తిరుపతి కొండల అంచున అద్భుత అటవీ ప్రకృతి లావణ్యం
x
అడవిలో పక్షల కోసం కట్టిన నీటి మూకుడు

తిరుపతి కొండల అంచున అద్భుత అటవీ ప్రకృతి లావణ్యం

తిరుపతి సమీపాన ఉన్న మాల్వాడి గుండానికి సన్ రైజ్ ట్రెక్. మాల్వాడి గుండం వెనక ఉన్న కథేంటో తెలుసా?



మేమెంత అదృష్టవంతులమో! మా తిరుపతి చూట్టూర చెప్పలేనన్ని ప్రకృతి సౌందర్యాలు. అపురూప ప్రాచీన కట్టడాలు. హొయలోలికే జలపాత మధుర సంగీత ప్రకంపనలు. కూత వేటంత దూరంలో అటు అలిపిరి పాదాల దగ్గర నుండి కపిలతీర్థం వరకు అద్భుతమయిన దివ్యారామం. కడు రమణీయమైనది.




నిన్న ఈతకు బక్రీద్ కారణంగా శెలవు గనుక దివ్యారామం వైపు దారి తీసినాను. ఎన్ని మార్లు పోయి వచ్చినా ప్రతిసారీ కొత్తదనమే. ఈ దివ్యారామం 1986లో ఎన్టీరామారావు పూనిక వల్ల ప్రారంభమయింది.




అప్పటి ఫారెస్టు కన్సర్వేటర్ మల్లిఖార్జునరావు చొరవ వల్ల జంగిల్ బుక్ గా స్థిరపడింది. ఈ నామకరణం చేసింది, సన్ రైజ్ ట్రెక్ (sunrise trek) బాలు. ఈ దివ్యరామం లోనే మాల్వాడి గుండం ఉండేది.




ఆ రోజుల్లో మాలామాదిగలకు కొండెక్కే అవకాశం లేకపోవటం వల్ల, కాదు అనుమతించక పోవటం వల్ల వారు ఈ మాల్వాడిగుండంలో స్నానపానాలాచరించి అలిపిరి పాదాల చెంతన ఒక నమస్కారం పెట్టి తిరిగి వచ్చేవారు. వారు ఉండటానికి గుడియాత్తంకు చెందిన ఒక దాత చల్లప్పమేస్త్రి ప్రస్తుతం ఉన్న ఎసవి మ్యూజిక్ కాలేజీ కి ఎడమ పక్కన ఒక సత్రం కట్టించినారు. ఇప్పటికీ ఆ సత్రం ఆ రోజుల్ని గుర్తు చేస్తూంటుంది.




బాగా పచ్చదనమేసి దివ్యారామం దివ్యంగా ఉంది. చించిగురు, లేత వేప ఆకులతో పాటు ఎదిగొస్తున్న వేపచెట్లు, ఏపుగా పెరిగిన ఎర్ర చందనం మొక్కలతో దారంతా గొప్ప ఆహ్లాదకరంగా , మనోజ్ఞంగా ఉంది. ఇంత దగ్గరలో ప్రకృతి వొడిలో తిరిగే అవకాశం మాకు దక్కటం తిరుపతి వాసుల అదృష్టమే. పొద్దు పొద్దునే రావటం వల్ల జనాల తొక్కిడి ఏమంతగాలేదు. పక్షుల కిలకిలారావాలు, నెమళ్ల అరుపులు ఇంపుగా ఉన్నాయి. ఇంకా ముందొస్తే జింకలు, అడవి పందుల్ని చూడొచ్చు. అప్పుడప్పుడు చూసేవాణ్ణి. అప్పుడప్పుడు చిరుత అడుగుల జాడలు ఉంటాయి. ఆ క్షణాల్లో దివ్యారామానికి ఎవర్నీ రానీయరు అటవీ శాఖాధికారులు.



మాల్వాడి గుండం దారిలో కొండ దిగుతూ రచయిత భూమన్


శేషాచలం ఏకో ఫ్రెండ్స్ పుణ్యమా అని, మా ట్రెక్కింగ్ గురువులు బి.వి. రమణ, బాలు, శ్రద్ధ, పట్టుదల వల్ల మంచి మంచి సొగసులతో, పక్షుల గూళ్లతో పాటు, చిన్న, చిన్న కుంటలు కూడ ఏర్పడినాయి. ఈ కుంటల నీళ్లు జంతువుల దాహార్తి తీరుస్తున్నాయి.




