పుస్తకాలపై ఒక తెలుగు ఉపాధ్యాయునికి ఉన్న ప్రేమ ఇంటిని అరుదైన పుస్తకాల గ్రంధాలయంగా మార్చింది. అతనిని నిరంతర పుస్తకాన్వేషి గా మార్చింది.మంచి పుస్తకాలు ఎక్కడో దొరుకుతాయో వెదికి వెటాడే పుస్తక వేటగాడిగా మార్చింది. పుస్తకం ఈ రోజుల్లో బాగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. పుస్తకం చేతపట్టి చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోతున్నది. పూర్వం దూర ప్రయాణాలలో పుస్తకాలు చదవేవాళ్లు బస్సుల్లో, రైళ్లలో ఎంతో మంది తారసపడే వారు. ఇపుడు ‘ప్రయాణ పాఠకులు’ అంతరించిపోతున్నారు. అంతా డిజిటల్ పాఠకులే అయ్యారు. ఇలాంటిక చారిత్రక నేపథ్యంలో ఒక తెలుగు టీచర్ పుస్తకాన్ని తెగ ప్రేమించేస్తున్నాడు. పుస్తకాలను సేకరిస్తున్నాడు. ఏమో, భవిష్యత్తులో మళ్లీ మనుషులు పుస్తకాల వైపు పరిగెడితే... అవును అపుడు వాళ్లకి పుస్తకాలు అవసరమవుతాయి, ఇపుడే సేకరించి పెట్టాలి అన్నంత ఆదుర్దాగా ఆయన పుస్తకాలను సేకరిస్తున్నాడు. విలువలేనివే అయినా పాతపుస్తకాలను సేకరించడం ఖర్చుతో కూడుకున్నపని. అయినా ఆయన లెక్క చేయలేదు. తన పుస్తకాన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు. మూరెడు స్థలం ఉంటే జానెడు ఇల్లేసి అద్దెకు ఇచ్చుకుంటున్న ఈరోజుల్లో ఆయన తన ఇంటినే లైబ్రరీగా మార్చేశాడు. ఆయన డబ్బున్నమారాజు కాదు. చిన్న తెలుగు పండితుడు. పేరు శీలా అవిలేను. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి హై స్కూల్ లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.
అతను పుస్తకాల సేకరణ కోసం బుక్ స్టాల్ల్స్, పుస్తక ప్రదర్శనలతో పాటు, సెలవు దినాలలో గంటల తరబడి చెత్త కాగితాలు దుకాణాలలో అన్వేషణ సాగిస్తాడు. స్క్రాప్ షాపుల నుంచే తాను ఎంతో అరుదైన ప్రాచీన గ్రంధాలను సేకరించానని చెబుతాడు. ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పుస్తకాలన్నీ ఆయన ఇంటిని ఆక్రమించుకున్నాయి.
శీలా అవిలేను అనే పేరు కొత్తగా ఉంది కదూ. అవిలేను అంటే ఏమిటి? తెలుగు వాళ్లలో ఇలాంటి పేరు లేదు గదా అని ప్రశ్నిస్తే, ఆయన ఒక కథ చెప్పారు. అవిలేను అనేది ఐనవోలు వ్యావహారిక రూపాంతరం. వరంగల్ జిల్లాలో ఉన్న ఐనవోలు అనేది మలికార్జున స్వామి కొలువున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఐనవోలు మల్లన్న జనంనోళ్ల లో నానే శక్తవంతుడైన దేవుడు. ఐనోలునే ప్రజలు అవిలేను గా పలికేవారు. పుణ్యకేత్రాల పేర్లను పిల్లలకు పెట్టడం ఆనవాయితీ. ఆయన ఇంటి పేరు శీలా వారు. ఆయన పేరు అలా ‘శీలా అవిలేను’ అయింది.
