అక్షర రహస్యం తెలిసిన మాంత్రికుడు తాడి ప్రకాష్
x

అక్షర రహస్యం తెలిసిన మాంత్రికుడు తాడి ప్రకాష్

ప్రఖ్యాత రచయిత కెఎన్ వై పతంజలి అవార్డుకు ఎంపిన చేసిన సందర్భంగా ప్రకాష్ అంటే ఏమిటో మూడు ముక్కల్లో చెబుతున్న రాఘవ



కొన్ని పరిచయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకో చెప్పలేనుకానీ, కొన్ని దూరమైపోతాయి. మరికొన్ని స్నేహాలుగా పెనవేసుకుపోతాయి.

నలభై రెండేళ్ళక్రితం పతంజలితో పరిచయం, పరిచయం గానే మిగిలిపోయింది. పతంజలి పరిచయం చేసిన తాడిప్రకాష్ (Tadi Prakash)తో మాత్రం స్నేహంగా నిలబడిపోయింది. అందుకే.. ప్రకాష్ కి పతంజలి అవార్డు రావడం నన్ను కాస్త సంతోష పెట్టింది. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను.

సిగరెట్టు కొందరి మధ్య స్నేహాన్ని వెలిగించి, బతికుండగానే తలకొరివి పెట్టేస్తుంది. మద్యం మరి కొందరి మధ్య జీవనదై ప్రవహించి, స్నేహవారధిని నిర్మించి, జీవితాన్ని ఎప్పుడో కొంప కొల్లేరు చేస్తుంది.

తాడి ప్రకాష్ కి నాకు మధ్య ఏర్పడిన స్నేహ వారధి మద్యమూ కాదు, దాని బాబు సిగరెట్టూ కాదు. అందమైన అక్షరమే మా మధ్య వారధి. కనుచూపు మేరలో ఎక్కడా కనిపించని కమ్యూనిజం కూడా మా మధ్య వారధే.

తాడి ప్రకాష్, నేనూ ఒకే వయసు వాళ్ళం. పత్రికా రంగంలోకి తాడి ప్రకాష్ నాకంటే పదేళ్ళు ముందొచ్చారు. నేను అందుకోలేనంత ముందుకెళ్ళిపోయారు.

నలభై రెండేళ్ళ క్రితం నాటి మాట. బీహార్ ప్రెస్ బిల్లు వచ్చింది. దేశం అట్టుడికి పోతోంది. బీహార్ ప్రెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఈనాడు నిండా వార్తలే వార్తలు. డిగ్రీ చదివే రోజుల్లో ఎమర్జెన్సీని కళ్ళారా చూశాను. బీహార్ ప్రెస్ బిల్లుకు వ్యతిరేకంగా కరపత్రం రాసి, తిరుపతి అంతా పంచేశాము.

బీహార్ ప్రెస్ బిల్లు పైన తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాం. బాగా పెద్దవారై పోయిన ఆలిండియా రేడియో కరస్పాండెంట్ వరదరాజులు గారింటికి వెళ్ళాం. ఇంట్లో చాప పైన కూర్చుని, తొడ పైన పుస్తకం పెట్టుకుని, వార్తలు రాసుకుంటున్నారు.

మేం వెళ్ళగానే, మేం ఇచ్చిన కరపత్రం చదివి, చాలా సంతోషించి, కాసేపు ప్రభుత్వాన్ని తిట్టి పోశారు. ‘‘మేం రాసేదాంట్లో అంతా ప్రభుత్వ భజనే’’ అంటూ, ఆలిండియా రేడియోకు రాసిన వార్తలను చదివి వినిపించారు. ‘‘తినకున్నా తనకున్న పని తప్పదు’’ అన్నట్టు, చిరునవ్వు కలబోసిన వైరాగ్యం ముఖం తో సభకు వస్తానన్నారు.

తిరుపతి ఈనాడు ఎడిషన్ ఇంచార్జిగా పతంజలి పనిచేస్తున్నారు. రేణిగుంటలో పతంజలి ఇంటికి వెళ్ళాం. ఒక పెద్ద హాలు. ఆ హాలులో అలమార్ల నిండా పుస్తకాలు. అదే వారి బెడ్ రూం. ఒక చిన్న వంట గది. స్నానం చేసి, టవల్ కట్టుకుని అప్పుడే హాల్ లోకి వచ్చారు.

బీహార్ ప్రెస్ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెడుతున్నామంటే పతంజలి చాలా సంతోషపడిపోయారు. మేము చేయాల్సిన పని మీరు చేస్తున్నా రం టూ మెచ్చు కున్నారు.సభలో మీరు మాట్లాడాలన్నాం. ‘‘సభలో నేను మాట్లాడను. మాట్లాడే మనిషిని మీకు పరిచయం చేస్తా.’’ అంటూ, నడుచుకుంటూ మమ్మల్ని ఒక ఇంటికి తీసుకొచ్చారు.

ఇంటి పెరటిలో ఒక నులక మంచంపైన కూర్చుని, ఒక అన్నా చెల్లెళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘‘ఈయనే తాడి ప్రకాష్ గారు. ఈనాడులో నాతోపాటే చేస్తుంటారు. మీ మీటింగ్ లో వీరు మాట్లాడతారు.’’ అని చెప్పేశారు. తిరుపతి ఈనాడులో పతంజలి తరువాత తాడి ప్రకాషే.

సాయంత్రం బాలాజీ భవన్ లో సభకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. పతంజలి, ప్రకాష్ వచ్చి ప్రేక్షకుల్లో కూర్చున్నారు. జర్నలిస్ట్ వరదరాజులుతో పాటు మరికొందరు మాట్లాడారు.

