మా బానిసత్వాన్ని పోగొట్టవా  మహానుభావా!
x
విజయవాడలో వెలసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం

మా బానిసత్వాన్ని పోగొట్టవా మహానుభావా!

దుర్గమ్మ నవరాత్రులు, గుణదల తిరునాళ్ల, యనమలకుదురు శివరాత్రి.. ఇకపై డాక్టర్ అంబేడ్కర్ సంస్మరణ వారోత్సవాలు. చూసొద్దాం పదండి!!


బెజవాడ.. బందరు రోడ్డు.. జనమంతా హడావిడిగా తిరుగుతున్నారు. కూలీలు కాంక్రీటు వేస్తున్నారు. మేస్త్రీలు కూలీలను గదమాయిస్తున్నారు. బొచ్చెల కొద్ది కాంక్రీటు పోస్తుంటే కన్ను మూసి తెరిచేలోగా ఉన్న షేపులు మారిపోతున్నాయి. క్రేన్లు గిరగిరా తిరుగుతున్నాయి. అద్దాలు బిగింపుల మధ్య గోడలకు రంగులద్దేవాళ్లు అరుపులు వినిపిస్తున్నాయి. కొందరు మొక్కలు నాటుతున్నారు. మరికొందరు ఇనుముతో తయారు చేసిన నెమళ్లను బిగిస్తున్నారు.

...

విజయవాడ ఒకప్పటి బెజవాడ.. ఎండకాలమొస్తే బ్లేజ్ వాడ. నలుదిక్కులా నాలుగు తీర్ధ క్షేత్రాలు.. ఓపక్క కృష్ణమ్మ, ఆ చివర్న బందరుకాలువ, మధ్యలో ఏలూరు కాల్వ.. ఇప్పటి బస్టాండ్ పక్కనున్న దుర్గమ్మ వారధి ఎక్కిచూస్తే.. ఓ పక్క గాంధీ కొండ, ఎదరుగా దుర్గమ్మ‌‌ కొండ మరోపక్క గుణదల కొండ ఇంకొ పక్క సీతానగరం కొండ.. కనుచూపు మేరలో యనమలకుదురు కొండ. బస్టాండ్ లో దిగి బందరు రోడ్డు ఎక్కి మ్యూజియం బస్టాప్ కి వచ్చే సరికి మనకో అద్భుత దృశ్యం కనిపిస్తుంది.

అది పీడబ్ల్యూడీ గ్రౌండే...


స్వరాజ్య మైదానమని ఇప్పుడు సోగ్గా పిలుస్తున్నారు గాని నిజానికది పీడబ్య్లూడీ గ్రౌండ్స్. కబ్జాలు, అధికారిక ఆక్రమణలు వంటివి పోగా కాస్త అటు ఇటుగా 18 ఎకరాలు మిగిలింది. ఒకప్పుడు ఏ పెద్ద మీటింగ్ జరిగినా ఆ గ్రౌండ్ లోనే జరిగేది. కమ్యూనిస్టు పార్టీ పదో మహాసభ అక్కడే జరిగింది. ఇప్పుడా గ్రౌండ్ చుట్టూ ముదురు నీలం రంగు రేకులు కట్టి ఉన్నాయి. లోపలంతా ఉయ్ ఉయ్ మని మోతలు వినపడుతున్నాయి.

ఓసారి అలా తొంగిచూస్తే...

ఏమిటీ హాడావిడి అని లోనికి తొంగిచూస్తే.. మతిపోయే అద్భుత సుందర విగ్రహం మనకు కనువిందు చేస్తుంది. జనారణ్యం, వాహనాల మోతలు, ఎవడి గోల వాడిది. నగరాల్లో అవసరాలు తప్ప పరిసరాలను పట్టించుకునే ఓపికా, తీరిక ఉండదు కదా.. అందువల్ల సిటీలో ఇటువంటి దొకటుందని దగ్గరకు పోయే దాకా కనిపించదు. నిజానికి కనకదుర్గ వారధి మించి కొంచెం తల ఎగరేసి చూస్తే విజయవాడ మణిహారంలో ఇంతటి మకుటం ఒకటుందా అన్పిస్తుంది....

నవ భారత నిర్మాతా.. నిను చూడతరమా...


