సింధులోయలో వెలుగుతున్న దీపాన్ని చిదిమేసింది ఎవరు?
ఒక సాంస్కృతిక మహా సంగ్రామం (హరప్పనుల గాథ) నవల సీరియల్ ప్రారంభం. ఆంగ్ల మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) - పాణిగ్రాహి బేతి.
ఆంగ్ల మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) - పాణిగ్రాహి బేతి. తెలుగు సేత: ఆడెపు లక్ష్మీపతి
ఉపోద్ఘాతం
సింధు లోయ ప్రాంతపు హరప్పా, క్రీ. పూ. 1500
పన్నెండు వేల ఏళ్ల క్రితం మానవులు వ్యవసాయాన్ని కనిపెట్టడంతో ప్రస్తుత భారత ఉపఖండంలోని సింధు నది తీరాలవెంట నాగరికత అభివృద్ధి చెందింది. దీనినే ‘సింధు లోయ నాగరికత’ అని పిలిచారు ; ఇది అనేక వేల సంవత్సరాల్లో సీక్వోయా మహావృక్షంలా పెరిగింది. సంక్లిష్టమైన లిపి, ఉన్నతమైన సంస్కృతితో సింధు లోయ ప్రజలు ఒక అధునాతన సమాజానికి గొప్ప ఉదాహరణగా నిలిచారు.
రెండు ముఖ్యనగరాలైన హరప్పా, మహెంజోదారో లలో కనిపించే చక్కని పట్టణ ప్రణాళిక, మురుగునీటి పారుదల వ్యవస్థ ఆనాటి ప్రజల తెలివితేటలకు అద్దం పడతాయి. వాటి ప్రశస్తమైన వాస్తుకళ ప్రాచీన ప్రపంచంలోని గొప్ప నగరాలతో పోటి పడింది.
హరప్పా వాసులుగా కూడా పిలువబడే సింధులోయ ప్రజలు తాము చేసే పనిలో ప్రావీణ్యం పై దృష్టి పెట్టే శాంతి కాముకులు. సమూహ శక్తి పై నమ్మకంతో వారు సామరస్యంగా జీవించారు. ఋతువుల మార్పులు, నేల స్వభావం పట్ల లోతైన అవగాహన కలిగిన వాళ్ళు చాలా విషయాలలో నిష్ణాతులు. వస్తువులను మార్పిడి చేసుకునేందుకు, కథలు వెతలు ఒకరికొకరు చెప్పుకునేందుకు ప్రాంతం నలుమూలల నుంచి వచ్చే వర్తకులతో హరప్పా నిత్యం సందడిగా వుండేది.
సింధు లోయ నాగరికత అలా సిరిసంపదలతో వర్థిల్లుతుండగా ఆర్యులు అనే సంచార జాతికి చెందిన కొత్త బృందం ఒకటి వైదిక వాఙ్మయంతో, సంస్కృత భాషతో అక్కడికి వచ్చింది. సుదూరపు ఉత్తర స్టెప్పీ మైదానాల నుంచి వాళ్ళు తమ ఆదివాసి సమూహాలతో లోయలోని వివిధ భూభాగాల్లోకి వలస వచ్చారు. ఉపఖండంలో భావితరాలపై అమిత ప్రభావం కలగజేసిన ఒక ముఖ్యమైన సాంస్కృతిక సంఘర్షణకు ఇది నాంది.
ఆర్యులది పురుషాధిక్య సమాజం ; కుటుంబంపై, వంశం పై మగవారిదే పెత్తనం. స్త్రీలు ప్రధాన పాత్ర వహించే, సమానత్వానికి ప్రాముఖ్యమిచ్చే సమాజం హరప్పా వాసులది.
ఆర్యులు, హరప్పావాసుల నడుమ అనేక తరాలుగా సాగిన సంఘర్షణలు, సహకారాలను ఈ ఇతిహాస గాథ శోధిస్తుంది. కథ ముందుకు పోయినా కొద్దీ, భారత ప్రజల విలువలు, సంప్రదాయాలు, మతాలకు రూపం దిద్దిన కొత్త నాయకులు, చింతనాపరుల ఆవిర్భావం గురించి తెలియ పరుస్తుంది. ముఖ్యంగా, కాలగమనంలో ‘ హిందూమతం ‘ ఎలా పరిణామం చెందినదో ఈ కథ తెలియ జేస్తుంది.
