అనాగరికులు -రౌండ్ టూ ( కవిత)
ఇజ్రేలీ కవి అమీర్ ఆర్ రాసిన హీబ్రూ కవిత బార్బేరియన్స్ (రౌండు టు) (Barbarians- Round Two) వివియన్ ఈడెన్ ఇంగ్లీష్ అనువాదానికి తెలుగు అనుసృజన ఇది
అనాగరికులు రౌండ్ టూ ( కవిత)
మాతృక : అమీర్ ఆర్ హీబ్రూ కవిత
తెలుగు అనుసృజన: గీతాంజలి
మేము ఆ అనాగరికుల కోసం సాగిన మా నిరీక్షణ వృధా కాలేదు
మేము నగర చౌరస్తాలో గుంపులుగా గుమిగూడం కూడా వృథాకాలేదు.
మన మహానుభావులు అధికారిక రాజ వస్త్రాలను వేసుకుని..
ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం తమ ఉపన్యాసాన్ని సాధన చేయడం ఏమాత్రమూ వ్యర్థం కాలేదు.
మన మందిరాలు ధ్వంసం చేసి ..వాళ్ల దేవుళ్ళ కోసం కొత్త మందిరాలు తయారు చేయడం అస్సలు వృధా కాలేదు.
మరి మేం ఏం చేశాం ?
సరిగ్గా అలాంటి వారికోసం. .
ఆ బయటి వారి కోసం..
ఏమీ రాయబడని మా పుస్తకాలను కాల్చివేసాం !
ఎవరో భవిష్య వాణి చెప్పినట్లే..అనాగరీకులు ...ఆ విదేశీయులు వచ్చి
రాజు చేతుల్లోంచి నగర ముఖ ద్వారం తాళం చెవులు లాగేసుకున్నారు !
అయితే...మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు
చాలా తెలివిగా మా దేశపు సంప్రదాయ దుస్తులు వేసుకుని మరీ వచ్చారు.
ఇంకా విచిత్రం ఏమిటంటే వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ అచ్ఛం మా రాజ్యపు సాంప్రదాయాల లాగానే ఉన్నాయి.
ఇక వాళ్లంతా మమ్మల్ని మా భాషలోనే ఆజ్ఞాపిస్తున్నప్పుడు..
వాళ్ళు ఎప్పుడు..ఎలా
మా రాజ్యాన్ని ఆక్రమించేసారన్నది నిజం...మాకస్సలు అర్థమే కాలేదు !
ఇదంతా..ఈ మాయ అంతా
మా మీదా.. మా రాజ్యంలోనే ఎప్పుడు..ఎలా జరిగిందో మాకస్సలు తెలీలేదు !