుతున్నారు. దూరంగా ఉన్న దళితకాలనీలో మొత్తం అవే కడుతున్నారు. కిలోమీటర్ దూరంలో ఉన్న మాలపల్లెలో కూడా ఇలాగే అయింది.

నా ఒంటి దుప్పటి ఓ ఏడు సార్లు మార్చుకున్నాక మా ఇంటి దగ్గర ఇంకో అద్భుతం జరిగింది. అప్పటి వరకూ నేను చూడని హాడావుడి. అప్పటికి కూడా ఓట్ల పండగలో మార్పు వచ్చింది. మొదట నేను అదే అనుకున్నా. కానీ వచ్చింది మాదొరే. కానీ రూపంలో చాలా మార్పు, ముఖంలో రాజసం. అప్పుడు తెలిసింది.. మా దొర దేశంలోనే గొప్ప వాడయ్యాడని. అప్పుడు నాకో విషయం గుర్తుకు వచ్చింది.

పీవీసాబ్ పుట్టినప్పుడు ఓ ఫకీర్ వచ్చి వాళ్ల నాన్నతో చెప్పాడట..నువ్వు ఈ ఊరికి రాజువి.. నీ కొడుకు దేశానికి రాజు అవుతాడు అని..నా ఆనందానికి హద్దేలేదు. ఏవోవో పనులు చేస్తున్నట్లు విన్నాను. మంచి పేరు వచ్చిందంట. ఇంకా చెబుతూనే ఉన్నారు ఊళ్లల్లో.. ఎలక్షన్ల టైంలో కూడా ఇంత చర్చ జరగలేదు నాదగ్గర. మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురైన చేస్తున్న పని ఆపలేదంట. ఆయన పట్టినపట్టు వదలడనే సంగతి మరోసారి గుర్తుకు వచ్చింది.

కాలం ఇంకాస్త వేగంగా వెళ్తోంది. ఆరోజు ఇంకా నాకు గుర్తు ఉంది. పొద్దుగూకుతోంది కానీ గాలి మొత్తం ఆగినట్లు అనిపించింది. గడీ పక్కన ఉన్న ఇంట్లో ఎవరో ఏడుస్తున్నట్లు అలికిడయింది. నాకేందుకో భయమేసింది. కొద్దిసేపటి తరువాత మా దొర ఫోటో ఒకటి పట్టుకొచ్చి నా దగ్గర పెట్టారు. ఎప్పుడూ లేనిదీ.. దండ వేశారు, దీపాలు పెట్టారు. ఓసారి నాకు మా దొరని చూడాలని అనిపించింది. కానీ చెప్పాను గదా.. కదలలేను అని.. ఎందుకంటే నేను వేపచెట్టుని. ఇప్పటిదాకా ఎదురు చూస్తునే ఉన్నాను ఆయన రాక కోసం.

Read More
Next Story