తెలుగు వాళ్లూ బంగాళ దుంపలు...
x

తెలుగు వాళ్లూ బంగాళ దుంపలు...

కోవ్వలి హ్యూమరసం: రెండు బంగాళ దుంపలు ఉంటే పది రకాల కూరలు చేసుకోరూ. అలాగే నలుగురు తెలుగుగోళ్ళు గుమికూడితే ఐదు సంఘాలు, పది గ్రూపులు పెట్టుకోవచ్చు.


-ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ


బంగాళా దుంప ఎంతో రుచికరమైన కూరకి పనికి వచ్చే పంట. కొంతమంది దాన్ని వెజిటబుల్ గా గుర్తించరు. కూరకి ఆంగ్ల పదం వాడేనేమని నా మాతృ భాషాభిమానాన్ని శంకించకండి. వండిన కూరకీ, పండిన కూరకీ; పండిన బియ్యానికీ, వండిన బియ్యానికీ తేడా మన పదకోశంలో లేదుగా.
గుర్తింపు ఉన్నా, లేకున్నా ఇందు గలదు, అందు లేదని సందేహము వలదు అన్న చందంగా బాగాళా దుంప దాదాపు అన్ని దేశాల లోనూ దొరుకుతుంది, అన్ని కూరల లోనూ ఇముడుతుంది. అందుకే, ఒక సామెత పట్టింది – బంగాళా దుంప, తెలుగోడూ లేని ప్రాంతం లేదని. నిజమే కదా; మనోళ్లు లేని దేశం కానీ, కంపెనీ కానీ ప్రపంచం లో ఎక్కడైనా ఉన్నాయా! బంగాళా దుంపలా మెత్తాగా కాకుండా, గట్టిగా కాకుండా, మెత్త బడ్డానికి ఎక్కువ కాలం బెట్టు చేయని సర్వాంతర్యామి తత్వం కదా మనది. ఏ సమూహంలోనైనా దూరి, ఇమిడిపోయి, పైకి ఎక్కగల చాతుర్యం మనకీ బంగాళా దుంపకీ తప్ప ఇంకెవరికి ఉంది! సార్వత్రిక ఉనికి, గుర్తింపు ఉన్న తెలుగోడు, బంగాళా దుంప ఎందుకు చులకనకి గురి అవుతాయి! తెలుగోడు అందరితోనూ కలిసిపోతాడు, రుచికరమైన మాటలు మాట్లాడతాడు ఏ భాషలోనైనా – నేర్చుకుని, accent ఎలా ఉన్నా. బంగాళా దుంప కూడా అంతే కదా! వేగించినా సహనంగా వేగి రుచికరమైన ఆహారంగా మారుతుంది; ఫ్రెంచి వారికి ఫ్రెంచ్ ఫ్రైస్ గాను, తెలుగు వారికి వేపుడు గానూ, ఇలా మాడి, వేగి, ఎందరికో భోజన పళ్ళెంలో నిగ నిగా మెరుస్తుంది!
పది బంగాళా దుంపలు ఇంట్లో ఉంటే పలు రకాల కూరలు చేసుకోవచ్చు. అలాగే పది మంది తెలుగుగోళ్ళు ఉంటే కనీసం ఐదు సంఘాలు, పది సమూహాలు పెట్టుకోవచ్చు. బెంగాలీ బాబుల తరవాత పేర్లు సృష్టించడం లో తెలుగోడు దిట్ట. తానా, ఆటా, నాటా, బాటా, టాటా, ఇల్లా ఎన్నో సృజనాత్మక పేర్లతో, కుల సమూహాల సృష్టి చేయగల సత్తా మనోడికి మాత్రమే సొంతం.
పోటీ పడి భాష, సాహిత్య సేవ చేయాలనే తపనతో సినీ రంగ ప్రముఖులను అమెరికా తీసుకు వచ్చి పొందులు, విందులిచ్చే భాషా ప్రేమికులు తెలుగోల్లే. అమెరికాలో ఉంటూ మరీ గోధుమ రంగు భామలని తీసుకు వస్తే ఏమి బాగుంటుందని వీలయినంత వరకూ“ ఫెయిర్ complexion” ఉన్న భామలని తీసుకు వస్తారు.
ప్రవచనాలంటే తెలుగోడికి మహా పిచ్చి. గరికనైనా, గంటెనైనా, పైన కండువా, కింద పంచీ (ప్రవచన సమయానికి మాత్రం) కట్టి వాగే పైత్య ప్రకోపాలని శ్రద్ధగా విని, విరివిగా, దండిగా విరాళాలు ఇచ్చి, చివరగా ఏ మంత్రం ఎన్ని సార్లు చదివితే, రాస్తే అమ్మాయి పెళ్లి జరుగుతుందో, అబ్బాయికి పేద్ద ఉద్దోగం వస్తుందో తెలుసుకుని, సాష్టాంగ నస్కారాలు చేసి దక్షిణలు ఇచ్చి సంతసిస్తారు, అమాయక తెలుగోల్లు, భావోద్వేగ పవన కుమారాత్ములు.
పదహారు గంటలు ఉడక పెట్టినా, ముప్పై నిముషాలు వేగించినా ఒక్క నిముషం ప్రశంసించి కరచాలనం చేస్తే, అన్నీ మరచి మళ్లీ చాకిరీకి సిద్ధమయ్యే వంగే వెన్నెముక ఉన్న, “ఆత్మాభిమానం” మెండుగా ఉన్న మనోడు ప్రపంచాన్ని ఏలుతాడు; కానీ, మనోళ్లు పల్లెల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరో వస్తారని, ఏదో తెస్తారని, ఎంతో చేస్తారని ఆశతో, రాని వర్షం కోసం ఆశపడే రైతులా ఎదురు చూస్తున్నారు. ఏ భాషలో ఏడ్వాలో కూడా తెలియక మౌనంగా రోధిస్తున్నారు.


(ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, రచయిత, కవి. అమెరికాలో శాస్త్రవేత్త)

Read More
Next Story