వేదికపైకి ప్రకాష్ ని పిలిచాం. పతంజలి పరిచయం చేసిన తాడి ప్రకాష్ కదా! త్రిపురనేని మధుసూదన రావులానో, జ్వాలా ముఖిలానో మీట్లాడతారులే అని ఎదురు చూస్తున్నాం. చిన్న కాగితంలో ఏదో రాసుకొచ్చి చదివి కూర్చునేశారు తాడి ప్రకాష్ . అప్పుడు నాకు తెలియదు సుమా.. రాత గాళ్ళైనంత మాత్రాన కూత గాళ్ళు కావాలన్న రూలే మీ లేదని.

మా పరిచయానికి మళ్ళీ ఎనిమిదేళ్ళ ఎడబాటు. కొన్నాళ్ళకు నేను కూడా పత్రికల్లో స్వీయ జీవితఖైదు విధించుకోవడానికి ఆంధ్రజ్యోతిలో చేరాను. రెండేళ్ళు తిరగ్గానే, ఎద్దుల కుమ్ములాటల్లో దూడల కాళ్ళు విరి గాయి. పై వాళ్ళ కుమ్ములాటల్లో నాకు, నా సహ రిపోర్టర్ గాలి నాగరాజుకు ఉద్యోగాలు ఊడిపోయాయి.

నాగరాజు విజయవాడ వెళ్ళి, ఆంధ్రభూమి ఎడిషన్ ఇంచార్జి తాడి ప్రకాష్ తో మాకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నాగరాజు ను వెంటనే రిపొర్టరుగా ఉద్యోగంలో చేర్చుకునేసి, నన్ను కూడారమ్మన్నారు. నేను కూడా వెళ్ళి ఆంధ్రభూమిలో చేరిపోయాను. పతంజలి పరిచయం చేశారన్న విషయాన్ని నేను చెప్పే వరకు ప్రకాష్ కి గుర్తు రాలేదు.

అప్పుడప్పుడూ తన క్యాబిన్ లోకి పిలిచి కొన్ని డిక్టేట్ చేసేవారు. చూపుడు వేలితో మీసాలను కిందకు నిమురుకుంటూ ఒక్కో వాక్యం చెప్పేవారు. అలా చెప్పినవాటిలో ‘నాచారంలో నల్ల డబ్బు’ వార్త బాగా పేలింది. అలా పేలడానికి తాడి ప్రకాష్ వాక్యవిన్యాస మే కారణం.

ఆ వార్త అందరికీ తెలిసినా ఆంధ్రభూమి తప్ప ఏ పత్రికా ప్రచురించలేదు. ఆంధ్రభూమిలో చేస్తున్నందుకు, అదీ నా చేతుల మీదుగా వెళ్ళి నందుకు చాలా గర్వంగా అనిపించింది. మిగతా పత్రికల్లో పనిచేసే పెద్ద పెద్ద ఎడిటర్లంతా ‘దమ్ముల్లేని దళపతుల్లా’ అనిపించారప్పుడు నాకు. పత్రికలన్నీ ఒకే తానులో ముక్కలన్న జ్ఞానోదయం చాలా కాలానికి కానీ కలగలేదు.

‘నాచారంలో నల్లడబ్బు’ లో ఎత్తిపొడుపులు, దెప్పి పొడుపులతో కుమ్మేశారు. ‘కాందహార్ హోటల్లో కల్పన ఆత్మహత్య’ తో కనీళ్ళు తెప్పించారు. సంఘీనగర్ లో చెస్ పోటీలు జరిగినా, రష్యాలో గోర్బచేవ్ ప్రభుత్వం పడిపోయినా తాడి ప్రకాష్ రాసిన సూపర్ లీడ్ సూపర్బ్.

రష్యాలో లెనిన్ విగ్రహాలు కూలదోస్తుంటే ప్రకాష్ గుండె పగిలింది. ఎల్త్సిన్ బూట్లు నాకారంటూ నిప్పులు చిమ్మారు. రాజ్ కపూర్ పోయినప్పుడు ‘జానేకహా గయే ఓ దిన్’ అంటూ వై వైరాగ్యం తో రాసిన వార్త ఆ రోజు ఎడిషన్ లేటైపోయింది.

తన క్యాబిన్ లో కూర్చుని, మీసాలను నిమురుకుంటూ, సూపర్ లీడ్ కోసం రాసే ఒక్కో వాక్యం ఒక్కో క్షిపణిలా పేలేది. తాడి ప్రకాష్ ఏదైనా రాయాలనుకుంటే ముందు దానిలోకి దూరిపోతారు. అందుకే తాడి ప్రకాష్ కి ‘సూపర్ లీడ్ పిచ్చోడు’ అని పేరు పెట్టారు. ఆయన వాక్య విన్యాసానికి ఆయనే సాటి, ఆయనే పోటీ.

పదాలను ఎలా పరుగులు పెట్టించాలో తెలిసిన అక్షర రౌతు తాడి ప్రకాష్. వాక్యాన్ని ఎలా మెలికలు తిప్పి, నాట్యం చేయించాలో తెలిసిన అక్షర నాట్యాచార్యు డాయన. తెలుగు రాత రహస్యం తెలిసిన వాడతను. ఆంధ్రభూమి ఎడిటోరియల్ విభాగంలో నేను చేసింది ఆరునెలలే అయినా, ఆ తరువాత కూడా ఆయన వాక్యనిర్మాణాన్ని అనుకరించాను.

తాడి ప్రకాష్ కి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఏకలవ్యుణ్ణి గురువు బొటనవేలడిగాడు. తాడి ప్రకాష్ నన్నేమీ అడగలేదు. ఒక సిగరెట్టో, ఒక బీరు బాటిలో కూడా అడగలేదు. దటీజ్ తాడి ప్రకాష్.

Read More
Next Story