ప్రేమ తరువాత మళ్ళీ ప్రేమ
x

ప్రేమ తరువాత మళ్ళీ ప్రేమ

ఎపుడో ఒక సారి ప్రతిమనిషి తనకు తాను ఎదురుకాక తప్పదు. విస్మరించిన తనని తాను గుర్తించక తప్పదు. ఈ అపూర్వ కలయిక మీద డెరెక్ వాల్కాట్ రాసిన గొప్ప కవితకు తెలుగు రూపం.




ప్రేమ తరువాత మళ్ళీ ప్రేమ

Love After Love by Derek Walcott*


(అనుసృజన-గీతాంజలి)

ఆ సమయం వస్తుంది
నీ సొంత ఇంటి ముందుకి.. నీ సొంత అధ్ధంలోకి వచ్చిన నిన్ను నువ్వు
గొప్ప హర్షాతిరేకంతో పలకరించే సమయం వస్తుంది!
నిన్ను నువ్వు ఇష్టపడే సమయం.....
అప్పుడు ఒకరినొకరు స్వాగతించుకోవడం చూస్తూ చిరునవ్వుతో
"రా ఇక్కడ కూర్చో..కొంచెం తిను" అంటావు.
నీకు నువ్వే మనోహరమైన స్వాగతం చెప్పుకుంటావు
ఒకప్పుడు నీలో ఉన్న ఆ అపరిచితుడ్ని మళ్ళీ ప్రేమిస్తావు చూడు.. ఇది నిజం
ఆ అపరిచితుడ్ని నువ్వుగా గుర్తు పట్టాక.. అతనికి కొద్దిగా
మత్తెక్కించే మధురమైన వైన్ ఇవ్వు..కమ్మని రొట్టె కూడా ఇవ్వు
నన్నడిగితే..అసలు నీ హృదయాన్నే అతనికి తిరిగి ఇచ్చేయి నిన్ను ప్రేమించిన ఆ మనిషికి.
అర్థం అయిందా నీకు ?
తప్పేం ఉంది చెప్పు?
ఆ అపరిచితుడికి... నిన్ను ఆత్మతో సృజించి..నిన్ను లోతుగా తెలుసుకున్న ..నిన్ను బ్రతుకంతా ప్రేమించిన ..
నీ లోపలే అసలైన నువ్వుగా ఉన్న
ఆ అపరిచితుడిని వదిలేసి వేరెవరి కోసమో..
జీవితమంతా..అతన్ని నిర్లక్ష్యం చేసావు.
ఇక చాలు...
ఇకిప్పుడు నువ్వేం చేయాలో అది చెయ్యి
ముందు అలమారాలో దాచుకున్న ఆ ప్రేమలేఖలు ...
ఫొటోలు నిస్సహాయంగా రాసుకున్న రాతప్రతులు..తీసేయ్!
అవి నీకు నీ పాత నిన్నుని జ్ఞాపకం చేస్తాయి.
అధ్ధం లోంచి నీపాత ప్రతిబింబాన్ని శుభ్రంగా వొలిచి అవతల పడేయి..
ఇటు రా...కాసింత నిమ్మళంగా.. ప్రశాంతంగా కూర్చో ..
నీలోలోపలికి నిదానంగా నిన్ను నువ్వు చేరుకోవడానికి...నిన్ను నువ్వు దొరకబుచ్చుకోవడానికి!
నిన్ను నువ్వు మళ్లీ ప్రేమించుకోడానికి !
పద.. ఇక నీ జీవితాన్ని ఉత్సవం లా పండగ చేసుకుందువు గానీ.

*డెరెక్ వాల్కాట్ (జనవరి 23, 1930 – మార్చి 17, 2017) అమెరికా నాటక రచయిత, కవి, చిత్రకారుడు. 1992లో ఆయన నోబెల్ బహుమతి లభించింది.



Read More
Next Story