వరంగల్ జిల్లాలో ఉన్న ఐనవోలు మల్లన్న ఆలయం
అవిలేను వేతనం లో 20 శాతం పుస్తకాల సేకరణ కోసం ఖర్చు చేస్తాడు. తాను సేకరించిన పుస్తకాలు అందరికి ఉపయోగపడాలనే విశాల హృదయంతో సూర్యాపేట లోనో తన నివాసం లోని మొదటి అంతస్థును లక్ష యాబై వేలపుస్తకాలతో కూడిన సొంత గ్రంధాలయం ఏర్పాటుచేశాడు. ఇల్లును గ్రంథాలయంగా మార్చాడు అనడంకన్నా, గ్రంథాలయంలో పుస్తకాల దొంతుల మధ్య మిగిలిన జాగా ఆయన నివాసం ఉంటున్నాడని అనడం సబబు. ఇంట్లో పుస్తకాలదే పెత్తనం.
ఆయన సేకరించిన వాటిలో లక్ష వరకు తెలుగు పుస్తకాలున్నాయి. మిగిలినవి ప్రధానంగా ఇంగ్లీష్, హిందీ పుస్తకాలు. వీటికి తోడు, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషల పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
తన పుస్తక ప్రపంచంలో అవిలేను మాస్టారు
మార్కెట్‌లో లభించనికొన్ని అరుదైన పుస్తకాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. దేవరాజు వెంకట కృష్ణారావు రాసిన 1924లో ప్రచురించబడిన తొలి తెలుగు డిటెక్టివ్ నవల ‘నేనే’, 1955లో వట్టికోట అల్వారు స్వామి రాసిన వివిధ రచయితల కథల సంకలనం ‘దేశోద్ధారక గ్రంథమాల’ అనే మరో పుస్తకం కూడా అతని సేకరించిన పుస్తకాలలో ఉన్నాయి.
1932లో యక్షగానంపై ప్రచురించబడిన అరుదైన పుస్తకం ‘గాండ్ల కాండం’ కూడా లైబ్రరీలో అందుబాటులో ఉంది. అవిలేను సేకరించిన పుస్తకాలలో తెలుగు, హిందీ మరియు ఆంగ్లంలో సాహిత్యం,కవిత్వం, డిటెక్టివ్ నవలలు, పిల్లల సాహిత్యం, జానపద కళలు మరియు సినీ సాహిత్యంపై పుస్తకాలు ఉన్నాయి.
తెలంగాణ రచయితలు మరియు కవుల సాహిత్యానికి సంబంధించిన దాదాపు 10,000 పుస్తకాలు మరియు నల్గొండ జిల్లా రచయితలు రాసిన 2,000 పుస్తకాలు లైబ్రరీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చినాయి.
1993లో ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పుడు తన పుస్తకాల సేకరణ హాబీ ప్రారంభం అయ్యి నేడు సొంత లైబ్రరీ స్థాపించే స్థాయికి వచ్చిందని అవిలేను తెలిపారు. 1999లో తెలుగు పండితుడిగా ఉద్యోగం పొందిన తర్వాత, తన జీతంలో 20 శాతం పుస్తకాలు కొనడానికి ఖర్చు చేస్తున్నాడు.
చందమామ ‘సంతానం’
ఒకనాటి చందమామ పిల్లల కథల మాసపత్రిక ఎందరో పిల్లలను పాఠకులుగా మార్చింది. అవిలేను కూడా చందమామ సంతానమే. ఆయన కథలమీద, నవల మీద ఉన్న శ్రద్ధ ఆయన్ని ఆనాటి లైబ్రరీకి మళ్లించింది. 1993లో ఆయన లైబ్రరీ సందర్శన మొదలయింది. అక్కడ ఎన్నో కథల పుస్తకాలు చదువుతున్నపుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ లైబ్రరీకి రోజూ రావడం కన్నా మన ఇంట్లోనే పుస్తకాలు ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఆయన పుస్తకాన్వేషిగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు సాగిన బుక్ హంట్ ఫలితమే ఈ లైబ్రరీ. " నా వయసు ఇపుడు 49 సంవత్సరాలు. ఇందులో దాదాపు 30 సంవత్సరాలుగా పుస్తక సేకరణ జరుపుతూనే ఉన్నాను," అని అవిలేను ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పాడు. తన ఇంటికి పిల్లల మర్రి పినవీరభద్ర కళా పీఠం అని పేరు పెట్టుకున్నరు. ఇది సంగీత, సాహిత్య కళా పరిశోధనా వేదిక అని చెప్పుకున్నారు.
