ఈ డిసెంబర్ మొదటి 15 రోజుల్లో తెలుగు మీడియాలో ఏం జరిగింది?
మన మీడియా వారికి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ గానీ, నోబుల్ అవార్డు గానీ తప్పక ఇవ్వాలంటున్న రచయిత రేకా చంద్ర శేఖర రావు
ప్రజల సమస్యలు పట్టని దిక్కు మాలిన మీడియానా మనది అంటూ ఒక రచయిత ఆవేదన
— రేకా చంద్ర శేఖర రావు
పుష్ప -2 సినిమా గురించిన వార్తలతో 2024 డిసెంబర్ నెల ప్రారంభం అయింది. పుష్ప 2 (Pushpa 2 : The Rule) వరల్డ్ వైడ్ గా ఎన్ని వేల కేంద్రాలలో విడుదల కాబోతున్నది?
ఎన్ని వేల కోట్లు వసూలు చేయబోతున్నది?
పుష్ప 2 సినిమాలో ఎన్ని అదిరి పోయే సీన్లు ఉన్నాయి?
అల్లు అర్జున్ ఎన్ని రకాల డ్యాన్సులు వేశాడు?
ఇవే మీడియా వార్తలు.
సంధ్య ధియేటర్ కి అల్లు అర్జున్ వెళ్ళిన ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోవడం, రెండో మనిషి హాస్పటల్లో ఆపదలో వుండడం, ఆ కుటుంబానికి జరిగిన నష్టం గురించిన వార్తలు మాత్రం పలుచబారి ఉన్నాయి.
పుష్ప రోజు వారి కలెక్షన్లు ఎంతెంత వచ్చింది?
ఏ రాష్ట్రంలో ఎంత ?
ఏ దేశంలో ఎంత?
మొదలయిన పనికి మాలిన ప్రజలకు అవసరం లేని వార్తలతో ప్రజల మైండ్లు నింపేశాయి. పైగా ఆ సినిమా ఏమయినా గాంధీ వంటి సందేశ సినిమానా!
జై భీమ్ వంటి ప్రబోదాత్మక సినిమానా! అల్లూరి సీతారామరాజు , భగత్ సింగ్ లాంటి స్వాతంత్య్ర పోరాట త్యాగ పురుషుల సినిమానా!
ఒక స్మగ్లర్, ఒక అడవి కలప దొంగ ఎలా స్మగ్లింగ్ చేయాలో చూపించే సినిమా! మంత్రులను, ప్రభుత్వాలను తనకు లొంగేలా చేసుకునే సినిమా!
***
ఆ తర్వాత రెండో ఎపిసోడ్ మంచుకుటుంబం ఆస్తుల తగువు. ఒక తండ్రీ - కొడుకుల కుటుంబం సంపాదించిన వేల కోట్ల ఆస్తులను పంచుకోవడంలో ఒక కొడుకుతో వచ్చిన తగువు. వారంతట వారే కేసులు పెట్టుకుని ప్రపంచానికి వారి పరువు ప్రతిష్టల గొప్పలను చెప్పుకున్నారు.
ఈ సందర్భంలో వారు పిలవకుండా వారి ఇంటి లోపలకు మీడియా వెళ్ళవచ్చునా! వారి పడక గదుల దాకా వెళ్ళ వచ్చునా! ఆ గొడవలలో తగిలిన దెబ్బల పైన (రెండు వైపులా తగిలాయి అని చెపుతున్న వాదన కూడా ఉంది) కేసులు , హత్యా ప్రయత్నం కేసులు మీడియా వారు పెట్టారు.
ప్రతి వారి ఇంటి లోపలకు మీడియా వారు వెళ్ళే హక్కు ఉన్నదా! అన్న చర్చ ఎవరూ చేయడం లేదు. ఆవేశంలో జరిగిన దెబ్బలను, గొడవలను హత్యా ప్రయత్నం అని మీడియా వారు అన వచ్చునా!
ఇదే మీడియా వారు గతంలో విమలక్క ఆఫీసు మీద , కోదండరాం ఇంటి మీద , వరవర రావు ఇంటి మీద కేసియార్ ప్రభుత్వం చేయించిన దాడులు గురించి ఎందుకు ధైర్యంగా ఖండించ లేక పోయింది అన్నది కూడా ప్రజల గమనంలో ఉంది.
***
మరల మూడో ఎపిసోడ్
అల్లు అర్జున్ అరెస్టు.
ఒక మనిషి మరణించిన కేసులో అందుకు ముఖ్య కారకులలో ఒకరిని - అల్లు అర్జున్ ని అరెస్టు చేస్తే మీడియా అంతా కాకి గోల .
ప్రతి పక్ష నాయకుడు
కే టి యార్ అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం అక్రమం అంటున్నాడు. అదే అరెస్టు గనుక చేయక పోతే ….
సంధ్యా ధియేటర్ మరణానికి కారకుడు అల్లు అర్జున్ ని అరెస్టు చేసే దమ్ము ప్రభుత్వానికి లేదా!
అని అన గలడు.
రేవంత్ అవునంటే కాదనడం, కాదంటే అవుననడం అనే
ఏక సూత్ర కార్యక్రమం
గల కేటియార్ రెండంచుల కత్తి లాగా మాట్లడ గలడు?
***
ఈ కాలంలో మీడియాకి
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలు పట్టలేదు?
పార్లమెంటు చర్చలు మీడియాకు అసలు పట్టలేదు.
సమాఖ్య వ్యవస్తను ధ్వంసం చేసే జమిలి ఎన్నికల పైన కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం
గురించి ఛానళ్ళకు పట్టలేదు.
ఈ 15 రోజులలో జరిగిన ఎన్కౌంటర్ల హత్యల గురించి మీడియాలో చర్చలే లేవు.
ఆ విధంగా ప్రజల సమస్యలు పట్టని ఎపిసోడ్లను నడుపుతున్న
మన మీడియా వారికి ఆస్కార్ అవార్డు గానీ, గిన్నీసు బుక్ అవార్డు గానీ, వీలయితే నోబుల్ ప్రైజు అవార్డు కానీ ఇవ్వడం సముచితమేమో….
Next Story