
వీధుల్లో గోవులు: నిర్లక్ష్యానికి ప్రతిబింబం
సమాజం మారాల్సిన సమయం ఇది
నవంబర్ నెల 2022. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలోని తన ఇంటి ప్రాంగణంలో రామ్‌రాజ్ అనే 55 ఏళ్ల రైతు ఓ చిన్న కప్పు టీతో తన సాయంత్రాన్ని ఆస్వాదించుకుంటున్నాడు.
అతనికి తెలియదు అదే తనకి ఆఖరి టీ కాబోతుందని. ఇంతలో ఒక్కసారిగా ఓ పెద్ద వీధి ఆవు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
రక్తపు మడుగులో కూరుకుపోయిన రామ్‌రాజ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలోనే అతడు తుదిశ్వాస విడిచాడు.
***
ఇది మాత్రమే కాదు 2025 జూన్ 25న మహారాష్ట్రలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. 85 ఏళ్ల ఓ మాజీ రెవెన్యూ ఉద్యోగి పగటి పూట నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వీధి ఆవు అకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.ఇలా వెలుగులోకి రాకుండా ఆవుల దాడి వలన ప్రాణాలు కోల్పోయిన వారెందరో వున్నారు.
మానవ సరక్షణలో ఉండాల్సిన ఆవులు వీధుల్లోకి ఎలా వచ్చాయి ??ప్రస్తుత భారతీయ గ్రామీణ మరియు పట్టణ జీవన విధానంలో గోవులు ఒక భాగమయ్యాయి. కానీ నేడు పాడి గోశాలల నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండటంతో చాలా యజమానులు తమ ఆవులను రోడ్డులపై వదిలేస్తున్నారు. కొన్ని గోవులు అనాధగా మారి, చెల్లాచెదురుగా తిరుగుతుంటాయి.
కొందరు గో యజమానులు పాలు ఇవ్వని ఆవులను , గర్భం ధరించని ఆవులను వీధులలోకి విడిచిపెడుతున్నారు, ఎందుకంటే వాటిని పోషించడంలో వారికి ప్రయోజనం లేదని భావిస్తున్నారు.
అంతేకాదు, నగరాల్లోని పౌరులు కూడా వీధిలో ఆవులకు "ఆహారం ఇవ్వడం దైవ కార్యంగా భావిస్తూ ", వాటిని ప్రజా స్థలాలకు అలవాటు చేసేస్తున్నారు.
వీధి ఆవుల దాడులకు కారణాలు (Reasons for Street Cow అటాక్స్):
1. ఆహారాభావం:
వీధుల్లో తిరిగే గోవులకు తగిన ఆహారం దొరకకపోవడంతో అవి ఆకలితో చికాకు చెంది మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది.
2. మానసిక ఒత్తిడి లేదా భయం:
ట్రాఫిక్ శబ్దం, హారన్‌లు, వేగంగా వెళ్లే వాహనాలు, అరుపులు, గోలలు గోవుల్లో భయాన్ని కలిగించవచ్చు. దీంతో అవి హింసాత్మకంగా మారుతాయి.
3. గర్భధారణ లేదా పిల్లల రక్షణ గర్భముతో ఉన్న గోవులు లేదా దూడలతో వున్న గోవులు వాటి రక్షణ కోసం దూకుడుగా ప్రవర్తిస్తాయి.
4. ఇంతకు ముందు అనుభవించిన హింస
గతంలో మానవులచేత హింసకు గురైన గోవులు భయంతో ఎదురుగా ఉన్న వారిపై దాడి చేస్తాయి.
5. అనారోగ్య సమస్యలు ప్లాస్టిక్, చెత్త తిన్న గోవులు అనారోగ్యంతో బాధపడుతూ అసహనంగా ప్రవర్తించవచ్చు.
6. వాటికి యజమానులు లేకపోవడం / నిర్లక్ష్యం పాడిపని లేని గోవులను యజమానులు వదిలేసినందున ,వాటికి సంరక్షణ కరువై అవి వీధుల్లో తిరుగుతూ ప్రమాదకరంగా మారుతున్నాయి.
7. గమనించకుండా వాటికి దగ్గరగా వెళ్లడం: కొన్నిసార్లు మనుషులు అజాగ్రత్తగా గోవుల దగ్గరికి వెళ్లడం వల్ల అవి ప్రమాదాన్ని ఊహించి స్పందిస్తాయి.
దశలవారీగా పరిష్కార మార్గాలు:
1.వీధి గోవుల కోసం గోశాలలను నిర్వహించేలా ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను, స్వచ్చంధ సంస్థలను ప్రోత్సహించడం
2.ప్రతి మున్సిపాలిటీ / గ్రామ పంచాయతీలలో వీధి ఆవులను గుర్తించి వాటిని గోశాలల్లోకి తరలించే చర్యలు తీసుకోవడం.
3.ఆవులను విడిచిపెట్టి వదిలేసిన గోపాలకులపై జరిమానాలు విధించడం, అప్పటికి వారిలో మార్పు రాకపోతే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం .
ఉదాహరణకు లుధియానా మునిసిపల్ కార్పొరేషన్ ఆసుపత్రి సంవత్సరం ₹3.5 కోట్ల (Cow cess) సేకరించినట్టు నివేదిక .
