గుర్రప్ప కొండకు ట్రెక్,  ముందు అలసట ఆపైన అంతా ఆహ్లాదమే...
x

గుర్రప్ప కొండకు ట్రెక్, ముందు అలసట ఆపైన అంతా ఆహ్లాదమే...

తిరుపతి నుంచి హైవే దారి పడితే, చంద్రగిరి దోర్నకంబాల, మల్లాయపల్లె, మంటపం గంగుడుపల్లె . ఆపైన కి.మీ దూరన గుర్రప్పకొండ. అలసట తర్వాత అంతా ఆహ్లాదమే


(భూమన్)

గుర్రప్ప కొండకు ఇది మూడోసారి వెళ్లడం. ఈ కొండని మాకు పరిచయం చేసింది అటవీశాఖ ఉద్యోగి వెంకటరెడ్డి. ఆ గ్రామస్తులు ముఖ్యంగా అప్పిరెడ్డి, విజయ పదే పదే రమ్మంటుంటే బయలుదేరినాను పెద్ద బ్యాచీని వేసుకుని.


ఇదే గుర్రప్ప కొండ


అంతకు మునుపు కొండమీద మేకపోతును కోసి బ్రహ్మాండమైన విందు చేసినారు. నేనంటే అభిమానం, వారికిష్టం. కాదనటానికి వీల్లేదు. మొన్న మొన్న వాళ్ల ఊరు గంగుడుపల్లెలో జల్లికట్టుకు పిల్చుకునిపోయి మంచి దోసెలు , ఊరుబిండి , కారంతో అదరగొట్టినారు. ప్రతి సంవత్సరం ఈ చుట్టు పక్కల జల్లికట్టి జరగటం ఆనవాయితీ. అందుకోసమే గ్రామస్థులు ఆవుల్ని మేపుతారు. కొండల పైకి తోలేసి అప్పుడప్పుడు చూసొస్తుంటారు. నాటావులు వీరికి మాత్రమే మచ్చి.




తిరుపతి నుండి ౩౦ కి.మీ. దూరాన ఉంటుంది. చంద్రగిరి మీదుగా పోయి పెట్రోల్బంక్ ఎడమ పక్కన డోర్నకంబాల , మల్లయ్యపల్లి , మంటపంపల్లె మీదుగా గంగుడుపల్లె చేరుకున్నాము. మంటపంపల్లెలో పురాతనమైన మంటపాన్ని చూపించినారు. పూర్వం తిరుపతికి వచ్చే యాత్రికులు ఇక్కడ సేదతీరి బయలుదేరేవారట. ఇపుడు బాగా పాడైపోయింది. ఆదుకునేవారు , పట్టించుకునే నాథులే లేరు. ఇట్టాంటి పురా సంపద మా చుట్టుపక్కల శిథిలంగావటం కళ్లారా చూస్తున్నాను.




పాలకులకు చారిత్రక స్పృహే లేదు. పాతకట్టడపు స్తంభాలను తమ ఇళ్లకు స్వేచ్ఛగా వాడుకుంటున్నారు. అడిగే , ప్రశ్నించే వారే లేరు. దీన్ని పునరుద్ధరిస్తే బావుంటుంది సార్ , మీరైనా ఆలోచించండంటే సరే లెమ్మని దిగాలుగా ముందుగా కదిల్నాము.




గంగుడుపల్లె నుండి కి.మీ దూరం ఎగుడుదిగుడు మట్టి బాటెంబడి , ట్రాక్టరు , మోటరు సైకిళ్ల మీద గుర్రప్పకొండ సానువులకు చేరుకున్నాము. గుర్రప్పకొండ చుట్టూ కొండలే. ఎదురుగా జెర్రిపోతుకోన , పక్క పులిబాన ఉన్నాయి.




వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి. మనోజ్ఞంగా ఉంది. సన్నని చినుకుల మధ్య నడక భలే గమ్మత్తుగాఉంది. పైగా నాకయితే వానలో అడవిలో , కొండల్లో ప్రయాణించటం మహాఇష్టం. మధ్యలో అక్కడక్కడా సన్నటి నీటిధార దూకుళ్లు. పక్కన పక్షుల కిలకిలారావాలు , అల్లంతదూరంలో కణుతుల దూకుళ్లు. అడవికోళ్ల అందా లు. మజాగా ఉంది.




మధ్యలో ఒక పెద్ద జారుడుబండ. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. దీన్ని “ అక్షరాలబండ ” అని అంటారని అప్పిరెడ్డి అన్నారు. కొండ మధ్యలో ఎంత మంచిపేరు. మేకలు మేపేవాళ్లు గుర్తి కోసం ఇక్కడ రాసేవారట. పల్లెలీయుల సాహితీ గవాక్షానికి శతకోటి దండాలు పెట్టుకున్నాము. కొండ నిట్టనిలువుగా ఉంది. నేను ముందే వెళ్లి వచ్చిన వాణ్ణి గనుక అడ్డదిడ్డాలుగా ఎక్క గలుగుతున్నాను.




