వెళ్లాలి! (Sunday Special)
x

వెళ్లాలి! (Sunday Special)

అవును ఒక్కొక్క సారి మనకు తెలియకుండానే మనసు గుబులు గూడు అవుతుంది. ఈ వెలుతురు, చుక్కలు, చంద్రుడు, మనుషులు మాయమయిన అంధకారం. ఎలా బయటపడాలి...




వెళ్ళాలి!


గీతాంజలి


పగలు నా నుంచి వెళ్ళిపోయింది.
చీకటి ..నన్ను చీకటి చీకటిగా చుట్టుకుంది.
ఒట్టి చీకటైపోయాను !
నూనె పోసి ప్రమిద వెలిగించుకున్నా..ఉహూ.. సరి పోలేదు.
సాయంత్రం వేళల్లో దీపాలు అమ్మే దుకాణానికి వెళ్లి శాండ్లియర్ తెచ్చుకున్నా..
ఊహూ..అదీ చాల లేదు !
మనసంతా నీలి మేఘాలు మాగురు మాగురుగా ...
గదంతా చీకటి...
నేనూ.. చీకటి !
చిరాగ్ దిల్ కా జలావో.. బహుత్ అంధేరా హై...ఎక్కడిదో... రఫీ పాట
గదిలో..చీకటిలో మరింత విషాదాన్ని ఒంపుతోంది.
అతగాడి పాట ఆగిపోయింది...ఆపారేవరో !
ఆగిపోయిన పాట ప్రసవించిన నిశ్శబ్దంలోనుంచి కొత్త దుఃఖం మొదలైంది !
చంద్రుడ్ని ఎత్తుకుని చుక్కలేటో గాభరాగా పారిపోయాయి.
మబ్బులు కన్నీళ్లు కుక్కుకొని ఇంకెటో తేలిపోయాయి.
నా ఆకాశం దోచుకున్న ఇంటిలా ఖాళీ అయిపోయింది !
ఇలా కాదని ..
రాత్రిని అలానే తెల్లారనిచ్చి ఆకాశంలోకి చేతుల్ని చాచి..
ఏకంగా సూర్యుడినే గుప్పిటపట్టి గుటుక్కున మింగేసా.
ప్రణయాన్ని..
విరహాన్ని మనిషి హృదయంలో పుట్టించింది సూర్యుడేగా మరి ?
ఇంకేం..నేనిక వెలుతురినైపోయా..
నన్ను నేనే వెలిగించుకున్నా.
అవునుమరి ! ఎదురుచూపు వేలాడుతున్న గుమ్మమొకటి ప్రాణాలు కడగట్టుకుని ఉంది ..వెళ్ళాలి..చీకటిలో ఉన్న ఆమెని వెలిగించాలి.. !


Read More
Next Story