రచయిత మాట
పలువురు శాస్త్రవేత్తలు ప్రచురించిన సింధులోయ ప్రజల ప్రాచీన చరిత్ర, జినోమ్ ప్రేరణతో రాసిన కల్పిత కథ ఇది. ఈ కథ ముఖ్యమైన చారిత్రిక ఘటనల ఆధారంగా రాసినదే అయినా ఇందులోని పాత్రలు కల్పితాలే, దీనిని చారిత్రిక వాస్తవంగా తీసుకోరాదు.
ఇక మనం ప్రాచీన బారత ప్రపంచంలోకి అడుగు పెడదాం...
ఒక జాతి సంస్కృతి ఆ జాతి ప్రజల హృదయాల్లో, ఆత్మల్లో నివాసముంటుంది: మహాత్మా గాంధీ
అధ్యాయం -1
అధికారపు భాష
హరప్పా కోట గంభీరంగా నిలబడి వుంది, దాని మట్టిఇటుక గోడలు నులివెచ్చని స్వర్ణకాంతులలో మెరిశాయి. నగర జనజీవన ధ్వనులు గాలి కెరటాల్లో సుదూరలోయ దాకా వ్యాపించాయి. పులులు, ఒంటికొమ్ము అశ్వాలను ప్రదర్శించే అందంగా చెక్కిన శిల్పాలు, మనోహరమైన చిత్రాలు వాస్తుకళ శోభను ద్విగుణీకృతం చేస్తూ నగరాన్ని మనోజ్ఞమైన చైతన్యకేంద్రంగా మార్చాయి. నగరంలోనికి వెళ్ళే దారికి కాపలా కాస్తూన్నట్టుగా ప్రవేశద్వారానికి ఇరువైపులా రాతి ఏనుగులు మార్దవమైన ముఖాల్లో చురుకైన కళ్ళతో నిలబడివున్నాయి.
ప్రవేశద్వారం పైన ఎత్తైన ‘మాతృదేవత ‘ భారీ విగ్రహం ప్రశాంతవదనంతో అభయమిస్తూ తన చల్లని చూపులను నగరం మీదుగా సారించింది. పూర్తిగా సాచిన ఆమె చేతులు పండ్లు, పుష్పాలు, ధన ధాన్యాలతో పొంగిపొర్లే తన ఒడిలోకి ప్రజలను, లోయను ఆప్యాయంగా తీసుకుంటున్నట్టుగా వున్నాయి. చిత్రమైన మెరుపుతో తళతళలాడుతున్న ఆమె కళ్ళు నగర కుడ్యాల మధ్య జీవించే వారందరికీ వెలుగు బాట చూపుతున్నట్టుగా వున్నాయి.
సాయంకాలమవుతుండగా హరప్పా ప్రజలు తమతమ పనుల నిమిత్తం నగరంలో సందడిగా తిరగ నారంభించారు. వాళ్ళ జుట్టు, చర్మం దివిటీల, దీపాల వెచ్చని వెలుగులో వింతగా మెరిశాయి.
కురచ రూపంలోని దోతులు కట్టిన పురుషుల బలిష్టమైన చేతి కండరాలు, భుజాలు వాళ్ళ కఠిన శారీరక శ్రమకు గుర్తుగా వున్నాయి. స్త్రీలు ధరించిన ముదురు రంగుల పొడవాటి కుర్తాల మీది వెండి నగలు రాత్రి ఆకాశంలో చుక్కల్లా మిణుకుమంటూ మెరిశాయి .
జన సమ్మర్దం తో కిటకిటలాడే అంగడి వీధులలో నవ్వుతూ కేరింతలు కొడుతూ ఒకరి వెంట ఒకరు పరిగెత్తుతూ పిల్లలు వీధుల్లో ఆడుకోసాగారు. కొందరు తమ పనులను ఆపి మాతృదేవత(మదర్ గాడెస్ ) కు భక్తితో పూలు, పాలు, తేనే అర్పించి చేతులు జోడించారు.