అలుపైన వారిని సేద దీర్చుకోమంటూ కదుల్తున్నాము. రకరకాల చెట్లు , తీగలు , వింతైన ఆగారాలతో మొక్కలు , రాళ్ల రప్పలతో దారంతా బావుంది. అడవి కరింపాకు భలేవాసనగా ఉంది. దూరంగా పక్కకు చూస్తే రెండుకొండలను కలుపుతూ చిన్న చెక్ డ్యాం దానిపేరు “ దోసెల వంక చెరువు ".

గుర్రప్పకొండ పైభాగాన్ని చేరుకున్నాము. ఒక షెడ్ ఉంది. దాతలెవరో భక్తుల కోసం కట్టినారు. పక్కనే సన్నటి సెలయేరు. ఆ సెలయేటి నీటిని ఒక కట్టకట్టి వొడుపుగా వాడకానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ కొండమీద దేవుడి విగ్రహాలేవీ లేవు. ఒక చెట్టుకు దారాలుకట్టి ఉన్నారు. మరొక పక్క మొక్కుబడి చిత్తులున్నాయి. పేరుకు గురవయ్యస్వామి స్థలం. గ్రామస్థుల కులదేవుడు మునీశ్వరుని పేరు మీదుగా మొక్కులు తీర్చుకుంటారు.

ఆ మొక్కులు కూడ గుర్రాలు , ఏనుగుల మట్టి బొమ్మలు సమర్పించి , ముందురోజుల్లో పల్లెల్లో ఉండే కుమ్మరులే చేసిచ్చేవారట. రోజులు మారినాయికదా. పలమనేరు , అంగళ్లనుండి మట్టిబొమ్మలు కొనుక్కొచ్చి. ఇంట్లో పూజలు పురస్కారాలు ముగించి గుర్రప్పకొండ మర్రిచెట్టు నీడకు చేరుస్తారు. అక్కడే పిల్లలకు తలవెంట్రుకలు ఇస్తారు.




తమాషా ఏమంటే ఇక్కడ జతఏటలు , జతకోళ్లు బలి ఇవ్వటం సాంప్రదాయం. ఒంటిగా ప్రశ్నేలేదు. సీజన్లో వందల వేటల , కోళ్ల తలలు తెగుతాయట. అక్కడ కొంచెం అంతా చూసి కొండచుట్టూ తిరగటానికి బయలుదేరినాము. అట్లా కుదరకపోతే మేకలవాళ్లు మేకపిల్లల కోసం వేసిన రాతిగూళ్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. మేక పిల్లల్ని శత్రువుల కంటపడకుండా పకడ్బందీ ఏర్పాటు అది. దగ్గర దగ్గర 10 మంది వరకు మేకలు పెంచేవాళ్లు. రాత్రింబవళ్లు అక్కడే ఉంటారట. బాగా మేపి అమ్మకానికి తోల్తారు. మేపిన వారికి యజమాని జీతమిస్తాడు. కొంచెంసేపు మేక పిల్లల్ని భుజానికి ఎత్తుకొని ఆడుకోవటం అదొక సరదా. ఇంకొంచెం పక్కకు పోతే నాటావులు మేస్తున్నాయి.

దూరంగా రాయలచెరువు కనువిందు చేస్తున్నది. ఈ కొండన , చుట్టు పక్కల అడవుల్లో నక్కలు , తాబేళ్లు , పందులు , జింకలు , దుప్పిలు , కణుతులు , కుందేళ్లు , ముళ్లపందులు , అడవికోళ్లు , పాములు వగైరా ఉన్నాయని వెంకటరెడ్డి చెప్పినాడు. అడవి జంతువులను స్వేచ్ఛగా వేటాడి చుట్టు పక్కల గ్రామస్థులు హెూయిగా ఆరగిస్తున్నారని విజయుడు వాపోతున్నాడు. దీని మూలాన జంతువుల సంఖ్య బాగా తగ్గిపోతున్నదట. అటవీశాఖ వారు ఇంతో అంతో పుచ్చుకుని పట్టీపట్టనట్టు వుంటారట. మధ్యాహ్నానికి షెడ్ దగ్గరికి వస్తే మళ్లీ మేకపోతు ఆహారం. ఆయాలాయలుగా వండి వారిస్తున్నారు. నేనూ ఒక చెయ్యేసి మంటల మీద సియ్యలిని కాల్చితిని అపని తీర్చుకున్నాను.




దాదాపు 70 మందికి శుచి , శుభ్రమైన , రుచికరమైన తిండిపెట్టి గంగుడుపల్లి మిత్రులు తృప్తిగా తేన్చినారు. తిని కొంచెంసేపు బండరాళ్ల మీద సేదతీరి వచ్చిన దారి గుండా కాకుండా మరొకదారిని ఎన్నుకుని మంటపం పల్లెకి సాయంకాలం ఆరుగంటల కంతా చేరుకున్నాము. గంగుడు పల్లి ట్రెక్ ప్రతిసారీ గొప్పగా ఉంది. పల్లెవాసులు తోడ్పాటు , సహకారం మరువ లేనిది. మళ్లీ మళ్లీ రమ్మనమనే వారి అభిమానానికి శతకోటి దండాలు పెట్టి మామా ఇళ్లు చేరుకున్నాము.



Read More
Next Story