పుస్తకాలను సేకరించడానికి అతను చెత్త పేపర్లు, బుక్స్ కొనే దుకాణాలు, పుస్తక దుకాణాల , పుస్తక ప్రదర్శనలను సేకరించేందుకు ఎంపిక చేసుకున్నట్లు అయన తెలిపారు. చెత్త పేపర్లు, పుస్తకాల దుకాణం లో తనకు చాలా అరుదైన పుస్తకాలు లభించాయని, వాటిలో కొన్ని కిలోగ్రాముకు రూ. 50కు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఇదే పైకి సాదా సీదాగా కనిపించే ఇల్లు. ఈ గోడల వెనక పుస్తకం విశ్వరూపం దాక్కుని ఉంది.
ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పరిశోధనా విద్యార్థులు కూడా తమ పీహెచ్‌డీ థీసిస్ తయారు చేసుకోవటానికి ఈ గ్రంధాలయంలోని పుస్తకాలను చదవటానికి అతని ఇంటికి వస్తుంటారు. సందర్శకుల నుండి అతను ఎలాంటి రుసుము వసూలు చేయడు.
అలివేను సహా ఉపాధ్యాయుడు జెల్లా ప్రసాద్ మాట్లాడుతూ అలివేను పుస్తక ప్రేమను వర్ణించేందుకు సరైన పదం లేదని అన్నారు. ‘ అలివేను పుస్తకాన్వేషణ నిరంతరం సాగుతూ ఉంటుంది. దానికి విసుగు విరామం లేదు. సెలవు దినాలలో కూడా ఆ సూర్యాపేట లోని ఎదో ఒక పాత పేపర్ల షాప్ లో పేపర్ల మధ్య పుస్తకాలను వెతుకుతూ ఆయన కనిపిస్తాడు. దుమ్ము, ధూళి ని సైతం లెక్క చేయడు. అలివేను అంటే పుస్తకం. ఆయన ఇల్లు ప్రపంచం పుస్తకం,’’ అని ప్రసాద్ తెలిపారు..
ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన పరిశోధన విద్యార్థి కే ప్రవీణ్ కుమార్ మాట్లాతుడూ పరిశోధక విద్యార్థులకు అవిలేను ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు. "ఎంత మంది తన లైబ్రరీకి వచ్చినా అలివేను నవ్వుతు పలకరిస్తారు. ఆహ్వానిస్తారు. తన లైబ్రరీని సందర్శించే వారికోసంచల్లటి మంచి నీటి సదుపాయం, ఫాన్స్ కూడా ఏర్పాటు చేసారు,’’అని తెలిపారు.
తన పరిశోధన కోసం అనేక గ్రంధాలయాలను సందర్శించానని, ఒక మిత్రుని ద్వారా అవిలేను లైబ్రరీ గురించి సందర్శించానని చెబుతు ఒక వ్యక్తి పుస్తకసేకరణ విశ్వరూపం అలివేను లైబ్రరీ అని, ఇది బహుశా ప్రపంచ రికార్డు అయిఉంటుందని ప్రవీణ్ తెలిపారు.
అనేక అరుదైన పుస్తకాలు అవిలేను లైబ్రరీ లో అందుబాటులో ఉన్నాయన్నాని తన పరిశోధన కోసం ఇప్పటికి 10 సార్లు ఈ లైబ్రరీని సందర్శించినట్లు ఆయన తెలిపారు.