ఆ లోగా, కొత్తగా వచ్చిన ఆర్యుల బృందాలు హరప్పా నగర పొలిమేరల ఆవల నివాసం ఏర్పరచుకున్నాయి. అనేక ప్రాచీన నదుల తీర ప్రాంతాలలో నివసించిన నేపథ్యం కల సంచార జీవులు వారు. గుర్రాల మీద స్వారీ చేస్తూ ఊళ్లు తిరుగుతూ సర్వ శక్తి మంతుడైన అగ్నిని, దేవతలరాజైన ఇంద్రుడిని పూజిస్తూ స్తోత్రగీతాలు పాడే సంస్కృతి వారిది. ఆర్యజాతి పూజారులు, కవులు మహా యోధులైన తమ పూర్వీకుల, దేవుళ్ళ గొప్పదనాన్ని వర్ణిస్తూ శ్రోతలు ముగ్దులయ్యేలా గాథలు అల్లే వారు, ఆ గాథల్లో, వర్ణనలలో వారి బలమైన విశ్వాసాలు ప్రస్ఫుటమయ్యేవి.
హరప్పా వాసులు తమ నిత్య నైమిత్తికాలలో యథావిధిగా నిమగ్నమై వుండగా, ఒక రోజు, పునీతుడు అనే ఆర్యజాతి యోధుడు హరప్పనుల రాజప్రాసాదం లోకి అడుగు పెట్టాడు, అతని పాదధ్వనులు రాబోయే కొత్తశకాన్ని సూచించే దుందుభి మోతలా ప్రతిధ్వనించాయి.
అతడు నిబ్బరంగా అడుగులు వేస్తూ తన నిశిత దృక్కులతో, ఒక కొత్త సామ్రాజ్యాన్ని జయించ బోయే విజేత వలే, ఎదుటి దృశ్యాన్ని పరిశీలనగా చూస్తూ ఆ విశాలమైన రాజదర్బార్ లోకి ప్రవేశించాడు.
కుడ్య చిత్రాల చిక్కని రంగులు మసక వెలుతురులో నృత్యం చేస్తున్నట్టుగా అగుపడ్డాయి ; అక్కడి కార్యకలాపాల చప్పుడు - రాజోద్యోగుల, పండిత ప్రకాండుల విధ్యుక్త చర్యల సవ్వడి –తేనెపట్టు దగ్గరి తేనెటీగల ధ్వనిలా గాలిలో తేలియాడింది. ఒక వైదిక జాతి సభ్యుడిగా పునీతుడు తన జాతి వారసత్వం, సంస్కృతి పట్ల గర్వంగా వున్నాడు, ఆ గర్వాతిశయాలే వాళ్ళ ప్రభావాన్ని ఇతర భూభాగాల్లో విస్తరింప జేసేలా పురికొల్పి వాళ్ళని సముద్రం వేపు ప్రవహించే నదిలా ఉరికించాయి.
తన రాజ్యం. తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ, కరుణ కనబరిచే హరప్పనుల నాయకుడు, దృఢమైన శరీరాకృతి గల మధ్య వయస్కుడైన బాగుహర, పెదాల మీదకు చిరునవ్వు తెచ్చుకుని పునీతుడికి స్వాగతం పలికాడు. అక్కడక్కడ నెరిసిన చిక్కటి నల్లని జుట్టు బాగుహర పరిణతి చెందిన జీవితానుభవాన్ని, వివేకాన్ని, అతని కళ్ళలోని మెరుపు తనని అమితంగా గౌరవించే రాజ్యప్రజల పట్ల అతని అంకితభావాన్ని సూచించాయి.
