స్విగ్గీ వింత ప్రవర్తన... ఆందోళనలో ఆహార ప్రియులు
x

స్విగ్గీ వింత ప్రవర్తన... ఆందోళనలో ఆహార ప్రియులు

ఇండియాలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ వింతగా ప్రవర్తిస్తోంది. ఫుడ్ ఆర్డర్ చేయడానికి ట్రై చేసిన కస్టమర్లకు కండిషన్లు పెడుతోంది.


ఇండియాలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ వింతగా ప్రవర్తిస్తోంది. ఫుడ్ ఆర్డర్ చేయడానికి ట్రై చేసిన కస్టమర్లకు కండిషన్లు పెడుతోంది. ఇప్పుడు ఐటమ్స్ అవైలబుల్ గా లేవు. తర్వాత ట్రై చేయండి. అంతగా కావాలంటే గ్రూపుతో కలిసి ఆర్డర్ చేయండి అంటూ ఆర్డర్స్ వేస్తోంది. ఒక్కరికే డెలివరీ చేయడం కుదరదు అంటూ తిక్క సమాధానాలు చెబుతోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్విగ్గీ యూజర్లు ఎక్స్ వేదిక ఎక్కారు. మస్క్ సాక్షిగా స్విగ్గీ పై తిట్ల దండకం అందుకున్నారు.

చేతకానప్పుడు వన్ మెంబర్ షిప్ తీసుకోండి... మంచి డెలివరీ సర్వీసులిస్తాం, ఫ్రీ డెలివరీలు చేస్తామని కాకమ్మ కబుర్లు ఎందుకు చెప్పావని ట్వీట్లతో బూతులు తిడుతున్నారు. డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్స్ లేకపోతే అసలు ఫ్రీ డెలివరీ చేస్తానని మెంబర్షిప్ కి ఎక్స్ ట్రా డబ్బులు ఎందుకు తీసుకున్నావని ఎక్స్ వేదికగా ఏకిపారేస్తున్నారు. సందులో సడేమియా అని స్విగ్గీ లో ఇంతకుముందు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న ట్వీట్లకి ఆజ్యం పోస్తున్నారు మరి కొందరు యూజర్లు.

పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉందని చకచకా ఎక్స్ లో అలర్ట్ అయిన స్విగ్గీ కేర్స్ టీమ్ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఏదైనా ఉంటే పర్సనల్ గా మాట్లాడుకుందాం. దయచేసి డైరెక్ట్ మెసేజ్ చేయండి అంటూ వేడుకోలు మొదలుపెట్టారు. తగ్గేదే లే.. తాడో పేడో ఇక్కడే తేల్చుకుందాం అని టపటపా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు ఆగ్రహించిన ఆహార ప్రియులు. ఇంతకీ సమస్య ఎక్కడ వచ్చిందంటే...

స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవటానికి ట్రై చేసిన యూజర్లకు ఓ సమస్య ఎదురైంది. ఫుడ్ డెలివరీ పేజీ కి వెళ్లి ఏదైనా రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎలాంటి ఐటమ్స్ అందుబాటులో లేవు అని ఒక మెసేజ్ కనిపిస్తోంది. దానికింద గ్రూప్ ఆర్డర్ ఆప్షన్ కనిపిస్తోంది. టీమ్ అప్ అయ్యి ఆర్డర్ చేయండి. కలిసి డిషెస్ ని కార్ట్ లో యాడ్ చేయండి అని చూపిస్తోంది. వర్షాల కారణంగా డెలివరీ బాయ్స్ కొరతతో స్విగ్గీ ఈ ఆప్షన్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

Read More
Next Story