సృజనాత్మకతకు ప్రతిబింబం గిరిజన కళలు..
x

సృజనాత్మకతకు ప్రతిబింబం గిరిజన కళలు..

ఈ రోజు 'జన జాతీయ గౌరవ దివస్'


- డా. ద్యావనపల్లి సత్యనారాయణ

గిరిజన సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, గిరిజనులకు ప్రకృతితో గల అనుబంధం... ఇవి గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ప్రధాన అంశాలు. ఇవి వారి నృత్యాలు, హస్తకళలు, పండుగల ద్వారా ఇప్పటికీ సంరక్షించబడుతున్నాయి.

నృత్యాలు:

ఆధునీకరణ ప్రభావం ఉన్నప్పటికీ, గిరిజన నృత్యాలు తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో కీలక భూమికను పోషిస్తూనే ఉన్నాయి. దీపావళి సందర్బంగా జరిగే దండారి పండుగ (అక్టోబర్) లో గోండుల పురుషులు గుస్సాడి నృత్యం చేస్తారు. వీరు తమను తాము నెమలి ఈకల కిరీటం, గంటలు, విభూతి రేఖలతో అలంకరించుకొని ఉత్సాహంగా నృత్యం చేస్తారు. ఈ పండుగ కొర్కొటుత్సవం అనే కోడి బలి ఆచారంతో ముగుస్తుంది. డెంసా నృత్యం... వివాహాలు, పెర్సా పెన్ (ముఖ్య దైవం) వేడుకల్లో రాజ్ గోండ్లు పురుషులు–మహిళలు కలిసి చేస్తారు. పేప్రే, ఢోలు, ఖాలిఖోం వంటి వాద్యాలతో ఈ నృత్యం సాగుతుంది. గోదావరి ఒడ్డున నివసించే కోయలు సమ్మక్క, సారలమ్మ, సడలమ్మ జాతరలలో కొమ్ము కోయ (బైసన్-హార్న్) నృత్యం చేస్తారు. పురుషులు అడవి దున్న (బైసన్) కొమ్ములను తలపాగా లాగా ధరించగా, మహిళలు తలపైన పక్షి ఈకలు అలంకరించుకొని తమతమ వలయాలలో నృత్యం చేస్తారు. హోలి, తీజ్ పండుగల్లో బంజారా (లంబాడి) మహిళలు రంగురంగుల వస్త్రాలతో అలంకరించుకుని చేతులు పైకెత్తి ఊపుతూ వలయాకార నృత్యం చేస్తారు. తమ పండుగలు, జాతరలలో భాగంగా అటవీ జీవనాన్ని ప్రతిబింబించే విల్లు, బాణాలు, తేనె బుట్టలను ధరించి డప్పు, ఊదనగ్రోవి (ఫ్లూట్) వాద్య శబ్దాలకు అనుగుణంగా చెంచులు చెంచాట అనే నృత్యం చేస్తారు.

చిత్రకళలు:

గిరిజన సంక్షేమ శాఖ ఔత్సాహిక గిరిజన యువకులకు చిత్రకళలో శిక్షణనిచ్చి, మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా గిరిజన చిత్రకళలను ప్రోత్సహిస్తుంది. గోండ్ చిత్రాలు జంతువులు, చెట్లు ప్రధానాంశాలుగా పలు రంగుల గీతలతో శోభాయమానంగా ఉంటాయి. ఐరేని కుండలు, పడిగెలు (జెండాలు) లలో ప్రతిఫలించే చిత్రాలతో కోయ చిత్రాలు చరిత్ర పూర్వ యుగ శైలి చిత్రాలను ప్రతిఫలిస్తాయి. నాయికపోడ్ చిత్రాలు వారి ఆలయ శిరస్సులు (మాస్కులు) ఆధారంగా ఉంటాయి. బంజారా చిత్రాలు గిరిజనుల దైనందిన జీవనాన్ని తేజోమయ రంగుల్లో చిత్రిస్తాయి. ఇవన్నీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ద్వారా ధృవీకరించబడి విక్రయించబడుతున్నాయి, తద్వారా కళాకారులకు ఆదాయం లభిస్తున్నది.

కళలు & చేతి పనులు:

గిరిజనుల చేతివృత్తులు వారి సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం. నాయికపోడ్ మినియేచర్ మాస్కులు సింగ బోయుడు, భీమన్న వంటి పురాణ పురుషులు, పెద్దలు, చారిత్రిక యుగ పురుషుల రూపాలను రంగురంగులుగా చిత్రిస్తాయి. భద్రాచలం ప్రాంతంలోని కోయ హస్తకళాకారులు కోయ సాంప్రదాయ నృత్యకారులు, జంతువులను టేక్ చెక్క ప్రతిమలుగా తీర్చిదిద్దుతారు. అసిఫాబాద్ జిల్లా ఓజా హస్తకళాకారులు మైనాన్ని కరిగించి మట్టి బొమ్మలపై పోత పోయడం ద్వారా అందమైన ఇత్తడి శిల్పాలు, దేవతలు, ఎడ్ల గంటలు, జంతు రూపాలను తయారు చేస్తారు. బంజారా మహిళలు ఎంబ్రాయిడరీ అద్దాల కళ ద్వారా రంగురంగుల దారాలతో అలంకార దుస్తులు, వస్త్రాలు రూపొందిస్తారు. ఎరుకలు, కోలములు, కొండరెడ్లు కంక (వెదురు) ఈనెలతో గృహ, పూజా అవసరాల కోసం పలు హస్తకళలను రూపొందిస్తారు.

జాతరలు & పండుగలు:

గిరిజన పండుగలు వారి ఆధ్యాత్మిక భక్తి, సంఘ సంక్షేమం, ప్రకృతి పట్ల గౌరవాన్ని ప్రతిఫలిస్తాయి. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేళా. కోటిన్నర మంది భక్తులు పాల్గొనే ఈ జాతరలో కంక వనం తేవడం, దేవతలను వనప్రవేశం చేయించడమే ప్రధాన అంశాలు. అసిఫాబాద్లో జంగుబాయి జాతర (గోండ్లు), కేస్లపూర్లో నాగోబా జాతర (పెర్సాపెన్ – ప్రధాన దైవం), జోడేఘాట్లో కుమ్రం భీం వర్ధంతి, పాట్నాపూర్లో ఫులాజీ బాబా జయంతి (ఆంధ్ లు), గాంధారి మైసమ్మ జాతర (నాయికపోడ్లు), సంత్ సేవాలాల్ జయంతి (లంబాడీలు) ఇతర ప్రధాన గిరిజన జాతరలు. నాంచారమ్మ జాతర (ఎరుకలు), బౌరాపూర్ జాతర (చెంచులు) లలో వారి సంతానోత్పత్తి కాంక్షను, ప్రకృతి దైవాల పట్ల వారి భక్తిని వ్యక్తం చేస్తాయి. తీజ్, కొత్తల పండుగ వ్యవసాయ చక్రాన్ని సూచిస్తాయి, చైత్ర పండుగ విత్తన శుద్ధీకరణ, వేట ఆచారాలతో జరుగుతుంది.

ఈ నృత్యాలు, కళలు, చేతివృత్తులు, పండుగలు—అన్నీ కలిపి తెలంగాణ గిరిజన సమూహాల సజీవ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, వారి అస్తిత్వం, పర్యావరణ అనుబంధం, ఆధ్యాత్మిక సంప్రదాయాలను భారత సాంస్కృతిక క్షేత్రంలో తమ సగర్వ వాటాను చాటి చెప్తున్నాయి.

Read More
Next Story