అదే.. అంబేద్కర్ స్మృతి వనం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ సెంటర్. అక్కడుంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహం. కులంపై కత్తెత్తి, మతంపై దుమ్మెత్తి పోసిన మహామనిషీ, నవ భారత నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్‌. 20 శతాబ్దపు భారతీయ బహుముఖవేత్త, మానవ హక్కుల విజేత. ఇప్పుడున్న పాలకులు మారుస్తామంటున్న.. భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్‌. ఆయన జ్ఞాపకార్థం పెడుతున్నదే ఈ సజీవ శిల్పం. విగ్రహం ఎత్తు 125 అడుగులు. అంటే 38 మీటర్లు. హైదరాబాద్ మహానగరంలో పెట్టిన విగ్రహం కన్నా పెద్దది. ఈ 125 అడుగుల విగ్రహం పెట్టడానికి 80 అడుగుల ఎత్తున పెద్ద దిమ్మె కట్టారు. అంటే మొత్తం 205 అడుగుల ఎత్తులో మనకు కనిపిస్తుంది. ఆ మహావిరాట్ విశ్వరూపాన్ని చూడడానికి మనం అమాంతం తలపైకెత్తి చూడాల్సిందే. అంతసవ్యంగా సాగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 జనవరి 19న ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అక్కడా ఇక్కడా 12 అడుగుల ఎత్తే...

ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల వారికి అంబేడ్కర్ పై విపరీతమైన ప్రేమాభిమానాలు ఉప్పొంగాయి. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అంటే 2016 ఏప్రిల్ 14న 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆ తర్వాత అదే బాటలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కూడా హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించి 2023లో ప్రారంభించారు.

ఐనవోలు నుంచి విజయవాడ నడిబొడ్డుకు...


2017 ఏప్రిల్ 14న అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు కొత్త రాజధాని అమరావతిలోని ఐనవోలు గ్రామ సమీపంలో పునాది రాయి వేశారు. ఆయన పదవీ కాలం పూర్తయినా అంబేడ్కర్ విగ్రహ పనులు చేయలేకపోయారు. ఈలోగా ప్రభుత్వం మారింది. చంద్రబాబు తలపెట్టిన "డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం" పథకం అటకెక్కింది. ఆ ప్రాజెక్ట్ విజయవాడ నగరానికి తరలింది. జూలై 9, 2020న శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 400 కోట్లు. 'డా. BR అంబేద్కర్ స్వరాజ్య మైదాన్ గా పేరు మారింది. 2023 ఆగస్టులో విగ్రహం పెట్టడం పూర్తయింది.

ఈ మైదానంలో ఏమేమి ఉంటాయంటే...

ఈ ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణం 20 ఎకరాలు. రూ. 400 కోట్ల ఖర్చు. ఈ మెమోరియల్ పార్కును ఏకకాలంలో 3వేల సందర్శించవచ్చు. పెద్ద కన్వెన్షన్ హాల్, అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ. అందులో ఆయన రాసిన, సేకరించిన 10 వేల పుస్తకాలు ఉంటాయి. బౌద్ధ ధ్యాన మందిరం, ప్రకృతి రమణీయత ఉట్టిపడే దృశ్యాలతో ఉద్యానవనాలు, పార్క్, 2 వేల మంది కూర్చునే వీలున్న ఓపెన్-ఎయిర్ థియేటర్ ఈ మొమోరియల్ లో కొన్ని. మెమోరియల్ చుట్టూ వాటర్ ఫౌంటెన్, మ్యూజికల్ ఫౌంటెన్ నిర్మాణం చురుగ్గా సాగుతోంది.

త్వరలోనే ప్రారంభం...

ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఈ జనవరిలో కచ్చితంగా సాగే అవకాశం కనిపిస్తోంది. “పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. సుమారు 6 వందల మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేస్తున్నారు. అంతసవ్యంగా సాగితే జనవరి 19 నుంచి 26వ తేదీ మధ్య ప్రారంభం కావొచ్చు“ అని చెప్పారు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మల్యాద్రి. జనవరి రాజ్యాంగ దినోత్సవం కనుక ఆ రోజునే ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Read More
Next Story