‘‘ఓ ఆర్య యువకుడా, నీ ప్రజల నుంచి ఏదో సందేశం తెచ్చినట్టున్నావు.. ’’ ఆప్యాయత ధ్వనించే స్వరం తో మెల్లిగా అన్నాడు బాగుహర. ‘‘అదేదో శాంతికి, వాణిజ్యానికి సంబంధించిన ప్రతిపాదన అయి వుంటుంది..ఔనా ? ’’
పునీతుడు చిన్నగా నవ్వి తల ఊపాడు. మెరుగు పెట్టిన రాగి పలకలా అతని ముఖం సూర్య కాంతిలో మెరిసింది. ‘‘నిజమే మహారాజా..మా వైదిక విజ్ఞానాన్ని, మీ సిరిసంపదలను ఒకరితో ఒకరం పంచుకోవాలని మా ప్రజలు కోరుకుంటున్నారు. ’’
బాగుహర నొసలు చిట్లించాడు, అతని కనుబొమలు నాగేటి చాళ్లలా సాగినాయి. ‘‘అదంత సులభమని నేననుకోను పునీతా.. మన సంస్కృతులు చాలా విభిన్నమైనవి ; మీకూ మాకూ నడుమ ఎంతో కాలంగా అపార్థాలున్నాయి. ’’
పునీతుడి ముఖంలో నవ్వు మాయమైంది. యుద్దానికి ముందు తన కవచం సరిచేసుకునే యోధుడిలా అతడు తన ఆసనంలో అసహనంగా కదిలాడు. ‘‘నేనేమీ తప్పుగా అనుకోను, మహారాజా..మన ఇరువురి సంస్కృతులు ఒకదాని కొకటి పరిపూరకంగా ఉండగలవని నా నమ్మకం..ఇంకా.. ’’
బాగుహర చెయ్యి పురుష మొఖానికి అడ్డంగా గాలిలోకి లేచింది. ‘‘చాలు పునీతా .. చాలు. మీ నుంచి ప్రతిపాదనలు చాలా విన్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మీ ‘బహు గొప్ప విజ్ఞానాన్ని’ నీతోనే తీసుకుపో. ’’
పునీతుడి ముఖంలో కవళికలు మారినై. యుద్ధంలో పరాజితుడైన వీరుడిలా అవమాన భారంతో భుజాలు కుంగిపోగా ఆసనం మీద నుంచి లేచాడు. ‘‘క్షమించండి మహారాజా. నేను మిమ్మల్ని కించ పరచాలనుకోలేదు. ఇక వెళతాను. నా విధానాన్ని పునః పరిశీలిస్తాను. ’’
బాగుహర వదనం చల్లగాలి సోకినట్టు కొద్దిగా ప్రసన్నమైంది. ‘‘అలా చెయ్యి, పునీతా. మరోసారి వచ్చేటప్పుడు..బహుశ, స్థిరాభిప్రాయం లేని, మరింత విశాల హృదయంతో, వినే సంకల్పంతో వస్తావనుకుంటా.”
అలా సడలిన విశ్వాసంతో, దెబ్బతిన్న అభిమానంతో పునీతుడు తల వంచి రాజ భవనం నుంచి బయటకు నడిచాడు. హరప్పా వాసులను, వాళ్ళ నాయకుడిని తాను తక్కువగా అంచనా వేశాడనీ, తన ప్రజల వైదిక విజ్ఞానం మాత్రమె గెలుపుకు హామీ ఇవ్వదనీ అతనికి అర్థమైంది. మరో ప్రయత్నంగా సరికొత్త ప్రణాళికతో, అవగాహనతో హరప్పా వాసుల వద్దకు వెళ్లి తెలివిగా వ్యవహరించాలని అతడు ప్రతిన పూనాడు.
హరప్పా గతి, సింధులోయ ప్రాంత భవిష్యత్తు తరాజు పళ్ళెంలో పడ్డాయి. హరప్పా వాసులు, ఆర్యులు భాష, సంస్కృతి, అధికారం విషయమై పోట్లాడుకోనారంభించారు. పూర్తి విభిన్నమైన తమ సంస్కృతుల సంక్లిష్టతల నడుమ ముందుకు పోయే మార్గం కనుక్కునేందుకు తాము చేసే పోరాటం అంతిమ ఫలితమేమిటో ఎవరికీ తెలియదు. (సశేషం)