2008 లో ఏర్పడిన జంగిల్ బుక్ ఇప్పుడు దాదాపు కనుమరుగై మాల్వాడి గుండంతో పాటుగా దివ్యారామం తిరుపతి పాదచారులకు ఒక అపురూప ఆరోగ్యశాలగా మారింది. ఈ దివ్యారామం ప్రస్తుతం లంగ్ స్పేస్. తిరుపతి జనానికి ఆరోగ్యకరమయిన ఊపిరితిత్తి.



దివ్యారామం నుండి అలిపిరి దగ్గరికి చేరుకుని ఎదురుగా గాలిగోపురాన్ని చూస్తుండగానే రమేష్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, శాస్త్రి, నగేష్ తదితర మిత్రులంతా కలిసారు. వీరి గ్రూపు క్రమం తప్పకుండా వస్తూంటుంది. దివ్యరామం బోర్డు దగ్గర కొంచెం సేపు వ్యాయామం చేయటం వీరి ప్రవృత్తి. అక్కడే ప్రతి రోజూ పక్షులకు గింజలు, నీరు పెట్టె మోహన్ ని పలకరించి అందర్నీ కలుపుకుని ఈసారి మాల్వాడిగుండం అంచుల్లోకి దారి తీసినాము. నీళ్లు లేనప్పుడు మాత్రమే పోగాలం. ఇదొక మినీ ట్రెక్. కొంచెం దూరమే అయినా ఆ బండరాళ్లు, గుండ్రాళ్లు, బొడ్రాళ్లు ఎక్కుతూ దిగి రావటం గొప్పగా ఉంది. ఈ దారి పొడవునా మరుగ్గదా ప్రేమికులు విహరించిన దాఖలాలున్నాయి. ప్రేమికులు ఎంత సాహసులో కదా. వీరికి పురుగు పుట్రా, భయమే ఉండదు. తెలిసిందల్లా ప్రేమ. ఉన్నదల్లా ఆకర్షణ. కొన్ని పదుల జంటలు గడిపే పవిత్ర స్థలం ఇది. చోటు ఎంత ముఖ్యం ఇట్టాంటి జంటలకు. ఎట్లా కనుక్కుంటారో గాని వీరి అన్వేషణకు హ్యట్సాఫ్ చెప్పాల్సిందే. ఎక్కడైనా పొదలు కనిపిస్తే చాలు ఎంత అందంగా తీర్చి దిద్దుకుంటారో వాటిని దర్శించుకున్న వారికే తెలుస్తుంది.

వానాకాలంలో మాల్వాడి గుండం


ఇదే మాల్వాడి గుండం వానాకాలం మూడుపాయలుగా హోరెత్తిస్తుంది. జనం చూడ్డానికి ఎగ బడుతుంటారు. ఆ పక్కనే వ్యూపాయింట్ నుండి చూస్తే చూసినంత దూరం తిరుపతి అందచందాలు ముచ్చటగా ఉంటాయి. అక్కడినుండి పై కెగ బాకితే మొదటి ఘాట్ రోడ్డుకు చేరుకోవచ్చు.




అన్ని దారులూ తిరిగితే రెండు గంటల వరకు గడిపిరావచ్చు. పూర్తిగా ప్రకృతి వొడిలో ఊగినట్టుగా ఉండే ఈ సుందర ప్రదేశం కపిలతీర్థం దగ్గర ముగుస్తుంది. కపిలతీర్థం జలపాతం వానాకాలం తిరుపతి జనాన్నే గాక ప్రతి ఒక్కరినీ ముగ్ధుల్ని చేస్తూంటుంది, కపిలతీర్థం పై భాగాన గుండాల్ని చూసే భాగ్యం మాకు ఎన్నడో కలిగింది.




అన్నింటినీ నెమరేసుకుంటూ ఈ పూట ఈ సన్ రైజ్ ట్రెక్ ను ఈ చిరు ట్రెక్ గా ముగించి ఇంతకు మునుపు మాదిరిగా ఒరాయన్ లో గాకుండా జల్పాన్ లో రుచి కరమయిన కాఫీ తాగి హాయిగా తిరిగి వచ్చినాము. మామూలుగా ఈ రామంలో కనిపించే మురళి, జ్యోతి, భాస్కర్ తదితర మిత్రులందరినీ, తెలిసిన ముఖాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ వచ్చేసినాము.


Read More
Next Story