అదేవిధంగా ఢిల్లీలో (Municipal Corporation of Delhi)వీధిలో గోవులు కనిపిస్తే యజమానిపై ₹5౦౦౦, చెన్నై (Greater Chennai Corporation)మొదటి సారీ ₹10,000, మళ్ళీ కనపడితే ₹15,000 , గుర్గావ్ (MCG)
మొదటి సారీ యజమానిపై ₹5,000, మళ్లీ కనపడితే ₹10,000 జరిమానాలు విధిస్తున్నాయి. ఏదో జరిమానాలు విధించి కోట్లు దండుకోవాలనే ఆలోచనతో కాదు. ఇలా చేయడం వలన వీధిలో ఆవులు తిరగవు ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గుతాయి, పాదచారుల భద్రతకు మద్దతు లభిస్తుంది. జరిమానాల వలన వసులు చేసిన పైకము జంతుశ్రేయస్సుకు దోహదపడుతుంది.
4.పౌరులు వీధి ఆవులకు ఆహారం వేయడం మానేయడం .
5.పాఠశాలల్లో, కమ్యూనిటీ కేంద్రాల్లో పశుసంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం వలన వీధులలో తిరిగే వీధి ఆవుల సంఖ్యను తగ్గించవచ్చు.
సంప్రదాయానికి మూలస్తంభమైన గోవు… మరి మన బాధ్యత?
"గోవును పవిత్రంగా పూజించే దేశమే ఇది."
ఇది వాస్తవం మాత్రమే కాదు — ఇది మన దేశపు సంస్కృతి, ఆధ్యాత్మికత, వ్యవసాయ క్షేత్రానికి ప్రాణం. పురాణాలనుండి నేటి వరకు, గోవు మన జీవన విధానంలో ఓ కుటుంబ సభ్యురాలిగా నిలిచింది. అయితే… ఈ సంప్రదాయాన్ని గర్వంగా చెప్పుకునే మనమే, ఆ గోవును చివరికి వీధిలో వదిలేయడం ఎంతటి విచారకరం? తల్లితండ్రులను రోడ్డుపై వదిలే పరిస్థితి…
ఇవాళ మనం చూస్తున్న మరో విషాదకర చిత్రం ఏమిటంటే — అవసాన దశలో ఉన్న తల్లితండ్రులను కూడా నిర్లక్ష్యంగా రోడ్డుపై వదిలేస్తున్న సమాజమయిపోయాం. అలాంటి మనకు తన జీవితం మొత్తం మనకు పాలు, వెన్న, దూడలు, చెరకు పెడలను అందించిన గోవును వీధిలో వదలడం పెద్ద విషయం కాకపోవచ్చు! ఈ నిజాయితీ లేని మనోభావం మనం సంస్కృతితో గర్వపడే హక్కును కూడా క్రమంగా కోల్పోయేలా చేస్తుంది.
గోవు – ఒక ఆస్తి కాదు… ఆత్మ
గోవు ఒక పాడి ఇచ్చే జీవి మాత్రమే కాదు. అది పల్లె జీవనానికి శక్తి. పాడి వ్యవస్థ, పంటల పరిశుభ్రత, జీవామృతం తయారీ, దూడల పోషణ… ఇలా అన్నింటికీ మూలం గోవే.
అయితే, పాలు ఇవ్వలేకపోయిన వెంటనే గోవును ‘ఉపయోగం లేని జీవి’గా పరిగణించి, రోడ్డుపై వదిలేయడం అత్యంత మానవత్వహీన చర్య. ఇది పాలిచ్చి లాలించి శంరక్షించిన తల్లి పట్ల చేసిన ద్రోహం లాంటిది.
వీధుల్లో తిరుగుతున్న ఆవులు – మానవ నిర్లక్ష్యం ప్రతిబింబం
వీధుల్లో గోవులు తిరగడం వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు, గాయాలు, మానవ ప్రాణ నష్టం జరుగుతున్నా, దీనికి మూలం మనమే. వాస్తవానికి ఇవి ‘ఆవుల తప్పు’ కాదు – అవి మన సంరక్షణ లోపం, మానవ హృదయ లోపం.
మనం మారాల్సిన సమయం ఇది
ఇది కేవలం జంతువుల సమస్య మాత్రమే కాదు – ఇది మానవ సమాజ భద్రతకు సంబంధించిన అంశం. శ్రద్ధ తీసుకుంటే, సాంకేతికంగా సరైన చర్యలు తీసుకుంటే, ఈ సమస్యను నియంత్రించవచ్చు. మనం జంతువులను గౌరవిస్తే – అవి కూడా మనకెలాంటి హాని చేయవు. మన దృక్పథాన్ని మారుస్తూ, దిగజారిన బాధ్యతను మళ్లీ సజీవం చేయాలి:
గోవును ఒక సంపదగా చూడాలి, బాధ్యతగా చూసుకోవాలి.
పాడిపని లేని గోవులను గోశాలల్లో సంరక్షించడానికి పాలకులు, ప్రజలు చేతులు కలపాలి.
తల్లిని చూసుకునే ప్రేమతో, గోవును చూసుకోవడం మన ధర్మం.
Next Story